సకుటుంబ సపరివార సమేతంగా ఎన్నికల బరిలో..: తెలంగాణ ఎన్నికలు

  • ప్రవీణ్ కాసం
  • బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో బంధుగణం భారీగానే కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నింటిలోనూ కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకులకు టికెట్లు దక్కాయి.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. కొన్ని చోట్ల బంధువులే ప్రత్యర్థులుగా పోటీ పడే పరిస్థితి కూడా నెలకొంది.

తండ్రీకొడుకు, మామాఅల్లుడు, అన్నాతమ్ముడు, అత్తాఅల్లుడు ఇలా అంతా ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

మరోసారి కేసీఆర్, కేటీఆర్, హరీశ్

ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ నుంచి మరోసారి బరిలో దిగుతుండగా, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ సిట్టింగ్ స్థానం సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్నారు.

కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ఆరోసారి సిద్ధిపేట బరిలో దిగుతున్నారు.

ఉత్తమ్ జంటకు మళ్లీ టికెట్లు

ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించినప్పటికీ ఈ విషయంలో ఉత్తమ్ దంపతులకు మినహాయింపు ఇచ్చింది.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలవడమే కాకుండా భార్య పద్మావతికి కోదాడ టికెట్ ఇప్పించి గెలిపించారు.

ఈసారి కూడా అధిష్ఠానాన్ని మెప్పించి హుజూర్‌నగర్ నుంచి ఆయన పోటీ చేస్తుండగా, భార్య పద్మావతి రెడ్డికి సిట్టింగ్ నియోజకవర్గం కోదాడ టికెట్ మళ్లీ ఇప్పించగలిగారు.

ఫొటో క్యాప్షన్,

రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి బ్రదర్స్

బరిలో 'బ్రదర్స్'

ఒక కుటుంబానికి ఒకే టికెట్ నిబంధనను కోమటిరెడ్డి, మల్లు బ్రదర్స్ విషయంలోనూ కాంగ్రెస్ అధిష్ఠానం పక్కనపెట్టింది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సిట్టింగ్ స్థానం నల్లగొండ నుంచే మళ్లీ పోటీ చేస్తుండగా, గత ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇచ్చింది.

మల్లు సోదరులు కూడా అధిష్టానాన్ని మెప్పించి టికెట్లు సాధించుకున్నారు. మధిర నియోజకవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు మల్లు రవి జడ్చర్ల నుంచి బరిలో దిగుతున్నారు.

టీఆర్ఎస్‌ కూడా ఈసారి అన్నాతమ్ముళ్లకు టికెట్ ఇచ్చింది.

మంత్రి మహేందర్ రెడ్డి తన సిట్టింగ్ స్థానం తాండూర్ నుంచి బరిలో దిగగా, ఆయన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున కొడంగల్ నుంచి పోటీలో ఉన్నారు.

మహేశ్వరం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పట్నం సోదరులు మేనల్లుళ్లు.

పాలకుర్తి నుంచి టీఆర్ఎస్ తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేస్తున్నారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు టీఆర్ఎస్‌ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.

బంధువుల మధ్యే పోటీ

గద్వాల నియోజవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున డీకే అరుణ మరోసారి బరిలో దిగుతుండగా, ఆమెకు ప్రత్యర్థిగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి డీకే అరుణ భర్త భరత్ సింహారెడ్డి సోదరి కుమారుడు. ఇక్కడ మేనత్త, అల్లుడి మధ్య పోరు నెలకొంది.

అలాగే, డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరఫున మక్తల్ నుంచి పోటీ చేస్తున్నారు.

స్టేషన్ ఘన్‌పూర్ నుంచి టీఆర్ఎస్ తరఫున తాటికొండ రాజయ్య మరోసారి బరిలో దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇందిరను బరిలోకి దింపింది. రాజయ్య బావమరిది భార్యే ఇందిర. ఆమె వరుసకు రాజయ్యకు సోదరి అవుతారు.

కొత్త గూడెంలో తోడల్లుళ్ల మధ్యే పోటీ నెలకొంది. ఇక్కడ మహాకూటమి నుంచి వనమా వేంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. ఇదేస్థానం నుంచి ఆయన తోడల్లుడు ఎడవల్లి కృష్ణ... బీఎల్ఎఫ్ కూటమి నుంచి బరిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)