అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- ప్రొఫెసర్ హేరంబ్ చతుర్వేది
- మాజీ శాఖాధిపతి(చరిత్ర), అలహాబాద్ విశ్వవిద్యాలయం

ఫొటో సోర్స్, EPA
అయోధ్య, ప్రతిష్ఠానపురం(ఝాన్సీ) చరిత్ర మూలాలకు బ్రహ్మ మానస పుత్రుడు మనువు నుంచీ సంబంధం ఉంది. ప్రతిష్ఠానపురంలో చంద్రవంశం పాలనకు మను కొడుకుకు సంబంధం ఉంది. అతను శివుడి శాపంతో 'ఇల'గా మారిపోయారు. అదే విధంగా అయోధ్యను పాలించిన సూర్యవంశం మనువు కొడుకు ఇక్ష్వాకుడితో ప్రారంభమైంది.
బెంట్లీ, పార్జిటర్ లాంటి స్కాలర్స్ 'గ్రహ మంజరి' లాంటి ప్రాచీన భారత గ్రంధాల ఆధారంగా ఈ వంశ స్థాపన క్రీస్తు పూర్వం 2200కు దగ్గరగా జరిగిందని భావించారు. ఈ వంశంలో శ్రీరాముడి తండ్రి దశరథుడు 63వ పాలకుడుగా నిలిచాడు.
ప్రాచీన భారతదేశంలో పుణ్యక్షేత్రాల ప్రస్తావన వచ్చినపుడు వాటిలో మొదట అయోధ్య పేరే ఉండడం కూడా ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యతను చెబుతుంది. "అయోధ్య మధురా మాయా కాశి కాంచీ అవంతికా పూరీ ద్వారావతీ చైవ సప్తైతా మోక్షదాయికా" అనే మాట ఉంది.
ఈ ప్రాచీన పుణ్య క్షేత్రాలలో ప్రయాగ గురించి చెప్పలేదనేది గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం. జైన సంప్రదాయం ప్రకారం తీర్థంకరులలో కూడా 22 మంది ఇక్ష్వాకు వంశం వారు ఉన్నారు. ఇది కూడా అయోధ్యకు ఉన్న విశిష్టతను చెబుతుంది.

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA/BBC
మొత్తం 24 తీర్థంకరులలో మొట్టమొదటి తీర్థంకరుడైన ఆదినాథ్(రిషబదేవ్)తో పాటు మరో నలుగురు తీర్థంకరులు అయోధ్యలోనే జన్మించారు. బౌద్ధ మతం చరిత్ర ప్రకారం బుద్ధ దేవుడు అయోధ్య లేదా సాకేత్‌లో 16 ఏళ్ల వరకూ నివసించారు.
ఇది హిందూ మతంతోపాటు ఇతర సంప్రదాయాలైన జైన, బౌద్ధ మతాలకు కూడా పవిత్ర ధార్మిక క్షేత్రంగా ఉంది. మధ్యయుగంలో భారత్‌లోని ప్రముఖ సన్యాసి రామానంద్ జన్మించింది ప్రయాగలోనే అయినా రామానంద సంప్రదాయానికి ముఖ్య కేంద్రం అయోధ్యే అయ్యింది.
ఉత్తర భారత దేశంలోని కోశల, కపిలవస్తు, వైశాలి, మిథిల లాంటి అన్ని ప్రాంతాలకూ అయోధ్యను పాలించిన ఇక్ష్వాకు వంశస్థులే రాజులుగా ఉన్నారు. మనువు స్థాపించిన అయోధ్య విషయానికి వస్తే వాల్మీకి రాసిన రామాయణంలోని బాలకాండలో అది 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు ఉండేదని ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA/BBC
సుదీర్ఘ చరిత్ర
ఏడో శతాబ్దంలో చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ దీనిని 'పికోసియా' అని సంబోధించారు. దాని ప్రకారం దీని పరిధి 16'లి'(ఒక చైనా 'లి' 1/6 మైళ్లకు సమానం) ఉండేది.
బౌద్ధ విశ్వాసాలలో భాగంగా ఆయన దీనిని అలా చెప్పుండచ్చు. అయిన్-ఇ-అక్బరీలో ఈ నగరం పొడవు 148 కోసులు, వెడల్పు 32 కోసులు అని చెప్పారు.
సృష్టి ప్రారంభమైన తర్వాత త్రేతాయుగంలో రామచంద్రుడి నుంచి ద్వాపరయుగంలో మహాభారతం, ఆ తర్వాత చాలాకాలం వరకూ మనకు అయోధ్య, సూర్యవంశీయులు, ఇక్ష్వాకుల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ వంశానికే చెందిన బృహధ్రథుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చేతిలో మరణించాడని పురాణాలు చెబుతాయి.
