హార్లిక్స్‌పై బిహార్‌లో నిషేధం: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?

 • 22 నవంబర్ 2018
హార్లిక్స్ Image copyright HORLICKS/fACEBOOK

'పాలలో హార్లిక్స్ కలుపుకోండి, పాలశక్తిని పెంచుకోండి'

 • కాల్షియం - 741 మిల్లీగ్రాములు
 • విటమిన్ డి - 9.26 మైక్రోగ్రాములు
 • ఫాస్పరస్ - 280 మిల్లీగ్రాములు
 • మెగ్నీషియం - 65 మిల్లీగ్రాములు
 • ప్రొటీన్ - 11.0 గ్రాములు

హార్లిక్స్ డబ్బాపై 10కి పైగా పోషక పదార్థాలు ఉన్నట్లు రాసి ఉంటుంది. అది శాకాహారమని సూచించే ఆకుపచ్చని చుక్క గుర్తూ కనిపిస్తుంది.

కానీ ఆ సంస్థ చెబుతున్నట్లుగా దానిలోని విటమిన్ డికి మూలం శాకాహార పదార్థాలేనా అన్న సందేహంతో బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వికాస్ శిరోమణి దాని విక్రయాలను నిషేధించారు.

దానిని తయారు చేసే గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్జూమర్ హెల్త్ కేర్ దీనిపై స్పందిస్తూ.. ''మాకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నుంచి నోటీసు అందింది. కానీ మా ఉత్పాదనలన్నీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కిందకు వస్తాయి. దాని ఆధారంగానే మాకు లైసెన్స్ లభించింది'' అని వెల్లడించింది.

Image copyright Glaxo Smith Kline

మూలం మొక్కలా, జంతువులా?

హార్లిక్స్‌లోని విటమిన్ డికి మూలం ఏమిటన్న దానిపై తమ సందేహాలకు ఆ సంస్థ సరైన సమాధానాలు ఇవ్వలేదని శిరోమణి వెల్లడించారు.

ఆయనబీబీసీతో మాట్లాడుతూ.. ''భారత రాజ్యాంగంలోని సెక్షన్ 29(1) ఏదైనా సంస్కృతి, మతవిశ్వాసాలను భంగపరచరాదని చెబుతోంది. కానీ హార్లిక్స్ చేస్తున్నది అదే'' అన్నారు.

శిరోమణి వెల్లడించిన వివరాల ప్రకారం, గ్లాక్సో స్మిత్‌క్లైన్ హార్లిక్స్‌లోని విటమిన్ డి3, డి2లకు మూలం ఏదన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అది మొక్కల నుంచి తీసుకున్నారా లేక జంతువుల నుంచా అన్నది తెలపాలని ఆ సంస్థకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.

జిల్లా డ్రగ్ నియంత్రణ శాఖ నిర్వహించిన పరిశోధన ప్రకారం, హార్లిక్స్‌లో ఉన్న విటమిన్ డికి మూలం జంతుసంబంధిత ఉత్పత్తులు. అందువల్ల అది శాకాహారం కాదు. అయినా ఆ సంస్థ ఆ వివరాలు వెల్లడించకుండా శాకాహారం పేరిట విక్రయిస్తోంది. అంతే కాకుండా దానిని 'ప్రొఫిలాక్టిక్' గుణాల ఆధారంగా విక్రయించాల్సి ఉండగా, ఫుడ్ లైసెన్స్ కింద విక్రయిస్తున్నారనేది మరో ఆరోపణ.

సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉన్న హార్లిక్స్‌ను డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 లోని సెక్షన్ 22 (ఐ), (డి) కింద నిషేధించారు.

ఆ నోటీసు కాపీని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంతో పాటు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ కార్యాలయానికీ పంపారు. దేశవ్యాప్తంగా దానిని నిషేధించాలని కోరారు.

