దిల్లీలో వాయు కాలుష్యం: విషపు గాలి చంపేస్తోంది.. కానీ ఆకలి ఆగనీయదు - రిక్షావాలా ఆవేదన

  • 18 నవంబర్ 2018
సంజయ్ కుమార్ Image copyright ANKIT SRINIVAS
చిత్రం శీర్షిక సంజయ్ కుమార్ ఐదేళ్లుగా రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్నారు

"రిక్షా తొక్కుతున్నపుడు నా కళ్లు మండుతాయి. శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. ఇక నా వల్ల కాదు అని నా శరీరం చెప్తుంటుంది. దిల్లీ విషపు గాలి నుంచి పారిపోదామని చెప్తుంటుంది. కానీ నేను రిక్షా తొక్కటం ఆపలేను. కుటుంబాన్ని పోషించుకోవాలి. డబ్బులు కావాలి. నేను ఇంకెక్కడికి వెళ్లగలను? ఈ రోడ్లే మా ఇల్లు" అని చెప్పారు సంజయ్ కుమార్.

ఐదేళ్ల కిందట బిహార్ నుంచి ఉద్యోగం కోసం దిల్లీకి వచ్చిన సంజయ్‌కు ఉద్యోగం దొరకలేదు. తను బతకటానికి, బిహార్‌లోని కుటుంబాన్ని పోషించుకోవటానికి రిక్షా తొక్కటం ఉపాధిగా ఎంచుకున్నారు.

రిక్షా మీద వచ్చే ఆదాయంతో ఇల్లు అద్దెకు తీసుకోవటం అసాధ్యం. ఆయన రోడ్ల మీదే పడుకుంటారు.

"ఒక మంచం ఉంటే బాగుండునని అనిపిస్తుంది. అది నెరవేరని కల అని నాకు తెలుసు. ఒక పూటైనా కడుపునిండా మంచి తిండి తినాలని కోరిక ఉంటుంది. కానీ ఖర్చు తలచుకుంటే భయమేస్తుంది. కనీసం మంచి గాలి పీల్చాలనుకున్నా.. ఈ శీతాకాలపు నెలల్లో అది అసాధ్యం. మీరు ఇంటికెళ్లి సుఖంగా ఉండగలరు. కానీ నేను పగలూ రాత్రీ ఈ రోడ్డు మీదే ఉండిపోవాలి’’ అని వివరించారు.

Image copyright ANKIT SRINIVAS

దేశ రాజధాని నగరంలో ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో గాలి తీవ్రంగా కలుషితమైపోతుంది. పొరుగు రాష్ట్రాల్లో రైతులు పంట కోత తర్వాత పొలాల్లో మిగిలిన వ్యర్థాల్ని దహనం చేయటం దీనికి ఒక కారణం. దీపావళి పండుగకు బాణసంచా కాల్చటం కూడా.. ఈ అనారోగ్యకర విషవాయువులను మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.

దిల్లీలో వేలాది మంది రిక్షా కార్మికులు ఉన్నారు. మెట్రోలు, బస్సుల్లో తిరిగే వారిని చివరిగా వారి గమ్యస్థానాలకు చేర్చటానికి.. తక్కువ దూరాలు ప్రయాణించేవారికి వీరు సేవలు అందిస్తుంటారు.

కానీ.. నగరంలో వాయు కాలుష్యం స్థాయి.. భద్రత పరిమితిని (సేఫ్టీ లిమిట్) దాటి 30 రెట్లకు పైగా పెరిగినపుడు.. ఆ దుష్ప్రభావం అత్యధికంగా ఈ రిక్షా కార్మికుల మీదే ఉంటుంది.

నిరంతరం ఆరుబయట రోడ్ల మీద ఉండటానికి తోడు.. రిక్షా తొక్కటం వల్ల ఊపిరితిత్తులపై ఇంకా ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కలుషిత గాలిలోని పీఎం 2.5 అని పిలిచే సూక్ష్మ విష పదార్థాలు.. ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకుపోయి రక్తప్రవాహంలోకి కూడా చేరతాయి.

Image copyright ANKIT SRINIVAS

ఈ రిక్షా కార్మికుల దుస్థితిని ఇటీవల సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఒక పిటిషన్ మీద ఇటీవల విచారణ జరుపుతూ.. జనాన్ని ఇంట్లో ఉండాలని సలహా ఇవ్వటం పరిష్కారం కాదని ప్రభుత్వానికి న్యాయస్థానం చెప్పింది.

"వారు అధికమైన శారీరక శ్రమ చేస్తున్నారు. ఉదయం వేళ పనిచేయటం సురక్షితం కాదు కాబట్టి మీరు పని చేయటం ఆపేయండి అని చెప్పజాలరు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

నేను కలిసిన ప్రతి రిక్షా కార్మికుడూ దగ్గుతూ ఉండటమో.. శ్వాస తీసుకోవటం కష్టంగా ఉందని చెప్పటమో జరిగింది. కొందరైతే పూర్తిగా మాట్లాడలేకపోతున్నారు కూడా.

ఒక మెట్రో స్టేషన్ వద్ద.. స్మాగ్ (ధూళి పొర) ఎంత దట్టంగా ఉందంటే.. ఆ గాలి నోట్లోకి వెళ్లినపుడు బూడిద స్పష్టంగా తగులుతోంది. కళ్ల ముందు కొన్ని మీటర్లకు మించి చూడటం కూడా అసాధ్యంగా ఉంది.

Image copyright ANKIT SRINIVAS

అలాంటి స్మాగ్‌లోనూ రిక్షా కార్మికులు రిక్షాలు తొక్కుతూ కనిపిస్తూనే ఉన్నారు.

ఈ విష వాయువు నుంచి దూరంగా ఉండటానికి కొన్ని రోజులైనా రిక్షా తొక్కటం ఆపేయటం కుదిరే పని కాదని చెప్తున్నారు జై చంద్ జాదవ్ అనే రిక్షా వాలా. ఆయన ఏడేళ్ల కిందట పశ్చిమ బెంగాల్ నుంచి దిల్లీ వచ్చారు.

"నేను రోజుకు 300 రూపాయలు సంపాదిస్తా. అందులో కొంత తిండి కోసం ఖర్చుపెట్టుకుని.. మిగతాది నా భార్య, ఇద్దరు పిల్లల కోసం దాచుకుంటా. నా కుటుంబం నా మీద ఆధారపడి ఉంది. కాబట్టి నేను పని చేస్తూనే ఉండాలి. గాలి పీల్చుకోవటం కష్టంగా మారినా.. రిక్షా తొక్కటం ఆపలేను’’ అని ఆయన చెప్పారు.

జైచంద్ ఉదయం ఆరు గంటలకు పని మొదలు పెడతారు. దగ్గర్లోని మెట్రో స్టేషన్‌కి వెళతారు. ఉదయపు ప్రయాణికులను ఎక్కించుకుని రిక్షా తొక్కటం ఆరంభిస్తారు. అలా 11 గంటల వరకూ పని చేశాక.. కాస్త ఖాళీ చూసుకుని.. గుళ్లు, స్వచ్ఛంద సంస్థలు ఏవైనా ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నాయేమోనని వెదుకుతారు.

Image copyright ANKIT SRINIVAS

ఉచితంగా ఆహారం దొరకనప్పుడు మాత్రమే ఆహారం కొనుక్కోవటానికి ఆయన డబ్బులు ఖర్చుపెడతారు. అర్థరాత్రి వరకూ పని చేస్తారు. ఇక ప్రయాణికులెవరూ రారు అనుకున్నపుడు మాత్రమే విశ్రాంతి తీసుకుంటారు. రెస్టారెంట్లు నిరాశ్రయులకు ఉచితంగా పంచిపెట్టే మిగిలిపోయిన ఆహారంతో రాత్రికి కడుపు నింపుకుంటారు.

కానీ.. ఉచితంగా ఆహారం అన్నిసార్లూ అంత సులభంగా దొరకదు. అందుకే.. దిల్లీలో రిక్షావాలాలు చాలా తరచుగా ఖాళీ కడుపులతోనే గడుపేస్తుంటారు.

"కొన్నిసార్లు ఏమీ తినకుండానే రిక్షా తొక్కటం నాకు అలవాటు. దానిని నేను తట్టుకోగలను. కానీ.. ఈ స్మాగ్ చాలా భయంకరమైనది. ఈ వాతావరణంలో పనిచేస్తున్నపుడు.. నా ఛాతీ మీద 50 కిలోల బరువు పెట్టుకుని రిక్షా తొక్కుతున్నట్లు అనిపిస్తుంది’’ అని జైచంద్ వివరించారు.

ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్నారు. గత వారంలో దీపావళి తర్వాత రోజు ఆయన దగ్గు బాగా పెరిగిపోయింది.

Image copyright ANKIT SRINIVAS

"గాలి ఇంత దారుణంగా ఉన్నపుడు జనం బాణసంచా ఎందుకు కాలుస్తారో నాకు అర్థం కాదు. వాళ్లు రోడ్ల మీద టపాసులు కాల్చేసి తమ తమ ఇళ్లలోకి వెళ్లిపోతారు. కానీ వారి పనుల వల్ల నాలాంటి వాళ్లు బాధలుపడాల్సి వస్తోంది. ఈ నగరంలో జనానికి ఇతరుల గురించి ఏమాత్రం పట్టింపు లేదు’’ అని విచారంగా వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడుతుండగా.. కొంతమంది రిక్షా వాలాలు అతడి చుట్టూ చేరారు. అందరి ఫిర్యాదూ స్మాగ్ గురించే. వారిలో ఆనంద్ మండల్ ఒకరు. ఉదయం నుంచి 18 గంటల పాటు నిర్విరామంగా రిక్షా తొక్కి అప్పుడే పని ముగించుకున్నారు ఆయన.

"ఇంత సేపు పని చేయటం చాలా కష్టం. నా ఛాతీ మండుతోంది. సరిగ్గా శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నాను. ముఖ్యంగా రిక్షా తొక్కేటప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. పోయిన సంవత్సరం నా సహచరుడు ఒకరికి ఇలాంటి సమస్యలే వచ్చాయి. కొన్ని రోజులకే అతడు ఆస్పత్రి పాలయ్యాడు. నెలల పాటు మళ్లీ పనిచేయలేకపోయాడు. నాకు ఆ పరిస్థితి వస్తుందేమోనని చాలా భయంగా ఉంది. అలా జరగొద్దని నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాను’’ అని వివరించారు ఆనంద్.

నగరంలోని చాలా మంది రిక్షా కార్మికులది ఇదే కథ.

Image copyright ANKIT SRINIVAS
చిత్రం శీర్షిక దిల్లీలో గాలి ఎన్నడూ ఇంత దారుణంగా లేదని హిమాసుద్దీన్ అంటారు

హిమాసుద్దీన్.. పాత దిల్లీలో రిక్షా తొక్కుతుంటారు. ఇరవై ఏళ్లుగా ఆయనది ఇదే పని. దిల్లీలో గాలి ఎన్నడూ ఇంత దారుణంగా లేదని చెప్తారాయన.

"నేను రిక్షా వాలాని. నేను రిక్షా తొక్కటం వల్ల కాలుష్యం ఏమాత్రం పెరగదు. మాది స్వచ్ఛమైన రవాణా సాధనం. కానీ.. విషతుల్యమైన స్మాగ్ వల్ల అత్యంత దారుణంగా ప్రభావితమయ్యేది మేమే.. ఇది విషాదకర విచిత్రం" అని హిమాసుద్దీన్ పేర్కొన్నారు.

రిక్షా కార్మికులకు ప్రభుత్వం సాయం చేయాలని ఆయన కోరుతున్నారు.

"కనీసం.. మాకు తాత్కాలిక ఆశ్రయం ఏర్పాటు చేయొచ్చు. మేం చేయని తప్పుకు.. నెమ్మది నెమ్మదిగా చనిపోతున్నాం. కానీ.. అసలు మా ఉనికే లేనట్టుగా.. ఎవరూ మా గురించి పట్టించుకోరు" అని ఆవేదన చెందారు.

ఆయన ఆవేదన అర్థం చేసుకోగలిగేదే. ఈ స్మాగ్ సీజన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎప్పుడూ చెప్పే మాట "ఇళ్లలోనే ఉండండి" అని.

కానీ.. దురదృష్టవశాత్తూ.. దిల్లీలో రిక్షా వాలాలకు ఆ అవకాశం లేదు. వాళ్లు రిక్షాల్లోనే.. రోడ్ల మీదే బతుకుతుంటారు.

"మాకు కాలుష్యం కన్నా.. ఆకలి పెద్ద సమస్య. అందుకే ఎవరూ కాలుష్యాన్ని లెక్కచేయరు. ఏం జరిగినా మేం పనిచేస్తూ ఉండాల్సిందే" అంటూ హిమాసుద్దీన్ రిక్షా తొక్కుతూ దట్టమైన ధూళి పొరలో అదృశ్యమైపోయారు.

ఫొటోలు: అంకిత్ శ్రీనివాస్

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)