ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం.. ముఖ్యాంశాలు: ‘నిజామాబాద్‌ను లండన్ చేస్తానన్న కేసీఆర్ మాట ఏమైంది?’ తెలంగాణ ఎన్నికలు 2018

నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకతో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది.

మంగళవారం నిజామాబాద్ పట్టణంలో ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

ముఖ్యంగా కేంద్రం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం 'ఆయుష్మాన్ భారత్'లో తెలంగాణ రాష్ట్రం చేరకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ నిర్ణయం కారణంగా తెలంగాణ పేద ప్రజలు ఎంతలా నష్టపోతున్నారో ఆయన వివరించారు.

''దిల్లీలో సోనియా రిమోట్‌తో నడిచిన యూపీఏ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి కూడా మంత్రిగా పనిచేశారు. యూపీఏ సర్కారు ఉప్పు తిని, సోనియా మేడమ్ వద్ద పనిచేసిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు కాంగ్రెస్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారు. బయటకు చెబుతున్నట్లు ఆయనకు కాంగ్రెస్ విరోధి కాదు. వీరు ఒకరికొకరు వ్యతిరేకులు కాదు.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు రెండూ నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయ''ని ఆయన ఆరోపించారు.

మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రైతు బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక భారతదేశానికి తొలి ప్రధాని అయ్యుంటే ఈ రోజు రైతులకు ఈ దుస్థితి ఉండేది కాదు. పటేల్ కనుక లేకుంటే హైదరాబాద్ వెళ్లడానికి కూడా పాకిస్తాన్ వీసా తీసుకోవాల్సి ఉండేది’’ అన్నారు.

2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నది తమ సంకల్పమని చెప్పారు.

నిజామాబాద్ సభకు రావడానికి ముందే నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్లు చేయడంతో ఉదయం నుంచే ఆయన రాకపై ఆసక్తి ఏర్పడింది.

నిజామబాద్‌లో ప్రసంగం ప్రారంభిస్తూనే ఆయన జిల్లాలోని బీజేపీ అభ్యర్థులందరి పేర్లూ ప్రస్తావించి ఆకట్టుకున్నారు.

అనంతరం ఎవరెస్ట్‌ను 13 ఏళ్లకే అధిరోహించిన తెలంగాణ బాలిక పూర్ణ, కామన్‌వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన నిజామాబాద్ వాసి మహ్మద్ హుస్సేనుద్దీన్ పేర్లు ప్రస్తావించి యువశక్తికి తెలంగాణ ప్రతీక అని ప్రస్తుతించారు.

ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల ఇప్పటికే పర్యటించానని.. ఇప్పుడు తెలంగాణలోనూ అడుగుపెట్టానని సంతోషం వ్యక్తంచేసిన మోదీ ఎప్పటిలాగే అభివృద్ధి మంత్రం పఠించారు.

'తెలంగాణ యువత బలిదానాలను వృథా చేసే హక్కు మీకు లేదు'

''అభివృద్ధిని విశ్వసించేవారు.. నవ తెలంగాణ నిర్మాణంపై నమ్మకం ఉన్నవారంతా బీజేపీతో అడుగు అడుగు కలిపి నడుస్తున్నారు. బీజీపీతోనే అభివృద్ధి సాధ్యమని దేశం విశ్వసిస్తోంది'' అని మోదీ చెప్పారు.

''తెలంగాణ ఉత్తనే రాలేదు, ఎన్నో ఏళ్ల పోరాటం, ఎంతోమంది యువత బలిదానాలతో ఆవిర్భవించిన రాష్ట్రం ఇది. ఆ బలిదానాలను వృథా చేసే అధికారం ఎవరికీ లేదు. ఏ రాజకీయ పార్టీకి, ఏ నేతకూ, ఏ ప్రభుత్వానికీ ఆ హక్కు లేనే లేద''ని అన్నారు.

* తెలంగాణ ఏర్పడి నాలుగున్నరేళ్లయింది... ఇక్కడి కేసీఆర్ ప్రభుత్వానికీ నాలుగున్నరేళ్లయింది. మరి, ఈ కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? పైసాపైసాకు లెక్క అడగాల్సిన సమయం వచ్చింది. మీరంతా అడగండి.

* యువత, రైతులు, దళితులు, గిరిజనులు, బడుగులకు ఇచ్చిన హామీలు అమలు చేయని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఇది.

* ఇక్కడి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదనుకుంటోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయకుండానే ఎన్నికలను గెలుస్తున్నట్లే తామూ ఏమీ చేమకుండానే ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది. కానీ, పరిస్థితులు మారాయి. అభివృద్ధి చేయకుండా, పనిచేయకుండా 50 నెలలు కూడా ప్రభుత్వం నడపలేరు మీరు.

