కోల్‌కతా: రోడ్డుపై ఉమ్మేస్తే రూ.లక్ష జరిమానా- ప్రెస్ రివ్యూ

  • 26 నవంబర్ 2018
మమతా బెనర్జీ Image copyright Getty Images

పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో రోడ్డుపై చెత్తవేయడం, ఉమ్మేయడం లాంటివి చేస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించనున్నారని ఈనాడు తెలిపింది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్తగా ప్రారంభించిన దక్షిణేశ్వర్‌ ఆకాశవంతెనను ఇటీవల పరిశీలించారు. దానిపై ఎక్కడపడితే అక్కడ చెత్తపేరుకుపోవడం, పాన్‌ మరకలు ఉండడం గమనించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం జరిమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, ఉమ్మేయడం లాంటివి చేస్తే జరిమానా కనిష్ఠంగా రూ.50గా, గరిష్ఠంగా రూ.5 వేలుగా ఉండేది. కనిష్ఠ జరిమానాను రూ.5000కు, గరిష్ఠ జరిమానాను రూ. లక్షకు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

కొత్త నిబంధనలు అమలు చేసేందుకు 11 మంది సభ్యులతో ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. కోల్‌కతాను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ కమిటీ అన్ని చర్యలూ తీసుకుంటుంది.

Image copyright Facebook/Uttam Kumar Reddy

ఓటమి వణుకుతోనే కేసీఆర్ ఆరోపణలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజాకూటమి ప్రభంజనం ధాటికి ఓడిపోతామనే వణుకుపుట్టి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇష్టానుసారంగా ఆరోపణలకు దిగుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారని ఈనాడు రాసింది.

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకున్నవేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

''అభివృద్ధి పథకాల అమలుకు అడ్డుపడుతున్నామని ఆరోపిస్తున్నారు.. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నామా? మైనారిటీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల అమలును ఆపామా? దళితులకు మూడెకరాల భూపంపిణీని అడ్డుకున్నామా'' అని ఉత్తమ్ ప్రశ్నించారు.

1,200 మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే.. పరిపాలన చేతకాక ఫాంహౌస్‌కే పరిమితమైన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నిలిచిపోతారని ఆయన విమర్శించారు.

ఉత్తమ్ సూర్యాపేట జిల్లాలోని సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో ఆదివారం ప్రచారం నిర్వహించారు.

నాలుగున్నరేళ్లుగా కేసీఆర్‌ అన్ని వర్గాలనూ మోసం చేశారని, తమ ప్రభుత్వం బాధితులకు మద్దతుగా నిలుస్తుందని ఉత్తమ్ ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన పథకాలన్నీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమల్లోకి తెస్తామని స్పష్టంచేశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జస్టిస్ చలమేశ్వర్

ప్రధాన న్యాయమూర్తులను ప్రశ్నించొద్దా: జస్టిస్ చలమేశ్వర్

ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను సాధారణ పౌరులు సైతం ప్రశ్నిస్తున్నప్పుడు.. 'మమ్మల్నెవరూ ప్రశ్నించజాలరు' అని ప్రధాన న్యాయమూర్తులు అనుకోవడం తనకు ఇప్పటికీ అర్థం కాని విషయమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారని సాక్షి తెలిపింది.

''వాళ్లు(ప్రధాన న్యాయమూర్తులు) ఎందుకు అతీతులుగా ఉండాలి'' అని ఆయన ఆదివారం విజయవాడలో ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన 'నవ్యాంధ్రతో నా నడక' పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ- సుప్రీంకోర్టులో కూడా జవాబుదారీతనం కోసమే తాను కొలీజియం గురించి ప్రశ్నించానన్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే నిర్ణయం తీసుకోవడం కంటే ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకోవడం కొంచెం నయమని ఆయన పేర్కొన్నారు.

''విభజనకు సంబంధించిన అంశాలు, లోపభూయిష్టమైన విభజన చట్టం, అందులోని సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇప్పటికీ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి'' అనే విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించానని ఐవైఆర్ చెప్పారు. ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఉన్న భేదాభిప్రాయాలను కూడా ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు.

Image copyright Getty Images

దేశంలో కొత్తగా 65 వేల పెట్రోలు బంకులు

దేశవ్యాప్తంగా 65 వేలకు పైగా కొత్త పెట్రోల్‌ పంపుల ఏర్పాటుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీ) ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్తాన్‌ పెట్రోలియం సన్నాహాలు ప్రారంభించాయని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఎన్నికల నియమావళి కారణంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలను మినహాయించి, మిగతా అన్ని రాష్ర్టాల్లో కలిపి 55,649 పెట్రోల్‌ పంపుల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ మూడు ఓఎంసీలు ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం మిగతా ఐదు రాష్ర్టాల్లోనూ సుమారు 10 వేల పెట్రోల్‌ పంపుల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.

నాలుగేళ్ల కాలంలో ఇంత భారీ మొత్తంలో పెట్రోల్‌ పంపుల ఏర్పాటుకు ఓఎంసీలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం ఇదే ప్రథమం.

ఐఓసీకి దేశవ్యాప్తంగా ప్రస్తుతం 27,377 పెట్రోల్‌ పంపులున్నాయి. కొత్తగా 26,982 పెట్రోల్‌ పంపుల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత్‌ పెట్రోలియంకు ప్రస్తుతం 14,592 పెట్రోల్‌ పంపులుండగా అదనంగా 15,802 పంపులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. హిందుస్తాన్‌ పెట్రోలియంకు ప్రస్తుతం 12,865 పెట్రోల్‌ పంపులుండగా కొత్తగా 15,287 పంపుల ఏర్పాటు కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)