తెలంగాణలో డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని గుర్తించాం: సీఈసీ రావత్ - ప్రెస్ రివ్యూ

  • 27 నవంబర్ 2018
సీఈసీ రావత్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక సీఈసీ ఓం ప్రకాశ్ రావత్

దేశంలో ఎన్నికల ప్రచారాన్ని, ఓట్లను డబ్బు ప్రభావితం చేస్తోందని, ఇప్పుడు ఈ ధోరణి మరింత పెరిగిందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓంప్రకాశ్ రావత్ చెప్పారని నవ తెలంగాణ రాసింది.

ఎన్నికల్లో 'మనీ పవర్‌' ఏటా పెరగటమేగానీ, తగ్గింది లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటం ఖాయమని, ఎన్నికలంటేనే ప్రజలు అసహ్యించుకునే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితిని పరిశీలించామనీ, ప్రచారం కోసం పెద్దయెత్తున డబ్బును ఖర్చు చేయటాన్ని, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని ఈసీ గుర్తించిందని రావత్ తెలిపారు. ఎన్నికల్లో పెద్దఎత్తున నల్లధనం ప్రవహిస్తోందని, దాంట్లో కొంత భాగమే పట్టుబడిందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ అధికారాలు పెరిగినంత మాత్రాన 'మనీ పవర్‌'ను అడ్డుకోలేమన్నారు.

ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు ప్రస్తావించారు.

ఎన్నికల బాండ్ల ద్వారా పార్టీ విరాళాల సేకరణలో అనేక లోపాలున్నాయని, తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని రావత్ పేర్కొన్నారు. ఉదాహరణకు విరాళాలమిచ్చిన వ్యక్తి పేరు రహస్యంగా ఉంచితే, అది నల్లధనమా? కాదా? అని ఈసీ ఎలా తెలుసుకోగలుగుతుందని ప్రశ్నించారు.

పెయిడ్‌ న్యూస్‌, ఫేక్‌ న్యూస్‌ ప్రతీ ఎన్నికల్లో ముఖ్యమైన సమస్యలుగా మారాయని రావత్ చెప్పారు.

Image copyright Getty Images

దిల్లీలో సీపీఎస్ రద్దు చేస్తాం: కేజ్రీవాల్

కంట్రిబ్యూటరీ పింఛను విధానం(సీపీఎస్‌) రద్దు చేసి, పాత పింఛను విధానాన్నే కొనసాగించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఈ విషయమై శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి, సీపీఎస్‌ రద్దుకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని కేజ్రీవాల్ సోమవారం స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా పాత విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు.

నేషనల్‌ మూవ్‌మెంట్ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ సిస్టమ్‌(ఎన్‌ఎంవోపీఎస్‌) జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ అధ్యక్షతన దిల్లీలో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ- సీపీఎస్‌ను దేశవ్యాప్తంగా రద్దు చేయాల్సిన అవసరముందన్నారు.

పాత విధానం కొనసాగించేందుకు తాను కేంద్రంతో పోరాడతానని కేజ్రీవాల్ చెప్పారు.

Image copyright NAlle Sivakumar

పోలవరం: కాంక్రీటు పనులు సగానికి పైగా పూర్తి

పోలవరం ప్రాజెక్టులో కాంక్రీటు పనులు సగానికిపైగా పూర్తయ్యాయని అధికారులు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వివరించారని ఈనాడు రాసింది.

ఎగువ కాఫర్‌డ్యాం నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, మరో వారంలో దిగువ కాఫర్‌డ్యాం నిర్మాణానికి అనుమతులు వస్తాయని అధికారులు తెలిపారు.

ప్రాజెక్టులో ఎడమ కాలువ అనుసంధానానికి అవసరమైతే టన్నెళ్లు రెండుగా విభజించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

డిసెంబరు 17న గేట్ల ఏర్పాటు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు.

Image copyright KALVAKUNTLACHANDRASHEKARRAO/FB

గురుకులాల్లో ప్రైవేటుకూ భాగస్వామ్యం: కేసీఆర్

ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రైవేటు పాఠశాలలనూ భాగస్వాములను చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారని ఆంధ్రజ్యోతి రాసింది.

ప్రస్తుతం ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.1.2 లక్షలు ఖర్చు చేస్తున్నామని, తాము నిర్దేశించిన ప్రమాణాల్లో గురుకులాలు నడపడానికి ముందుకు వచ్చే ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా అంతే మొత్తాన్ని బడ్జెట్‌గా అందజేస్తామని ప్రకటించారు.

త్వరలోనే ప్రైవేటు పాఠశాలల వారితో మాట్లాడి చక్కటి పథకాన్ని తయారు చేస్తామని కేసీఆర్ చెప్పారు.

ప్రైవేటు విద్యారంగంలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, వారిని కాదని ప్రభుత్వం పనిచేసే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ప్రైవేటు భాగస్వామ్యంతో తల్లిదండ్రులకు భారం లేకుండా గురుకుల విద్యను అందిస్తామనన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: పవన్ కల్యాణ్ రెండు చోట్లా వెనుకంజ.. మంగళగిరిలో నారా లోకేశ్ ఎదురీత

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: 296 స్థానాల్లో బీజేపీ.. 51 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

LIVE: నిజామాబాద్‌లో 65వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, ఏపీలో 23 చోట్ల వైసీపీ ముందంజ : ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. ఇంతకీ పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారా లేదా

నారా చంద్రబాబు నాయుడు: రాజకీయ చాతుర్యం, పరిపాలనా దక్షత వయసు రీత్యా బలహీనపడ్డాయా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మీ నియోజకవర్గంలో ఎవరిది ఆధిక్యం

వైసీపీ జోరు.. టీడీపీలో లోకేశ్ సహా మంత్రులు సైతం వెనుకంజ.. పవన్ సహా జనసేన అభ్యర్థులు డీలా