తర్వాత లవుడు శ్రావస్తిని పాలించాడు, ఈ ప్రస్తావన తర్వాత 800 ఏళ్ల వరకూ లభిస్తోంది. తర్వాత ఈ నగరం మగథకు చెందిన మౌర్యుల నుంచి గుప్తులు, కన్నోజ్ పాలకుల అధీనంలో ఉంటూ వచ్చింది. చివర్లో ఇక్కడ మహమూద్ గజనీ మేనల్లుడు సయ్యద్ సాలార్ ఇక్కడ టర్కీ పాలనను స్థాపించాడు. అతడిని బహ్రయిచ్‌లో 1033లో హత్య చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
తైమూర్
ఆ తర్వాత తైమూర్ అనంతరం జౌన్‌పూర్ లో శకుల పాలన ప్రారంభమైనప్పుడు అయోధ్య షర్కుల అధీనంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా 1440లో ఇది షక్ పాలకుడు మహమూద్ షా పాలనలో ఉంది.
1526లో బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన సేనాపతి 1528లో అయోధ్యపై దాడి చేసి మసీదును నిర్మించారు. దానిని 1992లో రామజన్మభూమి ఆందోళనల సమయంలో కూల్చివేశారు.
అక్బర్ కాలంలో పాలన పునర్నిర్మాణం జరిగింది. ఫలితంగా రాజకీయ స్థిరత్వం ఏర్పడడంతో అవధ్ ప్రాంతం ప్రాధాన్యం చాలా పెరిగిపోయింది. దానికి భూ-రాజకీయాలు, వ్యాపార కారణాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అక్బర్ అవధ్ సుబా
గంగానది ఉత్తర భాగాన్ని తూర్పు ప్రాంతాలతో, దిల్లీ-ఆగ్రాను బెంగాల్‌తో జోడించే మార్గం ఇక్కడి నుంచే వెళ్తుంది. అంటే అక్బర్ 1580లో తన సామ్రాజ్యాన్ని 12 సుబాలుగా విభజించారు. అప్పుడే ఆయన అవధ్ సుబా ఏర్పాటు చేశారు. అయోధ్య దానికి రాజధానిగా ఉండేది.
1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం ముక్కలైపోతున్నప్పుడు, స్థానికంగా ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భించాయి. అదే సమయంలో అవధ్ కూడా స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. 1731లో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా అవధ్ ప్రాంతాన్ని అదుపు చేయడానికి దానిని తన షియా దీవాన్ సువాదత్ ఖాన్‌కు ఇచ్చేశారు.

ఫొటో సోర్స్, PENGUIN INDIA
ఆయన పూర్తి పేరు మహమ్మద్ అమీన్ బుర్హనుల్ ముల్క్. ఆయన తన సుబాకు దీవాన్‌గా ఉన్న దయాశంకర్ ద్వారా అక్కడి నిర్వహణను చూసుకునేవారు. ఆ తర్వాత ఆయన అల్లుడు మంసూర్ అలీ 'సఫ్దర్ జంగ్' బిరుదుతో అవధ్ పాలకుడు అయ్యారు.
అప్పుడు స్థానిక దీవాన్ ఇటావాకు చెందిన కాయస్థ్ నవల్ రాయ్ ఆయన ప్రధాన మంత్రిగా ఉండేవారు. ఇదే సఫ్దర్ జంగ్ కాలంలో అయోధ్యలోని ప్రజలకు మత స్వాతంత్రం లభించింది. ఆ తర్వాత ఆయన కొడుకు షుజా-ఉద్దౌలా అవధ్ నవాబ్-వజీర్ అయ్యారు( 1754-1775) ఆయన అయోధ్యకు 3 మైళ్లు పశ్చిమంగా ఫైజాబాద్ నగరం నిర్మించారు.
ఈ నగరం అయోధ్యకు భిన్నంగా లక్నోకు తొలి రూపంగా మారింది. షుజా-ఉద్దౌలా చనిపోయిన తర్వాత(1775) ఆయన భార్య బహూ బేగమ్(ఈమె 1816లో మరణించారు)కు ఫైజాబాద్ జాగీరుగా ఉండిపోయింది. ఆమె కొడుకు ఆసఫ్-ఉద్దౌలా తర్వాత లక్నో అనే కొత్త నగరాన్ని నిర్మించాడు. 1775లో తన రాజధానిని అక్కడకు మార్చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
మొఘల్ పాలకుడు బాబర్
అయోధ్య, ఫైజాబాద్, లక్నో మూడు వేర్వేరు నగరాలు. అవి అవధ్ నవాబులు-వజీరులకు రాజధానులుగా ఉన్నాయి. ఈ రాజ్యాన్ని మొఘలుల దీవాన్-వజీర్లు స్థాపించారు. దాంతో తమ పాలనను చట్టబద్ధంగా చేసుకోడానికి వారు తమకు తాము నవాబ్-వజీరుగా చెప్పుకునేవారు.
