అయోధ్య: రామ మందిర వివాదం మోదీకి లాభమా? నష్టమా? - అభిప్రాయం

  • సుహాస్ పల్‌శీకర్
  • బీబీసీ కోసం
బాబ్రీ

ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సెప్టెంబర్ నెలలో దిల్లీలో కొన్ని ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలను బట్టి చాలా మీడియా సంస్థలు ఆరెస్సెస్ మారిపోయిందని నిర్ణయించాయి.

అయితే ఆ మీడియా సంస్థలు తమ సమీక్షలో ఆర్ఎస్‌ఎస్ నిజ రాజకీయ వైఖరిని విస్మరించాయి. మరోవైపు దసరా సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆర్ఎస్‌ఎస్ అధినేత.. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాల్సిందే అని ప్రకటించి, ఆర్ఎస్‌ఎస్ మారలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామమందిర అంశం చుట్టూ సమావేశాలు, ర్యాలీలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయోధ్యలోనే అనేక భారీ కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

దీంతో దేశంలో మరోసారి 30 ఏళ్ల నాటి పరిస్థితి తలెత్తుతుందా? అయోధ్య అంశంలో గతంలో 'అడ్వాణీ' పాత్రను ఇప్పుడు ఎవరు పోషిస్తారు? దాని వల్ల కలిగే లబ్ధిని పొందే 'వాజ్‌పేయి' ఎవరు అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

నిరంతరం వార్తల్లో అయోధ్య

30 ఏళ్ల క్రితం అడ్వాణీ నేతృత్వంలో హిందుత్వవాదాన్ని ప్రేరేపించే రథయాత్ర, కరసేవ వంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేపట్టారు. చివరకు సుప్రీం ఆదేశాలను కూడా బేఖాతరు చేసి, అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదును కూలగొట్టారు.

1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూలగొట్టాక, రామజన్మభూమి వివాదం కొంత నెమ్మదించింది. దీనికి కారణం, బీజేపీ అప్పటికే ఆ వివాదం వల్ల రాజకీయ లబ్ధిని పొందడం.

ఆ వివాదం తర్వాత కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీ పొందలేకపోయింది. దాంతో వివాదాస్పద అంశాలను పక్కనబెట్టి, ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

బాబ్రీ మసీదు కూలగొట్టాక సామాన్య ప్రజలతో పాటు మీడియా కూడా దీనిని తప్పుబట్టింది.

అయినా.. అక్కడ పునాది రాయి వేయడం, ఆలయ నిర్మాణం కోసం ఒక ప్లాన్ రూపొందించడం, ప్రతి ఏడాది డిసెంబర్ 6న ఉత్సవాలు జరుపుకోవడం మొదలైన వాటి ద్వారా అయోధ్య నిత్యం వార్తల్లోకెక్కుతూనే ఉంది. కోర్టుల్లో విచారణ, దాని మీద ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ కూడా దానిని నిరంతరం వార్తల్లో ఉంచుతూ వచ్చాయి.

ప్రస్తుతం తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఎందుకు మరోసారి వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది? దీనికి ఒక ఊహాజనిత సమాధానం - బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య (మరీ ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్, మోదీల మధ్య) సంబంధాలు సరిగా లేకపోవడం, ఈ సమస్య ద్వారా మరోసారి మోదీని ఇరకాటంలో పెట్టడం.

ఈసారి బీజేపీ తన స్వశక్తి మీదే ఆధారపడి విజయం సాధించింది. అందువల్ల ఆర్ఎస్ఎస్, మోదీల మధ్య కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నా వారు ఒకరికొకరు సమస్యలు సృష్టించుకునే పరిస్థితి లేదు.

మరికొందరు చెప్పే సమాధానం - అధికారంలో ఉండగానే ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన మోదీ ప్రభుత్వం చాలా సులభంగా రామమందిరాన్ని నిర్మిస్తుందని చాలా మంది ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు విశ్వసిస్తున్నారు.

కానీ వాస్తవం అది కాదు. అనేక కేసులు పెండింగ్‌లో ఉండగా, మందిరం నిర్మించడం సాధ్యం కాదు. అదీ కాకుండా, గత నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు సమస్యలను కొని తెచ్చుకుంటుంది?

మరి ఎన్నికలు దగ్గరలో ఉండగా, రామమందిరాన్ని మరోసారి ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు?

ఈ ప్రశ్నకు పలు కోణాలున్నాయి.

ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు రామభక్తుల కంటే ఎక్కువగా రాజకీయ నాయకులు. వాళ్ల ఆలోచనల్లో కేవలం ఎన్నికల లెక్కలే ఉన్నాయి.

గత ఎన్నికలలో రాజకీయ గందరగోళ పరిస్థితుల మధ్య మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయం సాధించింది. ఈసారి మోదీ మేజిక్ కొంత తగ్గింది. అధికారంలో ఉన్న బీజేపీ తన వైఫల్యాలకు ఇతరులను సాకుగా చూపే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భావోద్వేగాలు తమను రక్షించవచ్చని, ఈసారి ఎన్నికల్లో తమను గెలిపించవచ్చని బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావిస్తుండవచ్చు.

గత నాలుగేళ్లుగా లవ్ జిహాద్, గోరక్షణ వంటి అంశాలతో నిరంతరం హిందుత్వవాదాన్ని విపరీతంగా పెంచి పోషించారు.

అందువల్ల తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అధికారంలో ఉన్నవారు భావోద్వేగాలను రెచ్చగొట్టి, హిందుత్వవాద రాజకీయాలను తమ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

భారతదేశంలోని అత్యధిక జనాభా హిందూమతానికి చెందినవారు. వాళ్ల మతభావనలను రెచ్చగొట్టి, దానిని రాజకీయశక్తిగా మార్చగలిగితే, ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అన్నది వాళ్ల లెక్క.

గతంలో అడ్వాణీ ఈ లెక్కలను సరిగ్గా ఉపయోగించుకున్నారు. 1989లో ఆ పార్టీ ఓటుబ్యాంకు భారీగా పెరగడానికి రామజన్మభూమి వివాదం బాగా ఉపయోగపడింది. అందువల్ల ఈసారి ఎన్నికలలో 'హిందువునని గర్వించు' తరహా ప్రచారం చేపట్టినా ఆశ్చర్యం లేదు.

జాతి, అభివృద్ధి, హిందుత్వ అన్నిటికీ ఒకే అర్థమని మోదీ గత ఎన్నికలలోనే స్పష్టం చేశారు. మోదీ ఏకకాలంలో 'వికాసపురుషుడు', 'హిందూ హృదయసామ్రాట్' కూడా.

వచ్చే ఎన్నికలలో 'జాతి గర్వం కోసం రామమందిరం నిర్మిద్దాం' అన్న పిలుపునకు చాలా మంది హిందువులు సానుకూలంగా ప్రతిస్పందించొచ్చు. ఇప్పుడు రామమందిర అంశాన్ని లేవనెత్తడం వెనుక కచ్చితంగా రాబోయే ఎన్నికలున్నాయి. తన సొంత సామర్థ్యంతో ఓట్లు గెలుచుకుంటామన్న విశ్వాసం కూడా బీజేపీకి లేదని ఇది వెల్లడిస్తోంది.

ఆర్ఎస్ఎస్-బీజేపీ మధ్య స్పష్టమైన పని విభజన

అధికారంలోకి వచ్చాక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒక స్పష్టమైన పని విభజన విధానాన్ని పాటిస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన విషయాలకు పరిమితం అవుతుంది. ఆర్ఎస్ఎస్ వాటిలో జోక్యం చేసుకోదు.

మరోవైపు సంస్కృతికి సంబంధించిన విషయాలను ఆర్ఎస్ఎస్ చూసుకుంటుంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వాటిలో భాగం. అలాంటి వాటిపై ప్రభుత్వం స్పందించదు. దానిపై ఎలాంటి చర్యా తీసుకోదు. గోరక్షక దళాలతో కానీ, మతాంతర వివాహాలను వ్యతిరేకించే వారితో కానీ, హిందూ మత వ్యతిరేకులను హత్య చేసేవారితో కానీ తమకు ఎలాంటి సంబంధమూ లేదని ప్రభుత్వం అంటుంది.

ప్రభుత్వాన్ని నడపడం ఎంత ముఖ్యమో, సాంస్కృతిక ఆధిపత్యం కూడా అంతే ముఖ్యమని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. తమ అజెండాను అమలు పరచడానికి నేడు వాళ్లకు అపరిమితమైన స్వేచ్ఛ ఉంది. దానిలో భాగంగానే నేడు అడ్వాణీ వారసత్వాన్ని కొనసాగిస్తూ మరోసారి రామమందిర వివాదాన్ని ముందుకు తెస్తున్నారు.

