అండమాన్ సెంటినలీస్ మిత్రుడు - ఆయన పేరు పండిట్

  • 27 నవంబర్ 2018
సెంటినలీస్ ప్రజలకు కొబ్బరిబోండాలు అందిస్తున్న పండిట్ Image copyright TN PANDIT

అండమాన్ దీవుల్లో నివసించే సెంటినెల్స్ గురించి భారతీయ మానవశాస్త్రవేత్త టీఎన్ పండిట్ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు.

భారత ఆదివాసీ, గిరిజన శాఖ అధికారిగా ఆయన కొన్ని దశాబ్దాలపాటు సెంటినెల్స్‌తో స్నేహం చేయడానికి ప్రయత్నించారు.

వేల ఏళ్లుగా ఏకాంతంగా జీవిస్తున్న ఈ తెగ ప్రజలు.. 27ఏళ్ల అమెరికా యువకుడిని చంపారన్న వార్తలతో గతవారమే తెరపైకి వచ్చారు.

84ఏళ్ల పండిట్, సెంటినెల్స్‌తో తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. 'వారు శాంతికాముకులు' అన్నారు.

''మేం వారిని కలవడానికి వెళ్లినపుడు వారు మమ్మల్ని భయపెట్టారు కానీ మమ్మల్ని గాయపరచడం, చంపడం ఎప్పుడూ చేయలేదు. మా రాకను వారు వ్యతిరేకించినపుడు మేం వెనక్కు వచ్చేవాళ్లం'' అని బీబీసీ వరల్డ్ సర్వీస్‌తో పండిట్ అన్నారు.

Image copyright SURVIVAL INTERNATIONAL
చిత్రం శీర్షిక సెంటినలీస్ ప్రజల ఫొటోలు చాలా కొన్నే ఉన్నాయి

''అమెరికా యువకుడి మరణానికి చింతిస్తున్నాను. కానీ ఆయన పొరపాటు చేశారు. తన ప్రాణాలు కాపాడుకునే అవకాశం అతనికి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు'' అన్నారు.

1967లో తన బృందంతో కలిసి తొలిసారిగా ఉత్తర సెంటినెల్ దీవికి వెళ్లడానికి పండిట్ ప్రయత్నించారు.

మొదట్లో వీరిని చూసి సెంటినలీస్ ప్రజలు అడవుల్లో దాక్కున్నారు. మళ్లీమళ్లీ అక్కడకు వెళ్లినపుడు బాణాలు వేశారు. కానీ వీరితో సంబంధాలు పెంచుకోవడానికి శాస్త్రవేత్తలు తమతోపాటు కొన్ని వస్తువులను బహుమతులుగా తీసుకువెళ్లేవారు.

''కుండలు, పాత్రలు పెద్దమొత్తంలో కొబ్బరిబోండాలు, సుత్తి, కత్తులు లాంటి పనిముట్లను వారికి ఇవ్వడానికి వెంట తీసుకుపోయేవాళ్లం. సెంటినలీస్ ప్రజల భాష, హావభావాలను అర్థం చేసుకోవడానికి అండమాన్‌లోని మరో ఆదివాసీ తెగ ఓంగ్‌కు చెందిన ముగ్గురిని మాతో పిలుచుకుపోయేవాళ్లం'' అని పండిట్ గుర్తు చేసుకున్నారు.

''మమ్మల్ని చూడగానే వారు కోపోద్రిక్తులయ్యారు. వారంతా ఆయుధాలు కలిగివున్నారు. ఇదంతా కేవలం తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు మాత్రమే.''

ఆకాస్త దూరమైనా వెళ్లడం విజయంగా భావించిన శాస్త్రవేత్తలు, తమతోపాటు తెచ్చిన వస్తువులను అక్కడే వదిలి వెనక్కు వచ్చేవారు.

