తెలంగాణ ఎన్నికలు 2018: ఒకప్పుడు లండన్‌కు ఎగుమతి చేసేవారు.. ఇప్పుడు ఇక్కడే ఆదరణ కరవైంది

  • 27 నవంబర్ 2018
చేనేత

తెలంగాణ అస్తిత్వానికి మొదట్నుంచీ ప్రతీకగా ఉన్న చేనేత రంగం, ఎన్నికలు రాగానే పార్టీల ఎజెండాలోనూ ప్రధాన భాగమవుతుంది.

పోచంపల్లి ఇకత్, గొల్లభామ చీరలు.. గద్వాల పట్టు, కొత్తపల్లి టవళ్లు, వరంగల్ దరీలు(కార్పెట్లు)... ఇలా అంతర్జాతీయంగా తెలంగాణ చేనేత ఖ్యాతి గడించింది. కానీ మరమగ్గాలు ప్రవేశించినప్పటి నుంచి చేనేత కార్మికుల జీవితాలు నేలచూపులు చూడటం మొదలుపెట్టాయి.

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 17,026 చేనేత మగ్గాలు వినియోగంలో ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో చేనేత రంగంపై ఆధారపడ్డ కార్మికులు దాదాపు 40,000 మంది ఉన్నారు. 336 చేనేత సంఘాలు పని చేస్తున్నాయి.

మగ్గాలు ఆడితేనే చేనేత కార్మికుల కుటుంబాలు బతికేది. కానీ, రకరకాల సమస్యల మధ్య ఎన్నో ఏళ్లుగా తెలంగాణ చేనేత రంగం నలిగిపోతోంది.

ఎడారిలో నీటి ఊటలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు అప్పుడప్పుడు కొందరు చేనేత కార్మికులను ఆదుకుంటున్నాయి.

రాజీవ్ విద్యా మిషన్‌లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ యూనిఫాంల తయారీతో సిరిసిల్ల, పోచంపల్లి ప్రాంతంలో కార్మికులకు ఉపాధి దొరికింది.

బతుకమ్మ పండగ సమయంలో ప్రభుత్వం పంచుతోన్న చీరల తయారీ కాంట్రాక్టులు సిరిసిల్ల నేత కార్మికులకు కొంత ఊతమిచ్చాయి. కానీ, ఆ వెలుగులు తమ దాకా రాలేదని వరంగల్ చేనేత కార్మికులు అంటున్నారు.

తెలంగాణ టెక్స్‌టైల్స్ శాఖకు అనుబంధంగా చేనేత శాఖ ఉంది. పేరుకు రెండు రంగాలు నేత పనితో ముడిపడినా, భిన్న సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వీటిని వీడదీసి చేనేతకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తామని హమీ ఇచ్చింది.

2016-2017లో లక్ష కోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్‌లో హాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ విభాగానికి 83 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. 2017-18లో మాత్రం ఆ శాఖకు రూ. 1,200 కోట్లు కేటాయించారు. అంతే కేటాయింపు 2018-19 బడ్జెట్‌లోను జరిగింది.

కార్మికుల కోసం "నేతన్నకు చేయూత" అన్న నినాదంతో ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. దీని కోసం ఆ 1200 కోట్ల నుంచి రూ. 60 కోట్లు కేటాయించారు.

ఈ పథకంలో భాగంగా, నేత కార్మికుడు తన ఆదాయంలోంచి ఎనిమిది శాతం బ్యాంకులో వేస్తే దానికి ప్రభుత్వం పదహారు శాతం జోడించి ఆ ఖాతాలో వేస్తుంది. ఇలా జమ అయిన మొత్తాన్ని మూడేళ్ల వరకు తీసే వీలు లేదు.

"మాకొచ్చేదే అరకొర ఆదాయం. అందులోంచి కొంత తీసి బ్యాంకులో వేస్తే మూడు సంవత్సరాల దాకా వాడుకోకూడదంటే ఎలా? ప్రభుత్వం కూడా తన వాటా వేస్తా అనడం బానే ఉంది. కానీ, మూడు సంవత్సరాల కాలాన్ని ఇంకాస్త తగ్గిస్తే ఎక్కువ మంది నేత కార్మికులు దాన్ని ఉపయోగించుకుంటారు" అని వరంగల్ చేనేత కార్మిక సంఘం నేత వెంకటేశ్వరులు తెలిపారు.

కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇవ్వని వాగ్దానమంటూ లేదని చేనేత సంఘాల నేతలు అంటున్నారు. కానీ అందులో ఎన్ని హామీలు, ఎన్ని పథకాలు నిజంగా చేనేత కార్మికులకు చేరుతున్నాయో తెలీదని వారన్నారు.

వరంగల్‌లోని కొత్తవాడ దరీలకు చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 1851లోనే లండన్‌లోని ఎగ్జిబిషన్లలో ఇక్కడి దరీలను ప్రదర్శించారు.

గతంలో కొత్తవాడ కార్పెట్లు బ్రిటన్‌కు ఎగుమతయ్యేవి. అలాంటి దరీలు ఇప్పుడు తెలంగాణ కో-ఆపరేటివ్ సొసైటీ మార్కెటింగ్ వెబ్‌సైట్‌లోనూ అమ్మకానికి లేవు.

"ఇంతకుముందు మేము ఉదయం ఏడింటికి పనికి వస్తే రాత్రి ఎనిమిదికి కూడా పని పూర్తయ్యేది కాదు. అంత పని ఉండేది. ఒక్కప్పుడు కొత్తవాడలో ప్రతి ఇంట్లో చేనేత మగ్గాల చప్పుడు వినబడేది. ఇప్పుడు నేసే వారి సంఖ్యా తగ్గింది, మగ్గాలూ మూగబోయాయి. మేము ఒక రోజు పనికి వస్తే నాలుగు రోజులు ఖాళీయే. ఇంకో దారి లేక కొందరు ఇళ్లల్లో పనిమనుషులుగా మారుతున్నారు" అని శోభ అనే ఒక చేనేత కూలీ చెప్పారు.

రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ కొత్తవాడ కార్మికుల నుంచి వస్త్రాలు కొనుగోలు చేసేది.

"అప్పుడు ఆప్కో ఇక్కడి దరీలను కొనుగోలు చేసేది. కొత్తవాడకు దాదాపు ఆరు లక్షల ఆర్డర్లు వచ్చేవి. కానీ ఇప్పుడు లక్షకు మించి ఆర్డర్లు లేవు. అందులోనూ తెలంగాణ కో-ఆపరేటివ్ సొసైటీ దగ్గర ఇప్పటికి దాదాపు మూడు లక్షల ఆర్డర్లు స్టాక్‌లో ఉన్నాయి." అని వివరించారు హనుమకొండ అసిస్టెంట్ డైరెక్టర్ రాఘవరావు.

రోజుకు 12 గంటలు పనిచేసినా కనీసం రూ. 200 కూలీ కూడా రావట్లేదని, సొంతంగా మెటీరియల్ కొనే స్థోమత లేక కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాల్సి వస్తోందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

"నా దగ్గర ఓ పెద్ద మగ్గం, రెండు చిన్న మగ్గాలు ఉన్నాయి. ఇప్పుడు పని ఎక్కువ లేక ఒక పెద్ద మగ్గం, ఒక చిన్నమగ్గం పక్కన పెట్టేశాము. నూలు తెచ్చుకొని వస్త్రాలు నేసే స్థోమత లేదు. సంఘం నుంచి ఆర్డర్ వస్తే చేస్తా. లేకపోతే బంద్ పెడతా. అప్పుల పాలై ఇంకో దారి లేక అలా కాలం గడుపుతున్నాం. వచ్చే కాస్త డబ్బులో నుంచి కూలీ పైసలు తీయాలి, నా కిరాయి తీయాలి. ఇంకా నాకు మిగిలేది అంతంతమాత్రమే" అని జంబుఖానాలు నేసే వీరేశం చెప్పారు.

పని లేక, చేసే పనికి సరిపోను డబ్బు రాక యాసిన్ లాంటి వారు ఆటో డ్రైవర్లుగా మారుతున్నారు.

"టెక్స్‌టైల్ పార్కులు అన్నారు. కానీ, హ్యాండ్‌లూమ్‌ల ద్వారా వచ్చేది ఏమీ కనిపించడం లేదు. పవర్‌లూమ్‌లకు బానే సాయం చేశారు. ఆ పని మాకు కూడా నేర్పి టెక్స్‌టైల్ పార్కులో పని కల్పిస్తే మాకు బతుకుతెరువు దొరుకుతాది" అని యాసిన్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం కోసం 2018-19 బడ్జెట్‌లో రూ. 868 కోట్లు కేటాయించింది. వరంగల్‌లో నిర్మించదలచిన టెక్స్‌టైల్ పార్క్ పనులు 2019 నాటికి ప్రారంభం అవుతాయని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.

సతీష్ అనే కార్మికుడు, "మేము పని గురించి అడిగితే దరీలకు ఎక్కువ డిమాండ్ లేదు అంటున్నారు. కొంతమంది చీరలు, ధోతీలు నేయడం నేర్చుకుంటున్నారు. మాకు ఆ పని రాదు. మాకు వచ్చింది దరీలు నేయడమే. వయసులో ఉన్నప్పుడైతే నేర్చుకునే వాళ్లమేమో. మాకేమో కళ్ళే సరిగా కనిపించవు. ఇదే పని చేస్తూ జుట్టు నెరిసిపోయింది. ధోతీలకి, చీరలకి దారం సన్నగా ఉంటది. అందుకే ఆ పని ఇప్పుడు నేర్చుకునే పరిస్థితి లేదు" అన్నారు.

వచ్చిన పని మానేసి, ఇంకోటి నేర్చుకోమనడం సరి కాదు కదా అని మరి కొంతమంది నేత కార్మికుల అభిప్రాయం. ఏది ఏమైనా నెలకు నికరంగా 10,000 రూపాయలు వచ్చేలా ఉపాధి ఉంటే ఎంత కష్టపడటానికైనా సిద్ధమని హనుమకొండ, కొత్తవాడలోని చేనేత కార్మికులు చెబుతున్నారు.

ప్రభుత్వం ఏ విధంగా పోచంపల్లి, సిరిసిల్ల చీరల మార్కెటింగ్‌కు దారి చూపించిందో, అలాగే వరంగల్ దరీలకూ మార్కెట్ కల్పించాలని కోరుతున్నారు.

(ఫొటోలు: సంగీతం ప్రభాకర్)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం