దక్షిణ తెలంగాణలో ఆగని వలసలు.. ముంబైలోని కుర్లాలోనూ ప్రచారం : తెలంగాణ ఎన్నికలు 2018

  • 27 నవంబర్ 2018
ఉత్తర తెలంగాణ, వలసలు

"ఈ పిల్లలు దిక్కు లేని పిల్లల్లా పెరుగుతున్నారు. అమ్మానాన్న ఉండి, ఇంత బువ్వ పెడితే, తిని హాయిగా ఉండేవారు. ఇప్పుడు ఈ పిల్లలు మా మాట వినక వాళ్ల భవిష్యత్తు నాశనం అవుతుందేమో అని బెంగగా ఉంది."

దక్షిణ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంకా వలస వెళ్తున్న రైతులను కలిసేందుకు బీబీసీ న్యూస్ తెలుగు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోని ఓ తండాకు వెళ్లినపుడు జమిలిబాయి అన్న వృద్ధురాలి గోడు ఇది.

గంగుబాయ్ తండాలోని ప్రతి ఇంట్లో కేవలం వయసు పైబడిన ముసలి వారు, చిన్నపిల్లలే ఎక్కువగా కనిపిస్తారు. వయసులో ఉన్నవారు ఓ పదిమంది వరకు కనిపించారంతే.

ఇలా ఎందుకని అక్కడి వారిని అడిగితే, "మా తండాలో వాళ్లు బతుకుతెరువు కోసం ముంబై, పుణెలకు వెళతారు. అప్పుడప్పుడూ సెలవులకు ఇళ్లకు వచ్చిపోతుంటారు. ఎన్నికలు వచ్చినపుడు ఓటు వేసేందుకు వస్తారు'' అని ఇరాబాయి అనే వృద్ధురాలు తెలిపారు.

ఈ ఒక్క తండానే కాదు.. అనేక గ్రామాలు, తండాలలో ఇదే పరిస్థితి.

ముంబైలోని కుర్లాలోనూ తెలంగాణ ఎన్నికల ప్రచారం

తెలంగాణలోని మహబూబ్‌నగర్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల్ జిల్లాలలో ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. పాలమూరు కార్మికులుగా పేరు తెచ్చుకున్న ఇక్కడి వలస కూలీలు ఎక్కువగా ముంబై, పుణె నగరాలలో, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో టైల్స్ పని, భవన నిర్మాణ పనులు చేస్తుంటారు.

ఇక్కడి జిల్లా కార్మిక విభాగ అధికారుల వద్ద ఎంతమంది వలస వెళ్తుంటారు అన్న సంఖ్యే లేదు. కానీ ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది వలసలు వెళ్తుంటారు అని అనధికారిక అంచనా. పాలమూరు అధ్యయన వేదికలో పని చేస్తూ ఇక్కడి జిల్లాలలో సర్వే చేసిన రాఘవచారి.. వలసలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అంటున్నారు.

"ఇక్కడి రైతులు ఎందుకు వలసలు వెళ్తున్నారు అన్నది అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మేం ఎన్నోసార్లు అధ్యయనం చేయాలని అధికారులను కోరాం. అసలు ఎంతమంది వలస కూలీలు ఉన్నారు అన్నదానిపై అంచనా లేదు. మా లెక్కల ప్రకారం దక్షిణ తెలంగాణ జిల్లాల నుండి ఏటా 12-13 లక్షలు వలస కూలీలు వెళతారన్నది అంచనా" అని తెలిపారు.

ఇలా వలస వెళ్లిన వాళ్లలో కొందరు మళ్లీ తిరిగి వస్తుంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాల వల్ల మళ్లీ వెళుతుంటారు. అధికారిక సమాచారం లేకపోవటంతో స్పష్టమైన గణాంకాలు లేవు.

ఇటీవల వనపర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ముంబైలోని కుర్లాలో ఉంటున్న వలస కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. దీన్ని బట్టి తెలంగాణ ఎన్నికలలో ఇక్కడి వారి ఓట్లు రాజకీయ నాయకులకు ఎంత అవసరమో అర్ధం అవుతుంది.

కానీ తమ అవసరాలు గుర్తించే వారు మాత్రం లేరని ఇక్కడి గ్రామస్థులు, తండాలో ఉంటున్న గిరిజనులు వాపోతున్నారు.

రామ్‌నాయిక్ తండాకు చెందిన శంకర్ అనే రైతు, "మళ్లీ వచ్చే ఏడాది ముంబై పోవాల్సి వచ్చేటట్లుంది. ఈ ఏడాది పంట చేతికి రాలేదు. ఇరవైవేలు వస్తాయి అనుకుంటే ఎనిమిది వేలు కూడా వచ్చేట్టు లేదు. రెండు సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుందామని ఇక్కడే ఉన్నా. కానీ బోర్లు ఎండిపోయి, మళ్లీ బోర్లు వేయించడంతో మూడు లక్షల అప్పు మిగిలింది. పంటా నష్టమైంది. ఇప్పుడు ఈ అప్పు తీరాలి అంటే మళ్లీ ముంబై పోవాల్సి వస్తుందో ఏమో" అన్నారు.

అప్పులు తీర్చేందుకే వలస

శంకర్ తండ్రి కూడా ముంబై వెళ్లి అక్కడ భవన నిర్మాణ కార్మికునిగా పని చేసారు. ఆయన తన నాలుగు ఎకరాల భూమిని సాగు చేసేందుకు దాదాపు ఎనిమిది లక్షల అప్పు చేసారు. దాంతో శంకర్ అన్న ముంబై వలస వెళ్లాల్సి వచ్చింది.

"మా అన్న 2001లో ముంబై వలస వెళ్లాడు. అక్కడ రోజుకు 200 రూపాయలు కూలి వచ్చేది. ఒక్కడే చేస్తే మిగలట్లేదని నన్నూ తీసుకు పోయాడు. తరువాత మేమిద్దరం మా తమ్ముడిని తీసుకువెళ్ళాం. మా నాయన చేసిన అప్పు తీర్చాక, ఉన్న భూమిలో సాగు చేసుకుందామని 2016లో నేను తిరిగి వచ్చేసాను. బోరు వేస్తే 500 అడుగుల లోతు వెళ్లినా నీళ్లు పడలేదు. మళ్లీ ఇంకో బోరు వేసాము. ఈసారి నీళ్లు పడ్డాయి కానీ ఆరు నెలలలోనే అది ఎండిపోయింది. దాంతో మరోసారి బోరు వేసాము. ఇప్పుడు పంట వేసాక వర్షాలు కురవక నీళ్లు సరిపోవడం లేదు" అని వాపోయారు శంకర్.

గ్రామంలోని చాలా మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉందని, ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరైనా ముంబైలోనో, పుణెలోనో ఉన్నారని తెలిపారు.

మనీబాయి తన నాలుగు సంవత్సరాల కొడుకు జ్వరంతో ఉన్నాడని కబురు చేస్తే ముంబై నుంచి వచ్చారు.

"పిల్లల్ని మాతో తీసుకొని వెళ్లలేము. అక్కడ రెండు గదుల ఇంట్లో మూడు జంటలు సర్దుకొని ఉంటున్నాము. పిల్లలకి జాగా లేదు. ఇలా వచ్చి వెళుతుంటాం తప్ప మా దగ్గరే పెట్టుకుని పోషించే పరిస్థితి లేదు," అని చెబుతూ ఆమె కంట తడి పెట్టుకున్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కొనసాగుతున్న వలసలు

గత రెండు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. భూగర్భ జలాలు లేక, వర్షాలు పడక, పొలాలు బీటలువారి, వరుసగా కరువులు రావడంతో ఇక్కడి ప్రజలు జీవనోపాధి కోసం వలసలు వెళ్తున్నారు.

ఈ ప్రాంతాన్ని తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంగా గుర్తించారు. ఈ సంవత్సరం ఇక్కడ 30-40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

తెలంగాణ నేతలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక వలసలు ఆగుతాయని అన్నారు. నీళ్ల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పినపుడల్లా దక్షిణ తెలంగాణ జిల్లాల వలసలను ఉదాహరణగా చూపించారు.

కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడిచిపోయాక కూడా వలసలు కొనసాగుతున్నాయనడానికి ఇక్కడ నుంచి ముంబై వెళ్లే బస్సులలో ముటాముల్లెతో కనిపించే జనమే సాక్ష్యం.

అయితే నీటి పారుదల శాఖ అధికారులు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు తెలంగాణ ఏర్పడ్డాక పూర్తయ్యాయి అంటున్నారు.

కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా.. ఈ నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేక కారణాల చేత ఆగిపోయాయి. అవి ఇప్పుడు పూర్తి కావటంతో.. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలలోని 8 లక్షల ఎకరాల భూమికి సాగు నీరు అందుతోందని, ఈ ప్రాజెక్టులతో దాదాపు 900 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు అనుసంధానం చేయటం జరిగిందని అధికారులు తెలిపారు.

నీటి పారుదల శాఖ అధికారి శ్రీధర్ దేశ్‌పాండే బీబీసీతో మాట్లాడుతూ, ''పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు రావటంతో పనులు ముందుకు సాగలేదు. కానీ మరో రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. దీంతో మహబూబ్ నగర్‌లో మరో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయొచ్చు'' అని వెల్లడించారు.

అయితే నారాయణపేట, కొడంగల్ ప్రాంతానికి మాత్రం ఇంకా ఎందుకు నీరు అందలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయితే ఆ ప్రాంతానికి కూడా సాగు నీరు అందుతుందనన్నారు.

"ఇంతకు ముందు నారాయణపేట, కొడంగల్‌లకు నెట్టెంపాడు ప్రాజెక్ట్ కింద నీళ్లు అందించాలనే ప్రతిపాదన ఉండింది. ఈ ప్రాజెక్టుకు ఆధారం జూరాల. కానీ జూరాల ప్రాజెక్టుపై ఎక్కువ భారం కావటంతో దాన్ని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మళ్లించటం జరిగింది" అని దేశ్‌పాండే వివరించారు.

చిత్రం శీర్షిక శంకర్

ఒక్కోరిది ఒక్కో మాట

నీటిపారుదల ప్రాజెక్టులతో వలసల వెళ్లిన వారంతా తిరిగి ముఖం పట్టారని అధికారులు అంటుంటే ఈ ప్రాంతంలోని రైతుల సమస్యలపై అధ్యయనం చేస్తున్న సామాజిక కార్యకర్తలు మాత్రం అలా జరగడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యదర్శి రవీందర్ గౌడ్.. ఇక్కడి వలసలను ఒక సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలని అన్నారు.

"ఇక్కడి రైతులకు అవగాహన కల్పించి, ఈ ప్రాంతానికి తగినట్లు ఎలాంటి పంటలు వేస్తే ఉపయోగం ఉంటుందో తెలిపే కార్యక్రమాలు చేపట్టాలి. వలస వెళ్లిన వాళ్లంతా తిరిగి వస్తే వారికి సరిపోయే వసతులు ఉన్నాయా లేదా కూడా చూడాలి. నీరు అందిస్తే సరిపోదు, దాని సక్రమంగా ఎలా వాడుకోవాలో కూడా నేర్పించాలి" అని అన్నారు.

ఏదేమైనా.. శంకర్‌లాంటి రైతులు కనీసం తమ ముందు తరం నుంచైనా వలసలు ఆగుతాయని ఆశిస్తున్నారు.

"నా పిల్లాడికి కూడా ఇదే గతి పడితే ఏం లాభం? మార్పు రావాలి. మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు. ఆ వలస బతుకులు వద్దు" అని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)