ఒకసారి, ప్రాణాలతో ఉన్న ఒక పందిని అక్కడే వదిలేసి వచ్చారు. సెంటినలీస్ ప్రజలకు అది నచ్చలేదు. ఆ జంతువును బల్లేలతో పొడిచి చంపి, దాన్ని ఇసుకలో పాతిపెట్టారు అని పండిట్ అన్నారు.

Image copyright INDIAN COASTGUARD/SURVIVAL INTERNATIONAL

చివరికి స్నేహం కుదిరిందిలా..

ఎన్నో ప్రయత్నాల తర్వాత, 1991లో సెంటినలీస్‌తో వీరికి స్నేహం కుదిరింది. ఓరోజు ఈ శాస్త్రవేత్తలను కలవడానికి వారే స్వచ్ఛందంగా వచ్చారు.

''మమ్మల్ని కలవడానికి ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాలేదు. కానీ ఇది వారి సొంత నిర్ణయం. వారి నిబంధనలను అనుసరించే వారితో సమావేశమయ్యాం.''

''వారి ద్వీపానికి కాస్త దూరంలోనే పడవలు దిగి, మెడలోతు నీళ్లల్లో నిలుచున్నాం. మాదగ్గరకు వచ్చిన సెంటినలీస్‌కు కొబ్బరిబోండాలు, ఇతర బహుమతులు ఇచ్చాం. కానీ వారి భూభాగంలోకి అడుగుపెట్టడానికి మాత్రం అంగీకరించలేదు.''

సెంటినలీస్‌తో ఉన్న సమయాల్లో వాళ్లు తనపై దాడి చేస్తారని భయపడేవాడ్ని కాదు కానీ, ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడినని ఆయన అన్నారు.

''వాళ్లతో సైగల ద్వారా సంభాషించడానికి ప్రయత్నించాం. కానీ మా బహుమతులను తీసుకున్నాక వాళ్లలోవాళ్లు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల భాష, ఆ ప్రాంతంలోని ఇతర ఆదివాసీ తెగల భాషలాగానే అనిపించింది'' అని పండిట్ అన్నారు.

Image copyright CHRISTIAN CARON - CREATIVE COMMONS A-NC-SA
చిత్రం శీర్షిక సెంటినలీస్ తెగ ప్రజలు తమ దీవి తీరంలో గస్తీ కాస్తున్న దృశ్యం

‘నాకు ఆహ్వానం లేదు’

ఒక సందర్భంలో సెంటినెల్ తెగలోని ఓ యువకుడు పండిట్‌ను భయపెట్టిన ఘటనను ఆయన గుర్తుచేసుకుంటూ..

''ఓ యువకుడు నన్ను చూసి హేళనగా నవ్వుతూ, తన కత్తిని చూపించి నా పీక కోసేస్తానన్నట్లు సైగ చేశాడు. నాకు భయమేసి, బోటు తెప్పించుకుని వెంటనే బయలుదేరాను. ఆ యువకుడి చేష్టల వల్ల, నేను అక్కడకు రావడం వాళ్లకు ఇష్టం లేదని అర్థమైంది'' అన్నారు.

ఈ వీడియో చూడండి

వీళ్లకు ఇలా బహుమతులు ఇవ్వడాన్ని, ఆ ప్రాంతంలో పర్యటించడాన్ని భారత ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది.

బయటి నుంచి వచ్చే మనుషులను కలవడం ద్వారా వీరికి వ్యాధులు సంక్రమిస్తాయని, వీరికి రోగనివారణ శక్తి తక్కువగా ఉండటంతో జలుబు, మసూచి లాంటి వ్యాధులు సైతం వీరికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే వీరి వద్దకు ఎవ్వరూ వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించింది.

తమ బృందంలోని సభ్యులకు ముందస్తుగా కొన్నిరకాల ఆరోగ్య పరీక్షలు చేసి, ఆ తర్వాతే ఉత్తర సెంటినెల్ ద్వీపానికి అనమతించేవారిమని పండిట్ అన్నారు.

గతవారం సెంటినలీస్ చేతుల్లో మృతి చెందిన అమెరికా యువకుడు చౌ, సెంటినెల్ ద్వీపానికి వెళ్లడానికి అధికారుల వద్ద ఎటువంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు అన్నారు.

పైగా అక్కడకు తీసుకువెళ్లడానికి స్థానిక జాలర్లకు 25వేల రూపాయలు ఇచ్చి, సెంటినలీస్ ప్రజలను మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించాడని వారు చెబుతున్నారు.

Image copyright TN PANDIT

ప్రస్తుతం అమెరికా యువకుడు చౌ మృతదేహాన్ని సెంటినెల్ ద్వీపం నుంచి వెనక్కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో సెంటినెల్స్‌తో స్నేహం కోసం పండిట్ బృందం చేసిన ప్రయత్నాలను అధికారులు ఓసారి పరిశీలిస్తే ఫలితం ఉండొచ్చు.

సెంటినలీస్ సమక్షంలో టీఎన్ పండిట్ కొన్ని ఉద్రిక్త క్షణాలు గడిపినప్పటికీ, ఈ ఆదివాసీలను శత్రువులుగా చూడటాన్ని ఆయన ఖండిస్తున్నారు.

''వాళ్లను శత్రువులుగా చూడటం సరికాదు. అసలైన ఆవేశపరులం మనమే. వాళ్ల భూభాగంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది మనమే కదా'' అని పండిట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

''సెంటినలీస్ ప్రజలు శాంతికాముకులు. మనుషులపై దాడి చేయాలని వారు భావించరు. ఇతర ప్రాంతాలకు వెళ్లి, అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టరు. అమెరికా యువకుడి హత్య ఒక అరుదైన ఘటన'' అని పండిట్ బీబీసీతో అన్నారు.

గతంలోలాగ బహుమతులు ఇచ్చి, వారితో సఖ్యత సాధిస్తాను కానీ వారిని ఎట్టిపరిస్థితుల్లో ఇబ్బంది పెట్టరాదని ఆయన అంటున్నారు.

''ఒంటరిగా జీవించాలన్న వారి ఆకాంక్షను మనం గౌరవించాలి'' అని ఆయన అన్నారు.

Image copyright SURVIVAL INTERNATIONAL
చిత్రం శీర్షిక సెంటినలీస్ తెగ ప్రజలు దాదాపు 60,000 ఏళ్లుగా ఈ 60 చదరపు కిలోమీటర్ల నార్త్ సెంటినల్ దీవిలోనే జీవిస్తున్నారు

‘అలెన్ మృతదేహాన్ని తీసుకురాకండి.. అక్కడే వదిలేయండి!

ఇలాంటి అభిప్రాయాన్నే 'సర్వైవల్ ఇంటర్నేషనల్'లాంటి సంస్థలు కూడా వెలిబుచ్చాయి. చౌ మృతదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలను విరమించాలని స్థానిక అధికారులను ఆ సంస్థ కోరుతోంది.

ఈ విషయమై ఆ సంస్థ నవంబర్ 26న ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది.

''జాన్ అలెన్ చౌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ఆపాలని స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రయత్నం వల్ల అటు సెంటినలీస్‌కు, ఇటు అధికారులకు ఇద్దరికీ ప్రమాదమే. సెంటినలీస్‌కు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. సెంటినెల్ ద్వీపంలో పర్యటించడానికి నిబంధనలను నీరుగారుస్తూ తీసుకున్న నిర్ణయంపై వెనక్కు తగ్గాలి. తమ ప్రాంతానికి ఆపద వాటిల్లినపుడే వారు ప్రమాదంలో పడతారు. వాళ్లను అలానే ఉండనిద్దాం..'' అని సర్వైవల్ ఇంటర్నేషనల్ ప్రకటన సారాంశం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)