సెంటినలీస్ ఎవరు? వారి వద్దకు వెళితే బాణాలు వేసి ఎందుకు చంపేస్తారు?

  • 24 నవంబర్ 2018
ఆదివాసీ Image copyright Getty Images

అండమాన్ దీవుల్లో ఒకటైన సెంటినెల్ దీవిలో జీవించే సెంటినలీస్ జాతి ప్రజల చేతుల్లో అమెరికా యువకుడు హత్యకు గురయ్యాక, బాహ్య ప్రపంచానికి దూరంగా నివసించే ఇలాంటి ఆదిమమానవులు వార్తల్లో నిలిచారు.

అమెరికాకు చెందిన 27ఏళ్ల జాన్ అలెన్ చౌ.. ప్రపంచానికి దూరంగా జీవించే సెంటినలీస్ జాతి ప్రజలకు క్రిష్టియన్ మత ప్రచారం చేసేందుకే అండమాన్ దీవులకు వెళ్లారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కానీ బయటి మనుషులను చూసి భయపడే సెంటినెలీన్ ప్రజలు చౌపై బాణాలతో దాడి చేశారు.

తనను ఉత్తర సెంటినెల్ ప్రాంతానికి తీసుకుపోవటానికి స్థానిక జాలర్లకు జాన్ అలెన్ చౌ 25వేల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

అండమాన్‌లో మొత్తం 5 రకాల ఆదివాసీ తెగలున్నాయి. అవి.. జారావా, ఉత్తర సెంటినలీస్, గ్రేట్ అండమానీస్, ఓంగా, షోంపెన్ జాతులు. వీరిలో జారావా, ఉత్తర సెంటినెలీస్ తెగ ప్రజలు ఇంకా బయటి ప్రపంచానికి దూరంగానే జీవిస్తున్నారు. ఈ అంశమే.. ఏటా అండమాన్‌కు వచ్చే 5లక్షల మంది పర్యటకులను ఆకర్షిస్తోంది.

ఈ వీడియోను చూడండి

ఎవరీ సెంటినలీస్?

బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక చిన్న దీవికే పరిమితమై జీవిస్తున్న అతి కొద్ది ఆదిమ జాతుల్లో సెంటినల్ జాతి ఒకటి.

వీరు నివసిస్తున్న దీవి అండమాన్ ద్వీప సమూహంలో ఉంది. అది సుమారు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. కానీ వారి గురించి మనకు తెలిసినదంతా.. దూరం నుంచి వారిని గమనించటం ద్వారా తెలుసుకున్నదే.

నిజానికి.. ప్రపంచంలో ఇప్పుడున్న మరే ఆదిమ జాతి ప్రజలకన్నా ఎక్కువగా ఈ సెంటినలీస్ తెగ వారే ప్రపంచానికి సుదూరంగా జీవిస్తున్నారని నిపుణుల అంచనా.

వీరు.. ఆఫ్రికాలో ఆవిర్భవించిన మొట్టమొదటి మానవ జనాభా ప్రత్యక్ష వారసులు కావచ్చునని.. దాదాపు 60,000 సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని పరిగణిస్తున్నారు.

ఇతర అండమాన్ దీవుల్లోని ఆదిమజాతుల భాషకూ.. ఈ సెంటినలీస్ భాషకూ ఏమాత్రం పోలిక లేకపోవటాన్ని బట్టి.. వీరికి తమ చుట్టుపక్కల దీవుల్లోని ఆదిమజాతుల వారితో కూడా కొన్ని వేల ఏళ్లుగా సంబంధాలు లేవని అర్థమవుతోంది.

Image copyright INDIAN COASTGUARD/SURVIVAL INTERNATIONAL

వీళ్లకు డబ్బు గురించి తెలియదు

ఆ తెగ వారిని కలవటం నేరం. బయటి వ్యాధులు ఆ తెగవారికి సోకే ప్రమాదాన్ని నివారించటానికి.. వారిని ఎవరూ కలవరాదన్న నిషేధం విధించారు.

చనిపోయిన అమెరికా ప్రయాణికుడు జాన్ అలెన్‌ని వారి సెంటినెల్ దీవికి అక్రమంగా బోటులో తీసుకెళ్లినందుకు గాను ఏడుగురు మత్య్సకారులను అరెస్ట్ చేశారు.

‘‘అతడు గతంలో స్థానిక మత్స్యకారుల సాయంతో నాలుగైదు సార్లు నార్త్ సెంటినల్ ఐలండ్‌ను సందర్శించాడని పోలీసులు చెప్పారు’’ అని సుబీర్ భౌమిక్ అనే జర్నలిస్ట్ బీబీసీ హిందీకి తెలిపారు. ఆయన చాలా సంవత్సరాలుగా ఈ దీవుల్లో పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు.

‘‘సెంటినలీస్ తెగకు చెందిన జనం సంఖ్య చాలా తక్కువగా ఉంది.. డబ్బు ఎలా ఉపయోగించాలన్నది కూడా తెలియదు. నిజానికి వారిని ఏ విధంగా కలవటమైనా చట్టవిరుద్ధం’’ అని ఆయన చెప్పారు.

అండమాన్ ఆదివాసీ తెగల వారిని ఫొటోలు, వీడియోలు తీయటం కూడా.. మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించగల నేరమని భారత ప్రభుత్వం 2017లో ప్రకటించింది.

2006లో నార్త్ సెంటినల్ దీవి సమీపంలో చేపలు పడుతున్న భారత మత్స్యకారులు ఇద్దరిని కూడా ఈ తెగ వారు చంపారు.

Image copyright SURVIVAL INTERNATIONAL
చిత్రం శీర్షిక సెంటినలీస్ ప్రజల ఫొటోలు చాలా కొన్నే ఉన్నాయి

వీరి జీవనాధారం ఆహార సేకరణ, వేట. అయితే.. 60,000 ఏళ్ల కిందట వీరు ఎలా జీవించారో ఇప్పుడూ అలాగే జీవిస్తున్నారనేది దీని అర్థం కాదని పరిశోధకులు చెప్తున్నారు.

బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా.. బ్రిటిష్ వలస పాలనా కాలంలో అండమాన్ దీవుల్లోని ఆదిమ తెగలు కొన్నిటి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.

కానీ.. ‘‘బ్రిటిష్ వలస రాజ్య ఆక్రమణ.. అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే తెగలను ధ్వంసం చేసింది. వేలాది మంది ఆదివాసీలను తుడిచిపెట్టింది. వాస్తవ జనాభాలో కేవలం అతి చిన్న భాగం మాత్రమే ఇప్పుడు బతికుంది. కాబట్టి బయటి వారు అంటే వారి భయం అర్థం చేసుకోగలిగేదే’’ అని సర్వైవల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్టీఫెన్ కోరీ వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అండమాన్‌లో నివసరించే మరో ఆదిమజాతి జారావా తెగ ప్రజలకు.. బాహ్య ప్రపంచంతో కొద్దిగా సంబంధాలున్నాయి

వీరికి సరైన రక్షణ ఉందా?

ఈ ఏడాది మొదట్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో.. ఇలాంటి 29 దీవుల్లో పర్యటించడానికి పొందాల్సిన అనుమతుల(ఆర్.ఎ.పి) నుంచి విదేశీయులను మినహాయించింది.

ఈ 29 దీవుల్లో 9 దీవులు నికోబార్, 2 దీవులు అండమాన్‌కు చెందినవి. ఈ దీవుల్లో ఉత్తర సెంటినల్ దీవి కూడా ఒకటి.

ఇలాంటి తెగ ప్రజల తరపున మాట్లాడే 'సర్వైవల్ ఇంటర్నేషనల్' ఈ విషయమై స్పందించింది. అమెరికా యువకుడి మరణించిన సంఘటనను ఓ హెచ్చరికలా పరిగణించి, ఆదిమ తెగలను బయటి ప్రపంచం తాకిడి నుంచి కాపాడాలి అని పేర్కొంది.

ఈ ఒక్క సంఘటనతో ప్రజలకు, ఆదిమజాతి తెగలన్నీ క్రూరమైనవి, దుర్మార్గమైనవి అన్న అపోహ కలిగే ప్రమాదం ఉంది అని ఒక ఆంత్రోపాలజిస్ట్(మానవశాస్త్రజ్ఞుడు) బీబీసీతో అన్నారు.

Image copyright CHRISTIAN CARON - CREATIVE COMMONS A-NC-SA
చిత్రం శీర్షిక సెంటినలీస్ తెగ ప్రజలు తమ దీవి తీరంలో గస్తీ కాస్తున్న దృశ్యం

మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ మధ్యలోని 1,028కిలోమీటర్ల భూభాగంలో జారావా తెగ ప్రజలు జీవిస్తున్నారు.

వీళ్లని చూడటానికి పర్యటకులు.. పోర్ట్‌బ్లెయిర్ నుంచి 'అండమాన్ ట్రంక్ రోడ్డు'(ఏటీఆర్) గూండా రెండు గంటలపాటు బస్సులో ప్రయాణించి బారాతంగ్ చేరుకుంటారు. ఈ ఏటీఆర్ మార్గం జారావా భూభాగంలో వెళుతుంది.

