26/11 ముంబయి దాడులు: కసబ్‌కు ఉరిశిక్ష విధించడంలో ముఖ్య సాక్షి అరుణ్ జాదవ్.. ‘ఆ మారణకాండ నుంచి నేనెలా బైటపడ్డానంటే..’
- సౌతిక్ బిస్వాస్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Kanaggi Khanna
టయోటా ఎస్‌యూవీలో అలుముకున్న గాలి మొత్తం గంధకం పౌడర్, రక్తపు వాసనతో నిండిపోయింది.
నొక్కుకుపోయిన వెనుక సీట్లో హెడ్ కానిస్టేబుల్ అరుణ్ జాదవ్ తన కుడి చేతికి, ఎడమ భుజానికి అయిన తూటా గాయాల నుంచి రక్తం కారుతుండగా నిస్సహాయంగా సీట్లో పడి ఉన్నారు.
ఇద్దరు గన్మెన్లు ఏకే-47లతో వెనకాల సీట్లో ఉన్నవాళ్ల పోలీసులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో ఇద్దరు మరణించగా, ఒకరు కొనవూపిరితో ఉన్నారు. వాళ్ల ముగ్గురి శరీరాలు అతనిపై పడి ఉన్నాయి.
మధ్య సీటులో కూర్చున్న సిటీ యాంటీ టెర్రర్ యూనిట్ ఇన్ఛార్జ్ ఛాతీలో బులెట్ దిగడంతో మరణించారు.
ముందు సీట్లో ఉన్న ఒక పోలీసు అధికారి, మరో ఇన్స్పెక్టర్ కూడా గుళ్ల బారిన పడి మరణించారు.
నగరంలోని గ్యాంగ్స్టర్లకు సింహస్వప్నంగా భావించే సీనియర్ ఇన్స్పెక్టర్ స్టీరింగ్ వీల్ మీద నిర్జీవంగా పడి ఉన్నారు.
ఫొటో సోర్స్, AFP
26/11: దాడి జరిగిన ప్రదేశాలలో తాజ్ హోటల్ ఒకటి
అది 2008, నవంబర్ 26. భారతదేశ ఆర్థిక, వినోద కేంద్రంపై కనీవినీ ఎరుగని రీతిలో ఉగ్రవాద దాడి జరుగుతోంది.
భారీగా ఆయుధాలు ధరించిన పది మంది పాకిస్తానీ జాతీయులు సముద్రమార్గం గుండా దేశంలో ప్రవేశించి, బృందాలుగా విడిపోయారు. వాహనాలను హైజాక్ చేసి.. ఒక ప్రధాన రైల్వే స్టేషన్, రెండు లగ్జరీ హోటళ్లు, ఒక యూదు సాంస్కృతిక కేంద్రం, ఒక ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు.
60 గంటల పాటు కొనసాగిన ఆ మారణహోమంలో 166 మంది మరణించారు.
గన్మెన్లు ఒక ఆసుపత్రిపై దాడి చేశారన్న వార్తను తెలుసుకున్న జాదవ్, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి వాళ్లను ఎదుర్కోవడానికి తెల్లని ఎస్‌యూవీలో బయలుదేరారు.
పోలీసులు ఆసుపత్రిలోకి ప్రవేశించడంతోనే, ఆసుపత్రి వెనకాల ఉన్న సందులో దాక్కుని ఉన్న మొహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ వాళ్లపై దాడి చేశారు. వెనకాల కూర్చున్న జాదవ్ మాత్రమే వాళ్ల దాడి నుంచి తప్పించుకున్నారు.
వాహనంపై దాడి తర్వాత పోలీసుల నుంచి కాల్పులు ఆగిపోవడంతో వాళ్లు ఎస్యూవీ వద్దకు వచ్చారు. ముందున్న ముగ్గురు, మధ్య సీటులో ఉన్న పోలీసు అధికారుల మృతదేహాలను కిందికి లాగి పడేశారు.
ఒక్క అధికారి మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడంటూ వారిద్దరిలో ఒకరు జోక్ చేశారు. వెనకాల ఉన్న మిగతా పోలీసులను కూడా బైటికి లాగేయాలని వాళ్లు ఎస్యూవీ వెనుక భాగానికి వచ్చారు కానీ, తలుపు తెరవలేకపోయారు.
వెనకాల నాలుగు శవాలు ఉన్నాయనుకుని కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఫొటో సోర్స్, Sabasttian D'Souza
శవాల కింద పడి బతికిపోయారు
నిజానికి వాళ్లలో ఇద్దరు మాత్రమే మరణించారు. ఒకరు జీవించే ఉన్నారు. మరొకరు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. హఠాత్తుగా కొనప్రాణాలతో ఉన్న యోగేష్ పాటిల్ జేబులోని మొబైల్ ఫోన్ రింగ్ కావడం ప్రారంభించింది.
