తెలంగాణ ఎన్నికలు 2018: ‘సింగరేణిలో ఉద్యోగమొస్తదని ఎదురు కట్నం ఇచ్చిన్రు. ఇప్పుడు విడాకులు అడుగుతున్నరు’

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
సింగరేణి

"బొగ్గు గనిలో నాకు ఉద్యోగం వస్తుందనే నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సంబంధం ఖాయం చేసుకోవటానికి వచ్చినప్పుడు వారి పెద్దలు.. మైన్‌ల జాబ్ వస్తదికదా మేమే 13 లక్షలు ఎదురుకట్నం ఇస్తాం అన్నారు. అందులో 5 లక్షలు పెళ్లికి ముందే ఇచ్చారు. మిగతాది ఉద్యోగం అచ్చినాక ఇస్తామన్నరు. ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు అని తెలిసి విడాకులు అడుగుతున్నరు."

- ఇది మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఆర్.కె-6 గనిలో సపోర్ట్ మ్యాన్‌గా పనిచేసే సింగరేణి బొగ్గు కార్మికుని కూతురి గోస.

2012లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీజీబీకేఎస్) వారసత్వ నియామకాల నినాదంతోనే కార్మికుల్లోకి వెళ్లి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచింది.

2017లో ఇదే మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పడంతో మళ్లీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీజీబీకేఎస్ విజయం సాధించగలిగింది.

ఫొటో క్యాప్షన్,

మేన్ రైడింగ్ ద్వారా భూగర్భ గనిలోకి వెళ్తున్న కార్మికుడు

పదిహేనేళ్ల తరువాత మళ్లీ ప్రారంభించారు

సింగరేణి బొగ్గు గనుల్లో ఒకప్పుడు వారసత్వ నియామకాలు ఉండేవి. 1998లో ఆ విధానాన్ని రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016 డిసెంబరులో సింగరేణి యాజమాన్యం వారసత్వ నియామకాలను తిరిగి ప్రారంభిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే, 2017 మార్చిలో హైకోర్టు ఈ ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

కానీ, అదే ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు హైదరాబాద్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలిచ్చింది.

అనంతరం సింగరేణి యాజమాన్యం మార్చి 2018లో కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ఉత్తర్వుల్లో వారసత్వ నియామకాలకు బదులు కారుణ్య నియామకాలు అంటూ పేర్కొన్నారు. దీనికి మార్గమేర్పరుస్తూ సింగరేణి మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది.

ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నా..

రిటైర్మెంటుకు రెండేళ్ల సమయం ఉన్న కార్మికుడు 'పని చేసే స్థితిలో లేడు'(అన్ ఫిట్) అని తేలితే వారసులకు ఆ ఉద్యోగం ఇచ్చేలా ఈ ఉత్తర్వుల్లో ఉంది.

కార్మికుడి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోతే ఆ ఉద్యోగం వారసులకు ఇవ్వడమనేది సింగరేణి వారసత్వ నియామకాల విధానంలో ఉండేది. 1998 నుంచి ఈ విధానాన్ని రద్దు చేశారు.

పదిహేనేళ్ల తరువాత సింగరేణి యాజమాన్యం దీనిపై మళ్లీ ఉత్తర్వులివ్వడంతో చాలామంది కార్మికులు సంతోషించారు. తమ ఉద్యోగాలను వారసులకు ఇవ్వాలంటూ దరఖాస్తులు చేసుకున్నారు.

కానీ, కోర్టులు ఈ ఉత్తర్వులను కొట్టివేయడంతో వారి దరఖాస్తులు ముందుకుసాగలేదు.

పెళ్లి సందడి

వారసత్వ నియామకాలపై యాజమాన్యం ఉత్తర్వులు ఇవ్వడం, కేసీఆర్ కూడా దీనిపై హామీ ఇవ్వడంతో సింగరేణి కార్మికుల కుటుంబాల్లో సందడి మొదలైంది. చాలామంది కార్మికులు తమ కుమార్తెలకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేయగలిగారు.

తండ్రి ఉద్యోగం కుమార్తెకు వస్తుందన్న ఉద్దేశంలో అమ్మాయిలకు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లిళ్లు చేసుకున్నారు.

అలాగే తండ్రి ఉద్యోగం కుమారుడికి వస్తుందన్న ఆలోచనతో భారీ మొత్తంలో కట్నాలు ఇచ్చి కూడా చాలామంది సింగరేణి కార్మికుల కుమారులను అల్లుళ్లుగా చేసుకున్నారు.

