సోనియా గాంధీ నుంచి నెహ్రూ దాకా... తెలంగాణపై ఏమన్నారు? : తెలంగాణ ఎన్నికలు 2018

  • 23 నవంబర్ 2018
నెహ్రూ, ఇందిర, సోనియా గాంధీ Image copyright Getty Images

'అమాయకురాలైన అమ్మాయిని (తెలంగాణ) గడసరి అబ్బాయి(ఆంధ్రా)తో వివాహం చేస్తున్నాం. వీరి కాపురం సజావుగా సాగని పక్షంలో ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు' అని భారత తొలి ప్రధాని నెహ్రూ నిజామాబాద్‌ సభలో పేర్కొన్నారు.

'తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. వారి 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది' అని 2014 కరీనంగర్ సభలో సోనియా గాంధీ ప్రకటించారు.

తెలంగాణ చరిత్రలో కీలకమైన ఈ రెండు వ్యాఖ్యల మధ్య ఆరు దశాబ్దాల అంతరం ఉంది. ఒకటి తెలంగాణ విలీన సందర్భంలో అంటే మరొకటి తెలంగాణ ఏర్పాటు సమయంలో అన్నది.

ఈ రెండు వ్యాఖ్యలు చేసింది నెహ్రూ-గాంధీ కుటుంబమే. ఈ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలపడంలోను, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలోనూ ఈ కుంటుంబం నిర్ణయాత్మక పాత్ర పోషించింది.

Image copyright Getty Images

ఫజల్ అలీ నివేదిక వద్దన్నా...

నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు నాటి హోంమంత్రి పటేల్ ఒత్తిడి చేయడంతో సైనిక చర్యకు నెహ్రూ ఆమోదం తెలిపారు. దీంతో భారత్‌లో పార్ట్ బి రాష్ట్రంగా హైదరాబాద్ ఏర్పడింది.

భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనపై సిఫార్సులు చేయడానికి కేంద్రం 1953లో ఫజల్ అలీ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్ తెలంగాణలోని తెలుగు మాట్లాడే 8 జిల్లాలను హైదరాబాద్ రాష్ట్రంగానే ఉంచాలని, వారు ఇష్టపడితేనే 1961లో ( రెండు శాసనసభ ఎన్నికల తర్వాత) శాసనసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అంగీకారంతో సమైక్య తెలుగు రాష్ట్రంలో కలపాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.

కానీ, తెలంగాణను ఆంధ్రాతో కలిపి తెలుగు ప్రాంతాలను ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికే నెహ్రూ మొగ్గుచూపారు.

ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై 1956 మార్చి 5న నిజామాబాద్ సభలో నెహ్రూ మాట్లాడుతూ, 'అమాయకురాలైన అమ్మాయిని(తెలంగాణ) గడసరి అబ్బాయి(ఆంధ్రా)తో వివాహం చేస్తున్నాం. వీరి కాపురం సజావుగా సాగని పక్షంలో ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు' అని పేర్కొన్నారు. (ఆధారం: ఇండియన్ ఎక్స్‌ప్రెస్, నవంబర్ 2, 1956)

‘ఆధునిక దేవాలయాలకు నాంది’

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నెహ్రూ చేతుల మీదుగానే ప్రారంభమైంది. 'ఇది నవ భారత మానవతా మందిరానికి పునాది. దేశమంతటా మనం నిర్మించబోయే మరెన్నో ఆధునిక దేవాలయాలకు నాంది' అంటూ 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ నిర్మాణానికి నెహ్రూ శంకుస్థాపన చేశారు.

1967 ఆగస్టు 4న దీని నిర్మాణం పూర్తైంది. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సాగర్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

మరో కీలకమైన భారీనీటిపారుదల ప్రాజెక్టు శ్రీరాంసాగర్‌ కూడా తెలంగాణలో నెహ్రూ చేతుల మీదుగానే ప్రారంభమైంది. 90 టీఎంసీల సామర్థ్యంతో 40 కోట్ల అంచనాతో 1963 జూలై 26న ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

Image copyright Getty Images

‘ఇందిర తిరస్కరణ’

ముల్కీ నిబంధనలను పాటించకపోవడంతో తమ ఉద్యోగాలను కోల్పోతున్నామని భావించిన తెలంగాణ ప్రజలు 1969లో జై తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. తొమ్మిది నెలల పాటు ఈ ఉద్యమం సాగింది. అధికారిక సమాచారం ప్రకారం 369 మంంది దాకా చనిపోయారు.

