సుజనా చౌదరికి ఈడీ నోటీసులు - ప్రెస్ రివ్యూ

  • 25 నవంబర్ 2018
సుజనా చౌదరి Image copyright yschowdary/fb
చిత్రం శీర్షిక సుజనా చౌదరి (పాత చిత్రం)

టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి చెందిన సంస్థలు బ్యాంకులను మోసం చేశాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించిందంటూ ఈనాడు కథనం రాసింది. దాని ప్రకారం..

బ్యాంకుల ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదులో భాగంగానే ఆ సంస్థకు చెందిన ఎనిమిది ప్రాంగణాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. తదుపరి విచారణ కోసం ఈ నెల 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి సమన్లు జారీ చేసినట్లు వెల్లడించింది.

ఈ మేరకు శనివారం ఈడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

సుజనా గ్రూపులకు చెందిన సంస్థల్లో సోదాలు సాగించిన ఈడీ అధికారులు.. డొల్ల కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసిన ఆరు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకొన్నారు.

సుజనా గ్రూప్‌ సంస్థలపై ఫెమా, డీఆర్‌ఐ, సీబీఐ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 120 సంస్థల పేర్లతో నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారని, అందులో చాలా మటుకు సంస్థలు మనుగడలో లేవని తెలిపారు.

Image copyright Getty Images

పుస్తకం చూస్తూ పరీక్షలు రాయొచ్చు!

ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో నైపుణ్యతను పెంచడమే లక్ష్యంగా పరీక్షల విధానంలో ఏఐసీటీఈ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న పరీక్షా విధానానికి స్వస్తి పలికి 'ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌' విధానానికి ఆమోదం తెలిపిందని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం ప్రచురించింది.

కొత్త విధానంతో విద్యార్థులు ఇకపై పుస్తకం చూసుకుంటూనే పరీక్షలు రాయొచ్చు. పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ఏఐసీటీఈ నియమించిన కమిటీ సిఫార్సు మేరకు ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది.

2019-20 విద్యా సంవత్సరం నుంచి నూతన విధానాన్ని అమలు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేసుకోవాలని దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది.

సుమారు 60 శాతం మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు ప్రస్తుతం బట్టీ విధానాన్నే నమ్ముతున్నారు. పరీక్షలకు కొద్ది రోజుల ముందు చదివి.. పరీక్షలు రాస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో నైపుణ్యతలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై జవాబులను చదివి రాయకుండా అప్లికేషన్‌ విధానంలో చేసేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీంవర్క్‌, సెమినార్లు, క్విజ్‌లు కూడా ఉండనున్నాయి. ఫలితంగా విద్యార్థులు బట్టీ చదువులకు స్వస్తి పలికే అవకాశం ఉందని భావిస్తోంది.

విద్యార్థులు ఫార్ములాలు, జవాబులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గుతుందని, జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఉం డదు. పరీక్షల సమయంలో విద్యార్థి పూర్తిగా తన స్వశక్తిని నమ్ముకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరిగి.. నైపుణ్యం సాధించే అవకాశం ఉంటుందని ఎన్‌ఐటీ వరంగల్‌ డైరెక్టర్‌ ఎన్‌వీ రమణారావు అభిప్రాయపడ్డారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright Getty Images

షోరూముల్లోనే రిజిస్ట్రేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో కార్లు, బైకుల్లాంటి రవాణేతర (నాన్‌ట్రాన్స్‌పోర్టు) వాహనాల రిజిస్ట్రేషన్లను ఇకనుంచి డీలర్లవద్దే నిర్వహించనున్నారని 'నమస్తే తెలంగాణ' ఓ కథనం ప్రచురించింది.

ఏజెంట్ల మోసాలను, అవినీతిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్లకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో తెలంగాణలో రవాణేతర వాహనాల రిజస్ట్రేషన్లను డీలర్లవద్దే నిర్వహించాలని రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి తాజాగా జీవో జారీచేశారు.

విధివిధానాలను రూపొందించి త్వరలో డీలర్లకు రిజిస్ట్రేషన్ అధికారాన్ని అప్పగించనున్నట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ విధానం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో స్పష్టంచేయలేదు.

ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగ సంఘాలతో కమిటీని నియమించి మార్గదర్శకాలకు తుదిరూపం ఇవ్వనున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను కూడా డీలర్లే అమర్చాల్సి ఉంటుంది. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుండా కొత్త వాహనం బయటికి వస్తే డీలర్లకు భారీగా జరిమానా విధించనున్నారని నమస్తే తెలంగాణ వివరించింది.

Image copyright ALHAJAKBARUDDINOWAISI/fb
చిత్రం శీర్షిక ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ

'నేను కింగ్ కాదు... కింగ్ మేకర్‌ను'

రాష్ట్రంలో ఏ సీఎం అయినా తన చెప్పుచేతల్లోనే ఉంటారని చాంద్రాయణగుట్ట ఎం ఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సాక్షి రాసింది.

అక్బరుద్దీన్‌ శుక్రవారం రాత్రి పాతబస్తీలోని రియాసత్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభ సందర్భంగా మాజీ సీఎంలపై ఈ వ్యాఖ్య లు చేశారు. మజ్లిస్‌ పార్టీ రాబోయే ప్రభుత్వం ఏర్పాటులో కింగ్‌ మేకర్‌ అని అభివర్ణించుకున్నారు.

ఏ పార్టీ సీఎం అయినా తమ ముందు వంగి సలాం కొట్టినవారేనని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్సార్, ఏపీ సీఎం చంద్రబాబు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు, ప్రస్తుతం కేసీఆర్‌ అందరూ తమ మాటలను విన్నారనీ.. కాదు వినాల్సిందే అని అన్నారు.

అందరినీ బ్యాలెన్స్‌ చేసే శక్తి తమ వద్ద ఉందనీ, అది తమకు బాగా తెలుసన్నా రు. తాను కింగ్‌ మేకర్‌ననీ, ఎవరిని సింహాసనంపై కూర్చోబెట్టాలో ఎవరిని దించాలో తెలుసనీ ఆ సత్తా తమకు ఉందన్నారు. రాబోయే ప్రభుత్వం తమ ద్వారానే అధికారంలోకి వస్తుందని, డిసెంబర్‌ 11 ఎన్నికల తరువాత సీఎంను నిర్ణయించే క్రమంలో తమ పార్టీ కీలకంగా మారనుందన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు