సోనియా గాంధీ: తెలంగాణకు తొలిసారి: ప్రెస్ రివ్యూ

  • 23 నవంబర్ 2018
Image copyright Getty Images

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సోనియా గాంధీ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

శుక్రవారం మేడ్చల్‌లో సోనియా, రాహుల్‌ పాల్గొంటున్న సభను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సోనియా, రాహుల్‌ బయలుదేరి సాయంత్రం 5గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

అక్కడ టీపీసీసీ ముఖ్య నేతలతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తారు. అక్కడి నుంచి 5.30 గంటలకు బయలుదేరి 6గంటలకు మేడ్చల్‌లోని బహిరంగ సభకు చేరుకుంటారు.

సభలో దాదాపు 45 నిమిషాల పాటు సోనియా ప్రసంగించనున్నారు. రాహుల్‌ 20 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా 116 పేజీల కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను సోనియా ఆవిష్కరించనున్నారు.

కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు ఈ సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సాక్షి కథనం పేర్కొంది.

Image copyright jd laxminarayana fans club/facebook

మరో కొత్త పార్టీ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఓ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఈనెల 26న ఆయనే స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నారు. పార్టీ జెండా, అజెండా, సిద్ధాంతాల గురించి స్వయంగా వివరించనున్నారు.

సీబీఐ సంయుక్త సంచాలకులుగా ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్‌, గాలి జనార్ధన్‌రెడ్డి అక్రమాల కేసులను దర్యాప్తు చేయటం ద్వారా వెలుగులోకి వచ్చారు.

ఈ కేసులను విచారించిన తీరు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రభుత్వ సేవలో ఉన్నప్పటినుంచే ఆయన గ్రామీణ సమస్యలపై, ప్రత్యేకించి రైతుల సమస్యలపై అధ్యయనం చేశారు.

పదవీ విరమణ తీసుకున్నాక రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేశారు. గ్రామాలను సందర్శించి రైతులతో మమేకమయ్యారు.

కొంతకాలంగా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపించాయి. ఓ జాతీయ పార్టీలో చేరతారని, తమతో కలిసి పనిచేయాలని మరో పార్టీ ఆయనను ఆహ్వానించిందని ప్రచారం జరిగింది.

వీటన్నింటికీ ఆయన విరామమిస్తూ సొంతంగానే పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే పార్టీ ప్రధాన అజెండాగా ఉంటుందని ఈనాడు కథనం తెలిపింది.

Image copyright facebook/KCR

‘నేను ఓడితే మీకే నష్టం’

టీఆర్ఎస్ ఓడిపోతే ప్రజలే నష్టపోతారని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు నవతెలంగాణ పత్రిక పేర్కొంది. ఆ పత్రికలోని కథనం మేరకు..

''టీఆర్‌ఎస్‌ ఓడిపోయిందనుకో.. నాకొచ్చే నష్టం పెద్దగా లేదు. ప్రజలే నష్టపోతారు. గెలిపిస్తే గట్టిగ పని చేస్తాం. లేకుంటే ఇంటికాడ పడుకుని రెస్ట్‌ తీసుకుంటాం..'' అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిర్మల్‌, ఖానాపూర్‌, ముథోల్‌, ఇచ్చోడ, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజ ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో ఎన్‌డీఏ, కాంగ్రేసేతర ప్రభుత్వాలు రావాలన్నారు.

మోదీ తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రలో కలిపి తన నిరంకుశ వైఖరిని ప్రదర్శించారన్నారు. రాష్ట్రంలోని మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్ల కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యం చేశారన్నారు.

రెప్ప ఆర్పే సమయం కూడా కరెంటు పోకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించిన ఘనత దేశంలో తమకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ వస్తే మళ్లీ కరెంటు ఎటమటం చేస్తారని కేసీఆర్ పేర్కొన్నట్లు నవతెలంగాణ కథనం పేర్కొంది.

నారా చంద్రబాబునాయుడు Image copyright Nara Chandrababu Naidu/Facebook

‘గవర్నర్ ఆఫీస్‌లో ఫ్యాక్స్ మెషీన్ పని చేయదా?

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు ఫాసిస్టు చర్య అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. ఆ కథనం ప్రకారం..

నరేంద్ర మోదీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఇది పరాకాష్ట అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలను కాలరాసేలా బీజేపీ వ్యవహరిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

తమకు అసెంబ్లీలో 56మంది సభ్యుల మెజారిటీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని మెహబూబా ముఫ్తీ కోరినా, గవర్నర్ స్పందించకపోవడం దారుణం.

రాజ్‌భవన్‌లో ఫ్యాక్స్ మెషీన్ పనిచేయకపోవడం, ఫోన్ చేసినా గవర్నర్ అందుబాటులోకి రాకపోవడం, మెయిల్ పంపినా పరిగణనలోకి తీసుకోకపోవడం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉందన్నది సుస్పష్టం.

మెహబూబా ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. ఆ వెంటనే గవర్నర్ పాలన పెట్టారు. అది కూడా ఆరు నెలలు పూర్తి కాకముందే అసెంబ్లీని రద్దు చేశారు.

మోదీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు