అయోధ్య: నిజంగానే ఆదివారం కాషాయ రంగులో మునిగి తేలిందా? - ఫేక్ న్యూస్ అలెర్ట్

  • 26 నవంబర్ 2018
అయోధ్య Image copyright SocialMedia

సాధువులు, మితవాద ఉద్యమకారులకు తోడు వేలాది హిందువులు రామమందిర నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు అయోధ్య చేరుకున్నారు.

అనేక మితవాద సోషల్ మీడియా పేజీల్లో ఆ కార్యక్రమం గురించి భారీగా ప్రచారం చేశారు. ఆదివారం నాడు వేలాది ప్రజలు అయోధ్య చేరుకుంటారని వాటిలో కొన్ని పేజీలు ప్రచారం చేశాయి.

ఆ కార్యక్రమం ముగిసిన మరుసటి రోజు సోషల్ మీడియాలో అయోధ్యకు సంబంధించినవిగా చెబుతూ అనేక ఫొటోలు కనిపించాయి. నగరంలో అనేక ప్రాంతాల్లో కాషాయ దుస్తులు ధరించిన వందలాది ప్రజలు ఆ ఫొటోల్లో ఉన్నట్లుగా చూపారు.

కానీ, అందులో చాలా ఫొటోలు నకిలీవని మా పరిశోధనలో తేలింది.

ఉదాహరణకు వేలాదిమంది ఉన్న పై ఫొటో అయోధ్యకు చెందినదిగా ప్రచారంలో ఉంది. కానీ, నిజానికి అది 2017 ఆగస్టు నాటి ఫొటో. ముంబయిలో నిర్వహించిన మరాఠా క్రాంతి మోర్చా కార్యక్రమంలో భాగంగా వేలాది మరాఠీ ప్రజలు రిజర్వేషన్‌ను, సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ మౌనంగా బైకుల్లా జూ నుంచి ఆజాద్ మైదానం దాకా పాదయాత్ర నిర్వహించారు.

ప్రభుత్వంతో చర్చలు జరిగాక ఆ నిరసన ముగిసింది.

Image copyright SocialMedia

పైన ఉన్న ఫొటో కర్ణాటకలో నిర్వహించిన భజరంగ్ దల్ కార్యక్రమానికి సంబంధించినది. ప్రజల చేతిలోని ప్లకార్డుల్లో కన్నడ లిపి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇలాంటి ఎన్నో ఫొటోలను ఆదివారంనాడు అయోధ్యలో జరిగిన కార్యక్రమానివిగా చెబుతూ ప్రచారం చేస్తున్నారు.

అయోధ్య రాముడి జన్మ స్థలం అని హిందువులు విశ్వసిస్తారు. తాము అనేక తరాలుగా అక్కడ ప్రార్థనలు చేస్తున్నామని ముస్లింలు అంటారు. 1992లో బాబ్రీ మసీదును హిందువుల మూక కూల్చేశాక రెండు వర్గాల మధ్య అనిశ్చితి నెలకొంది.

Image copyright SocialMedia

ఆ తరువాత దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో 2వేలమంది దాకా చనిపోయారు.

రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు తోడు సాధారణ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో అక్కడ రామమందిరాన్ని నిర్మించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ప్రస్తుతం అయోధ్య వివాదానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఎన్నికలు దగ్గరపడటంతో కొందరు నేతలు రామమందిర నిర్మాణానికి అనుగుణంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరుతున్నారు.

(ఏక్తా న్యూస్ సౌజన్యంతో రాసిన కథనం)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)