‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ సెంటనలీస్ ఆదిమజాతి ప్రజలు’

సెంటినలీస్ తెగ వ్యక్తి
ఫొటో క్యాప్షన్,

సెంటినలీస్ ప్రజలు ఎల్లప్పుడూ ప్రతిఘటిస్తూనే ఉన్నారు.. 2004లో సునామీ అనంతరం పరిశీలనకు వచ్చిన హెలికాప్టర్ మీద సైతం ఇలా బాణాలతో దాడికి దిగారు

అండమాన్ నికోబార్ దీవుల్లో అమెరికా వ్యక్తి ఒకరిని.. ప్రపంచానికి దూరంగా ఉండే ఆదిమ తెగ వారు చంపేశారు.

సెంటనలీస్ ఆదిమవాసులు వేల ఏళ్లుగా నార్త్ సెంటినల్ దీవిలో ఏకాంతంగా నివసిస్తున్నారు. బయటి నాగరకతతో ఏ మాత్రం సంబంధాలు లేని ఈ తెగ వారు ప్రస్తుతం 50 నుంచి 150 మధ్య మాత్రమే ఉన్నారన్నది అంచనా.

ఆ దీవికి అతడు వెళ్లినపుడు ఆ తెగ వారు బాణాలు వేసి చంపారని, మృతదేహాన్ని బీచ్‌లోనే వదిలివేశారని.. ఆ వ్యక్తిని బోటులో నార్త్ సెంటినల్ ఐలండ్‌కు తీసుకెళ్లిన మత్స్యకారులు చెప్పారు.

మృతుడిని అమెరికాలోని అలబామాకు చెందిన జాన్ అలెన్ చౌ (27) గా గుర్తించారు. సెంటినలీస్ ప్రజలకు క్రైస్తవ మతాన్ని బోధించటం కోసం అతడు అక్కడికి వెళ్లివుంటాడని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే.. పర్యటనలు, సాహసయాత్రలు తనకు చాలా ఇష్టమని అలెన్ సోషల్ మీడియాలో తన గురించి చెప్పుకున్నాడు.

‘‘అతడు క్రైస్తవ మత ప్రచారకుడు కాదు. అతడొక సాహసయాత్రికుడు. ఆదిమతెగ ప్రజలను కలవటమే అతడి ఉద్దేశం’’ అని అండమాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దీపేంద్ర పాఠక్ చెప్పినట్లు న్యూస్ మినిట్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఫొటో క్యాప్షన్,

ఈ ప్రాంతానికి వెళుతున్నట్లు @johnachau అక్టోబర్ 21న పోస్ట్ చేశారు

‘సెంటినలీన్ ప్రజలకు సువార్త బోధించేందుకే వెళ్లాడు’

ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్‌సర్న్ సంస్థ అధ్యక్షుడు జెఫ్ కింగ్ ఈ సంఘటనపై ‘బీబీసీ న్యూస్‌డే కార్యక్రమం’లో స్పందించారు. ఈ సంస్థతో అలెన్ చౌకు అనుబంధం ఉంది. అండమాన్ పర్యటన సందర్భంగా కూడా జెఫ్ కింగ్‌తో అలెన్ చౌ మాట్లాడారు.

‘‘ఈ ప్రజలకు సువార్త బోధించేందుకే జాన్ అక్కడికి వెళ్లాడు. దీనిపై అతను మాట్లాడాడు. ఇందుకు కొంత కాలంగా ప్రణాళిక తయారు చేసుకున్నాడు. కాబట్టి ఇది ఎవరి ఆదేశమూ కాదు.. చంచలత్వంతో చేసిన పనీ కాదు’’ అని జెఫ్ కింగ్ చెప్పారు.

సెంటినలీస్‌ను కలవటం నేరం

ప్రపంచానికి దూరంగా ఏకాంతంలో జీవిస్తున్న అండమాన్ తెగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఆ తెగ వారిని కలవటం నేరం. బయటి వ్యాధులు ఆ తెగవారికి సోకే ప్రమాదాన్ని నివారించటానికి.. వారిని ఎవరూ కలవరాదన్న నిషేధం విధించారు.

చనిపోయిన అమెరికా ప్రయాణికుడు జాన్ అలెన్‌ని వారి దీవికి అక్రమంగా బోటులో తీసుకెళ్లినందుకు గాను ఏడుగురు మత్య్సకారులను అరెస్ట్ చేశారు.

‘‘అతడు గతంలో స్థానిక మత్స్యకారుల సాయంతో నాలుగైదు సార్లు నార్త్ సెంటినల్ ఐలండ్‌ను సందర్శించాడని పోలీసులు చెప్పారు’’ అని సుబీర్ భౌమిక్ అనే జర్నలిస్ట్ బీబీసీ హిందీకి తెలిపారు. ఆయన చాలా సంవత్సరాలుగా ఈ దీవుల్లో పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు.

