ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా?
- ప్రవీణ్ కాసం
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, INCTelangana/facebook
కొంతకాలంగా సెక్షన్ 49(పి) గురించి చర్చ జరుగుతోంది. ఈ సెక్షన్ గురించి చాలా మంది గూగుల్‌లో వెతుకుతున్నారు. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' సినిమా నేపథ్యం అంతా ఈ సెక్షన్ 49(పి) చుట్టూ తిరుగుతుంది. ఆ సినిమాలో హీరో విజయ్ పోయిన తన ఓటును ఈ నిబంధన ప్రకారమే తిరిగి దక్కించుకుంటారు.
'సర్కార్' సినిమా తర్వాత ఈ సెక్షనేంటో తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు.
మరి, ఈ సినిమాలో చెప్పినట్లుగా సెక్షన్ 49(పి)తో పోయిన మన ఓటును వాస్తవంగా దక్కించుకునే అవకాశం ఉందా? ఇంతకీ సెక్షన్ 49(పి) అంటే ఏమిటి? ఈ నిబంధనతో మన ఓటును ఎలా పొందవచ్చు?
ఫొటో సోర్స్, Getty Images
టెండర్డ్ ఓటు అంటే
మన పేరుతో ఉన్న ఓటును ఎవరైనా వేస్తే ఆ ఓటును రద్దు చేసి మన ఓటును పొందే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. భారత ఎన్నికల సంఘం 1961లో తీసుకొచ్చిన సెక్షన్ 49(పి) ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ సెక్షన్ కింద మనం పొందే ఓటును టెండర్డ్ ఓటు అని పిలుస్తారు.
ఎలా వినియోగించుకోవాలి?
'దొంగ ఓట్ల వల్ల లేక ఇతర కారణాలతో మన ఓటు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మన ఓటును మనం సాధించుకునే హక్కు సెక్షన్ 49(పి) కల్పిస్తోంది' అని ఉస్మానియా విశ్వవిద్యాలయం లీగల్ సెల్ డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ వేంకటేశ్వర్లు బీబీసీకి చెప్పారు.
టెండర్డ్ ఓటు ఎలా వినియోగించుకోవచ్చో ఆయన వివరించారు.
'సెక్షన్ 49(పి) ద్వారా ఓటు పొందాలనుకునేవారు ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయన వ్యక్తి మనమేనని ప్రిసైడింగ్ అధికారి ముందు నిరూపించుకోవాలి. ఇందుకోసం ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17(బి)లో పేరు, సంతకం చేసి ఆయనకు తిరిగి ఇవ్వాలి. అప్పుడు వెనకవైపు తన సంతకంతో ఉన్న టెండర్డ్ బ్యాలెట్ పేపర్‌ను ప్రిసైడింగ్ అధికారి మనకు ఇస్తారు. దానిపై మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి తిరిగి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. ఆయన ప్రత్యేక కవర్‌లో ఆ టెండర్డ్ ఓటును భద్రపరిచి లెక్కింపు కేంద్రానికి పంపిస్తారు. ఈవీఎంలో టెండర్డ్ ఓటు వేసేందుకు అనుమతి లేదు'' అని ప్రొఫెసర్ వేంకటేశ్వర్లు వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
‘చాలెంజ్డ్ ఓటూ ముఖ్యమే’
చాలా మందికి టెండర్డ్ ఓటుతో పాటు చాలెంజ్డ్ ఓటు గురించి పెద్దగా తెలియదని, వీటిపై ఓటర్లలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ వేంకటేశ్వర్లు చెప్పారు.
టెండర్డ్ ఓటు ద్వారా మన ఓటును మనం దక్కించుకోవచ్చు, చాలెంజ్డ్ ఓటు ద్వారా దొంగ ఓట్లను నివారించవచ్చు అని ఆయన పేర్కొన్నారు.