Image copyright Getty Images

ఫుడ్ సప్లిమెంట్ కాదు.. ఔషధం

శిరోమణి వెల్లడించిన వివరాల ప్రకారం, హార్లిక్స్‌లో కలుపుతున్న పలు పదార్థాలు ప్రొఫిలాక్టిక్ (రోగాలను నిరోధించే పదార్థాలు) విభాగం కిందకు వస్తాయి. దాని ఆధారంగా హార్లిక్స్‌ను ఒక ఔషధంగా విక్రయించాలి తప్ప ఫుడ్ సప్లిమెంట్‌గా కాదు.

హార్లిక్స్‌లోని విటమిన్ డి కి సంబంధించి తమకు రెండు నివేదికలు అందాయని ఆయన తెలిపారు.

''ఎస్‌జీఎస్ ల్యాబ్‌ ఇచ్చిన నివేదిక మేరకు హార్లిక్స్‌లో ఉపయోగించే విటమిన్ డికి మాంసాహార పదార్థాలు మూలం అని తెలుస్తోంది'' అని అన్నారాయన.

'అమూల్', 'కాంప్లాన్'లపై కూడా పరిశోధించామని వికాస్ శిరోమణి అంటున్నారు.

''కాంప్లాన్ తన సమాధానంలో.. తాము విటమిన్ డిని చైనా నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఇక అమూల్ తమ విటమిన్ డిని శాకాహార పదార్థాల నుంచి ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ హార్లిక్స్ నుంచే ఎలాంటి సమాధానమూ రాలేదు'' అని తెలిపారు.

హార్లిక్స్‌లోని విటమిన్ డి1, డి2, డి3కి మూలం ఏమిటని ప్రశ్నించగా, తమకు ఎలాంటి సమాధానమూ రాలేదన్నారు.

Image copyright AFP

గ్లాక్సో స్మిత్‌క్లైన్ వాదన

ఎస్‌జీఎస్ ల్యాబ్ తమకు పంపిన రిపోర్టులో హార్లిక్స్‌లో.. శాకాహార పదార్థాలలో లభించే విటమిన్ డి2ను ఉపయోగించినట్లు పేర్కొందని గ్లాక్సో స్మిత్‌క్లైన్ తెలిపింది.

గ్లాక్సో స్మిత్‌క్లైన్ ప్రకారం జరిగిన సంఘటనా క్రమం ఇదీ:

 • అక్టోబర్ 6: ఒక డిస్ట్రిబ్యూటర్ వద్ద హార్లిక్స్ డబ్బాలపై 'పచ్చని చుక్క' ఉన్నట్లు డగ్ర్ ఇన్‌స్పెక్టర్ గుర్తించారు. అయితే హార్లిక్స్‌లో మాంసాహార పదార్థాల మూలాలు ఉన్నట్లు ఆయన భావించారు. హార్లిక్స్ యాజమాన్యంతో మాట్లాడాలంటూ ఆయన డిస్ట్రిబ్యూటర్‌ను ఆదేశించారు.
 • అక్టోబర్ 12: 'జాయింట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్'కు ప్రతిస్పందించిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ సంస్థ.. హార్లిక్స్‌లో ఉపయోగించే విటమిన్ డికి ఆధారం శాకాహార పదార్థాలంటూ ఒక సర్టిఫికెట్‌ను సమర్పించింది.
 • అక్టోబర్ 29: హార్లిక్స్‌పై ఉన్న లేబుల్ ప్రకారం దానిలోని విటమిన్ డికి ఆధారం శాకాహార పదార్థాలు (డి2) కాదని, మాంసాహార పదార్థాలని (డి3) నిర్ధరించారు. బహుశా ఇది లేబుల్ మీద డి2 అనో, డి3 అనో కాకుండా కేవలం డి అని రాసి ఉండడం జరిగి ఉండొచ్చు.
 • నవంబర్ 12: 'ఎంక్వైరీ రిపోర్టు'కు ప్రతిస్పందిస్తూ గ్లాక్సో స్మిత్‌క్లైన్ సంస్థ, హార్లిక్స్‌ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద 'మాల్ట్ బేస్డ్ ఫుడ్'గా భావిస్తున్నారని తెలిపింది. హార్లిక్స్‌లోని విటమిన్ డికి మూలం శాకాహార పదార్థాలంటూ ఎస్జీఎస్ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికేట్‌ను కూడా సమర్పించింది.
 • నవంబర్ 17: తుది నివేదికను సమర్పించిన ఇన్‌స్పెక్టర్ హార్లిక్స్ విక్రయాలను నిషేధించారు.
Image copyright Getty Images