ఈ ఉద్యమాన్ని చల్లార్చేందుకు ఎనిమిది సూత్రాలు, ఐదు సూత్రాల ఫార్ములాను ఇందిర తీసుకొచ్చారు. కానీ, అవేవీ ఫలించలేదు. 1971లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కాదని ఇక్కడి ప్రజలు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజా సమితి(టీపీఎస్‌)కి పట్టం కట్టారు. ఆ ఎన్నికల్లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని టీపీఎస్‌కు 14 లోకసభ సీట్లకు గాను 11 సీట్లు దక్కాయి.

తెలంగాణ ప్రజల తీర్పు ఓట్ల రూపంలో తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షను వ్యక్తపరిచినప్పటికీ ఇందిర రాష్ట్ర ఏర్పాటును తిరస్కరించారు.

1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణకు చెందిన పీవీ నర్సింహారావును నియమించారు. ఆయన కాలంలోనే జై ఆంధ్రా ఉద్యమం మొదలైంది.

దీంతో ఇరు ప్రాంతాల నేతలతో చర్చించిన ఇందిర ఆరు సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి రెండు ఉద్యమాలను నిలిపివేయించారు.

'మెదక్' కానుక

1975లో దేశంలో అత్యయికస్థితి విధించిన అనంతరం ఇందిరా గాంధీ ప్రతిష్ఠ దెబ్బతిన్నది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో (1977) కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఇందిర కూడా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

జనతా పార్టీ విఫలవడంతో 1980లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 లోకసభ స్థానాల్లో పోటీ చేస్తే 41 స్థానాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 15 సీట్లను కాంగ్రెస్ చేజిక్కించుకుంది.

ఇందిర స్వయంగా మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రధాన మంత్రి అయిన వెంటనే ఆమె మెదక్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, పటాన్‌చెరువుకు సమీపంలో ఇక్రిశాట్‌ ఏర్పాటు చేయించారు.

Image copyright Keystone/Getty Images

'అంజయ్యకు అవమానం'

'హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాజీవ్ గాంధీ చేసిన అవమానమే ఎన్టీయార్ తెలుగు దేశం పార్టీ పెట్టడానికి కారణమైంది' అని ఇటీవల ప్రధాని మోదీ పార్లమెంట్‌లో పేర్కొన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ట్విటర్‌లోనూ మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 'అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారు' అని పేర్కొన్నారు.

తెలంగాణకు చెందిన టంగుటూరు అంజయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో రాజీవ్ గాంధీని స్వాగతించేందుకు అంజయ్య భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, వీటిని చూసి రాజీవ్ గాంధీ విసుక్కున్నారు.

ఈ విషయం నాటి పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. ఇది తెలుగువారికి జరిగిన అవమానం అంటూ ప్రచారమైంది.

ఈ ఘటన తర్వాత కాలంలో ఎన్టీయార్ టీడీపీని ఏర్పాటు చేసి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టొద్దు అంటూ ప్రచారం చేసి 1983 ఎన్నికల్లో విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Image copyright Getty Images

'సోనియా పట్టుదల'

2004లో కరీంగనగర్ సభలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా మారాయి.

'యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల చిరకాలవాంఛ నేరవేరుస్తాం' అంటూ 2004‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ డిమాండ్‌పై తొలిసారి బహిరంగంగా స్పందించారు.

2009లో తెలంగాణ ఉద్యమ ఉధృతంగా సాగడం, కేసీఆర్ ఆమరణనిరహార దీక్ష నేపథ్యంలో సోనియా జన్మదినం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ, ఆ తర్వాత ఆంధ్రాలో ఉద్యమం మొదలవడంతో వెనక్కి తీసుకుంది.

తీవ్రస్థాయి ఉద్యమాలు, విద్యార్థుల బలిదానాలు, అనేకానేక రాజకీయ కారణాలు వెరసి యూపీఏ2 పాలన చివరి దశలో తెలంగాణ ఏర్పాటుకు సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది.

పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం తర్వాత 2014లో కరీంనగర్ సభలో సోనియా ప్రసంగిస్తూ ''60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేశాం. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు అలుపెరగని పోరాటం చేశారు. అనేక సంఘర్షణల తర్వాత తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ ఇవ్వాలన్నదే కాంగ్రెస్ సంకల్పం'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)