తెలంగాణ ఎన్నికలు: 2014 ఎన్నికల్లో ఆ గట్టు.. 2018లో ఈ గట్టు

  • అరుణ్ శాండిల్య
  • బీబీసీ ప్రతినిధి
రేవంత్, కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకరరావు

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్,

రేవంత్, కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకరరావు

రాజకీయాల్లో కీలక ఘట్టం ఎన్నికలు. అందుకే ఎన్నికల్లో పోటీ కోసం నేతలు ఏమైనా చేస్తారు. చట్టసభలకు వెళ్లేందుకు ప్రవేశ పరీక్షైన ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. పార్టీలు మారుతుంటారు, నియోజకవర్గాలు మారుతుంటారు, చిరకాల బంధాలనూ చిటికెలో వదిలేస్తారు.

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలో దిగుతున్నవారిలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు 2014 ఎన్నికల్లోనూ పోటీ చేశారు. వారిలో కొందరు అప్పుడు విజయం సాధించగా మరికొందరు ఓటమిపాలయ్యారు. కానీ, వారు అప్పుడు పోటీ చేసిన పార్టీ వేరు.. ఇప్పుడు పోటీ చేస్తున్న పార్టీ వేరు.

ఆ ఎన్నికలైన కొద్దికాలానికే పార్టీలు మారి ఇప్పుడు కొత్త పార్టీ నుంచి టిక్కెట్ పొందినవారు కొందరైతే... ఇప్పుడు ఎన్నికల్లో టిక్కెట్లు రాక ఇతర పార్టీలకు మారిపోయినవారు మరికొందరు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే పాలక తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితా నుంచి మొదలుపెడితే నామినేషన్ల చివరి రోజైన సోమవారం(నవంబరు 19) వరకు పార్టీలు ప్రకటిస్తున్న అభ్యర్థుల వరకు చూస్తే సుమారు 50 మంది ఆ గట్టు నుంచి ఈ గట్టుకు వచ్చేసినవారే.

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్,

టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్ కేటాయించకపోవడంతో ఆమె ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు..

119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో అత్యధిక స్థానాలను గెలుచుకుని తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐల నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఇండిపెండెంట్లుగా గెలిచిన కొందరు అనంతర కాలంలో పాలక టీఆర్ఎస్‌లో చేరారు.

అలా ఎమ్మెల్యేలుగా పార్టీ ఫిరాయించిన నేతల్లో అత్యధికులు ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ నుంచి టిక్కెట్లు సాధించగా.. ఆ రేసులో వెనుకబడినవారు మళ్లీ ఫిరాయించి ఇతర పార్టీల నుంచి టిక్కెట్లు తెచ్చుకున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీ, బీఎస్పీ నుంచి టీఆర్ఎస్.. ఇలా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారి టిక్కెట్లు పొందారు.

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్,

గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్న వంటేరు ప్రతాపరెడ్డి

ఎమ్మెల్యేలు కాని వారిలో..

గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారిలో కొందరు ఈ ఎన్నికల్లో పార్టీ మారి మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రమేశ్ రాథోడ్, సోయం బాపూరావు, విజయరమణారావు, నాగం జనార్దనరెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, వంటేరు ప్రతాపరెడ్డి వంటివారు ఈ జాబితాలో ఉన్నారు.

వీరిలో వంటేరు ప్రతాప్ రెడ్డి 2014లో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌పై తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయగా ఈసారి అదే నియోజకవర్గంలో కేసీఆర్‌తో కాంగ్రెస్ పార్టీ నుంచి తలపడుతున్నారు.

ఫొటో సోర్స్, బీబీసీ

గత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసినవారిలో కొందరు ఇప్పుడు బీఎల్‌ఎఫ్ నుంచి బరిలో ఉన్నారు. 2014లో టీడీపీ తరఫున మధిర నుంచి పోటీ చేసిన మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు ఆలేరు నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కొత్తగూడెంలో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన యడవల్లి కృష్ణ ఈసారి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)