26/11 ముంబయి దాడులు: ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?

  • జాహ్నవి మూలే
  • బీబీసీ ప్రతినిధి
అజ్మల్ కసబ్, సెబాస్టియన్ డిసౌజా, ముంబై దాడి

ఫొటో సోర్స్, SEBASTIAN D'SOUZA

ఫొటో క్యాప్షన్,

సీఎస్‌ఎమ్‌టీలో అజ్మల్ కసబ్

2008, నవంబర్ 26 చాలా బోర్‌గా ప్రారంభమైందని సెబాస్టియన్ డిసౌజా తెలిపారు.

అదే రోజు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్‌ఎమ్‌టీ)లో తుపాకీ ధరించిన ఇద్దరు వ్యక్తులు విరుచుకుపడ్డంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

దశాబ్దం అనంతరం 66 ఏళ్ల డిసౌజా రిటైర్మెంట్ అనంతరం తానుంటున్న గోవా నుంచి ఫోన్ ద్వారా మాతో సంభాషించారు.

అప్పట్లో డిసౌజా 'ముంబయి మిర్రర్' దినపత్రికలో ఫొటో ఎడిటర్‌గా పని చేసేవారు. దాడులు జరిగిన రోజు ఆయన సీఎస్‌ఎమ్‌టీకి దగ్గరలో ఉన్న తన కార్యాలయంలో కూర్చున్నారు.

లియోపోల్డ్ కెఫె దగ్గర కాల్పులు జరిగినప్పుడు ఆయనకు మొదట ఆ దాడి గురించి తెలిసింది.

''ఆ రోజు చాలా బోరింగ్‌గా ఉంది. ఎవరి దగ్గరా మంచి ఫొటోలు లేవు. దాంతో ఫొటోగ్రాఫర్లందరం కూర్చుని చర్చించుకుంటున్నాం. హఠాత్తుగా కాల్పుల గురించి వార్త రావడంతో బ్యాగులు తీసుకుని అక్కడికి పరిగెత్తాం.'' అని డిసౌజా వివరించారు.

ఫొటో సోర్స్, Hindustan Times

సాధారణ టూరిస్టుల్లాగే ఉన్నారు

ఆ కాల్పులు ప్రారంభమైన తర్వాత సుమారు 60 గంటల పాటు ముంబయిలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రైల్వేస్టేషన్, రెండు లగ్జరీ హోటల్స్, ఒక యూదు సాంస్కృతిక కేంద్రంపై జరిగిన ఆ దాడిలో 9 మంది గన్‌మెన్లతో పాటు మొత్తం 175 మంది ప్రాణాలు కోల్పోయారు.

దాడి చేసిన వారిలో ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ కసబ్, మరో సహాపరాధితో కలిసి సీఎస్‌ఎమ్‌టీలో 52 మంది ప్రాణాలు తీశాడు.

కాల్పులు శబ్దాలు వినగానే స్టేషన్ చేరుకున్న డిసౌజాకు తన కళ్ల ముందు జరుగుతున్నది సాధారణ సంఘటన కాదని అర్థమైంది.

కసబ్, మరో గన్‌మ్యాన్ (ఇస్మాయిల్ ఖాన్)ను చూసిన సంఘటనను వివరిస్తూ, ''వాళ్లు ప్లాట్‌ఫాం మీద ఉన్న టికెట్ కౌంటర్ల వద్ద ఉన్నారు. వీపు వెనకాల బ్యాగ్‌లతో వాళ్లు సాధారణ టూరిస్టుల్లా కనిపించారు. వాళ్లు కాల్పులు జరుపుతుంటే తప్ప, వాళ్లను ఉగ్రవాదులని గుర్తించలేము. వాళ్లు ఒక వ్యక్తిని కాల్చి చంపినప్పుడు నేను వాళ్లను గుర్తించాను.'' అని డిసౌజా తెలిపారు.

దాని తర్వాత ఆయన తాను కనిపించకుండా వాళ్లను అనుసరిస్తూ, వీలుచిక్కినప్పుడల్లా వాళ్ల ఫొటోలు తీస్తూ పోయారు.

''నేను వాళ్ల నుంచి ఒక్క క్షణం కూడా దృష్టి మరల్చనే లేదు. వాళ్లెవరు? నిజంగానే ఉగ్రవాదులా? వాళ్లెందుకు కాలుస్తున్నారు? ఇదే నా మెదడులోని ప్రశ్నలు.''

ఫొటో సోర్స్, Getty Images

చరిత్రాత్మక ఫొటో

కసబ్, ఇస్మాయిల్ ఖాన్ ఆ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లిపోయేంతవరకు డిసౌజా ఫొటోలు తీస్తూనే ఉన్నారు. అప్పుడే కంబాట్ ట్రౌజర్ వేసుకుని, అసాల్ట్ రైఫిల్ పట్టుకున్న కసబ్ ఫొటో ఆయన కెమెరాలో చిక్కింది.

ఆ ఫొటోయే తర్వాత కోర్టులో ఒక కీలకమైన సాక్ష్యంగా ఉపయోగపడింది. ఆ ఫొటోకు ఆయనకు 2009లో వరల్డ్ ప్రెస్ ఫొటో పోటీలో పురస్కారం కూడా దక్కింది.

2008, నవంబర్ 27 ఉదయం.. ఇంకా తాజ్, ఒబెరాయ్, నారిమన్ హౌస్ వద్ద దాడులు కొనసాగుతున్నపుడు, ముంబై మిర్రర్ పత్రిక మొదట పేజీలో కసబ్ ఫొటో ప్రచురితమైంది.