దీంతో డ్రైవర్ సీటులో ఉన్న కసబ్ వెనక్కి తిరిగి మళ్లీ కాల్పులు జరిపాడు. దాంతో యోగేష్ పాటిల్ ఊపిరి కూడా ఆగిపోయింది. శవాల కింద, రక్తపు మడుగులో జాదవ్ మాత్రమే జీవించి ఉన్నారు.
''కసబ్ తన తుపాకీని కొంచెం తిప్పి ఉంటే చాలు, నా ప్రాణాలు కూడా పోయేవి'' అన్నారు జాదవ్.
చావుగా దగ్గరగా వెళ్లి వచ్చిన వాళ్లు.. తమకు శరీరం నుంచి విడిపోయిన భావన కలుగుతుందని, కన్నుల ముందు ఒక గుహ చివరన వెలుతురు కనిపిస్తుందని చెబుతారు. కానీ ముంబైలో నేరాలను అరికట్టడంలో భాగంగా చాలా గాయాలు తగిలిన జాదవ్ మాత్రం అలాంటి అనుభవమేమీ తనకు కలగలేదన్నారు.
ఆ సమయంలో ఆయనకు కేవలం తన కుటుంబసభ్యులే గుర్తుకు వచ్చారు. తనకు మరణం ఆసన్నమైందని జాదవ్ అనుకున్నారు.
కింద పడి ఉన్న తన ఆటోమాటిక్ రైఫిల్ అందుకోవడానికి ప్రయత్నించారు కానీ గాయపడిన చేయి అందుకు సహకరించలేదు. వచ్చే ముందు తన 9 ఎంఎం పిస్టల్‌ను తన సహచరునికి ఇచ్చి వచ్చినందుకు ఆయన ఆ క్షణంలో తనను తాను తిట్టుకున్నారు.
''నా చేతిలో ఆ పిస్టల్ ఉంటే వెనుక నుంచి చాలా సులభంగా ఆ ఇద్దరు గన్మెన్లను కాల్చేసి ఉందును'' అన్నారు జాదవ్.
ఫొటో సోర్స్, Kanaggi Khanna
కారు పంక్చర్ కావడంతో..
ఆ తర్వాత కసబ్, ఇస్మాయిల్ ఖాన్లు ఆ వాహనంలో తమ ఇష్టం వచ్చినట్లు తిరిగారు. ఒక సెంటర్ వద్ద రోడ్డు పక్కనే నిలబడి చూస్తున్న వాళ్లపై కాల్పులు జరిపారు. అలా వెళుతుండగా, పోలీసులు వాళ్ల వాహనంపై కాల్పులు జరపడంతో అది వెనుక టైరుకు తగిలింది.
సుమారు 20 నిమిషాల పాటు అలా తిరిగాక పంక్చరైన టైరు సహకరించకపోవడంతో వాళ్లు దాన్ని వదిలేసి మరో స్కోడా సెడాన్‌ను ఆపారు. దానిలోని ముగ్గురు వ్యక్తులను తుపాకులతో బెదిరించి, సముద్రం పక్కనున్న విశాలమైన రోడ్డువైపు దూసుకుపోయారు.
వెళ్లే సమయంలో వాళ్లకు ఓ పోలీస్ చెక్ పాయింట్ తారసపడింది. అక్కడ పోలీసులతో జరిగిన ఎదురుకాల్పులలో ఒక పోలీసు, ఇస్మాయిల్ మరణించారు.
''నేను చచ్చిపోయినట్లు నటిస్తూ, వెనుక నుంచి వాళ్లను గమనిస్తూ ఉన్నాను'' అని జాదవ్ తెలిపారు.
కసబ్, ఇస్మాయిల్ పోలీసు వాహనాన్ని వదిలివెళ్లిపోయాక ఆయన వైర్లెస్ సెట్లో తన పరిస్థితిని వివరించారు. దాంతో మరికొంచెం సేపటికే ఆంబులెన్స్ వచ్చి ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లింది.
ఫొటో సోర్స్, Getty Images
ఏడు నెలల తర్వాత డ్యూటీకి
పోలీసు వాహనంలో చనిపోయిన వాళ్లలో ముగ్గురు నగరంలోని ప్రముఖ పోలీసు అధికారులున్నారు. వారిలో ఒకరు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే. మిగిలిన ఇద్దరు.. అడిషనల్ కమిషనర్ అశోక్ కామ్టే, ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్. 1988లో పోలీసు సర్వీసులో చేరిన జాదవ్ అంచెలంచెలుగా ఎదిగి నగరంలోని గ్యాంగ్స్టర్లను ఏరివేసే సలాస్కర్ బృందంలో చోటు సంపాదించుకున్నారు.
దాడి జరిగిన రోజు రాత్రి జాదవ్ ఇంటి వద్ద అతని భార్య, ముగ్గురు పిల్లలు రాత్రంతా ముంబైలో జరుగుతున్న దాడులను టీవీ ద్వారా చూస్తూనే ఉన్నారు. ఎక్కడైనా కాల్పులు జరిగాయన్న వార్త టీవీలో రాగానే వాళ్లు జాదవ్ కోసం ప్రార్థనలు చేశారు.
