మేరీకోమ్ ఆరోసారి చాంపియన్: ‘బాక్సింగ్ చేస్తానంటే నీకు పెళ్లి కాదన్నారు’

  • 24 నవంబర్ 2018
మేరీ కోమ్ , బాక్సింగ్ Image copyright AFP/Getty Images

గతంలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలలో విజయం సాధించారు.

లైట్ వెయిట్ విభాగంగా మేరీ కోమ్ ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాను ఓడించారు.

దిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏకపక్ష పోటీలో 35 ఏళ్ల మేరీ కోమ్ తనకన్నా 12 ఏళ్లు చిన్నదైన హనాను ఓడించారు.

ఆమె చివరిసారిగా 2010 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో స్వర్ణపతకం సాధించారు. అంతకు ముందు ఆమె 2002, 2005, 2006, 2008లో స్వర్ణపతక విజేతగా నిలిచారు.

తాజా విజయంతో మేరీ కోమ్, గతంలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఐదుసార్లు స్వర్ణపతకం సాధించిన ఐర్లాండ్‌కు చెందిన కేటీ టైలర్ రికార్డును తిరగరాశారు. అదే సమయంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఆరుసార్లు స్వర్ణపతకం సాధించిన పురుష బాక్సర్ ఫెలిక్స్ సెవన్ రికార్డును సమం చేశారు.

Image copyright AFP/Getty Images

బాల్యం

మేరీ కోమ్ మణిపూర్‌లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆమె బాక్సింగ్ నేర్చుకోవడం ఆమె కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. దీంతో ఆమె పొలంలో పని చేస్తూ, ఇంటి పనులు చేసుకుంటూ, తోడబుట్టిన వాళ్లను చూసుకుంటూనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవారు.

చాలాకాలం పాటు ఆమె బాక్సింగ్ నేర్చుకుంటోందని ఇంట్లో తెలీనే తెలీదు.

2000లో రాష్ట్ర ఛాంపియన్‌షిప్ పోటీల ఫొటోలు పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆమె ఇంట్లో బాక్సింగ్ గురించి తెలిసింది.

అయితే బాక్సింగ్‌లో దెబ్బలు తగిలితే ఆమెకు పెళ్లి కాదని ఆమె తండ్రి భయపడేవారు. కానీ తండ్రి భయాన్ని ఆమె లెక్కచేయలేదు.

గత ఏడాది నవంబర్‌లో ఆమె ఐదోసారి ఆసియన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఐదోసారి స్వర్ణపతకం సాధించారు.

మేరీ కోమ్ జీవితకథ కూడా హిట్టే. ప్రియాంక చోప్రా కథానాయికగా మేరీ కోమ్ పేరుతో తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.

Image copyright Getty Images

ఐరన్ లేడీ

మేరీ కోమ్‌ను ఐరన్ లేడీ అని కూడా అంటుంటారు. ఆ పేరు ఆమెకు ఊరికే రాలేదు. బాక్సింగ్ రింగ్‌లోనే కాదు, నిజజీవితంలోనూ ఆమె సమస్యలతో పోరాటం చేశారు.

2011లో ఆమె మూడున్నర ఏళ్ల కుమారుడికి గుండె ఆపరేషన్ జరిగింది. అదే సమయంలో ఆమె ఆసియా కప్ కోసం చైనా వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఏం చేయాలో తోచనప్పుడు ఆమెకు భర్త అండగా నిలిచారు. కొడుకును భర్త సంరక్షణలో వదిలి ఆమె ఆసియా కప్‌కు వెళ్లారు. అక్కడ స్వర్ణపతకం సాధించి తిరిగి వచ్చారు.

గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె,''బాక్సింగ్ రింగ్‌లో మీరు, ప్రత్యర్థి.. ఇద్దరే ఉంటారు. అందువల్ల మీకు పౌరుషం రాకుంటే, మీరసలు నిజమైన బాక్సరే కాదు'' అన్నారు.

అదే పౌరుషంతో ఆమె ఈ వయస్సులో కూడా స్వర్ణ పతకం సాధించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు