పవన్ కల్యాణ్: '2019లో నేనే ముఖ్యమంత్రి' - ప్రెస్ రివ్యూ

  • 22 నవంబర్ 2018
Image copyright janasenaparty/fb

వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, తాను ముఖ్యమంత్రి కావడం తథ్యమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారని 'ఆంధ్రజ్యోతి' రాసింది.

దక్షిణ భారత హక్కుల కోసం జరిగే పోరాటానికి తాను నేతృత్వం వహిస్తానని కూడా పవన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని పరిచయం చేసేందుకు బుధవారం చెన్నై వెళ్లిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

సీఎం చంద్రబాబు బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఇటీవల డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ కావడంపై బదులిస్తూ.. 'చంద్రబాబుతో ప్రయాణం చాలా ప్రమాదకరం. ఆయన ఎప్పుడు ఎవర్ని ఎత్తుతారో, ఎవర్ని దించేస్తారో చెప్పలేం. ఎవరితో స్నేహం చేస్తారో, ఎవరితో శత్రుత్వం నెరపుతారో అర్థంకాదు. అందువల్ల ఆయన్ను విశ్వసించలేం. చంద్రబాబు చెప్పే కూటమిలో ఎవరు చేరినా వారిని దారుణంగా మోసం చేయగలరు. చంద్రబాబు రాజకీయ రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నారు. తన కుమారుడు లోకేశ్‌ను ప్రమోట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని లోకేశ్‌.. పంచాయతీరాజ్‌ మంత్రిగా వ్యవహరిస్తున్నారు' అని అన్నారు.

వైసీపీతో పొత్తుకు జనసేన ప్రయత్నించిందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అవన్నీ అవాస్తవాలన్నారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. ఏపీలో త్రిముఖ పోరు తప్పదన్నారు. 'ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి నేనే పోరాడుతున్నా. జగన్‌ దీనిపై నోరెత్తితే కేంద్రం కేసుల చిట్టా చూపిస్తుంది. దాంతో ఆయన మిన్నకుండిపోతున్నారు' అని ఎద్దేవా చేశారు.

తగినంత సమయం లేకనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని పవన్‌ వివరణ ఇచ్చారు.

ఓటరు గుర్తింపు కార్డులు Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఎన్నికలు: అమ్మకానికి ఓటర్ల జాబితా

ఓటర్ల సమాచారం అంగట్లో సరకులా మారిందని, గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీ వంటి పూర్తి వివరాలను కొన్ని ముఠాలు అమ్మకానికి పెట్టాయంటూ 'ఈనాడు' ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

దాని ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలోని 119 శాసనసభ స్థానాల సమాచారం కావాలంటే రూ. 12 లక్షలు, ఒక పార్లమెంటు స్థానం వరకైతే రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఇవ్వాలంటూ ముఠాలు బేరానికి పెట్టాయి.

ఆ ముఠాల వద్ద ఇటీవల ఓటరుగా నమోదైన వివరాలతోపాటు, తాజాగా తొలగించిన ఓటర్ల జాబితా సైతం ఉండటం తమ పరిశోధనలో బయటపడిందని 'ఈనాడు' పేర్కొంది.

ఉదాహరణకు హైదరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో 19 లక్షలమంది ఓటర్లు ఉండగా వారిలో 4.12 లక్షలమంది ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీ తదితర వివరాలు తమ వద్ద అందుబాటులో ఉన్నట్లుగా డాటా ముఠాలు చెబుతున్నాయి. అంటే మొత్తంగా రాష్ట్ర ఓటర్లలోని 10 శాతంమంది వివరాలు వారి చేతికి చిక్కి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీలకు ఓటరు జాబితాలను అధికారికంగా అందజేస్తారు. వాటిలో ఓటరు పేరు, వయసు, ఓటరు కార్డు నంబరు, చిరునామా, పోలింగ్‌ కేంద్రం వివరాలు మాత్రమే ఉంటాయి.

కానీ ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారం మొత్తాన్ని కొన్ని ముఠాలు అడ్డదారుల్లో సంపాదించి అమ్మకానికి పెట్టాయి.పేర్ల ఆధారంగా ఓటరు కుల మతాల వివరాలను అదనంగా పొందుపరిచార.

Image copyright tdp.ncbn.official/Facebook
చిత్రం శీర్షిక తన మనవడు దేవాన్ష్‌తో చంద్రబాబు (పాత చిత్రం)

రూ.7 కోట్లు పెరిగిన చంద్రబాబు మనవడి ఆస్తి

ఏపీ సీఎం చంద్రబాబు మనవడి ఆస్తులు ఏడాదిలో రూ.7.17 కోట్లు పెరిగాయని ఈనాడు, సాక్షి పత్రికలు ప్రచురించాయి.

ఎప్పటిలాగే చంద్రబాబు కుటుంబ సభ్యులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను తాజాగా వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం, చంద్రబాబు కంటే ఆయన మనవడు దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల విలువే ఎక్కువగా ఉంది.

గతేడాది ఫిబ్రవరిలో ఆస్తులు ప్రకటించినప్పుడు రూ.11.54 కోట్లుగా వున్న దేవాన్ష్ ఆస్తుల విలువ ఈ ఏడాది రూ.18.71 కోట్లకు చేరింది.

2018 మార్చి నెలాఖరుకి చంద్రబాబు కుటుంబం నికర ఆస్తుల విలువ 88.68 కోట్లు అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అయితే అవన్నీ ఆస్తులను తమ కుటుంబం కొన్నప్పటి విలువ మాత్రమేనని, మార్కెట్ విలువలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి.. ప్రస్తుత మార్కెట్ విలువను చెప్పడంలేదని ఆయన అన్నారు.

గతేడాదితో పోల్చితే చంద్రబాబు ఆస్తుల విలువ రూ.46 లక్షలు, రూ.6.20 కోట్లు పెరిగినట్లు ఆయన తెలిపారు. తన పేరుమీద ఉన్న ఆస్తుల విలువ రూ.90 లక్షలు పెరిగిందన్నారు.

Image copyright Getty Images

కిక్ చాలెంజ్ తరహాలో ఇప్పుడు 'ఉంగ్లీ చాలెంజ్'

ఓటింగ్‌పై ఐటీ రంగంలోని వారికి అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) 'ఉంగ్లీ చాలెంజ్‌' ప్రారంభించిందని 'నమస్తే తెలంగాణ' ఓ కథనంలో తెలిపింది.

ఇటీవలే రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్య వేదికలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో నిర్వహించిన పొలిటికల్ హ్యాకథాన్‌కు కొనసాగింపుగా ఉంగ్లీ చాలెంజ్ కార్యక్రమాన్ని రూపొందించినట్టు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల తెలిపారు.

కికి చాలెంజ్ తరహాలోనే ఉంగ్లీ చాలెంజ్ సాగుతుందని అన్నారు. సందీప్ బుధవారం స్వయంగా డ్యాన్స్‌చేసి టీటా సభ్యులకు చాలెంజ్ విసిరారు. నవంబర్ 30 వరకు ఈ చాలెంజ్ కొనసాగుతుందని అన్నారు.

పదిరోజులపాటు సాగే ఉంగ్లీ చాలెంజ్ ద్వారా డ్యాన్స్, మెసేజ్‌లతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో ఓటింగ్‌పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు