తెలంగాణ ఎన్నికలు 2018: టీడీపీతో పొత్తు కాంగ్రెస్‌కు లాభిస్తుందా? టీడీపీ భవిష్యత్ ఏమిటి? - అభిప్రాయం

  • ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు
  • బీబీసీ కోసం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికల క్షేత్రంలో పాలక టీఆర్‌ఎస్‌కూ.. కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ భాగస్వాములుగా ఏర్పడ్డ మహాకూటమికీ మధ్య తీవ్రమవుతున్న పోరును నేపథ్యంగా తీసుకొని ఈ చర్చను అర్థం చేసుకోవాల్సి ఉంది.

ఆంధ్రా పార్టీగా ముద్రపడ్డ టీడీపీ.. మహాకూటమిలో భాగంగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ ఆ కూటమి లెజిటిమసీనే తోసిపుచ్చుతూ టీఆర్‌ఎస్ ఒక చర్చకు తెర తీసింది.

తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన పార్టీగా, తెలంగాణ డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆంధ్రా ప్రాంతంలో ప్రజామద్దతు కూడగట్టి క్రియాశీలంగా పోరాడిన, జాతీయస్థాయిలో ఇతర రాజకీయ పార్టీలతో లాబీయింగ్ చేసిన పార్టీగా టీడీపీని విమర్శిస్తున్నారు.

ఆరోపణలు, విమర్శల్లో వాస్తవాలు ఎలా ఉన్నా.. తెలంగాణలో టీడీపీ స్థానంపై టీఆర్‌ఎస్ వైఖరి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాజకీయ ఆవరణం, సిద్ధాంతాలు, విధాన వైరుధ్యాలు, సామాజిక పునాదులు తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలివి.

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ తీవ్రమైన రాజకీయ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొన్న మాట వాస్తవమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ లిఖితపూర్వక మద్దతు తెలిపినప్పటికీ ఈ పరిస్థితి తప్పలేదు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ విభజనతో ఈ రెండు పార్టీలు రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్నాయి.

రెండు పార్టీల్లో ప్రాంతాల వారీగా విభజనలు తలెత్తి తీవ్రస్థాయిలో వాద-ప్రతివాదనలు, డిమాండ్లు వినిపించాయి. ఒకే స్వరాన్ని వినిపించడం, రాజకీయ స్పష్టతతో వ్యవహరించడంలో టీఆర్‌ఎస్‌కు ఉన్నంత వెసులుబాటు ఈ రెండు పార్టీలకు లేకపోయింది.

తెలంగాణ డిమాండ్‌కు వ్యతిరేకమైన వైఖరిని టీడీపీ అనుసరించిందని కేవలం వాదన కోసమే అనుకున్నా, పాపులర్ మూడ్‌కు విరుద్ధమైన వైఖరిని తీసుకొందన్న కారణంతో ఒక ప్రాంతం లేదా రాష్ట్రం నుంచి ఒక పార్టీని 'నిషేధించవచ్చా'?

కేవలం ఆ కారణంతో తెలంగాణలో టీడీపీ అప్రస్తుతం అయిపోతుందా? తెలంగాణ ప్రజానీకంలో టీడీపీకి మద్దతు ఉందా, లేదా? మద్దతు లేకపోతే, కాంగ్రెస్, టీజేఎస్ ఏ ప్రాతిపదికన టీడీపీతో జట్టు కట్టాయి?

కాంగ్రెస్‌ను కాకుండా కేవలం 13 సీట్లలో పోటీచేస్తున్న టీడీపీపైనే టీఆర్‌ఎస్ ఎందుకు ప్రధానంగా విమర్శలు గుప్పిస్తోంది?

సుదీర్ఘ కాలంపాటు ప్రభావం చూపబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల చుట్టూ జరుగుతున్న చర్చను అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాల్సి ఉంది.

1982లో ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఏర్పాటైన ఏడాది వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది.

రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను కల్పిస్తూ, కాంగ్రెస్‌ పాలన పట్ల పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకొంటూ విజయం సాధించింది.

మరోవైపు.. ఎమర్జెన్సీ అనంతరం భారత రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. అప్పటివరకు రాజకీయాల్లో జాతీయ వ్యవహారాలే కేంద్ర బిందువుగా ఉంటే.. ఎమర్జెన్సీ తర్వాత రాష్ట్ర రాజకీయాలకు ప్రాధాన్యం పెరగడం మొదలైంది.

కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య నిర్మాణాల మీద చర్చ ప్రారంభమైంది. అప్పటికి రాజకీయ, ఆర్థిక కోణాలకే పరిమితమైన ఆ చర్చకు.. భాషా సాంస్కృతిక కోణాన్ని చేర్చటం ద్వారా ఆ చర్చకు మరింత చిక్కదనం తెచ్చింది టీడీపీ.

తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని, నిజానికి కాంగ్రెస్ పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని.. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్వతంత్రాధికారం నిరాకరించటంలో, తరచుగా నాయకత్వాన్ని మార్చటంలో ఇది స్పష్టంగా ఉందని విమర్శలు లేవనెత్తటం ద్వారా టీడీపీ ఈ భాషా సంస్కృతుల అంశం ఆవశ్యకతను వ్యక్తీకరించింది.

ఇలా చేయటం ద్వారా టీడీపీ.. 1940లు, 50ల నాటి భాషా ప్రయుక్త రాష్ట్ర ఉద్యమాల స్ఫూర్తిని మళ్లీ జాగృతం చేయటమే కాదు.. తెలుగు జాతి అస్తిత్వ రాజకీయాలను పునర్నిర్వచించింది. భారతదేశపు బహుళ జాతీయత నేపథ్యంలో.. సమాఖ్య అంశానికి లోతైన సాంస్కృతిక ప్రతీకాత్మకతను జోడించింది.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో 1980లు, 90ల ఆరంభంలో ఎన్‌టీఆర్ సారథ్యంలోని టీడీపీ, తర్వాత 1990ల్లో చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీ పోషించిన పాత్ర.. జాతీయ రాజకీయాల్లో టీడీపీ హోదాను, స్థాయిని పెంచింది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌లలో, అనంతరం నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రయోగాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక సంక్షోభంలోకి దిగజార్చిన ప్రజాకర్షణ విధానాలు ప్రధానంగా ఉన్న ఎన్‌టీఆర్ హయానికి భిన్నంగా.. చంద్రబాబునాయుడు పాలన ఆర్థిక వ్యవస్థకు నూతన సరళీకరణ మలుపును ఇచ్చింది.

ఈ మార్పు సాఫీగా సాగలేదు. అది కొత్త వైరుధ్యాలకు బాటలు పరిచింది. నగర ఆర్థికవ్యవస్థ మీద, ఐటీ రంగం మీద దృష్టి కేంద్రీకరించిన ఆయన పాలన.. తీవ్ర వ్యవసాయ సంక్షోభానికి కారణమవటంతో పాటు.. ప్రాంతీయ అసమాన అభివృద్ధి వేగంగా పెరిగిపోవటానికి దారితీసింది.

తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు ప్రధాన కారణం ఒక రకంగా చూస్తే.. ఈ నూతన సరళీకరణ విధాన పాలనే.

సాంస్కృతిక, సమాఖ్య అంశాలు టీడీపీ రాజకీయాలకు ఒక కోణమైతే.. అది ప్రేరేపించిన రాజకీయ మార్పులో సామాజిక సమీకరణల బదిలీ మరో ముఖ్యమైన కోణం.

కొంత ప్రణాళిక ప్రకారం.. కొంత కాకతాళీయంగా.. టీడీపీ లోతైన సామాజిక రాజకీయాలు చేసినట్లు చెప్పవచ్చు.

అయితే సామాజిక శక్తుల పున:సమీకరణల్లో ప్రాంతాల వారీగా తేడాలున్నాయి. విభిన్న చారిత్రక నేపధ్యాలు, కులం - వర్గాల అసమాన రాజకీయ ఆర్థిక వ్యవస్థలు, సామాజిక పెట్టుబడుల్లో, రాజకీయ అవగాహన స్థాయుల్లో తేడాలు కూడా దీనికి కారణం.

కాంగ్రెస్‌కు భిన్నంగా టీడీపీని ఆది నుంచీ ఆంధ్రా పార్టీగానే చూశారు. దాని ప్రధాన నాయకత్వం, మూల మద్దతు.. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్న కమ్మ కులమేనన్న తర్కం.. ఈ చిత్రీకరణలో అంతర్లీనంగా కనిపిస్తుంది.

1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తలెత్తిన వైరుద్ధ్యాలు ఈ అభిప్రాయాన్ని మరింత బలోపేతం చేశాయి.

1985లో కారంచేడులో దళితుల మీద కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరి దుశ్చర్యలు... దళితులు టీడీపీకి దూరం కావటానికి, విరోధులుగా మారటానికి దారితీస్తే.. వంగవీటి రంగా హత్య తర్వాతి పరిణామాలు కమ్మలకు వ్యతిరేకంగా కాపులు ఏకంకావటానికి కారణమయ్యాయి.

కులం ప్రాతిపదికగా ఈ లోతైన చీలికల ద్వారా.. టీడీపీ పాలన కులం, ప్రాంతం, పార్టీల వారీగా సామాజిక రాజకీయాల పున:సమీకరణలకు బాట పరిచింది.

ఆంధ్రాలో ఒక నిర్దిష్ట స్థాయి విభజనాత్మకతతో టీడీపీ సామాజిక రూపం తీసుకుంటే.. తెలంగాణలో అది విభిన్నమైన చిత్రాన్ని సంతరించుకుంది.

