ఆంధ్ర ప్రదేశ్ ఖజానా కటకట: ప్రెస్ రివ్యూ

  • 24 నవంబర్ 2018
Image copyright www.apfinance.gov.in

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ ఆదాయం, ఖర్చు దాదాపు సమంగా ఉందని, పెద్ద చెల్లింపులకే రూ.15 వేల కోట్లు అవసరం ఉందని ఈనాడు ఒక కథనం ప్రచురించింది. ముందు ముందు రాష్ట్రం సవాళ్లు ఎదుర్కోబోతోందని తెలిపింది.

రాష్ట్రంలో రాబోయే మార్చి వరకూ ఆర్థిక సవాళ్లు తప్పేటట్టు కనిపించడం లేదు.

డిసెంబరు తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రాష్ట్రం నుంచి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.. కేంద్రం నుంచి ఎంత మొత్తాలు వస్తాయి? జీతాలు పింఛన్లు, వడ్డీలు, అసలు వంటివి కలిపి ఎంత మొత్తాలు చెల్లించాలనే అంచనాలను ఆర్థికశాఖ రూపొందించింది.

ప్రతి నెలా సాధారణ చెల్లింపులు కాకుండా పెద్ద పెద్ద మొత్తాలు దాదాపు రూ.15వేల కోట్లు మించి చెల్లించాల్సినవి ఉన్నట్లు లెక్కల్లో తేలిందని కథనంలో తెలిపింది.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో అప్పులు తెచ్చుకోవడానికి పెద్దగా ఆస్కారం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక బండిని ముందుకు నడిపించడం కత్తిమీద సాములా ఉందని ఆ శాఖ అధికారులు అంతర్గతంగా చెబుతున్నారని ఈనాడు పేర్కొంది.

చట్ట ప్రకారం కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే కాసుల కటకట ఏర్పడిందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినట్టు ఈనాడులో మరో కథనం పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించే నాటి ప్రభుత్వం ఎన్ని నిధులివ్వాలో ముందుగానే నిర్ణయించినా, ప్రస్తుత ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు.

నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీ మేరకు కేంద్రం తొలి బడ్జెట్‌లోనే రూ.16,079 కోట్లు ఇచ్చి ఉంటే రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు వచ్చి ఉండేవి కావని యనమల అన్నట్టు కథనంలో తెలిపారు.

Image copyright Getty Images

పీపీపీ పద్ధతిలో విశాఖ మెట్రో

నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చే ముందు విశాఖ మెట్రోను పీపీపీ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని సాక్షి ఓ వార్తను ప్రచురించింది.

ఎంపికైన సంస్థల నుంచి టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌ (ఏఎంఆర్సీ)కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులను ఆహ్వానించగా వచ్చిన వాటినుంచి ఏఎంఆర్సీ 5 సంస్థలను ఎంపిక చేసింది.

ఈ ప్రాజెక్టును మూడు కారిడార్లలో మొత్తం 42.55 కి.మీ. మేర చేపట్టనున్నారు. దీనిలో 38 స్టేషన్లు ఉంటాయని ప్రతిపాదన.

మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.8300 కోట్లు కాగా ఇందులో ప్రభుత్వ వాటా రూ.4200 కోట్లు. దీనికోసం ప్రభుత్వం రుణం తీసుకోనుంది. దీన్ని తీర్చేందుకు మెట్రో ప్రాజెక్టు సమీపంలోని 250 ఎకరాలను రియల్ ఎస్టేట్‌కు ఇవ్వనుంది. దీని ద్వారా వచ్చే రాబడి ద్వారా ఈ అప్పు తీర్చాలని భావిస్తోంది అని సాక్షి తన కథనంలో పేర్కొంది.

Image copyright Getty Images

పోలీసుల లంచావతారం

తెలంగాణ పోలీసులు వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్నారంటూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. లంచావతారుల్లో ఎస్‌ఐ స్థాయివారే అధికంగా ఉన్నారని అందులో పేర్కొంది.

తెలంగాణ పోలీస్‌ శాఖకు బ్రాండ్‌ ఇమేజ్‌ తెచ్చేందుకు ఉన్నతాధికారులు ఎన్ని సంస్కరణలు తెస్తున్నా.. కొందరు అవినీతి అధికారులు, సిబ్బంది తీరు కారణంగా పరిస్థితిలో మార్పు రావడం లేదు.

డబ్బు సంపాదనే లక్ష్యంగా లంచాల వేటలో పడిన ఇటువంటి సిబ్బంది.. మొత్తం పోలీస్‌ శాఖకే మచ్చ తెస్తున్నారు. ఏసీబీ దాడుల్లో వరుసగా పోలీసులు పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం అని కథనంలో తెలిపారు.

గడచిన నెలన్నర వ్యవధిలో ఐదుగురు పోలీస్‌ సిబ్బంది ఇలా ఏసీబీకి పట్టుబడ్డారు. వీరిలో నలుగురు ఎస్‌ఐ స్థాయి అధికారులు కాగా.. ఒక కానిస్టేబుల్‌ ఉన్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేరు తొలగించేందుకు, కేసుల నుంచి తప్పించేందుకు.. ఇలా ఎక్కడ అదను దొరికితే అక్కడ దర్యాప్తు అధికారులు కాసులు వసూలు చేస్తూ ఏసీబీకి పట్టుబడుతున్నారని ఆంధ్రజ్యోతి తమ కథనంలో పేర్కొంది. లంచం అడిగితే 1064కు సమాచారమివ్వాలని ఏసీబీ ప్రకటించినట్టు చెప్పింది.

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓమ్ ప్రకాశ్ రావత్‌ Image copyright Getty Images

ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసినట్టు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది. తక్కువ సమయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారని ప్రశంసించిందని పేర్కొంది.

తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాల కల్పనలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నదని కితాబిచ్చారని కథనం తెలిపింది.

చాలా తక్కువ సమయంలో ఎన్నికల ఏర్పాట్లు చాలా బాగా జరిగాయని రావత్ ప్రశంసించారు. తెలంగాణలో ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

పోలింగ్ ఏజెంట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనుమానం ఉందని ఫిర్యాదు చేస్తే.. వీవీ ప్యాట్లలో ఓటర్ స్లిప్పులను కూడా లెక్కిస్తామని, ఈ విషయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పూర్తి అధికారం ఉంటుందని రావత్ అన్నట్లు కథనం పేర్కొంది.

ఎన్నికల ప్రచారంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టినట్టు మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలలో ప్రవర్తనానియమావళిని ఉల్లంఘిస్తున్నట్టు వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులందాయని రావత్ తెలిపారు.

నగదు, మద్యం పంపిణీపై నిఘావేసి ఉంచామని, అధికారులు చాలా పటిష్ఠంగా చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)