పోషకాహార నిపుణులు, డాక్టర్లు ఏమంటున్నారు?

క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రితూ ఆరోరా.. హార్లిక్స్‌లో మాంసాహార పదార్థాల మూలాలు ఉన్నాయన్న వాదనను కొట్టిపారేయలేమన్నారు.

''ఫ్యాటీ ఫిష్, పశుమాంసంలో విటమిన్ డి ఉంటుంది. హార్లిక్స్‌లో దానిని ఉపయోగించి ఉండవచ్చు. కానీ ల్యాబ్‌లో తుది ఫలితాలు వచ్చాకే స్పష్టత వస్తుంది. కేవలం అనుమానాల ఆధారంగా నిర్ధారణకు రావడం తప్పు'' అన్నారు.

విటమిన్ డి ఎందుకు ముఖ్యం?

ఎముకల బలోపేతానికి, రోగ నిరోధక వ్యవస్థకు విటమిన్ డి చాలా ముఖ్యం. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. కండరాలు, కీళ్లు నొప్పులు రావొచ్చు. అలాగే త్వరగా అలసిపోవడం, బద్ధకం పెరుగుతాయి.

విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్ కూడా కలగవచ్చు. అందువల్లే శీతాకాలంలోనూ, చల్లగా ఉండే ప్రదేశాలలోని నివసించేవారిలోనూ డిప్రెషన్‌ను గమనించవచ్చు.

డాక్టర్ రీతూ ప్రకారం.. విటమిన్ డి2 సాధారణంగా శాకాహార పదార్థాల నుంచి, డి3 మాంసాహార పదార్థాల నుంచి లభిస్తుంది. విటమిన్ డి మరో ముఖ్యమైన మూలం సూర్యరశ్మి.

మన దేశంలోని ప్రతి 10 మందిలో 8 మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని డాక్టర్ రీతూ తెలిపారు.

Image copyright Getty Images

హార్లిక్స్ లాంటి డ్రింక్స్ నిజంగా మంచివేనా?

హార్లిక్స్‌లాంటి డ్రింక్స్ వల్ల ప్రచారం జరుగుతున్నంత లాభం లేదని డాక్టర్ రీతూ అన్నారు.

''హార్లిక్స్ లాంటి వాటిలో షుగర్, కెలోరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మిగతా న్యూట్రియెంట్స్ వల్ల అంత ఎక్కువ లాభం ఉండదు.'' అని ఆమె తెలిపారు.

విటమిన్ డి దేని నుంచి వచ్చినా ఫలితం ఒకే మాదిరిగా ఉంటుందన్నారు.

జిల్లా డ్రగ్ కంట్రోల్ విభాగం నోటీసులు జారీ చేసిన నాటి నుంచి ముజఫర్‌పూర్ జిల్లాలో హార్లిక్స్ విక్రయాలు నిలిపేశారు.

''హార్లిక్స్‌లో ఉపయోగించే పదార్థాలన్నీ శాకాహార పదార్థాల నుంచి తీసుకున్నవే. మా ఉత్పత్తులలో పచ్చని చుక్క కలిగిన ఉత్పత్తులన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2011 ప్రమాణాలకు లోబడి ఉండేలా చూసుకుంటాం'' అని గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు