అల్వర్‌ సామూహిక ఆత్మహత్య: సంపన్న కుటుంబాలకు చెందిన యువకులు రైలు ముందు ఎందుకు దూకేశారు?

  • 24 నవంబర్ 2018
గ్రౌండ్ రిపార్ట్
చిత్రం శీర్షిక ఆత్మహత్యకు పాల్పడ్డ యువకులు వీరే

నవంబర్ 20 రాత్రి 11.30 గంటలకు ఛత్తీస్‌గఢ్ నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కోడాలో ఒక పోన్ వచ్చింది.

సాయుధ భద్రతా దళాల క్యాంప్‌లో జవాన్ నేమ్‌చంద్ మీనా గాఢనిద్రలో ఉన్నారు. దాంతో ఆ కాల్ మిస్సైంది.

రెండోసారి కాల్ రావడంతో లేచి ఫోనందుకున్న అతడు, విషయం విని నేరుగా క్యాంప్ అధికారి ఇంటి వైపు పరిగెత్తారు.

రాజస్థాన్, అల్వర్ నుంచి అతడి రెండో తమ్ముడు ఫోన్ చేశాడు. "తమ్ముడు సత్యనారాయణ్ చనిపోయాడు. ఇంట్లో నాన్నగారికి చెప్పలేదు. కాసేపటి క్రితం తన శవం రైలు పట్టాలపై దొరికింది. శవాన్ని చాలా కష్టంగా గుర్తుపట్టాం అని చెప్పాడు".

ఛత్తీస్‌గఢ్‌లోని ఆ ప్రాంతంలో రాత్రిపూట భద్రతాదళాలు ప్రయాణించడంపై నిషేధం ఉంది. అందుకే తెల్లారేవరకూ మెలకువగా ఉన్న నేమ్‌చంద్ నాలుగు గంటలకు బయల్దేరి జబల్పూర్, ఆగ్రా, దౌసా మీదుగా 24 గంటల తర్వాత ఇల్లు చేరారు.

అదే రోజు రాత్రి అల్వర్ జిల్లాలో బహడ్కో గ్రామంలో నివసించే రాజస్థాన్ మాజీ పోలీస్ కానిస్టేబుల్ బాబూలాల్ మీనా ఇంట్లో కూడా అల్వర్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. "మీ కొడుకు రుతురాజ్ పరిస్థితి విషమంగా ఉంది. త్వరగా రండి అని చెప్పారు".

బాబూలాల్ మీనా ఫోన్ పెట్టేసి, భార్యతో బయల్దేరారు. అంతలోనే ఆయనకు అల్వర్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌కు ఫోన్ వచ్చింది. వాళ్లను అక్కడకు రమ్మని చెప్పారు. అలాగే మరో ఇద్దరు యువకులైన మనోజ్ మీనా, అభిషేక్ మీనా ఇళ్లకు కూడా ఫోన్లు వెళ్లాయి.

గంటన్నర తర్వాత సత్యనారాయణ్, రుతురాజ్, మనోజ్ మీనా ఇంట్లో వాళ్లు వారి శవాల ముందు విషాదంగా నిలబడి ఉన్నారు. అభిషేక్ కుటుంబ సభ్యులు పోలీసులతో కలిసి తీవ్రంగా గాయపడ్డ అతడిని తీసుకుని అంబులెన్సులో రాజధాని జైపూర్ వెళ్లే దారిలో ఉన్నారు.

చిత్రం శీర్షిక అల్వర్ రైల్వే స్టేషన్

రైలు ముందు దూకేశారు

నిజానికి నవంబర్ 20 సాయంత్రం 17 నుంచి 24 వయసు మధ్యలో ఉన్న ఈ నలుగురు యువకులు అల్వర్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరబోతున్న జైపూర్-చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ ముందు హఠాత్తుగా దూకేశారు.

కానీ ఆ సమయంలో అక్కడ వీళ్లు మాత్రమే లేరు. వీరితోపాటు రాహుల్, సంతోష్ అనే మరో ఇద్దరు కూడా ఉన్నారు.

వీళ్లందరూ ఒకరికొకరు ఫోన్లు చేసి రైల్వే స్టేషన్ దగ్గర కలుద్దామని చెప్పుకున్నారు. అక్కడికి వాళ్లు అప్పుడప్పుడూ వచ్చేవారు.