ఆర్ఎస్ఎస్‌లో హిందుత్వవాద చట్రంలో ఒక లెక్క ప్రకారం రాజకీయాలు చేసే వారున్నారు. వాళ్లు ప్రశాంతంగా తమ పని తాము చేసుకుపోతుంటారు. అయితే కొంత మంది హిందూ జాతీయవాదులకు మాత్రం తొందరెక్కువ. వాళ్లకు బీజేపీ అధికారంలోకి రావడమనేది హిందూదేశం ఏర్పడడానికి ఒక మార్గంలాంటిది.

రాజకీయ అధికారం, సాంస్కృతిక ఆధిపత్యం కలగలిసి ఉంటాయని వాళ్లు భావిస్తారు.

కొత్త తరానికి బదిలీ

బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ కలిసి మరోసారి రామజన్మభూమి వివాదాన్ని ఎగదోసినప్పుడు హిందుత్వవాద రాజకీయాలలో ఒక దశ పూర్తైంది.

ఈ దశలో బ్రాహ్మణ-వైశ్య-క్షత్రియ కులాలను దాటి సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలలో ఈ భావం ప్రచారం పుంజుకుంది.

నేడు ఆలయాన్ని నిర్మించాలనే వివాదం ఒక కొత్త దశను చేరుకుంది. అదే సమయంలో హిందుత్వ రాజకీయాలు చేస్తున్న వాళ్లు కూడా సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

ఈ మత రుగ్మతను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సుసంపన్నమైన సరికొత్త తరానికి కూడా బదిలీ చేయాలి - అదీ వారి ముందున్న సమస్య.

ఇందుకోసం ఒకవైపు చరిత్రకు సంబంధించిన దుష్ప్రచారాన్ని చేస్తూ, మరోవైపు జాతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇంకోవైపు సమాజాన్ని హిందూ, హిందూయేతర వర్గాలుగా చీలుస్తున్నారు. నూతనతరాన్ని హిందుత్వ రాజకీయాలతో జోడించేందుకు ఇలా బహుముఖ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గతంలో అయోధ్య ఉద్యమం మొదలైనప్పుడు భారతదేశం అప్పుడే ప్రపంచీకరణ దిశగా అడుగులు వేస్తోంది. నాడు ప్రజలు సాంకేతికంగా, ఆర్థికంగా ప్రపంచీకరణ చెందారు కానీ సాంస్కృతిక రీత్యా వాళ్ల మూలాలు గతాన్నే అంటిపెట్టుకున్నాయి. అందువల్ల ప్రపంచీకరణ నీడలో పెరిగిన కొత్త తరం కూడా దానిని తప్పించుకోలేదు.

ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో 'హిందువులకు దేశంలోనే అన్యాయం జరుగుతోంది' లాంటి నమ్మకాలను వ్యాప్తి చేయడం చాలా సులభం. ఈ విధంగా అయోధ్య వివాదం యువత, భవిష్యత్ తరాల మెదళ్లలో మత రాజకీయాల బీజాలను నాటగలదు.

ఫొటో క్యాప్షన్,

మోహన్ భాగవత్

ప్రత్యర్థులే లేరు

ఎన్నికలు వచ్చీపోవచ్చు. బీజేపీ గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ నేడు 20లలో ఉన్న తరానికి భవిష్యత్‌పై ఆందోళన కలిగించడం ఆర్ఎస్ఎస్‌ సాంస్కృతిక రాజకీయాలలో ఒక భాగం.

ఈ నేపథ్యంలో, హిందుత్వ రాజకీయాలు చేస్తున్నవారు, అయోధ్య పేరిట భావోద్వేగాలను రెచ్చగొడుతున్నవారు రేపటి రాజకీయ అధికారంపై కన్నేసిన వారే.

ఒకవైపు అయోధ్య రాజకీయాలు ఇలా కొనసాగుతుండగా, ఈ మతరాజకీయాలకు ప్రతిరాజకీయాలు లేకపోవడం ఆశ్చర్యకరం. వివాదాస్పద స్థలంలో ఆలయాన్ని నిర్మిస్తారా, లేదా అన్నది పక్కనబెడితే, ఆర్ఎస్ఎస్‌ ప్రారంభించిన ఈ పోరాటాన్ని సవాలు చేసే ప్రత్యర్థులే లేరు.

30 ఏళ్ల క్రితమే ఆర్ఎస్ఎస్‌ తన రాజకీయ మార్గాన్ని నిర్దేశించుకుంది. దానిని ఎదుర్కొనే శక్తే లేకపోవడం, భారతీయ ప్రజాస్వామ్యం పక్కదారి పడుతోందన్న దానికి సూచనా?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)