‘‘సెంటినలీస్ తెగకు చెందిన జనం సంఖ్య చాలా తక్కువగా ఉంది.. డబ్బు ఎలా ఉపయోగించాలన్నది కూడా తెలియదు. నిజానికి వారిని ఏ విధంగా కలవటమైనా చట్టవిరుద్ధం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

సెంటినలీస్ తెగ ప్రజలు తమ దీవి తీరంలో గస్తీ కాస్తున్న దృశ్యం

వారిని ఫొటోలు, వీడియోలు తీయటం నిషిద్ధం

అండమాన్ ఆదివాసీ తెగల వారిని ఫొటోలు, వీడియోలు తీయటం కూడా.. మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించగల నేరమని భారత ప్రభుత్వం 2017లో ప్రకటించింది.

అలెన్ నవంబర్ 14వ తేదీన సెంటినలీస్ దీవికి వెళ్లటానికి ప్రయత్నించి విఫలమయ్యారని.. కానీ రెండు రోజుల తర్వాత మళ్లీ వెళ్లటానికి ప్రయత్నించాడని స్థానిక వర్గాలను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తా సంస్థ చెప్పింది.

‘‘అతడి మీద బాణాలతో దాడి చేశారు. కానీ అతడు ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. ఆదివాసీలు అతడి మెడకు తాడు కట్టి, అతడి శరీరాన్ని లాక్కెళ్లటాన్ని మత్స్యకారులు చూశారు. వీరు భయపడి పారిపోయారు’’ అని ఆ కథనం పేర్కొంది.

అలెన్ మృతదేహాన్ని నవంబర్ 20వ తేదీన గుర్తించారు. అయితే.. ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

‘‘పోలీసులకు ఇది చాలా క్లిష్టమైన కేసు. సెంటినలీస్‌ను అరెస్ట్ చేయజాలరు’’ అని భౌమిక్ వ్యాఖ్యానించారు.

2006లో నార్త్ సెంటినల్ దీవి సమీపంలో చేపలు పడుతున్న భారత మత్స్యకారులు ఇద్దరిని కూడా ఈ తెగ వారు చంపారు.

ఫొటో క్యాప్షన్,

సెంటినలీస్ ప్రజల ఫొటోలు చాలా కొన్నే ఉన్నాయి

ఎవరీ సెంటినలీస్?

నాగరిక ప్రపంచంగా మనం చెప్పుకుంటున్న విస్తృత ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా.. ఏకాంతంగా జీవిస్తున్న అతి కొద్ది ఆదిమ జాతి ప్రజల్లో సెంటినలీస్ ఒకరు.

ఈ తెగ వారు తమ సొంత దీవి మీద జివిస్తారు. అది సుమారు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. కానీ వారి గురించి మనకు తెలిసినదంతా.. దూరం నుంచి వారిని గమనించటం ద్వారా తెలుసుకున్నదే.

నిజానికి.. ప్రపంచంలో ఇప్పుడున్న మరే ఆదిమ జాతి ప్రజలకన్నా ఎక్కువగా ఈ సెంటినలీస్ తెగ వారే ప్రపంచానికి సుదూరంగా జీవిస్తున్నారని నిపుణుల అంచనా.

వీరు.. ఆఫ్రికాలో ఆవిర్భవించిన మొట్టమొదటి మానవ జనాభా ప్రత్యక్ష వారసులు కావచ్చునని.. దాదాపు 60,000 సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని పరిగణిస్తున్నారు.

అండమాన్ దీవుల్లోని ఇతర దీవుల్లో ఉన్న వేరే ఆదిమజాతుల వారి భాషకూ.. ఈ సెంటినలీస్ భాషకూ ఏమాత్రం పోలిక లేకపోవటాన్ని బట్టి.. వీరికి తమ చుట్టుపక్కల దీవుల్లోని జాతుల వారితోనే వేల ఏళ్లుగా సంబంధాలు లేవని అర్థమవుతోంది.

ఫొటో క్యాప్షన్,

సెంటినలీస్ తెగ ప్రజలు దాదాపు 60,000 ఏళ్లుగా ఈ 60 చదరపు కిలోమీటర్ల నార్త్ సెంటినల్ దీవిలోనే జీవిస్తున్నారు

బ్రిటిష్ వలస పాలనలో వేలాది మంది అంతం

వీరి జీవనాధారం ఆహార సేకరణ, వేట. అయితే.. 60,000 ఏళ్ల కిందట వీరు ఎలా జీవించారో ఇప్పుడూ అలాగే జీవిస్తున్నారనేది దీని అర్థం కాదని పరిశోధకులు చెప్తున్నారు.

