తెలంగాణ ఎన్నికలు 2018: అందరి చూపు ఈ నియోజకవర్గాలపైనే

తెలంగాణ ఎన్నికలు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. 119 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో దిగారు. టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, టీడీపీ, టీజేస్, సీపీఐ కూటమిగా ఏర్పడి బరిలో దిగాయి.

బీజేపీ ఒక సీటును యువతెలంగాణ పార్టీకి కేటాయించి 118 నియోజకవర్గాల్లో పోటీ పడుతోంది. బీఎల్‌ఎఫ్ కూటమి అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ అవేంటి? అక్కడి ఓటర్లు గత ఎన్నికల్లో ఎలాంటి తీర్పునిచ్చారు? ఒకసారి పరిశీలిద్దాం.

గజ్వేల్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీలో ఉండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. కేసీఆర్ రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో సొంత నియోజకవర్గం సిద్ధిపేట నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హరిష్ రావుకే ఆ సీటు అప్పగించి గజ్వేల్ నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు. ఇప్పుడు అదే స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.

గజ్వేల్‌లో చేసిన అభివృద్ధి పనులే కేసీఆర్‌ను గెలిపిస్తాయని పార్టీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి.

హరీశ్‌రావు... అంతా తానై

టీఆర్ఎస్ రథసారథిగా కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి రాష్ట్రమంతా పర్యటిస్తుండటంతో గజ్వెల్‌లో ప్రచార బాధ్యతలను హరీశ్ మోస్తున్నారు. నియోజకవర్గంలోని 8 మండలాల బాధ్యతలను 8 మంది నేతలకు అప్పగించి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

బలమైన అభ్యర్థిని దింపిన కాంగ్రెస్

కేసీఆర్‌కు ప్రత్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నర్సారెడ్డి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన నర్సారెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఆయన చేరికతో తమ పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలతో ఇక్కడ ప్రచారం చేయిస్తోంది.

ఈ నియోజవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఆకుల విజయ, బహుజన వామపక్ష కూటమి (బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థిగా శ్రీరాముల శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు.

నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు : 2,27,934

కూకట్‌పల్లి

హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గాల్లో కూకట్‌పల్లి ఒకటి. ఒకప్పుడు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కూకట్‌పల్లి 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పడింది.

మహాకూటమి అభ్యర్థిగా అనూహ్యంగా నందమూరి సుహాసిని బరిలోకి దిగడంతో ఈ నియోజవర్గంపై అందరి దృష్టి పడింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మనవరాలు, మాజీ మంత్రి హరికృష్ణ కుమార్తె సుహాసిని. ఈమె పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మొదటి నుంచి ఈ స్థానం తమకే కావాలని పట్టుబట్టి సాధించుకుంది. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరకు వెళ్లి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఈ సీటును ఆయన నందమూరి సుహాసినికి కేటాయించారు.

నగరంలో ఆంధ్రులు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం ఒకటి.

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి మాధవరం కృష్ణారావు గెలుపొందారు. ఆ తర్వాత కొంత కాలానికే ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీ నుంచి మాధవరం కాంతారావు పోటీ చేస్తున్నారు.

బీజేపీ నుంచి పోటీ చేస్తోన్న మాధవరం కాంతారావు.. టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావుకు సమీప బంధువు. 2009లో ఆయన పోటీ చేసి పదివేల ఓట్లు తెచ్చుకున్నారు.

గతంలో లోక్‌సత్తా పార్టీ నుంచి జయప్రకాశ్ నారాయణ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు.

ఈ నియోజకవర్గంలో బాలానగర్‌ పారిశ్రామిక కేంద్రంతో పాటు కేంద్ర పరిశోధనా సంస్థలు సీఐటీడీ, ఎస్‌ఎంఈడీ, ఎన్‌ఆర్‌ఎస్‌ఈ ఉన్నాయి.

నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు: 3,37,835

హుజూర్‌నగర్

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండటంతో హుజుర్‌నగర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన మరోసారి ఇక్కడి నుంచి పోటీకి దిగారు. కోదాడ, హుజూర్‌నగర్ ఉత్తమ్ సొంత నియోజవర్గాలుగా చెప్పుకోవచ్చు. ఆయన గతంలో కోదాడ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి కోదాడ నుంచి ఆయన భార్య పద్మావతి రెడ్డి పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ హయాంలో మంత్రిగా, నాలున్నరేళ్లుగా ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఉత్తమ్ నమ్ముతున్నారు.

ఇక్కడ టీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బరిలో దిగుతున్నారు. ఈయన విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు.

ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ నాలుగుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ(టీఆర్ఎస్)పై ఆయన గెలిచారు.

కమ్యూనిస్టు నాయకుడు, కవి ముగ్దుం మొహియుద్దీన్ గతంలో ఒకసారి ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు.

బోణి కొట్టాలని టీఆర్ఎస్ ప్రయత్నం

ఈసారి కీలకమైన ఈ నియోజవర్గం నుంచి గెలిచి సత్తా చాటాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి 2009లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఉత్తమ్ కుమార్‌పై ఓడిపోయారు.

