తెలంగాణ విద్యుత్ రంగం: 24 గంటల విద్యుత్ విజయమా? విధాన లోపమా? - Fact Check

  • బళ్ల సతీశ్
  • బీబీసీ ప్రతినిధి
కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్

2013: ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ రంగం ఎలాంటి సంక్షోభం ఎదుర్కోనుందో వివరించారు.

''తెలంగాణలో 57 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంది. వినియోగం 113 మిలియన్ యూనిట్లు ఉంది. 50 శాతానికిపైగా కొరత ఉంది. మూడేళ్ల వరకూ చత్తీస్‌గఢ్ గ్రిడ్ అనుసంధానం జరగదు. విపరీతమైన సంక్షోభం వస్తుంది. కేసీఆర్ చత్తీస్‌గఢ్ నుంచి పదివేల మెగా వాట్లు కొంటాం అంటున్నారు. వారి మొత్తం సామర్థ్యమే 6,300 మె.వా. ఎత్తిపోతల పథకాలకు 175 మిలియన్ యూనిట్లు కావాలి. దీనికి రూ.45 వేల కోట్లు అవుతుంది? ఎలా తెస్తారు?''

...................

2014: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విలేకరుల సమావేశం. విద్యుత్ రంగంపై వివరణ ఇచ్చారు. ''విద్యుత్ సంక్షోభం ఎదుర్కోక తప్పదు. దానికి మనం ఏం చేయలేం. వచ్చే పంటకు పరిస్థితి కాస్త మెరుగవుతుంది. మరో మూడేళ్లలో అసలు సమస్య లేకుండా చేస్తాం. అప్పటి వరకూ రైతులు ఓపిక పట్టాలి.''

........................

2018: మాకు 24 గంటలు కరెంటు వద్దు బాబోయ్ అంటున్న ఉత్తర తెలంగాణలోని కొందరు రైతులు..

....ఈ మూడు ప్రకటనలూ తెలంగాణ విద్యుత్ రంగానికి అద్దం పడతాయి. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పటి సందర్భాన్ని బట్టి నిజమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ కొరత కొంత వేధించింది వాస్తవమే. కానీ కరెంటు కోతతో రైతులు, పరిశ్రమలు ఇబ్బందులు పడ్డ స్థాయి నుంచి, 'మాకు ఇంతసేపు కరెంటు అక్కర్లేదు' అనే స్థాయికి చేరింది తెలంగాణ.

అయితే, ఈ స్థాయికి చేరడంలో అనుసరించిన విధానాల వల్ల కలిగే నష్టాలనూ చూడాలని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ గణాంకాల ప్రకారం తెలంగాణ విద్యుత్ రంగంలో, దేశంలోని చాలా రాష్ట్రాల కంటే ముందుంది. తలసరి విద్యుత్ వినియోగం, విద్యుత్ డిమాండ్ పెరగడం వంటి విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.

విద్యుత్ సామర్థ్యాన్ని సంతరించుకోవడం రెండు రకాలు. ఒకటి సొంతంగా ఉత్పత్తి చేసుకోవడం, రెండోది కొనుగోలు చేయడం. తెలంగాణకు రెండో పద్ధతి బాగా కలిసొచ్చింది. నిధులతో సంబంధం లేకుండా, కరెంటు ఎక్కడ అందుబాటులో ఉన్నా కొనుగోలు చేస్తూ వచ్చింది. ఫలితం ఇప్పుడు చూస్తున్నదే. అదే సమయంలో సొంతంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు మూడు ప్లాంట్లు నిర్మిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు ఉన్న అన్ని అవకాశాలూ పరిశీలించింది. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి, ఆంధ్రలోని ప్లాంట్లు, ఇతర ప్రైవేటు ప్లాంట్ల నుంచి కొనుగోలు చేయడమే కాకుండా సౌర, పవన్ విద్యుత్ కూడా తక్కువ తక్కువ మొత్తాల్లో లభ్యమైనప్పటికీ కొనుగోలు చేసింది. దీంతో తెలంగాణ విద్యుత్ అవసరాలు తీరి సమృద్ధ స్థితికి చేరింది.

అయితే... ఒక్క తెలంగాణే కాదు దేశంలోని 24 రాష్ట్రాలు ఇలా మిగులు విద్యుత్ సాధించాయి.

ఫొటో సోర్స్, NTPC

తలసరి వినియోగంలో పెరుగుదల 59.32 శాతం

విద్యుత్ సమృద్ధిగా ఉండడంతో వినియోగమూ అంతేస్థాయిలో పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలో విద్యుత్ వినియోగ రేటు పెరుగుదల అత్యధిక శాతం ఉన్న రాష్ట్ర తెలంగాణయే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి విద్యుత్ వినియోగం ఏకంగా 59.32 శాతం పెరిగింది.

2013-2014లో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,084 యూనిట్లు ఉండగా 2017-18లో అది 1,727 యూనిట్లకు చేరింది.

