బీజేపీకి శబరిమల రూపంలో మరో ‘అయోధ్య’ దొరికిందా?

  • ఇమ్రాన్ ఖురేషీ
  • బీబీసీ కోసం

1990ల్లో అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశాన్ని అస్త్రంగా మలచుకొని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. కానీ, ఆ అంశాన్ని అడ్డుపెట్టుకొని ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ అసంఖ్యాక ప్రజా మద్దతు కూడగట్టింది. కొన్నాళ్లకు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇప్పటిదాకా ఉత్తర భారతానికే ఎక్కువగా పరిమితమైన ఆ పార్టీ దక్షిణాదిలోనూ ఎదగడానికి ఇప్పుడు శబరిమల రూపంలో మరో ‘అయోధ్య’ను కనుగొన్నట్టు కనిపిస్తోంది.

రెండేళ్ల క్రితం వరకు కేరళలో తాము బీజేపీకి చెందిన వారిమని చెప్పుకోవడానికి కూడా చాలామంది ఆలోచించేవారు. నాలుగు దశాబ్దాలుగా అక్కడ సీపీఐ(ఎం) నేతృత్వంలోని కూటమి, లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మధ్య అధికారం చేతులు మారుతూ వస్తోంది.

కానీ గత రెండు నెలలుగా పరిస్థితి మారుతోంది. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, సంప్రదాయానికి మద్దతుగా ‘హిందువులందరినీ ఏకంచేసే’ ఆయుధం బీజేపీకి దొరికింది.

నవంబర్ 17న 64 రోజుల మండల-మకరవిళక్కు యాత్ర కోసం శబరిమల ఆలయాన్ని తెరిచినప్పటి నుంచి సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి పెంచుతూ వస్తోంది.

బీజేపీ పరివార్ నాయకుల చర్యలు రెచ్చగొట్టేవిగా ఉండటంతో, అవి వారి అరెస్టులకు దారితీశాయి. దాంతో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కింది. బీజేపీ అనుబంధంగా ఉన్న ఆ సంస్థ నాయకుడిని ఆలయం తెరిచిన తొలి రోజునే అరెస్టు చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు దారితీసింది. రెండో అరెస్టు కింద మరో బీజేపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. దాంతో బీజేపీ కార్యకర్తలు హైవేలను దిగ్బంధించారు.

అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఓ పక్క నిబంధనలను ఉల్లంఘిస్తున్నందుకు ఆలయం దగ్గర బీజేపీ కార్యకర్తలు అరెస్టు అవుతున్నప్పటికీ, దాన్ని పట్టించుకోకుండా చిన్న చిన్న పట్టణాల్లో సైతం 200-300 మంది పార్టీ కార్యకర్తలు ఆ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

అక్టోబరులో కొందరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఇంకొందరు అడ్డుకోవడంతో, ఆలయ పరిసరాల్లో కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. అయినా కొందరు వాటిని లెక్కచేయకుండా ఆందోళనలు చేపడుతున్నారు.

‘ఆందోళనలు నిర్వహించేవారి విషయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. అందుకే సీపీఎం కూడా సందిగ్ధంలో ఉన్నట్టు కనిపిస్తోంది’ అని జో స్కారియా అనే రాజకీయ విశ్లేషకుడు చెప్పారు.

బీజేపీ మద్దతుతో పనిచేస్తున్న కొన్ని సంఘాల పిలుపు మేరకు వివిధ వర్గాలకు చెందిన మహిళలు కూడా అక్టోబరులో ఆందోళనల్లో పాల్గొనడం కనిపించింది. సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ ఆ మహిళలు 50ఏళ్లు దాటాకే ఆలయంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ మహిళలు తీసుకున్న నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని చరిత్రకారిణి జె.దేవిక చెప్పారు.

‘బీజేపీ రాజకీయంగా ఎదిగింది. మరీ ముఖ్యంగా సామాజికంగా కూడా అది ఎదిగింది. సంప్రదాయవాదం ఒకప్పుడు కేరళలో బాగా విస్తరించింది. వామపక్షాలు, మితవాదులు దాన్ని పంచుకున్నారు. వామపక్షాలు దీన్నుంచి చాలా లాభపడ్డాయి. అది రాజకీయంగా వాళ్లు ముందడుగు వేసేందుకు ఉపయోగపడినా, సామాజికంగా మాత్రం అది వెనకడుగే’ అంటారు దేవిక. కేరళలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంటల్ స్టడీస్‌లో దేవిక అసిస్టెంట్ ప్రొఫెసర్.

1957లో మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాద్ ఎప్పుడు ఆలయానికి వెళ్లినా ఆయన భార్యను వెంటబెట్టుకొని వెళ్లేవారు. కానీ, ఆయన నాస్తికుడు అన్న విషయం అందరికీ తెలుసు.

ఆరు దశాబ్దాల తరువాత కూడా ఆ పద్ధతి మారినట్లు కనిపించట్లేదు.