ఘటన జరిగిన తర్వాత రోజు పోలీసుల విచారణలో రాహుల్ "అందరూ సరదాగా ఉన్నారు. నవ్వుకుంటున్నాం. అంత సీరియస్ మాటలేం లేవు. వాళ్లు మేమెటూ చావబోతున్నాం, మీరు కూడా మాతోపాటూ చస్తారు అన్నారు. నేను అలా చేయద్దు అని వాళ్లకు నచ్చజెబుతున్నా. ఒకడు నాకు సిగరెట్ ఇవ్వు అన్నాడు. నేను ఇచ్చాను. అప్పుడు ఇంకో వైపు నుంచి రైలొస్తోంది. తర్వాత వాళ్లు నలుగురూ రైలు ముందు దూకేశారు" అని చెప్పాడు.

ఆ నలుగురూ రైలు ముందు ఎందుకు దూకారు అని అడిగితే అతడు "జీవితంలో ఉద్యోగాలెటూ వచ్చేది లేదు, బతికి ఏం ప్రయోజనం ఉంది అని తనతో అన్నట్లు" చెప్పాడు.

రాహుల్ అలా చెప్పిన వెంటనే "ఉగ్యోగాలు లేవని ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు యువకులు" అనే ఒక వార్త దేశమంతా వ్యాపించింది.

ఆ వ్యాపించిన వార్త పూర్తిగా నిరాధారమేం కాదు. రాహుల్ లాంటి ప్రత్యక్ష సాక్షి మీడియాకు ఈ విషయం చెప్పాడు.

చిత్రం శీర్షిక అభిషేక్ మీనా(ఫైల్ ఫొటో)

అసలు నిజమేంటి?

రైలు ముందు దూకినట్టు చెబుతున్న ఈ యువకులందరూ అల్వర్‌లో అద్దె గదుల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వారిలో పరీక్షలు కూడా రాసిన కొందరు ఫెయిలయ్యారు.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో నిరుద్యోగం, రైతుల అసంతృప్తి ఒక పెద్ద ఎన్నికల అంశం అయిపోయింది.

కానీ వీటన్నిటి మధ్య అసలు నిజం మాత్రం వేరేలా కనిపించింది.

ఘటన జరిగిన తర్వాత రోజు మేం సత్యనారాయణ్ మీనా గ్రామం బుజ్‌పురి వెళ్లాం. అక్కడ అందరూ విషాదంలో ఉన్నారు.

సత్యనారాయణ్ అన్నయ్య నేమ్‌చంద్ "నా ఏటీఎం కార్డు కూడా తన దగ్గరే ఉంది, అలాంటప్పుడు ఉద్యోగాలు లేవని తను ప్రాణాలు ఎందుకు తీసుకుంటాడు" అన్నారు.

"అందరూ ఉద్యోగం లేదని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. కానీ అలా జరిగుండదు. నేను ఎప్పుడూ ఉద్యోగం చేయమని ఒత్తిడి తీసుకురాలేదు. 60 వేల రూపాయల మోటార్ సైకిల్ కూడా కొనిచ్చాను. వారిలో ఒకరికి 17 ఏళ్లు, ఆ వయసులో ఉద్యోగం లేదని ఎవరైనా బాధపడతారా" అని నేమ్‌చంద్ అన్నారు.

చిత్రం శీర్షిక నేమ్ చంద్ మీనా(మృతుడి సోదరుడు)

యువకుల కుటుంబ పరిస్థితి?

సత్యనారాయణ్ కుటుంబానికి చాలా పొలాలున్నాయి. గ్రామంలోని సంపన్న కుటుంబాల్లో వారిది కూడా ఒకటి. వాళ్ల ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో 17 ఏళ్ల రుతురాజ్ మీనా ఇల్లు ఉంది. అతడు బీఏ ఫస్టియర్ చదువుతున్నాడు.

బహడ్కో అనే ఈ ఊళ్లో అందరికంటే పెద్ద ఇల్లు రుతురాజ్‌దే. దానికి ఎదురుగా దాదాపు ఎకరం పొలం కూడా ఉంది. ఐదు బెడ్రూంల ఈ ఇంటి బయట లాన్లో రుతురాజ్ పెంపుడు కుక్క లాబ్రడార్ కనిపించింది.

రుతురాజ్ ఒకే ఒక అన్నయ్య మానసిక స్థితి చిన్నతనం నుంచీ సరిలేదు. అతడి తండ్రి బాబూలాల్ మీనా రాజస్థాన్ పోలీసుగా పనిచేసారు. కానీ 12 ఏళ్ల క్రితం డ్యూటీలో జరిగిన యాక్సిడెంటులో ఆయన రెండు కాళ్లు పోయాయి.

