బ్రెగ్జిట్ అంటే ఏంటి, భారత్‌పై దాని ప్రభావం ఉంటుందా?: లబ్‌డబ్బు

  • 24 నవంబర్ 2018
బ్రెగ్జిట్ Image copyright Getty Images

బ్రిటన్‌లో ఈ మధ్య బ్రెగ్జిట్ ఒప్పందంతో చాలా గందరగోళం ఏర్పడింది. ఈ విడాకుల షరతులేంటో, వాటి విధి-విధానాలేంటో ఇంకా నిర్ణయించాల్సి ఉంది. అసలు బ్రెగ్జిట్ కథేంటో, దాని ప్రభావం ఎలా ఉంటుందో, దానిపై ఉన్న వాదనలేంటో ఈ వారం 'లబ్‌డబ్బు'లో చర్చిద్దాం.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ ఎక్కడ మొదలైంది?

2016 జూన్ 23న బ్రిటన్‌లో ఈ అంశంపై రెఫరెండం జరిగింది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలా లేదా విడిపోవాలా అన్న అంశంపై జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు అందరూ పాల్గొన్నారు.

యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కాకుండా 27 దేశాల ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1951లో ఆర్థిక సహకారం లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ ఏర్పాటైంది. కలిసి వ్యాపారం చేసే దేశాలు ఒకదానిపై ఇంకొకటి యుద్ధానికి దిగకూడదు అనేదే దీని వెనుక ఆలోచన. ఈ సంఘంలోని దేశాల్లోకి సరకుల రవాణాతో పాటు మనుషులు కూడా ఏ అడ్డంకులూ లేకుండా ఒకే దేశంలా ప్రయాణిస్తారు.

బ్రెగ్జిట్ ప్రక్రియ 2019లో మొదలై 2020 డిసెంబర్ దాకా కొనసాగుతుంది. ఈ పరివర్తనా కాలంలో ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సౌలభ్యాలన్నీ కొనసాగుతాయి.

అయితే ఐర్లండ్, ఉత్తర ఐర్లండ్ సరిహద్దు విషయంలో వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రెగ్జిట్

బ్రెగ్జిట్ ప్రభావం, వాదనలు

బ్రెగ్జిట్ వల్ల వ్యాపారంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయానికొస్తే... లేబర్ మార్కెట్‌పై, కరెన్సీపై చాలా నెగెటివ్ ప్రభావం ఉండే అవకాశం ఉంది.

బ్రిటన్‌లో పని చేస్తున్న యూరోపియన్ యూనియన్ పౌరులకు, యూరప్‌లో పని చేస్తున్న బ్రిటిష్ వారికీ ఇబ్బందులు ఎదురు కావచ్చు.

బ్రిటిష్ బ్యాంకింగ్, ఫైనాన్స్ వ్యవస్థపై బ్రెగ్జిట్ ప్రభావం పడక తప్పదు. కొన్ని బడా ఫైనాన్స్ కంపెనీలు తమ వ్యాపారాల్ని లండన్ నుంచి తరలించనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.

సింగిల్ ట్యాక్స్ మార్కెట్ నుంచి వైదొలగడం వల్ల డైరీ ఉత్పత్తులు, పళ్లు, కూరగాయలు, ప్రాసెస్డ్ ఫుడ్, వైన్ వంటి సరకుల ధరలు పెరుగుతాయి.

Image copyright Getty Images

ఈ ఒప్పందంతో బ్రిటన్‌కూ, యూరోపియన్ దేశాలకూ నష్టమే జరుగుతుంది. ఎందుకంటే బ్రిటన్ తన ఎగుమతుల్లో దాదాపు సగభాగం యూరోపియన్ దేశాలకే ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. అదే సమయంలో దాదాపు 50 శాతం దిగుమతులను ఈ దేశాల నుంచే చేసుకుంటుంది.

బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవలో యూరోపియన్ యూనియన్‌‌లోని 27 దేశాలకు చెందిన వేలాది ఉద్యోగులు పని చేస్తారు. NHS ఏప్రిల్ 2018 నివేదిక ప్రకారం వీరు దాదాపు 5 శాతం ఉంటారు. బ్రిటన్‌లో పని చేసే 80-90 శాతం పశు వైద్యులు యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన వారే. ఇప్పుడు వీరు కూడా బ్రిటన్ నుంచి వెనక్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రెగ్జిట్

భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం ఎలా ఉంటుంది?

దీంతో భారత్‌కు చాలా లాభాలుంటాయని కొందరి అభిప్రాయం కాగా, మరి కొందరు మాత్రం దీనివల్ల ప్రతికూలతలు పెరుగుతాయని అంటున్నారు.

బ్రిటన్ భారత్‌కు ఈయూలో ఎంట్రీ పాయింట్‌లా ఉంటుంది. చాలా కంపెనీల కార్యాలయాలు లండన్‌లో ఉన్నాయి. ఇప్పుడు అవి మారిపోతాయి.

ఈయూ దేశాల్లోని వలస కార్మికులు పని కోసం బ్రిటన్‌కు వెళ్లాలంటే ఎలాంటి అడ్డంకులూ ఉండేవి కాదు. ఈయూలో భాగం కాని భారత్ వంటి దేశాల కార్మికులు బ్రిటన్‌కు వెళ్లాలంటే వీసా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.

బహుశా ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోవచ్చు. ఉన్నత విద్య కోసం బ్రిటన్‌ వెళ్లే విద్యార్థులకు ఇది అనుకూలంగా మారొచ్చు.

బ్రిటన్ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. బ్రిటన్‌లో నియమనిబంధనల్లో ఏ మార్పులు జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా పడటం ఖాయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు