ఆర్‌బీఐ వర్సెస్ ప్రభుత్వం: ఈ రోజు బోర్డు సమావేశం ఎందుకంత కీలకం?

  • 19 నవంబర్ 2018
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అరుణ్ జైట్లీ, ఉర్జిత్ పటేల్ Image copyright Hindustan Times
చిత్రం శీర్షిక అరుణ్ జైట్లీ, ఉర్జిత్ పటేల్

ఇవాళ జరగనున్న ఆర్‌బీఐ బోర్డు కీలక సమావేశం గతంలో ఎన్నడూ ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకోలేదు. గత కొంత కాలంగా ఆర్‌బీఐకు, ప్రభుత్వానికి మధ్య రెగ్యులేటరీ అంశాలపై వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో.. రిజర్వ్ బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు సమావేశం కావడం ఇదే మొదటిసారి.

రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య ఒక ప్రసంగంలో.. ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ స్వతంత్ర ప్రతిపత్తిని హరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించడంతో వివాదం మొదలైంది.

ఈ సమావేశంలో అనేక విషయాలపై చర్చించనున్నా, ప్రధానంగా రెండు అంశాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

Image copyright Getty Images

1. బ్యాంకుల రుణ నిబంధనలు

ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్.. భారతీయ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయడంలో భాగంగా నిరర్ధక ఆస్తుల విషయంలో అనేక కఠినమైన నిబంధనలు తీసుకువచ్చింది. ఒక నివేదిక ప్రకారం 2018, జూన్ నాటికి భారతీయ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రూ.9.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ నిరర్థక ఆస్తులను తగ్గించుకోని పక్షంలో భవిష్యత్తులో అది ఆర్థిక వ్యవస్థకే పెనుప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. ఆర్‌బీఐ నిబంధనల నేపథ్యంలో చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వలేకపోతున్నాయి.

అదే కాకుండా లిక్విడిటీ సమస్య కూడా పరిశ్రమలపై - మరీ ముఖ్యంగా మధ్య, చిన్న తరహా పరిశ్రమలపై - తీవ్ర ప్రభవం చూపుతోంది. ఆర్‌బీఐ ఈ నిబంధనలను సరళతరం చేయాలని అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ఆర్థిక శాఖ కోరుతోంది కానీ రిజ్వర్ బ్యాంక్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

2014లో ఆర్‌బీఐ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ పేరిట నిరర్ధక ఆస్తుల సమస్యలను ఎదుర్కొంటున్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం ఒక ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక కింద చెల్లింపుల అవకాశం తక్కువగా ఉన్న సందర్భంలో రుణాలు మంజూరు చేయడానికి కుదరదు. దీని వల్ల బ్యాంకుల రుణాలిచ్చే రేటు చాలా తగ్గిపోయింది. అందువల్ల ప్రభుత్వం ఆ నిబంధలను సరళతరం చేయాలంటోంది.

Image copyright Getty Images

ఎన్నికల ముందు ఆర్థికాభివృద్ధి

ఆర్‌బీఐ ఇలా నిబంధనలను కఠినతరం చేయడంతో పెట్టుబడుల ప్రవాహం మందగించింది. దీని వల్ల క్షేత్రస్థాయి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వాలని భావిస్తోంది. మరీ ప్రత్యేకించి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉపాధి కల్పనలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎన్నికల ముందు బీజేపీకి ఇది చాలా కీలకం. అయితే ఇటీవలి కాలంలో ఆ పరిశ్రమలు జీఎస్‌టీ, నోట్ల రద్దు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి.

అయితే ప్రభుత్వం ఆర్‌బీఐతో ప్రత్యక్షంగా యుద్ధానికి దిగేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే అది మదుపర్ల విశ్వాసంపై ప్రభావం చూపడమే కాకుండా, అది ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ చేతికి మంచి అస్త్రాన్ని ఇచ్చినట్లు అవుతుంది.

చాలా మంది విశ్లేషకులు లిక్విడిటీ సమస్యలపై మధ్యేమార్గం సాధ్యమని భావిస్తున్నారు. ఇది రిజర్వ్ బ్యాంక్ తన నిబంధనలను ఏ మేరకు సడలిస్తుందన్న దానిపై ఆధారపడి ఉంది.

Image copyright Getty Images

2. ఆర్‌బీఐ క్యాష్ రిజర్వ్

రెండో ప్రధాన సమస్య ఆర్‌బీఐ ఎంత క్యాష్ రిజర్వ్‌ను తన వద్ద ఉంచుకోగలదు అన్నది. తాము ఆర్‌బీఐ నుంచి రూ.3.6 లక్షల కోట్లను కోరామన్న వార్తలను ప్రభుత్వం ఖండిస్తుండగా, ఈ సమావేశంలో ఆర్‌బీఐ తన వద్ద ఎంత అదనపు నగదును ఉంచుకోవచ్చన్న దానిపై చర్చించనున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఆర్‌బీఐ వద్ద ఎంత అదనపు నగదు ఉండాలి, అదనపు నగదు నిల్వలను ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చా అన్నది ఒక కీలక అంశం.

రిజర్వ్ బ్యాంక్ అవసరాలను నిర్ణయించడానికి ఒక సమగ్రమైన ప్రణాళిక ఉండాలని ప్రభుత్వం అంటోంది. దీని వల్ల ప్రభుత్వానికి వచ్చే డివిడెండ్లపై ఒక స్పష్టత వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ప్రతి ఏడాది తన వద్ద ఉన్న నగదు నిల్వలపై ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లిస్తుంది.

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, తన వద్ద ఇప్పడు రూ.9.6 లక్షల కోట్లు ఉన్నాయి. 2016-17లో ఇది రూ.8.38 కోట్లు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉర్జిత్ పటేల్

ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయకపోవచ్చు

గత కొన్ని వారాలుగా ప్రభుత్వం ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7 ను ఉపయోగించి బోర్డు సభ్యుల ద్వారా తన డిమాండ్లను నెగ్గించుకోవాలని భావిస్తే, గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి.

కానీ, అనేక మంది పరిశీలకులు మాత్రం ఇరువర్గాలు తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను సామరస్యపూర్వకంగానే పరిష్కరించుకుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నేడు ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి మొత్తం 18 మంది సభ్యులూ హాజరు కానున్నారు. ప్రస్తుతం బోర్డులో ఆర్‌బీఐకి చెందిన అధికారులు ఐదుగురు - గవర్నర్ ఉర్జిత్ పటేల్, నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు ప్రభుత్వ నామినీలుగా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మిగతా 11 మందిని ప్రభుత్వం నియమించింది.

వారిలో ఎస్.గురుమూర్తికి ఆరెస్సెస్‌తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన ఆర్‌బీఐపై చాలా తీవ్రమైన విమర్శలు చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)