కానీ, ఈ వారసత్వ ఉద్యోగాలపై ముందడుగు పడకపోవడంతో ఇలాంటి ఎన్నో వివాహాలపై వివాదాలు ముసురుకున్నాయి.

ఫొటో క్యాప్షన్,

గులాం రసూల్

నేను రిటైర్ అయిపోయాను కానీ నా కొడుక్కి ఉద్యోగం రాలేదు

గులాం రసూల్ అనే కార్మికుడి కుమారుడి వివాహం కూడా ఈ వారసత్వ నియామకాల విషయం మళ్లీ తెరపైకి వచ్చాకే జరిగింది. కానీ, కొడుక్కి తన ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో వియ్యంకులతో పెళ్లి సమయంలో చెప్పిన మాటను తాను తప్పినట్లయిందని ఆయన ఆవేదన చెందుతున్నారు.

"హైదరాబాద్‌లో ఉండే ఒక కుటుంబానికి చెందిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసాము. మేం కట్నం ఏమీ తీసుకోలేదు. కానీ, అబ్బాయికి నా ఉద్యోగం వస్తుందని అని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాను. తీరా చూస్తే నేను రిటైర్ అయిపోయాను కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. డిగ్రీ చదివినా, హైదరాబాద్‌పోతేకానీ ఉద్యోగ అవకాశాలు లేవు. మేం ముసలివాళ్లమని, మమ్మల్ని చూసుకోవడానికి ఇంతకాలం మాతోనే ఉండిపోయాడు నా కొడుకు. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నడు. వచ్చే జీతం చాలక నేను నా పెన్షన్ డబ్బులో నుంచి పంపుతూ ఉన్నాను. కానీ అందరి ముందు తల తీసేసిన పని అయ్యింది నాకు" అని గులాం రసూల్ చెప్పుకొచ్చారు.

కారుణ్య నియామకాల కోసం మార్చ్ 2018లో ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం రిటైర్మెంట్‌కు రెండేళ్ల గడువు ఉండగా మెడికల్ బోర్డుకు అప్లై చేసుకోవచ్చు.

మెడికల్ బోర్డు గనుక అన్‌ఫిట్ అని తేలిస్తే వారి ఉద్యోగం వారి పిల్లలకు వస్తుంది. కానీ అందులో అవకతవకలు జరగడంతో వందలమంది కార్మికులకు అన్యాయం జరిగిందంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు.

మెడికల్ బోర్డు అవకతవకలపై ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన ఒక బహిరంగ సభలోనూ చెప్పారు. కొత్త మెడికల్ బోర్డునూ ఏర్పాటు చేశారు.

ఫొటో క్యాప్షన్,

ఇ.సత్యనారాయణ

'కార్మికుడు అన్‌ఫిట్.. అయినా, వారసులకు కారుణ్య నియామకం కుదరదు'

సత్యనారాయణ అనే కార్మికుడు 2018 మేలో రిటైరయ్యారు. ఆయనకు 2014లో పక్షవాతం వచ్చి శరీరంలో కుడిభాగం పని చెయ్యడం మానేసింది. ఆయన 2013లోనే తాను నడుము, కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడుతున్నానని మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. మెడికల్ బోర్డు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తేల్చి ఉద్యోగం చేసుకోవాలని సూచించింది. 2014లో పక్షవాతం వచ్చాక మళ్లీ మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేశారు. దీనిపై మెడికల్ బోర్డు 2017లో సత్యనారాయణకు అన్‌ఫిట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ, కారుణ్య నియామకానికి అర్హులు కారంటూ తేల్చి చెప్పింది.

ఇలా ఎందరో రిటైర్మెంట్ సమయంలో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నా అక్కడి నుంచి సకాలంలో స్పందన రాకపోవడంతో నష్టపోయారు.

మెడికల్ బోర్డు ఏమీ తేల్చి చెప్పకముందే వారు రిటైరైపోయారు.దీంతో వారి సంతానానికి కారుణ్య నియామకాల అవకాశం రాలేదు.

వేణు తండ్రి వెన్నెముక ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ రిటైర్మెంట్‌కి ఒకే సంవత్సరం మిగిలుంది. ఇప్పుడు వేణుకి కారుణ్య నియామకానికి అవసరమైన రెండు సంవత్సరాల గడువు లేదు.

అయితే సింగరేణిలో నిలిపివేసిన వారసత్వ నియామకాలపై కానీ, కారుణ్య నియామకాలపైకానీ మాట్లాడేందుకు అధికారులు స్పందించలేదు.

ఎన్నికల సమయం కాబట్టి, అనవసర ప్రచారం అవుతుందంటూ బీబీసీ అడిగిన ప్రశ్నలకు ఎవరూ స్పందించలేదు.

‘మేం కేవలం ఓట్ బ్యాంక్.. మా బాధలు పట్టవు’

సింగరేణి బొగ్గు గనులలో 57 శాతం కార్మికులు 50 ఏళ్లు దాటినవారే. 1986 తర్వాత సింగరేణిలో ప్రత్యేక నియామకాలు జరగలేదు.

మొత్తం 29 భూగర్భ బొగ్గు గనుల్లో 52,531 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో కేవలం 9% మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు.

గత నాలుగేళ్లలో 7,200 కొత్త నియామకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రానున్న రెండేళ్లలో రిటైర్ కావాల్సిన కార్మికుల సంఖ్య 10వేలు.

ఇందులో శ్రీరాంపూర్‌లోని ఎనిమిది భూగర్భ గనులు, ఒక ఉపరిత బొగ్గు గని ఉన్నాయి. ఇక్కడ దాదాపు 13వేల మంది కార్మికులు ఉన్నారు.

సింగరేణి కార్మికులకు ఆదాయ పన్నులో రాయితీల అంశంపైనా ఇప్పటివరకు స్పందన లేదని కార్మికులు అంటున్నారు.

సమస్యలు ఎన్ని ఉన్నా ఇప్పటిదాకా ఉన్న కార్మికుల్లో ఎక్కువమందికి చదువు లేక, అవగాహన లేక, ఏది చెబితే అది వినేసి అదే కరెక్ట్ అనుకొని మోసపోతూ వచ్చారని కార్మిక సంఘం నేతలు అంటున్నారు.

"వీరిని కేవలం ఓటు బ్యాంకుగానే భావిస్తున్నారు కానీ వీరి మేలు కోరి, అభివృద్ధి పనులు చేద్దామని ఏ రాజకీయ నాయకుడూ ఆలోచించడం లేదు. ఉద్యోగాల కల్పన లేదు. ఆకలితో ఉన్న కార్మికునికి తిండి పెట్టే ఆలోచన లేదు. ఓపెన్ కాస్ట్ గనులు భవిష్యత్తు అంటూ డీజల్‌తో మెషీన్ల కడుపు నింపుతున్నారు" అని ఒక కార్మిక సంఘం నేత అభిప్రాయ పడ్డారు.

నిర్వాసితుల సమస్య

కేసీఆర్ ఓపెన్ కాస్ట్ గనులు వద్దని ఒకప్పుడు అన్నారు. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ గనులు లేనిదే సింగరేణి లేదు అంటున్నారు. మరి ఇప్పుడు తమ పరిస్థితేమిటని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.

సుప్రీం కోర్టు కూడా ఓపెన్ కాస్ట్ మైన్స్ వల్ల నిర్వాసితులైన గిరిజనుల కుటుంబాలకు కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలని నవంబర్ 21 న తీర్పు ఇచ్చింది.

12 నియోజకవర్గాల్లో ప్రభావం

సింగరేణి బొగ్గు గనులు తెలంగాణలోని 12 శాసనసభ నియోజిక వర్గాల్లో ఉన్నాయి. సిర్పూర్, చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, రామగుండం, మంథాని, సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలో ఈ గనులు వ్యాపించి ఉన్నాయి.

ప్రస్తుతం 29 భూగర్భ బొగ్గు గనులు 17 ఓపెన్ కాస్ట్ గనులను సింగరేణి నిర్వహిస్తోంది. 2011-12.. 2012-13లో 2 నుంచి 5% ఉన్న వృద్ధి రేటు 2015-16కి 15 శాతంగా నమోదైంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.18,389 కోట్ల టర్నోవర్‌ని సింగరేణి చూపగలిగింది. అంతకు ముందు ఏడాది రూ.16,516 కోట్ల టర్నోవర్ ఉంది.

సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం. సింగరేణి కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం ఆగస్టులో షేర్లు వెల్లడించింది.

2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను 27% ప్రకటించింది. కానీ కార్మికుల భవిష్యత్తు కోసం బాగు కోసం ఇంకా చేయవలిసింది చాలా ఉందని కార్మిక కుటుంబాలు అంటున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మసిబారిన బొగ్గు గని కార్మికుల భవిష్యత్తు బాగు పడుతుందని వారు భావించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)