అవధ్ చివరి నవాబ్-వజీరుగా వజీద్ అలీ షా ఉన్నారు. ఆయన తర్వాత ఆయన బేగం హజ్రత్ మహల్, ఆమె కొడుకు బిల్కిస్ బద్ర్ 1857-58లో ఆంగ్ల పాలకులతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. 1856లో ఆంగ్లేయ పాలకులు అవధ్‌ను విముక్తి చేయలేకపోయారు.
ఇదే వాజిద్ అలీ షా కాలంలోనే హనునాన్‌గడీలో మొట్టమొదటి మత ఘర్షణలు మొదలయ్యాయి. చివరికి హిందువుల తరఫున తన నిర్ణయం ప్రకటించిన నవాబ్ వాజిద్ అలీ షా "మేం మతానికి కాదు ప్రేమకు బద్ధులై ఉంటాం/ మనం ఉన్నది కాబా అయితే ఏం, మందిరం అయితే ఏం?" అని రాశారు.
వాజిద్ అలీషా నిష్పక్షపాత నిర్ణయాన్ని అప్పటి ఆంగ్ల గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ప్రశంసించారు. అలా ఇప్పుడు ఫైజాబాద్ పేరు మార్పుతో చరిత్ర విద్యార్థులు-పరిశోధకులకు ఇప్పుడు అయోధ్య పరిస్థితి ఏంటి? అనే ఒక ప్రశ్న ఎదురైంది. ఫైజాబాద్ ఎలా ఏర్పడింది. ఈ ఫైజాబాద్ మ్యాప్ పైనే పాత లక్నో నగరాన్ని నిర్మించాలని ఊహించారా, ఎలా చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
చరిత్ర విద్యార్థులకు సమస్య
కొత్తగా నగరాన్ని, ప్రాంతాన్ని, భవనాన్ని నిర్మించేవాళ్లకు మాత్రమే వాటికి పేరు పెట్టే హక్కు ఉంటుంది. ఏదైనా ప్రాంతం పేరు మార్చాలన్నా, ఆ నిర్ణయానికి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పాత్ర కచ్చితంగా ఉండి తీరాలి. దాన్నే నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ అంటాం.
భారత రాజ్యాంగ పీఠిక మూల ఉద్దేశం కూడా ఇదే. ఇక్కడ పాలకులు, నిర్వాహకులు అని లేదు, మనమంతా భారతీయులం. ఇక్కడ పేర్లు జనాభిప్రాయ సేకరణ ద్వారా మారుస్తున్నారా, లేక పాలకుల వ్యామోహం కోసం మారుస్తున్నారా అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది.
ఈ పేర్ల మార్పుకు ( ప్రయాగ రాజ్, అయోధ్య) న్యాయపరంగా, ప్రజాస్వామ్య విధానాలను పాటించారా అనేది చూడాలి.

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA/BBC
ముస్లిం పాలకులే తప్పు చేశారని మనం భావిస్తే, వాళ్లు 12 నుంచి 17వ శతాబ్దం వరకూ చేస్తూ వచ్చిన అదే పనిని ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో చేయడం సముచితమేనా? అనేది కూడా ఆలోచించాలి.
ఇలాంటి వాటి వల్ల భారత అంతర్జాతీయ ప్రతిష్టకు ఏం జరుగుతుంది? అలా చేయడం దేశ ఐక్యత-అఖండతకు సముచితమేనా? ఒకే సంస్కృతి మన వారసత్వమా? హిందూ సంస్కృతి గురించి మాట్లాడుతూ మనం అలసిపోవడంలేదా? అలా చేస్తున్న వారికి వసుధైక కుటుంబం అనే సిద్ధాంతంపై నమ్మకం లేదా?
వారు సంప్రదాయవాదులుగా లేకపోవడంతో ఆ సంప్రదాయం కొనసాగింది. అందుకే ఇక్బాల్ "శతాబ్దాలుగా మనపై శత్రువుల దాడులు జరిగినా/మన ఘనత ఎప్పటికీ మాసిపోదు" అంటారు.
ఇవి కూడా చదవండి
- రణ్వీర్-దీపిక పెళ్లి: ఇటలీలోని 'జల్‌మహల్' ప్రత్యేకతలు ఇవే..
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
- దొంగ ఓటును గెలవడమెలా? 'సర్కార్' సినిమా చెప్తున్న సెక్షన్ 49(పి)తో సాధ్యమేనా?
- మిషెల్ ఒబామా: నా పిల్లలిద్దరూ ఐవీఎఫ్ ద్వారా జన్మించారు
- తెలంగాణ ఎన్నికలు: ‘పాతబస్తీ అభివృద్ధి గాలిబ్ ప్రేయసి వాగ్దానంలా ఉంది’
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)