మరుసటి రోజు ఉదయం జాదవ్ ఆసుపత్రి నుంచి తన భార్యతో ఫోన్లో క్లుప్తంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆయనను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి చేయి, భుజం నుంచి ఐదు బులెట్లు తొలగించారు. అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లకు ఆయన షాక్‌కు లోను కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఏడు నెలల తర్వాత ఆయన తిరిగి డ్యూటీకి వెళ్లారు.
ఫొటో సోర్స్, Kanaggi Khanna
జాదవ్ ఇప్పుడు ముంబైలోని ఓ చిన్న అపార్ట్మెంటులో నివసిస్తున్నారు
ఇప్పటికీ గ్యాంగ్స్టర్లను ఏరేస్తూనే ఉన్నారు
కసబ్‌కు శిక్ష విధించేందుకు జాదవ్ ముఖ్యమైన సాక్ష్యంగా మారారు. జడ్జీలకు పోలీసు వాహనంలో జరిగిన సంఘటనలను జాదవ్ పూసగుచ్చినట్లు వివరించారు.
2010, మేలో కసబ్‌కు మరణశిక్ష విధించారు. ఆ తర్వాత మరో రెండేళ్లకు పుణెలోని యెరవాడ జైలులో దానిని అమలు చేశారు.
జాదవ్ చూపిన ధైర్యసాహసాలకు అతనికి శౌర్యసాహసాలకు ఇచ్చే పురస్కారం లభించింది. ఆయన పెద్ద కూతురికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. మరో ఇద్దరు పిల్లలు ఇప్పుడు కాలేజీలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు.
పదేళ్ల తర్వాత జాదవ్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. 51 ఏళ్ల జాదవ్ ఇప్పటికీ గ్యాంగ్స్టర్లను, బెదిరించి డబ్బు దోచుకునే వాళ్లను వెంటాడుతూనే ఉన్నారు.
రెండుసార్లు సర్జరీ అనంతరం ''ఇక్కడ ఇంకా నొప్పిగా ఉంది'' అని సరిగా పని చేయని తన చేతిని చూపారు.
అమితాబ్ బచ్చన్, 26/11 దాడుల నుంచి బైట పడినవారి పోస్టర్
ముంబై అంతటా జాదవ్ ఫొటోలు
ఇప్పుడు ఆయన తాను బయట ఏ ఆపరేషన్‌కు వెళ్లినా భార్యకు తరచు ఫోన్ చేస్తుంటారు.
ముంబై దాడులు జరిగి దశాబ్ద కాలం గడిచిన సందర్భంగా ఈ రోజు గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలోని తాజ్ హోటల్ వద్ద జాదవ్ ఇంటర్వ్యూను ప్రసారం చేయనున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. జాదవ్, ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడ్డ మరో ఇద్దరితో కలిసి దిగిన చిత్రాలు ముంబై అంతటా వేలాడుతున్నాయి.
అయితే ఆ హడావుడికి దూరంగా ఆయన తన కుటుంబంతో కలిసి ఉత్తర భారతదేశంలో ఓ ఆధ్యాత్మిక ఆశ్రమానికి వెళ్లారు.
''అలాంటి సంఘటన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండడం చాలా కష్టం. ఒకోసారి రాత్రిళ్లు మెలకువ వస్తే మళ్లీ నిద్ర పట్టదు. ఆనాటి సంఘటనలు మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తుంటాయి'' అని జాదవ్ తెలిపారు.
''ఆ మారణకాండ నుంచి నేనెలా బైటపడ్డానని ఒకోసారి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది కేవలం అదృష్టమా? లేక విధి చేసిన వింతా? బహుశా నాకెప్పటికీ తెలీదేమో.''
ఇవి కూడా చదవండి
- సూపర్ ఎర్త్: సమీప నక్షత్రం పరిధిలో మరో భూగ్రహం
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- తెలంగాణ ఎన్నికలు 2018: మీ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరో తెలుసుకోండి
- అయోధ్యలో ఉద్ధవ్ థాకరే: 'రామ మందిరం కట్టకపోతే, ప్రభుత్వం కూడా ఉండదు'
- రూ.50 వేలిస్తే వర్షాలు కురిపిస్తానన్న వ్యక్తి.. ఆయన సేవలు ఉపయోగించుకోవాలంటూ విజయనగరం కలెక్టర్ సిఫారసు
- సెంటినలీస్ ఎవరు? వారి వద్దకు వెళితే బాణాలు వేసి ఎందుకు చంపేస్తారు?
- మోస్ట్‌వాంటెడ్ హాఫిజ్ సయీద్ బ్రిటన్‌లోనూ జిహాద్ ప్రచారం చేశారు
- ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడేం చేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)