‘సామాజిక సంప్రదాయవాదాన్ని మితవాదులు క్రియాశీలంగా విస్తరిస్తున్నారు. నిజానికి అది వామపక్షాల కంటే వీరికే బాగా నప్పుతుంది. అందుకే వాళ్లు దాన్ని లాభదాయకంగా మార్చుకుంటున్నారు. వామపక్షాలు మాత్రం దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాయి’ అని దేవిక చెప్పారు.

నిజం చెప్పాలంటే శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం మినహా కేరళ ప్రభుత్వం ముందు మరో మార్గం లేదు.

అన్ని వయసుల మహిళలకు ఆ తీర్పు అనుకూలంగా ఉందని తాము అఫిడవిట్ దాఖలు చేసినందున, ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయడం కానీ, అమలు చేయడానికి సమయం కోరడం కానీ ప్రభుత్వానికి సాధ్యం కాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పదేపదే చెప్పారు.

‘రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంఘాలతో చర్చలు జరిపి ఉండాల్సింది. వాళ్లు మరింత చాకచక్యంగా వ్యవహరించి ఉంటే బావుంటుంది. బీజేపీకి దూరమైన కేరళ పులెయర్ మహా సభ(రాష్ట్రంలోని అతిపెద్ద దళిత సంఘం)ను వాళ్లు భాగం చేసుండాల్సింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఎలాంటి రాజకీయ ప్రణాళికను వాళ్లు రచించలేదు’ అని రాజకీయ విశ్లేషకుడు, ఏషియానెట్ టీవీ నెట్‌వర్క్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎంజీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

శబరిమల అంశాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో బీజేపీ లాభపడిందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కానీ, దాన్ని ఓట్లుగా మలచుకోవడంలో అది సఫలమవుతుందా అన్నదే ప్రశ్నార్థకం.

‘త్రిపురలో అమలు చేసిన ప్రణాళికనే ఇక్కడా అమలు చేయొచ్చని బీజేపీ నేతలు అనుకోవచ్చు. కానీ, అది ఇక్కడ కుదురుతుందని నేననుకోవట్లేదు. ఎందుకంటే, ఆందోళనలకు సంబంధం లేకుండా కేరళలో ఓటింగ్ సరళి ఉంటుంది’ అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు బీఆర్‌పీ భాస్కర్ అన్నారు.

2011లో 8.98శాతంగా ఉన్న బీజేపీ ఓటు షేరు, 2016 నాటికి 15.20 శాతానికి పెరిగింది. హిందువులను ఏకం చేయాలన్న వారి పాచిక పారలేదు. ఎందుకంటే రాజకీయ వేదికపై కులాలు ఎప్పుడూ తలోదిక్కే ఉంటాయి అని రాధాకృష్ణన్ అంటారు.

కేరళలో ప్రధాని మోదీ భారీ క్యాంపైన్ అనంతరం ఒకేఒక్క సీటుతో బీజేపీ ఖాతా తెరిచింది. అది కూడా అక్కడి అభ్యర్థి, వృద్ధ నేత ఓ.రాజగోపాల్‌పై ఉన్న సానుభూతి కారణంగానే గెలవగలిగిందని చెబుతారు.

‘బీజేపీ కచ్చితంగా లాభపడింది. కాంగ్రెస్‌నుంచి బీజేపీ వైపు గాలి మళ్లింది. కానీ, ఎంతమంది బీజేపీకి ఓటేస్తారన్నది చెప్పలేం’ అంటారు రాధాకృష్ణన్.

‘వరదల సమయంలో కులాలకు అతీతంగా అందరూ ముందుకొచ్చి పనిచేశారు. కానీ, తరువాత ఈ అంశం ముందుకొచ్చింది. సామాజిక అభివృద్ధిని చూసుకుంటూ కేరళ గర్వపడుతుంది. కానీ, దానికింద బలమైన మత సెంటిమెంటు కూడా దాగుంది’ అని భాస్కర్ చెప్పారు.

కానీ, ‘రాముడి’ పేరుతో 90ల్లో ఉత్తరాది వాళ్లను ఆకర్షించినంత సులువుగా దక్షిణాది ప్రజలను ఆకర్షించడం సాధ్యం కాదు.

‘బీజేపీ అక్కడికి వెళ్లి తన బలం పెంచుకోవడం అంటూ ఏమీ లేదు. ఎవరి బలం ఎంతో తేలేది ఎన్నికల్లోనే అన్న విషయం బీజేపీకి బాగా తెలుసు’ అని పేరును గోప్యంగా ఉంచమని కోరిన బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువే ఉంది. గత కొన్ని రోజుల్లో సాధించిన ఉత్సాహాన్ని బీజేపీ అప్పటిదాకా కొనసాగించగలదా లేదా అన్నదే ఇప్పుడు వాళ్లముందున్న ప్రశ్న.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)