వ్యవసాయ కనెక్షన్లు 51.37 శాతం పెరిగాయి. వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడానికి ఉన్న నియంత్రణలు ఎత్తివేశారు.

గత నాలుగేళ్లలో కొత్తగా 4.28 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చినట్టు విద్యుత్ శాఖ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images

2014 తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చిన కీలక మార్పులు

(ఆధారం: తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో)

1.వ్యవసాయానికి 24 గంటల విద్యుత్

2.మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం: 2014లో - 7,778 మెగావాట్లు, 2018లో - 15,606 మెగావాట్లు

3.పంపిణీ, సరఫరా వ్యవస్థలను రూ.20,177 కోట్లతో బలోపేతం చేయడం

4.5,880 మె.వా. సామర్థ్యం ఉన్న 3 కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం(యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్-7)

5.కొత్తగా ఇచ్చిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు: 2010 నుంచి 2014 మధ్య 2,82,875.. 2014 నుంచి 2018 మధ్య 4,28,208

6.2017-18 కి కరెంటు వినియోగంలో వృద్ధి: 13.62 (ఇది దేశంలోనే అత్యధికం)

7.2017-18 కి తలసరి కరెంటు వినియోగంలో వృద్ధి: 11.34 (ఇది దేశంలోనే అత్యధికం)

ఫొటో సోర్స్, Getty Images

'ఇది విజయం ఎలా అవుతుంది?': తెలంగాణ జేఏసీ చైర్మన్ రఘు

‘‘వాస్తవానికి 2014 తరువాత తెలంగాణతో పాటూ దేశవ్యాప్తంగా పరిస్థితి మారింది. ప్రైవేటు రంగంలో కరెంటు ఉత్పత్తి బాగా పెరిగింది. గతంలో తలపెట్టిన ప్రైవేటు, ప్రభుత్వ ప్లాంట్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. దేశమంతా విద్యుత్ లభ్యత పెరిగింది. సీఈఏ లెక్కల ప్రకారం దాదాపు 24 రాష్ట్రాల్లో ఇప్పుడు మిగులు విద్యుత్ ఉంది.

24 గంటల విద్యుత్ నీటికి సంబంధించిన విషయం. ఎప్పుడూ మోటార్లు తిరగడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల కరెంటు వద్దని కరీంనగర్ రైతులు కోరడానికి కూడా ఇదే కారణం. అంతే కాదు, ఎక్కువ మోటార్లు ఉన్న పెద్ద రైతులు నిరంతరం వాటిని నడిపిస్తూడడంతో చిన్నరైతులకు నీరు అందడం లేదన్న సమస్య కూడా ఉంది.

24 గంటల కరెంటు ఇవ్వడం విద్యుత్ రంగంపై కూడా భారమే అన్న అభిప్రాయం ఉంది. పగటి పూట రైతులకు 12 గంటలపాటూ కరెంటు ఇస్తే మంచిదనేనది వారి మాట. అప్పుడు విద్యుత్ సంస్థలపై భారం పడకుండా ఉంటుంది, భూగర్భజలాల సమస్యా రాదు’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ రఘు చెప్పారు.

''భద్రాద్రి ప్లాంట్‌లో సబ్ క్రిటికల్ పరిజ్ఞానం వాడుతున్నారు. అది పాతపడిపోయింది. దానివల్ల కాలుష్యంతో పాటూ, ఏటా 450 కోట్ల అదనపు భారం. ఇక యాదాద్రి ప్లాంటు అక్కడ కాకుండా బొగ్గు దొరికేచోట నిర్మించాలి. అసలు బొగ్గు దొరకని ఆంధ్రలో విద్యుత్ ప్లాంట్లు నిర్మించారని ఆందోళన చేసిన మనమే, ఇప్పుడు యాదాద్రిలో ప్లాంటు నిర్మిస్తే ఎలా?'' అని ప్రశ్నించారాయన.

ప్రస్తుతం దేశంలో చాలా పవర్ ప్లాంట్లు వేలానికి వచ్చాయి. సగటున ఒక మెగావాట్ సామర్థ్యం రూ.3 నుంచి 4 కోట్లకు దొరుకుతోంది (అంటే ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటు పెట్టడానికయ్యే ఖర్చు. మొత్తం ప్లాంట్ పెట్టడానికయ్యే ఖర్చును, అది ఉత్పత్తి చేసే విద్యుత్ మెగావాట్లతో భాగిస్తే వస్తుంది). చత్తీస్‌గఢ్ విషయంలో ఆ ఖర్చు దాదాపు 9 కోట్లు. పైగా అక్కడి నుంచి కరెంటు కొన్నా, కొనకున్నావెయ్యి కోట్ల వరకూ చెల్లించాలి. అందువల్ల ఈ ఒప్పందం కొనసాగించే బదులు, వేలానికి వచ్చిన ప్లాంట్లు కొనుగోలు చేసే అంశం ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నారు రఘు.

