వర్గీస్ కురియన్: శ్వేత విప్లవ పితామహుడు అమూల్ ఖాతాల నుంచి మతమార్పిడులకు క్రైస్తవ మిషనరీలకు నిధులు అందించారా?

ఫొటో సోర్స్, Getty Images
వర్గీస్ కురియన్. ఆయన జీవించి ఉంటే ఈరోజు 97 ఏట అడుగుపెట్టుండేవారు. కానీ భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడైన ఆయన చనిపోయిన ఆరేళ్ల తర్వాత కురియన్ పేరు మరోసారి చర్చల్లోకి వచ్చింది.
నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బీజేపీ నేత దిలీప్ సంఘానీ శనివారం అమ్రేలీలో జరిగిన ఒక కార్యక్రమంలో కురియన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
"వర్గీస్ కురియన్ అమూల్ డబ్బు నుంచి గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో మతమార్పిడుల కోసం నిధులు అందించేవార"ని దిలీప్ సంఘానీ అన్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఒక కథనం ప్రచురించింది.
అయితే బీబీసీ ప్రతినిధి అనంత్ ప్రకాశ్‌తో మాట్లాడిన దిలీప్ సంఘానీ అమ్రేలీలోని అమర్ డెయిరీలో తను అన్న మాటల్లో ఆఖరి వాక్యాన్ని ముక్కలు చేసి చూపిస్తున్నారని ఆరోపించారు.
"నేను ఆయన్ను గౌరవిస్తాను. ఆయన సమర్థత గురించి నేను చెప్పాల్సిందేం లేదు. కానీ గుజరాత్ డాంగ్ జిల్లాలో శబరీధామ్ నిర్మించిన వారు చందాల కోసం ఆయన దగ్గరకు వెళ్లినపుడు కురియన్ మాకు ఇలాంటి వాటిపై విశ్వాసం లేదని తిరస్కరించారు. కానీ అదే సమయంలో తన పదవీకాలంలోనే ఆయన క్రైస్తవ సంస్థలకు చందాలు ఇచ్చారు" అన్నారు.
బీజేపీ నేత తన వ్యాఖ్యను సమర్థించుకున్నారు. అయితే దిలీప్ సంఘానీ వ్యాఖ్యలపై అమూల్ వైపు నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
ఫొటో సోర్స్, Getty Images
వర్గీస్ కురియన్ ఎవరు?
కేరళలో జన్మించిన వర్గీస్ కురియన్ సహకార డెయిరీ అభివృద్ధి కోసం గుజరాత్ ఆనంద్‌లో ఒక విజయవంతమైన మోడల్‌ను స్థాపించారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా నిలిపారు.
కురియన్ 1973లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) స్థాపించారు. 34 ఏళ్ల వరకు దానికి అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ జీసీఎంఎంఎఫ్ సంస్థే తర్వాత అమూల్ పేరుతో డెయిరీ ఉత్పత్తుల సంస్థగా మారింది.
ఈ సంస్థలో 11 వేల గ్రామాల్లో 20 లక్షల మందికి పైగా రైతులు సభ్యులుగా ఉన్నారు. సహకార రంగంలో పాలు, ఇతర ఉత్పత్తుల తయారీలో ఇది కొత్త చరిత్రను లిఖించింది.
కురియన్ జీవితకాలంలో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలతో గౌరవించింది. 1965లో కురియన్ రామన్ మెగసెసే అవార్డు కూడా అందుకున్నారు.
వర్గీస్ కురియన్ ఆనంద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్(ఐఆర్ఎంఎ) అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆయనను 'భారతదేశ మిల్క్‌మ్యాన్' అని పిలుచుకుంటారు.
ఒకప్పుడు భారతదేశంలో పాల లోటు ఏర్పడింది. దాంతో, పాల ఉత్పత్తిలో దేశం స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా కురియన్ నేతృత్వంలో చర్యలు ప్రారంభమయ్యాయి. 90వ దశకంలోకి అడుగుపెట్టగానే భారత్ పాల ఉత్పత్తిలో అమెరికాను కూడా వెనక్కు నెట్టిందని చెబుతారు.
ఫొటో సోర్స్, DILEEPSANGHANI.COM/BBC
దిలీప్ సంఘానీ
చందాల వివాదం
కానీ క్రైస్తవ సంస్థలకు చందా ఇచ్చారని వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత వర్గీస్ కురియన్ ఉద్దేశంపైనే ప్రశ్నలు లేవనెత్తారు.
అయితే చందా ఇవ్వడం అనేది ఏదైనా ఒక సంస్థకు ప్రత్యేక హక్కు అవుతుందా?
"హిందూ సంస్థ శబరీధామ్ చందా ఇవ్వాలని ఆయన్ను చాలా వేడుకుంది. కానీ వర్గీస్ కురియన్ మాకు అలాంటివాటిపై విశ్వాసం లేదని చెప్పేశారు. ఆయన ఎవరికీ చందా ఇచ్చుండకూడదు. ఒకరికి ఇచ్చి, ఇంకొకరికి ఇవ్వకపోవడం చేసుండకూడదు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయి" అని సంఘానీ తెలిపారు.
మంత్రిగా ఉన్నప్పుడు ఈ అంశంపై సంఘానీ ఏం చేశారు?
"మేం దీనిపై విచారణ చేయించాం. మా విచారణలో ఆయన శబరీధామ్ కోసం చందా ఇవ్వడానికి నిరాకరించారని తెలిసింది. కానీ క్రిస్టియన్ మిషనరీస్‌కు మాత్రం చందా ఇచ్చారు. అయితే ఇందులో ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు. ఇలాంటి వాటి వల్ల కొందరి మనస్తత్వాలు తెలుస్తాయి.
ఫొటో సోర్స్, Getty Images
వర్గీస్ కురియన్
చారిత్రక రాజీనామా
వర్గీస్ కురియన్ తప్పుడు పద్ధతుల్లో 15 ఏళ్ల వరకూ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా ఉన్నారని కూడా బీజేపీ నేత ఆరోపించారు.
2006లో ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో కురియన్ అమూల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు చెందిన సభ్యుల సహకార సమితుల విశ్వాసాన్ని కోల్పోవడంతో తను రాజీనామా చేసినట్టు అప్పట్లో కురియన్ బీబీసీకి చెప్పారు.
వర్గీస్ కురియన్‌కు వ్యతిరేకంగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్లో అవిశ్వాసం తీసుకొచ్చారు. సంస్థ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆయన నింపిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ రద్దు చేశారు.
ఇవి కూడా చదవండి:
- 1970ల్లో బ్రిటన్ను కుదిపేసిన భారత సంతతి మహిళల పోరాటం
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- అడాల్ఫ్ హిట్లర్ - ఓ యూదు చిన్నారి: ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన స్నేహం
- సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో నో ఎంట్రీ... దీని పర్యవసానాలేమిటి?
- సింగర్ బేబీ: రెహమాన్ మెచ్చిన ఈ కోయిల పాట ఇలా మొదలైంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)