ఆ ఫొటో రేపిన భావోద్వేగం నాటి నుంచి ముంబయి వాసుల మనసుల్లోనే ఉండిపోయింది. అయితే రాత్రికి రాత్రే అంతర్జాతీయ గుర్తింపు వచ్చినా డిసౌజా మాత్రం దాని నుంచి దూరంగానే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

కసబ్ ఓ కొత్త వ్యక్తిలా కనిపించాడు..

''అంతా ముగిసాక, ఓహో! మనమేదో భిన్నమైనది చేశామని తెలుస్తుంది. కానీ నేనేదో గొప్పపని చేశానని భావించడం లేదు. నా ఎదురుగా ఒక సంఘటన జరిగింది. దానిని నా కెమెరాతో రికార్డు చేశాను. దాని గురించి నాకేమీ గర్వం లేదు. ప్రజలు దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ నేను కేవలం నా విధిని నిర్వర్తించానంతే.''

''నేను దానిని మర్చిపోవాలనుకుంటున్నాను కూడా. నేను ఒక హంతకుణ్ని నా కెమెరాలో బంధించాను. ఎవరైనా ఒక మంచి వ్యక్తిని నా కెమెరాలో బంధించి ఉంటే అప్పుడు నేను చాలా సంతోషించేవాణ్ని'' అన్నారాయన.

కసబ్ విచారణ సందర్భంగా డిసౌజాను ప్రత్యేక కోర్టుకు పిలిచారు. కోర్టు గదిలో రెండోసారి కసబ్‌ను చూసిన దృశ్యం తనకు ఇంకా గుర్తుందని ఆయన అన్నారు.

''రెండోసారి అంత దగ్గరగా చూసినప్పుడు, అతను నాకో కొత్త వ్యక్తిలా కనిపించాడు. బహుశా తానెంత ఘాతుకానికి ఒడిగట్టాడో అతనికి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్లు కేవలం రోబోల్లా అందరినీ కాలుస్తూ పోయారు. వాళ్లకు డ్రగ్స్ ఇచ్చారేమో నాకు తెలీదు.''

చివరికి కోర్టు కసబ్‌ను దోషిగా తేల్చి అతనికి మరణశిక్ష విధించింది. 2012, నవంబర్ 21న కసబ్‌ను పుణెలోని యెరవాడ జైలులో ఉరి తీశారు.

ఫొటో సోర్స్, SEBASTIAN D'SOUZA

ఫొటో క్యాప్షన్,

సెబాస్టియన్ డిసౌజా

బుల్లెట్ల వర్షం

కసబ్‌ను ఉరితీసి ఆరేళ్లు గడిచిపోయాయి. కానీ కసబ్ జీవించి ఉన్నపుడు కానీ, అతను స్టేషన్లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నపుడు కానీ డిసౌజా అతణ్ని చూసి భయపడలేదు.

''ఫొటోలు తీసేప్పుడు నేను ఒక్క క్షణం కూడా భయపడలేదు. ఒక్కసారి మనం ఆందోళనకు గురైతే సంఘటనా స్థలం నుంచి పారిపోతాం. అలా చాలా మంది జర్నలిస్టులు అక్కడి నుంచి పారిపోయారు.'' అని డిసౌజా తెలిపారు.

అయితే ఆయన కుటుంబం మాత్రం చాలా భయపడింది.

''నేను అక్కడ ఉన్నానన్న విషయం తెలిసి నా భార్య రోజీ రాత్రంతా నిద్ర పోలేదు. దానికి తోడు ఉగ్రవాదులను నేనున్న ప్రదేశం తెలీకూడదని నా ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెట్టాను.'' అని డిసౌజా తెలిపారు.

బహుశా ఏళ్ల తరబడి అల్లర్లు, ప్రమాదకర పరిస్థితుల మధ్య ఫొటోలు తీయడం వల్ల ఆయనకు ఆ నిర్భయతత్వం అలవడి ఉండొచ్చు.

ఫొటో సోర్స్, SEBASTIAN D'SOUZA

ఈ ఫొటో కూడా సెబాస్టియన్ తీసిందే

2002లో గుజరాత్‌లోని పలు నగరాలలో మతఘర్షణలు జరిగినప్పుడు, డిసౌజా ఎఎఫ్‌పీ వార్తాసంస్థ తరపున పని చేసేవారు. ఆ సందర్భంగా కత్తి పట్టుకున్న వ్యక్తి ఫొటో ఒకటి గుజరాత్ అల్లర్లకు పర్యాయపదంగా మారింది.

''దానిని నేను 300 ఎంఎం లెన్స్‌తో తీశాను. చాలా మంది అతను ఫొటో కోసం ఫోజిచ్చాడని భావించారు. కానీ నిజానికది దాడి చేయడానికి వెళుతున్నపుడు తీసిన ఫొటో'' అని డిసౌజా వివరించారు.

సరైన సమయంలో సంఘటనా స్థలంలో ఉండడం జర్నలిస్టులకు ముఖ్యం అని డిసౌజా అంటారు.

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఫొటోలు తీసేస్తున్నారు. వాళ్లకు ఆయన ఇలా సూచన ఇచ్చారు. ''ఓపిక పట్టండి. ఎప్పుడూ తొందర పడవద్దు. మీరే మీకు న్యాయనిర్ణేతగా ఉండండి. పరిస్థితిని అంచనా వేసి, అప్పుడు ఫొటో తీయండి.''

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)