విద్యుత్ కొనుగోలు మరింత పారదర్శకంగా జరగాలనీ, ప్రైవేటు విద్యుత్ ఒప్పందాలను బహిర్గతం చేయాలనీ, చత్తీస్‌ఘఢ్‌తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లను తిరిగి సమీక్షించాలని కోరుతోంది తెలంగాణ జెఎసి. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చాలా అవసరం. విద్యుత్ రంగ ప్రణాళిక ఖర్చును తగ్గించే దిశగా రూపొందించాలి అంటున్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వానికి వరం.. విద్యుత్ సంస్థలపై భారం

ప్రభుత్వ నిర్ణయాల భారాలు ప్రభుత్వమే భరిస్తుందా లేదా అన్నది తేలాలన్నారు సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల రావు. ''రాష్ట్రానికి దీర్ఘ కాలికంగా విద్యుత్ ఎంత అవసరం పడుతుంది అనేది శాస్త్రీయంగా లెక్కించాలి. దాని ఆధారంగా ఎప్పుడు ఎక్కడ నుంచి ఎంత కొనుగోళ్లు జరగాలి అనేది లెక్కించాలి. అలా కాకుండా, అవసరానికి మించి ఒప్పందాలు చేసుకుంటే ఒక ప్రమాదం ఉంది. ఒప్పందం చేసుకున్నాక, కరెంటు కొన్నా కొనకపోయినా కొంత చెల్లించాలి. అటు ప్రభుత్వాలు రాయితీ భారాన్ని ఎంతవరకు భరిస్తాయో చూడాలి. దానికితోడు ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలూ అందరికీ అందుబాటులో లేవు'' అన్నారు వేణుగోపాల రావు.

అయితే, విద్యుత్ విజయం ఖరీదు ఆ సంస్థలకు ఆర్థికంగా భారంగా మారుతోంది అన్నారు కొందరు అధికారులు. 2014 నాటికి తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంలు రూ.13 వేల కోట్ల నష్టాల్లో ఉండగా, ఇప్పుడవి దాదాపు రూ.30 వేల కోట్లకు పెరిగినట్టు చెప్పారు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి.

ఫొటో సోర్స్, Getty Images

సమగ్ర వ్యూహంతోనే సాగుతున్నాం

అధిక ఖర్చు పెట్టామన్న వాదనను కొట్టిపారేస్తోంది ప్రభుత్వం. ఎక్కడా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టలేదని వివరించారు ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు. ''తెలంగాణ విద్యుత్ రంగంపై అప్పుడు కామెంట్ చేసిన వారే ఇప్పుడు పొగిడారు. చాలా మంది విమర్శిస్తున్నట్టు మేం డబ్బులు ఎక్కడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. మా అంతర్గత పనితీరు మెరుగు పరుచుకున్నాం. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను అరికట్టాం. అది 16 శాతం నుంచి 13 శాతానికి తగ్గింది. దేశంలో సగటు లోడ్ ఫాక్టర్ 60 ఉంటే తెలంగాణలో 80 శాతం ఉంది. ట్రాన్స్‌మిషన్ అందుబాటు 99.98 శాతం ఉండగా, ఈహెచ్‌టీ నష్టాలు 2.98 శాతం మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ మా అంతర్గత సామర్థ్యం పెంచుకున్నాం అనేందుకు సంకేతాలు. ఇక ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టామో చెప్పండి?'' అంటూ ప్రశ్నించారు ప్రభాకర రావు.

''విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించలేదని ఒప్పుకుంటాం. మేం చేసే కొనుగోళ్లన్నీ పారదర్శకంగా బిడ్డింగ్ ద్వారానే జరుగుతాయి. సగటున యూనిట్‌కి 5 రూపాయల కంటే ఎక్కువ ఎక్కడా ఖర్చు చేయలేదు. భవిష్యత్తులో వచ్చే ఎత్తిపోతల పథకాలను కూడా లెక్కల్లోకి తీసుకుంటున్నాం. సాంకేతిక సమస్యలుంటాయి కాబట్టి ఏమాత్రం అంతరాయాల్లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పలేం కానీ నమ్మకంగా కరెంటు ఇస్తున్నాం.'' అని చెప్పారు ప్రభాకర రావు.

ఫొటో సోర్స్, Getty Images

ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశమంతా కరెంట్ అందుబాటులోకి వచ్చింది

వాస్తవానికి 2014 తరువాత తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పరిస్థితి మారింది. ప్రైవేటు రంగంలో విద్యుదుత్పత్తి బాగా పెరిగింది. సీఈఏ లెక్కల ప్రకారం దాదాపు 24 రాష్ట్రాల్లో ఇప్పుడు మిగులు విద్యుత్ ఉంది.

కానీ తెలంగాణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు లోటు రాకుండా ప్రణాళిక వేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఖర్చెక్కువైనా ఫర్వాలేదు, కరెంటు మాత్రం లోటు రాకూడదు అన్న ధోరణిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)