''మనం టెండర్డ్ ఓటుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా ఇతర సందర్భాల్లో సంబంధిత పోలింగ్ బూత్‌లో మనకు ఓటు లేదనే కారణంతో అక్కడున్న పోలింగ్ ఏజెంట్ అడ్డుకోవచ్చు. అలాంటప్పుడు పోలింగ్ ఏజెంట్ రూ.రెండు ఫీజు చెల్లించి ఫామ్ 14 ద్వారా ప్రిసైడింగ్ అధికారికి రాతపూర్వకంగా మనపై ఫిర్యాదు చేస్తారు. అప్పుడు వీఆర్‌ఏ లేదా గ్రామస్తుల సమక్షంలో మన గుర్తింపుపై ప్రిసైడింగ్ అధికారి విచారణ జరిపిస్తారు. సదరు వ్యక్తి మనమేనని రుజువైతే ఓటు వేయవచ్చు. కాదని తేలితే ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు మేరకు మనపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది. అలాగే, పోలింగ్ ఏజెంట్ చెల్లించిన రూ.రెండు ఆయనకే తిరిగి ఇచ్చేస్తారు'' అని ప్రొఫెసర్ వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
'అరుదైన సందర్భంలోనే టెండర్డ్ ఓటు లెక్కింపు'
సెక్షన్ 49(పి) ద్వారా మనం ఓటు వేసినప్పటికీ ఎన్నికల సంఘం ఆ ఓటును లెక్కించదు. అరుదైన సందర్భంలో మాత్రమే టెండర్డ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదట ఈవీఎంల ద్వారా వచ్చిన ఓట్లను మాత్రమే ఎన్నికల సంఘం లెక్కిస్తుంది. అప్పుడు ఇద్దరు అభ్యర్థులకు స్వల్ప తేడాతో ఓట్లు వస్తే నిబంధనల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటుంది. అప్పుడు కూడా ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తేనే టెండర్డ్ ఓట్లను లెక్కిస్తుంది.
2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కోర్టు ఆదేశం మేరకు టెండర్డ్ ఓట్లను లెక్కించారు.
ఫొటో సోర్స్, cp joshi/facebook
ఒక్క ఓటుతో ముఖ్యమంత్రి పదవి దూరం
ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. భారత ఎన్నికల చరిత్రలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులు ఇద్దరున్నారు.
2008లో రాజస్థాన్ ఎన్నికల్లో నాథ్‌ద్వారా అసెంబ్లీ సీటుకు జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషికి 62,215 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్‌కు 62,216 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినప్పటికీ అదే ఫలితాలు రావడంతో ఎన్నికల సంఘం కల్యాణ్ సింగ్‌ను విజేతగా ప్రకటించింది.
అయితే, ఈ ఎన్నికల్లో కొందరు టెండర్డ్ ఓటు వేశారని వాటి ఓట్లు లెక్కించాలని, తన ప్రత్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్ భార్య రెండు చోట్ల ఓటు వేశారని వాటిని రద్దు చేయాలని సీపీ జోషి రాజస్థాన్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. హైకోర్ట్ నుంచి ఈ కేసు సుప్రీం కోర్ట్ వరకు వెళ్లింది. చివరకు సుప్రీం ఆదేశంతో టెండర్డ్ ఓట్లతో కలిపి ఎన్నికల సంఘం రీకౌంటింగ్ చేసింది. ఈసారి లెక్కింపులో కల్యాణ్ సింగ్, జోషిలకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం డ్రా తీసి కల్యాణ్ సింగ్‌ను విజేతగా ప్రకటించింది.
కర్నాటకలో..
కర్నాటకలోని సంతేమరహళ్లి నియోజకవర్గానికి 2004లో జరిగిన ఎన్నికల్లో ఏఆర్ కృష్ణమూర్తి జేడీఎస్ టికెట్‌పై పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్.ధ్రువనారాయణ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, ధ్రువనారాయణకు 40,752 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటుతో కృష్ణమూర్తికి గెలుపు దూరమైంది.
ఫొటో సోర్స్, facebook/komatireddy venkat reddy
పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో గట్టెక్కిన కోమటిరెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే అవసరం వచ్చిందని ప్రొఫెసర్ వేంకటేశ్వర్లు చెప్పారు.
''నల్గగొండ శాసన సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేయగా, సీపీఎం అభ్యర్థిగా నంద్యాల నర్సింహారెడ్డి బరిలోకి దిగారు. లెక్కింపు సమయంలో గెలుపు ఇద్దరి మధ్యా దోబూచులాడింది. చివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా వచ్చిన కోమటిరెడ్డి విజయం సాధించారు' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
- ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- లువిస్ హామిల్టన్: ‘‘పూర్ ఇండియా’ వ్యాఖ్యలు భారత్ పట్ల సానుభూతితోనే..’
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్‌కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)