ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?

కరెన్సీ నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

అక్షరాలా 6,900 కోట్ల డాలర్లు.. అంటే దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి రెమిటెన్స్‌లుగా వచ్చాయని ఆర్‌బీఐ సర్వే ఒకటి వెల్లడించింది.

ఉద్యోగమో ఉపాధో.. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు.. ఆయా దేశాల నుంచి స్వదేశానికి పంపే నగదునే విదేశాల నుంచి రెమిటెన్స్‌లుగా వ్యవహరిస్తారు.

ఇందులో 46 శాతం నిధులు.. అంటే 3,174 కోట్ల డాలర్లు (సుమారు రూ. 2,30,900 కోట్లు).. నాలుగు దక్షిణాది రాష్ట్రాలకే వచ్చాయని ఆర్‌బీఐ సర్వే చెప్తోంది. అవి.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌.

మొత్తం విదేశీ రెమిటెన్సుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 4 శాతం.. అంటే 276 కోట్ల డాలర్లు. ఇది సుమారు రూ. 20,000 కోట్లతో సమానం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దుబాయ్‌లో రోడ్ల నిర్మాణం

అగ్ర స్థానంలో కేరళ...

విదేశాల నుంచి రెమిటెన్సులు అందుకుంటున్న రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానంలో (19.0 శాతం) ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో (4.0 శాతం) ఉంది.

రెండో స్థానంలో మహారాష్ట్ర (16.7 శాతం), మూడో స్థానంలో కర్ణాటక (15.0 శాతం), నాలుగో స్థానంలో తమిళనాడు (8.0 శాతం), ఐదో స్థానంలో దిల్లీ (5.9 శాతం) నిలిచాయి.

- మొత్తం విదేశీ రెమిటెన్సుల్లో.. అగ్రభాగాన ఉన్న నాలుగు రాష్ట్రాలు - కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు - వాటా 58.7 శాతంగా ఉంది.

- కేరళకు 2016-17లో 1,311 కోట్ల డాలర్లు (సుమారు రూ. 95,000 కోట్లు) వచ్చాయి. మహారాష్ట్రకు 1,152 కోట్ల డాలర్లు, కర్ణాటకకు 1,035 కోట్ల డాలర్లు విదేశాల నుంచి రెమిటెన్సులుగా వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దుబాయ్‌లో భారత కార్మికులు

ప్రపంచంలో భారత్‌దే అగ్రస్థానం

ప్రపంచంలో విదేశాల నుంచి రెమిటెన్సులు అత్యధికంగా వచ్చే దేశంగా భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోందని ఆర్‌బీఐ సర్వే పేర్కొంది.

విదేశాల నుంచి భారత్‌కు అందుతున్న రెమిటెన్సుల్లో 82 శాతం ఎనిమిది దేశాల నుంచే వస్తోంది. అవి.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమన్, బ్రిటన్, మలేసియా.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అగ్రస్థానంలో ఉంటే.. రెండో స్థానంలో అమెరికా ఉంది.

‘‘ప్రవాస భారతీయుల్లో 90 శాతం మందికి పైగా - అంటే అత్యధికులు పాక్షిక నైపుణ్యం గల, నైపుణ్యం లేని కార్మికులు - గల్ఫ్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. అందువల్ల భారతదేశానికి విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సుల్లో సగానికి పైగా గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తున్నాయి’’ అని ఆర్‌బీఐ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దుబాయ్‌లో భారత కార్మికులు

నైపుణ్యం లేని కార్మికులు పంపేదే అధికం...

విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సుల లావాదేవీల్లో 70 శాతానికి పైగా 500 డాలర్లు, అంతకు మించి ఉన్నాయి. మొత్తం లావాదేవీల్లో 200 డాలర్లు, అంతకన్నా తక్కువ ఉన్నవాటి వాటా కేవలం 2.7 శాతమే.

అంటే.. అత్యధిక విదేశీ రెమిటెన్సులు.. గల్ఫ్ ప్రాంతంలోని నైపుణ్యం లేని కార్మికుల నుంచే వస్తున్నాయని ఇది సూచిస్తోంది.

విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సుల్లో సగానికి పైగా మొత్తాన్ని (59.2 శాతం).. కుటుంబ నిర్వహణ కోసం వెచ్చిస్తున్నట్లు ఆర్‌బీఐ అంచనా. మరో 20 శాతం మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్లుగాను, 8.3 శాతం నిధులను ఆస్తులు, షేర్లలో పెట్టుబడులుగాను పెడుతున్నట్లు గుర్తించింది.

ఇక ప్రైవేటు బ్యాంకుల ద్వారా ఈ రెమిటెన్సులు పంపటానికే ప్రవాస భారతీయులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రైవేటు బ్యాంకుల ద్వారా 74.2 శాతం రెమిటెన్సులు పంపిస్తే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా 17.3 శాతం, విదేశీ బ్యాంకుల ద్వారా 8.5 శాతం రెమిటెన్సులు పంపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)