2014లో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసిన శంకరమ్మ కూడా ఉత్తమ్ పై ఓడిపోయారు.

ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి తన అభ్యర్థిని మారుస్తోంది.

ఈసారి శంకరమ్మ టికెట్‌ కోసం ప్రయత్నించినప్పటికీ అధిష్టానం సైదిరెడ్డి వైపు మొగ్గు చూపింది.

నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు: 2,18,703

కొడంగల్

కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి పోటీ పడుతోన్న నియోజకవర్గం కొడంగల్. దీంతో అందరిచూపు ఈ నియోజకవర్గంపై పడింది.

ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి సీనియర్ నేత గురునాథ్ రెడ్డిపై ఆయన గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్... టీడీపీ-కాంగ్రెస్‌ కూటమిగా తనకు లాభిస్తుందని భావిస్తున్నారు.

ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అత్యధికంగా 15 సార్లు గెలిచింది.

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రమంతా ప్రచారం నిర్వహించాల్సిన నేపథ్యంలో నియోజకవర్గానికి ఆయన సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో రేవంత్ సోదరులు ఇక్కడ ప్రచార బాధ్యతలు చూసుకుంటున్నారు.

అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు.

మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి ఇక్కడ ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

సీనియర్ నేత, ఈ నియోజవర్గం నుంచి అత్యధికసార్లు గెలిచిన గురునాథ్ రెడ్డి టీఆర్ఎస్‌కు మద్దతివ్వడం తమకు కలిసివస్తుందని నరేందర్ రెడ్డి భావిస్తున్నారు.

నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 1,97, 439

సిద్ధిపేట

తెలంగాణ ఉద్యమ కేంద్రంగా, టీఆర్ఎస్ కంచుకోటగా సిద్ధిపేటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏడోసారి విజయం సాధించేందుకు హరిశ్‌రావు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి భారీ ఆధిక్యంతో గెలుస్తోంది.

సిద్ధిపేటను జిల్లాగా ఏర్పాటు చేయడం, ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి తన గెలుపు ఖాయం అని హరీశ్ భావిస్తున్నారు.

ఇక్కడ ప్రజాకూటమి అభ్యర్థిగా టీజేఎస్ నుంచి భవానీ రెడ్డి తొలిసారిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఆయన ఆరుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇప్పుడు ఆ రికార్డును సమం చేయాలని హరీశ్ ప్రయత్నిస్తున్నారు.

2004 ఉపఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్‌రావు ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.

2008, 2010 ఉపఎన్నికలు, 2004, 2009, 2014 సాధారణ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తూ వచ్చారు.

నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,05,802

సిరిసిల్ల

చేనేత పరిశ్రమల కేంద్రం... కమ్యూనిస్టుల ఖిల్లా.. సిరిసిల్ల. సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ఈ నియోజవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఇప్పటికే ఆయన ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. నాలుగోసారి పోటీకి దిగారు.

2009లో తొలిసారి ఇక్కడి నుంచి పోటీ చేసి కేటీఆర్‌ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై 53 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

సీపీఐ నేత చెన్నమనేని రాజేశ్వర రావు ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచారు.

ఇటీవల ఈ నియోజవర్గాన్ని జిల్లా కేంద్రంగా మార్చారు.

ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కె.కె.మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి మల్లుగారి నర్సాగౌడ్‌ బరిలో కేటీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కేకే మహేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కేవలం 171 ఓట్లతో ఆయనపై కేటీఆర్ గెలుపొందారు. ఈసారి ఓటర్లు సానుభూతితోనైనా తనను గెలిపిస్తారని కేకే నమ్ముతున్నారు.

చేనేత కార్మికుల కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు, నియోజవర్గాన్ని జిల్లాగా మార్చడం తమకు అనుకూలిస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి.

డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితర ప్రభుత్వ పథకాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్‌ను ఓడించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,16,056

గోషామహల్‌

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే బీజేపీ నేత రాజాసింగ్ సిట్టింగ్ నియోజకవర్గం ఇది.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్‌గౌడ్‌పై ఆయన తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి ఇదేస్థానం నుంచి రాజాసింగ్ బరిలో దిగుతున్నారు. నగరంలో బీజేపీకి బలమైన నియోజకవర్గాల్లో గోషామహల్ ఒకటి.

ఇప్పటి వరకు మూడు సార్లు ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. టీడీపీ రెండుసార్లు గెలిచింది.

ఉత్తర భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఈ నియోజవర్గం ఒకటి. వారి ఓటు బ్యాంకు ఎన్నికల్లో కీలకంకానుంది.

ఇక్కడ నుంచి టీఆర్ఎస్ నుంచి ప్రేంసింగ్ రాథోడ్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి ముఖేశ్ గౌడ్ బరిలో దిగుతున్నారు. బీఎల్‌ఎఫ్ కూటమి నుంచి ట్రాన్స్ జెండర్ చంద్రముఖి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు.

ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 2,29,875

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)