ఉదాహరణకు వీరు ‘రాతియుగానికి చెందిన వారు’గా అభివర్ణించటానికి వీలు లేదని.. తమ దీవి తీరంలోకి కొట్టుకువచ్చే నౌకల శిధిలాల్లో లభ్యమయ్యే లోహాల నుంచి వీరు లోహపు పనిముట్లు తయారు చేసుకున్నారని పేర్కొన్నారు.

బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా.. బ్రిటిష్ వలస పాలనా కాలంలో అండమాన్ దీవుల్లోని ఆదిమ తెగలు కొన్నిటి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.

కానీ.. ‘‘బ్రిటిష్ వలస రాజ్య ఆక్రమణ.. అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే తెగలను ధ్వంసం చేసింది. వేలాది మంది ఆదివాసీలను తుడిచిపెట్టింది. వాస్తవ జనాభాలో కేవలం అతి చిన్న భాగం మాత్రమే ఇప్పుడు బతికుంది. కాబట్టి బయటి వారు అంటే వారి భయం అర్థం చేసుకోగలిగేదే’’ అని సర్వైవల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్టీఫెన్ కోరీ వ్యాఖ్యానించారు.

అండమాన్‌ దీవుల్లోని ఆదిమ తెగలు సహా ప్రపంచ వ్యాప్తంగా నాగరికతకు దూరంగా ఇప్పటికీ జీవిస్తున్న ఆదిమజాతుల ప్రజలను రక్షించటం కోసం లండన్ కేంద్రంగా గల సర్వైవల్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఉద్యమిస్తున్నాయి.

ఫొటో క్యాప్షన్,

అండమాన్‌లో నివసరించే మరో ఆదిమజాతి జారవా తెగ ప్రజలకు.. బాహ్య ప్రపంచంతో కొద్దిగా సంబంధాలున్నాయి

సునామీని తట్టుకున్నా.. ఫ్లూ వంటి వాటిని తట్టుకోలేరు...

2004లో ఇండొనేసియా, శ్రీలంక, భారత తూర్పు తీరాల్లో మహావిలయం సృష్టించిన హిందూ మహా సముద్ర సునామీని.. నార్త్ సెంటినల్ దీవిలో నివసించే ఈ సెంటినలీస్ తెగవారు తట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారని అధికారులు గుర్తించినట్లు బీబీసీ ప్రతినిధి గీతాపాండే పేర్కొన్నారు.

ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడ, నార్త్ సెంటినల్ దీవి మీదుగా నేవీ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ పరిశీలించారు. మరింత దగ్గరగా చూడటానికి హెలికాప్టర్ కాస్త కిందకు దిగినపుడు.. దానిపై అక్కడి తెగ వారు బాణాలు విసిరిరారు. ‘‘అలా వారు క్షేమంగా ఉన్నారని మాకు తెలిసింది’’ అని ఆ హెలికాప్టర్ పైలట్ మీడియాకు చెప్పారు.

‘‘సెంటినలీస్ వారు తమను ఏకాంతంగా వదిలివేయాలని పదే పదే చాటుతున్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలి’’ అని స్టీఫెన్ పేర్కొన్నారు.

అండమాన్‌లో అంతరించిపోయే దశలో ఉన్న రెండు ఆదిమ తెగలు - జారవా, సెంటినలీస్ - జీవనాధారం.. ఆహార సేకరణ, వేట. బయటి ప్రపంచంతో సంబంధాల వల్ల వారికి అంటు వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది.

ప్రత్యేకించి సెంటినలీస్ తెగ వారికి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. వారు పూర్తిగా మిగతా ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా జీవిస్తుండటం వల్ల ఫ్లూ, మీజిల్స్ వంటి సాధారణ వ్యాధులను తట్టుకునే నిరోధక శక్తి కూడా వారికి ఉండే అవకాశం లేదు.

‘‘తాజా పరిణామం నేపథ్యంలో ఇప్పుడు ఆ సెంటినలీస్‌కి ప్రాణాంతక క్రిములు సోకి ఉండే అవకాశం లేకపోలేదు. వాటిని తట్టుకునే వ్యాధినిరోధకత వారికి లేకపోతే.. ఆ తెగ మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమూ ఉంటుంది‘’ అని స్టీఫెన్ పేర్కొన్నారు.

బయటి ప్రపంచంతో కొంత సంబంధం ఉన్న జారవా తెగ విషయంలోనే కొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ తెగ నివసించే ప్రాంతం మధ్య గుండా రోడ్డు వేసి, దానిని పర్యాటకులు ‘సఫారీ’ యాత్రలకు ఉపయోగించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)