నిజామాబాద్‌ను లండన్ చేస్తానన్న కేసీఆర్ మాట ఏమైంది?

''ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్‌ను లండన్‌లా మారుస్తానని చెప్పారు.. స్మార్ట్ సిటీ చేస్తామన్నారు.. కానీ, ఇక్కడ కరెంటు, రోడ్లు, నీరు ఏమీ లేవు. హెలికాప్టర్‌ నుంచి చూస్తే నాకు లండన్ కనిపించలేదు, అత్యంత వెనుకబడిన రాష్ట్రానికి వచ్చినట్లుగా ఉంది'' అంటూ కేసీఆర్ వాగ్దానభంగాలపై విమర్శలు ప్రారంభించారు.

* నిజామబాద్‌లో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీలను చూస్తుంటే డ్రైనేజ్ నిర్మిస్తున్నారా, డ్యామేజ్ చేస్తున్నారా అన్నది అర్థం కావడం లేదన్నారు మోదీ.

* ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఒకేలా ఉన్నాయి. ఆయన ఏ పనీ పూర్తి చేయరు. ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయలేదు, పథకాలు పూర్తి చేయలేదు.. చివరకు అయిదేళ్ల పదవీ కాలం కూడా పూర్తిచేయలేదు అంటూ కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోదీ. ఇలాంటి సగం సగం పనుల ముఖ్యమంత్రిని నమ్మరాదని ప్రజలకు సూచించారు. అయితే... కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రావడంతో ఆయన్ను అయిదేళ్ల పాటు భరించే బాధ ప్రజలకు తప్పిందని మోదీ అన్నారు.

ఫొటో క్యాప్షన్,

నిజామాబాద్ జిల్లా

'ఇంటింటికీ గోదావరి నీరు రాలేదు కానీ, మళ్లీ ఓట్లగడానికి కేసీఆర్ వచ్చారు'

నిజామాబాద్ జిల్లాలో ఇంటింటికీ గోదావరి నీరు ఇవ్వకపోతే మళ్లీ ఓటడగడానికి రానని గత ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పారని.. కానీ, తాగడానికి గోదావరి నీరు రాకపోయినా ఓటడగడానికి మాత్రం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మళ్లీ వచ్చారని మోదీ అన్నారు.

ఇలాంటి ముఖ్యమంత్రికి వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

'ఆయుష్మాన్ భారత్‌లో చేరకుండా పేదలకు ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు'

ధనికులకు జబ్బు వస్తే డాక్టర్లే ఇంటికొస్తారని... కానీ, పేదోడి జబ్బు చేస్తే ఆ కుటుంబమే అల్లకల్లోలమైపోతుందని.. అందుకే పేదల కోసం కేంద్రం ఆయుష్మాన్ భవ పథకం తీసుకొచ్చిందని.. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఇందులో చేరకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోందని ఆరోపించారు.

* ''దేశంలో 'ఆయుష్మాన్ భారత్' వంటి గొప్ప కార్యక్రమం చేపడితే తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి నిరాకరించారు. ఆయన తీరు వల్ల తెలంగాణ పేదలు నష్టపోతున్నారు''

* ''ఆయుష్మాన్ భారత్ ప్రారంభించి రెండు నెలలే అయింది.. ఈ కొద్దికాలంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 3 లక్షల మందికి ఇది ఉపయోగపడింది. ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయి. కానీ, ఇందులో ఒక్కరు కూడా తెలంగాణవాసి లేరు. దీనికి బాధ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన పార్టీయే'' అంటూ ఆరోపణలు చేశారు.

* మరోవైపు తెలంగాణలో ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని.. పేదలకు వైద్యం అందడం లేదని, నిజామాబాద్ మెడికల్ కాలేజి పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

ఫొటో క్యాప్షన్,

మోదీ సభలో వేదికపై బీజేపీ అభ్యర్థులు

'కేసీఆర్‌ది అభద్రతా భావం.. ఆయనపై ఆయనకే నమ్మకం లేదు'

కేసీఆర్ తీవ్రమైన అభద్రతాభావంలో ఉన్నారని, ఆయనపై ఆయనకే నమ్మకం లేదని మోదీ అన్నారు.

కేసీఆర్‌కు జ్యోతిష్కులను నమ్మడం.. నిమ్మకాయలు, మిరపకాయలను నమ్మడం తప్ప ఆయనపై ఆయనకు నమ్మకం లేదన్నారు.

'కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రత్యర్థులు కావు.. వారిది ఫ్రెండ్లీ మ్యాచ్'

తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా కనిపిస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు రెండూ నిజానికి ప్రత్యర్థులు కావని.. ఒకే తానులో ముక్కలని మోదీ ఆరోపించారు.

''దిల్లీలో సోనియా రిమోట్‌తో నడిచిన యూపీఏ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి కూడా మంత్రిగా పనిచేశారు. యూపీఏ సర్కారు ఉప్పు తిని, మేడమ్ వద్ద పనిచేసిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు కాంగ్రెస్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారు. బయటకు చెబుతున్నట్లు ఆయనకు కాంగ్రెస్ విరోధి కాదు. ఇద్దరూ కుమ్మక్కయ్యారు.

అసలు కేసీఆర్‌కు ట్రైనింగ్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.. కాంగ్రెస్ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థే తెలంగాణను ఇంతగా నష్టం చేస్తే.. ఆయనకు ట్రైనింగ్ ఇచ్చిన కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఇంకా 100 రెట్లు నష్టం కలుగుతుంది'' అంటూ ఆయన హెచ్చరించారు.

''టీఆరెస్ కుటుంబ పార్టీ, చంద్రశేఖరరావు కుటుంబ ప్రభుత్వం నడిపిస్తున్నారని సోనియా అంటోంది.. మరి, ఆమె చేస్తున్న పనేంటి? రెండు పార్టీలదీ కుటుంబ పాలన, కుటుంబ రాజకీయమే అని ప్రజలు తెలుసుకోవాలి.

ఈ రెండు పార్టీలకూ ఎలాంటి తేడా లేదు. రెండు పార్టీల్లోనూ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, మైనార్టీలకు వీరు చేసిందేమీ లేదు. వీరిద్దరూ ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయి. ఈ రెండు పార్టీలూ ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాలు'' అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు రెండూ అబద్ధాలు చెప్పడంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయన్నారు.

'కాంగ్రెస్, బీజేపీల మధ్య తేడా అదే..'

దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాల మధ్య తేడాను మోదీ వివరించారు.

''2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక్కో కుటుంబానికి 9 సిలిండర్లకు బదులు 12 ఇస్తామని చెప్పింది. కానీ.. గత నలభైయాభయ్యేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్యాస్, టెలిఫోన్ కనెక్షన్ల కోసం ఎన్నెన్ని కష్టాలు పడ్డారో.. ఇప్పుడు ఇవి ఎంత సులభంగా వస్తున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు'' అంటూ ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ఆయన చెప్పుకొచ్చారు.

కట్టెలపొయ్యిలపై వండే బాధ నుంచి మహిళలను తప్పించేందుకు ఉజ్వల పథకం ప్రవేశపెట్టి దేశంలో కోట్లాది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు.

''నాకూ పేదరికం తెలుసు.. నేను పేదరికాన్ని దాటి వచ్చాను. మా అమ్మ కట్టెల పొయ్యిపై వంటి చేసి పెట్టేది మాకు. అందుకే నేను ప్రధాని అయ్యాక దేశంలో ప్రతి అమ్మకీ కట్టెల పొయ్యి కష్టం తప్పించాలని నిర్ణయించుకున్నాను. ఉజ్వల పథకం పెట్టాను అందుకే.. ఆ పథకంలో తెలంగాణలో 5 లక్షల కనెక్షన్లు ఇచ్చాం'' అన్నారు.

''దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయిన ఇప్పటివరకు చాలా ఇళ్లకు కరెంటు లేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు విద్యుత్‌తో రాజకీయం చేస్తున్న సమయంలో మేం ఒక్క నిజామాబాద్‌లోనే 15 వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం'' అని చెప్పారు.

మోదీకి కేసీఆర్ సవాల్

నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ తనపై చేసిన విమర్శలపై కేసీఆర్ స్పందించారు. మోదీ చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడడం దారుణమని ఆయన అన్నారు.

మోదీ చెబుతున్నట్లుగా తెలంగాణలో విద్యుత్ సమస్య ఎక్కడుందో చెప్పాలంటూ సవాల్ విసిరారు. ''నిజామాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా.. దమ్ముంటే మళ్లీ నిజామాబాద్ రా'' అంటూ సవాల్ చేశారు.

''నేను ఛాలెంజ్ చేస్తున్నా.. తెలంగాణలో కరెంట్ సమస్యన్నదే లేదు.. దేశంలో 24 గంటలూ విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాదని రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధం. రుజువు చేయలేకపోతే మీరు ప్రధాని పదవికి రాజీనామా చేస్తారా'' అంటూ చాలెంజ్ విసిరారు.

దేశంలోనే విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పిందని.. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదో మోదీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తనకు యాగాలు, పూజలపై ఉన్నంత శ్రద్ధ ప్రజలపై లేదని మోదీ అనడంపైనా కేసీఆర్ మండిపడ్డారు.

‘నాకు భక్తి ఉంది. దేవుడిని నమ్ముతా. నీకు భక్తి ఉంటే నువ్వూ ఇక్కడి రా, తీర్థం ఇస్తా’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)