వెనుకబడిన తరగతులను పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి తీసుకురావటం ద్వారా, వారిని పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలు రెండింటా స్పష్టంగా కనిపించే పదవుల్లో చేర్చుకోవటం ద్వారా.. ఇక్కడ రాజకీయ భాగస్వామ్యం, నాయకత్వపు సామాజిక పునాదిని విస్తరించటానికి మార్గం పరిచింది.

పంచాయతీరాజ్ వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ, పెద్ద పంచాయతీ సమితుల స్థానంలో మండలాలను ప్రవేశపెట్టి వ్యవస్థాగత అవకాశాలను విస్తరించటం, పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టటం వంటివి.. ఈ వర్గాలవారి సాధికారతకు దారితీసిన ముఖ్యమైన చర్యలుగా చూడవచ్చు.

ఫలితంగా.. రెడ్డి ఆధిపత్యమున్న పార్టీగా పరిగణించే కాంగ్రెస్‌కు భిన్నంగా.. టీడీపీని బీసీ అనుకూల పార్టీగా భావించారు. తదనుగుణంగా బీసీలు, మహిళలు ఈ పార్టీని తమదిగా స్వీకరించారు.

కాంగ్రెస్ కన్నా.. టీఆర్ఎస్ కన్నా కూడా భిన్నంగా టీడీపీ బలమైన వ్యవస్థాగత నిర్మాణమున్న పార్టీ. ఆంధ్రాతో పోల్చినా కూడా తెలంగాణలో ఇది టీడీపీకి చాలా ఉపయోగపడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ.. ఓట్లు, సీట్ల విషయంలో టీడీపీ సాధించినదాన్ని తక్కువ చేసిచూడలేం.

అధికార టీఆర్ఎస్ 'ఆకర్ష్' పేరుతో భక్షించటం వల్ల టీడీపీ స్పష్టంగా క్షీణించినప్పటికీ.. ఆ పార్టీ రాజకీయ ప్రత్యక్షతను, ప్రత్యేకించి బీసీల్లో సామాజిక పునాదిని పూర్తిగా కొట్టివేయజాలం.

టీఆర్ఎస్, ఆమాటకొస్తే కాంగ్రెస్‌లో ఆధిపత్య కుల రాజకీయాలు.. సంఖ్యాపరంగా అధికులు, రాజకీయ చైతన్యమున్న కాపు, గౌడ, పద్మశాలి, గొల్ల వంటి బీసీ కులాలకు ఆ పార్టీల ఎన్నికల రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవటం.. వారిని రాజకీయంగా అసంతృప్తులుగా మిగిల్చాయి.

ఇందువల్లనే.. ఈ సామాజిక వర్గాల విధేయతను టీడీపీ ఇంకా పొందుతోంది. టీఆర్ఎస్ నిర్లక్ష్యమే టీడీపీ బలమని చెప్పటం అతిశయోక్తి కాదు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేసిన కాంగ్రెస్, టీడీపీలకు మొత్తం 40 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇది టీఆర్ఎస్‌కు వచ్చిన 34.3 శాతం ఓట్లు కన్నా ఎక్కువ. ఈ వాస్తవమే టీఆర్ఎస్‌ను ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది.

టీడీపీతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుంది. తెలంగాణ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ నాయకత్వానికి నిజాయతీ లేకపోవటం, అవిధేయతకు రుజువని టీఆర్ఎస్ చేస్తున్న వాదన నిలిచేది కాదు. ఎందుకంటే గతంలో అంటే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీచేసింది.

ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందన్నది వేరే విషయం. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నపుడు.. టీడీపీకి తగినంత బలమున్నపుడు.. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోగల అవకాశాలను అడ్డుకోగల స్థాయిలో ఉన్నపుడు అది జరిగింది.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలన్న టీడీపీ నిర్ణయాన్ని బట్టి.. జాతీయ రాజకీయాలనే విస్తృత వేదిక మీద ఆ పార్టీ దృష్టి ఉందని.. రాబోయే జాతీయ ఎన్నికల నేపథ్యానికి రూపునివ్వటం మీద దృష్టి సారించిందని.. ఆ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే ఉద్దేశంతో ఈ పని చేస్తోందని స్పష్టమవుతోంది.

టీడీపీని ఆంధ్రా పార్టీ అంటూ తక్కువ చేసి మాట్లాడటం ద్వారా.. టీఆర్ఎస్ తనను తాను నిఖార్సైన తెలంగాణ ప్రతినిధిగా చాటుకోవటానికి ప్రయత్నించవచ్చు. కానీ స్వీయ ప్రాధాన్యం పెంచుకోవటానికి చేస్తున్న ఈ పనికి ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

బలమైన సామాజిక పునాదులను, జాతీయ రాజకీయాల్లో ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. టీడీపీని తక్కువగా అంచనా వేయటానికి వీలులేదు.. స్వీయ చెరుపుకు తప్ప.

(వ్యాసకర్త ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతిశాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)