కొన్నేళ్ల కిందట, పర్యటకుల కోసం నృత్యం చేయాలంటూ పోలీసులు జారావా మహిళలను బలవంతపెడుతున్న వీడియోను ఓ జర్నలిస్టు చిత్రీకరించారు. ఈ సంఘటనతో పర్యటకులు ఎవ్వరూ ఏటీఆర్ మార్గాన్ని వాడరాదని 2013లో సుప్రీం కోర్టు ఆదేశించింది.

కానీ పోర్ట్‌బ్లెయిర్‌కు పశ్చిమ దిక్కున 50కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర సెంటినల్ ద్వీపానికి ఎటువంటి రోడ్డు రవాణా వ్యవస్థా లేదు.

కానీ సెంటినలీస్ ప్రజలను చూసేందుకు స్థానిక జాలర్లకు లంచం ఇచ్చి, ఆ ప్రాంతంలో పహారా కాసే కోస్టు గార్డుల కళ్లు కప్పి, కొందరు పర్యటకులు ఉత్తర సెంటినల్‌కు వెళతారని చాందీ అనే వ్యక్తి అన్నారు.

Image copyright Getty Images

''ఆదివాసీ తెగలను చూడటానికి ప్రజలు ఇష్టపడతారు. కానీ ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా మేం జాగ్రత్తపడతాం. ఆ ప్రాంతంలో పోలీసులు, ఇతర అధికారుల నిరంతర పహారా ఉంటుంది'' అని ఆదివాసీ సంక్షేమశాఖ డైరెక్టర్ గోవింద్ రామ్ బీబీసీతో అన్నారు.

విదేశీయులు జావారా, ఉత్తర సెంటినెల్ దీవులకు వెళ్లేందుకు జిల్లా, అటవీ శాఖ అనుమతులు అవసరమని అధికారులు చెబుతున్నారు. కానీ ఈవిధమైన అనుమతుల వల్ల నిషిద్ధ ప్రాంతాల్లో పర్యటించడానికి తలుపులు బార్లా తెరిచినట్టేనని అటవీ పరిరక్షణ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

''ఆదివాసీ ప్రాంతాలకు ఇబ్బంది కలిగించే 'ట్రైబల్ టూరిజం'కు దారితీసే అంశాలను నియంత్రించకుండా ఈవిధంగా అనుమతులు ఇస్తూ, ఇబ్బందులు కలగకుండా నిఘా ఉంచుతాం అని ప్రభుత్వం చెబుతోంది'' అని స్థానిక పత్రిక అండమాన్ క్రానికల్స్ ఎడిటర్ డేనిస్ గిల్స్ అన్నారు.

నిషిద్ధ ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించడానికి నిబంధనలను సడలించడం పట్ల పునరాలోచించాలని షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాతీయ కమిషన్ తెలిపింది.

ఈవిషయమై కొందరు టూర్ ఆపరేటర్లతోకూడా బీబీసీ మాట్లాడింది. పర్యటకులు ఎప్పుడూ ట్రైబల్ టూరిజం గురించి తమను అడగలేదని వారంటున్నారు.

Image copyright SURVIVAL INTERNATIONAL
చిత్రం శీర్షిక సెంటినలీస్ తెగ ప్రజలు దాదాపు 60,000 ఏళ్లుగా ఈ 60 చదరపు కిలోమీటర్ల నార్త్ సెంటినల్ దీవిలోనే జీవిస్తున్నారు

''ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో పర్యటించాలని మా కస్టమర్లు ఎప్పుడూ అడగలేదు. ఆదివాసీ ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది. ఆదివాసీ ప్రాంతాల సమీపంలో పర్యటిస్తున్నపుడు పర్యటకులపై గట్టి నిఘా ఉంటుంది. భద్రతాలోపం వల్లనే అమెరికా యువకుడి హత్య జరిగింది. ఆర్ఏపీ అనుమతులను సడలించడం పర్యటక రంగానికి మంచిదే'' అని అండమాన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు వినోద్ అన్నారు.

సడలించిన అనుమతులను ఉత్తర సెంటినల్ ప్రాంతానికి కూడా వర్తింపచేయాలన్నది ఆయన వాదన. కానీ నిబంధనల సడలింపును ఎన్ని ద్వీపాలకు వర్తింపచేయాలి అన్నది ప్రభుత్వానికే వదిలేస్తున్నామని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)