ఆయన "మేం ఆ రోజు మాట్లాడుకున్నాం కూడా. నేను డబ్బులేమైనా కావాలా అని అడిగా. దానికి వద్దు, రెండ్రోజుల తర్వాత ఇంటికొస్తున్నా అన్నాడు. తనకు మంచి తిండి, మంచి బట్టలు వేసుకోవడం ఇష్టం. నేను స్వయంగా తనకు 70 వేల రూపాయల ఐపోన్ కొనిచ్చి వచ్చాను. వాళ్ల గదికి 6 వేల రూపాయలు అద్దె. మీరే చెప్పండి ఉద్యోగం లేదని ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? అన్నారు.

మరో ఇద్దరు యువకులు మనోజ్, అభిషేక్ కూడా అదే ప్రాంతంలో ఉంటారు. దాదాపు సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వీరందరూ అల్వర్‌లో చదువుకునేవారు.

చనిపోయిన ఈ యువకులు రాజస్థాన్‌లోని మీనా సమాజానికి చెందినవారు. అల్వర్, సవాయ్ మాధోపూర్ ప్రాంతంలో వారి జనాభా భారీగానే ఉంటుంది. ఈ సమాజం వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఉన్నాయి.

చిత్రం శీర్షిక రుతురాజ్ ఇంట్లో విషాధంలో మహిళలు

అయితే ఆత్మహత్యకు కారణం ఏంటి?

వీళ్లు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకోడానికి కారణం నిరుద్యోగం కాకుంటే, వేరే ఏమై ఉంటుంది? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

బీబీసీ దీనిపై అల్వర్ జిల్లా ఎస్పీ రాజేంద్ర సింగ్‌తో మాట్లాడింది. నిరుద్యోగం వల్లే యువకులు ఆత్మహత్య చేసుకున్నారనే మాటను ఆయన కొట్టిపారేశారు.

"వాళ్లందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారని విచారణలో తేలిన మాట నిజమే. కానీ అది నిరుద్యోగం వల్లే అని ప్రస్తుతానికి మేం చెప్పలేం. మేం ఇప్పుడు వాళ్ల కాల్ రికార్డ్స్, మిగతా ఆధారాలు సేకరిస్తున్నాం. అసలు విషయం కచ్చితంగా తెలుసుకుంటాం" అన్నారు.

కానీ ఈ 'సామూహిక ఆత్మహత్య' వెనుక అసలు విషయం ఏంటో చెప్పగలడు అనుకున్న అభిషేక్ మీనాను విషమ పరిస్థితుల్లో జైపూర్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి అతడు కూడా చనిపోయాడు. దీంతో ఈ కేసు చిక్కుముడిలా మారింది.

రాహుల్, సంతోష్ మీనా సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. ఇద్దరినీ ప్రస్తుతం గుర్తు తెలియని ప్రదేశాలలో ఉంచారు. వారి మొబైళ్లు ఆఫ్ వస్తున్నాయి.

అల్వర్‌లోని ఒక పోలీస్ స్టేషన్లో సత్యనారాయణ్, రుతురాజ్ మీనాపై ఒక గొడవ కేసు కూడా ఉంది. ఇద్దరి కుటుంబ సభ్యులు ఆ విషయం గురించి తమకు అసలు తెలీదని చెబుతున్నాయి.

చిత్రం శీర్షిక బాబూలాల్ మీనా(రుతురాజ్ తండ్రి)

కానీ వీరందరి కుటుంబాలు పైకి చెప్పకపోయినా, వారికి చెడు సావాసాలు ఉండచ్చని మాత్రం కచ్చితంగా అంటున్నారు.

రుతురాజ్ నాన్న బాబూలాల్ మీనా బహిరంగంగానే "నా కొడుకు అమాయకుడు, చెడు సావాసమే వాడిని చంపేసింది" అన్నారు.

అభిషేక్ మీనా బంధువు ఒకరు పేరు రాయకూడదనే షరతుతో "అల్వర్ వెళ్లి చదవడానికి బదులు వాళ్లు చెడు సావాసాలకు అలవాటు పడ్డారు. అందుకే పరీక్షలకు ప్రిపేర్ అవడానికి వాళ్లను జైపూర్ పంపించేశారు" అని చెప్పారు.

అయినా, ఇలాంటి ఘటనలు జరిగినపుడు ముగ్గురు యువకులూ నిరుద్యోగం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం కాస్త తొందరపాటే అవుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు