తెలంగాణ ఎన్నికలు 2018: దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ ఎందుకు ముందుకు సాగడం లేదు

  • 29 నవంబర్ 2018
దళితులకు మూడెకరాల భూపంపిణీ Image copyright tssccfc.cgg.gov.in

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకాల్లో దళితులకు మూడెకరాల భూపంపిణీ ఒకటి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితులను అభివృద్ధిపథంలోకి తెచ్చేందుకు ఈ పథకం తోడ్పడుతుందని భావించి టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది.

2014 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గోల్కొండ కోట నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. తర్వాత ఈ పథకం పేరును భూ కొనుగోలు, పంపిణీ పథకంగా మార్చారు.

భూమిలేని నిరుపేద దళితులు ఈ పథకానికి అర్హులు. అయితే, నాలుగేళ్లలో ఈ పథకం ప్రయోజనాలు నెరవేరాయా? రాష్ట్రంలోని అర్హులైన దళితులందరికీ మూడెకరాల భూమి దక్కిందా? ప్రభత్వం ఏమంటోంది? లబ్ధిదారుల మాటేమిటి?

భూ పంపిణీ ఇలా..

ఈ పథకం కింద ఒక్కో లబ్దిదారుకు కుటుంబంలోని మహిళ పేరు మీద మూడెకరాల భూమిని ప్రభుత్వం అందిస్తుంది. ఈ భూమిని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తుంది.

మూడు ఎకరాల భూమి కొనేందుకు ఎకరాకు సగటున రూ. 2 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఖర్చు చేస్తోంది.

ఇలా పంపిణీ చేసిన భూమిలో పంటసాగు చేసుకునేందుకు అవసరమైన సహకారాన్ని, సాగునీటి సదుపాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది.

Image copyright tssccfc.cgg.gov.in

5,607 మందికే వర్తింపు...

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం దళితులు 54.09 లక్షలు. దాదాపు 12 లక్షల దళిత కుటుంబాలున్నాయి.

ఇందులో 6.39 లక్షల కుటుంబాలు ఎకరా నుంచి ఐదు ఎకరాల భూమిని కలిగి ఉన్నాయి.

50 వేల దళిత కుటుంబాలు ఐదు అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి కలిగి ఉన్నాయి.

3.3 లక్షల దళిత కుటుంబాలకు అంగుళం భూమి కూడా లేదు. వీరంతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'దళితులకు మూడుఎకరాల భూమి' పథకానికి అసలైన అర్హులు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం పథకం ప్రారంభమైన తొలి ఏడాదిలో 959 మంది లబ్ధిదారులకు 2,534 ఎకరాల భూమి అందింది.

2018 ఏప్రిల్ నాటికి 14,282.37 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం మొత్తం 5,607 మంది లబ్దిదారులకు పంపిణీ చేసింది.

అంటే రాష్ట్రంలోని భూమిలేని 3.3 లక్షల దళితల కుటుంబాల్లో కేవలం 5,607 కుటుంబాలకు మాత్రమే ఇప్పటి వరకు ఈ పథకం వర్తించింది.

అర్హులకే అందిందా?

ఈ పథకంపై దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక సర్వేను వెల్లడించింది. దీనికి సంబంధించిన విషయాలను సెంటర్ ప్రతినిధి శంకర్ బీబీసీతో పంచుకున్నారు.

ఆశించిన స్థాయిలో ఈ పథకం అమలు కావడం లేదని, కొన్ని చోట్ల పథకం పక్కదారి పట్టిందని ఆయన ఆరోపించారు.

'2016-17 ఆర్థిక సంవత్సరంలో జగిత్యాల, గద్వాల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, సిరిసిల్ల, సిద్ధిపేటలో ఈ పథకం అమలు కాలేదు. 2017-18 లో తొమ్మిది జిల్లాల్లో అసలు భూమే కొనుగోలు చేయలేదు. సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, నిజామామాద్, మహబూబ్ నగర్, జగిత్యాల, జనగాంలలో ఈ పరిస్థితి కనిపించింది' అని శంకర్ వెల్లడించారు.

‘భూమి అందించడంతో పాటు సాగుకు యోగ్యం అయ్యేరీతిలో లబ్ధిదారులకు సాయం చేయడం ఈ పథకంలో ముఖ్యమైన అంశం. కానీ, చాలా చోట్ల భూమి ఇచ్చారు తప్పితే ఇతర సౌకర్యాలు కల్పించలేదు. మేం 42 గ్రామాలను శాంపిల్‌గా తీసుకుంటే 18 గ్రామాల్లో విత్తనాలు, ఎరువు ఇవ్వలేదు. 17 గ్రామాల్లో సాగునీటి సౌకర్యం కల్పించలేదు' అని ఆయన బీబీసీకి చెప్పారు.

Image copyright Parusharaumulu
చిత్రం శీర్షిక తనకు పథకం వర్తింపచేయడం లేదని ఆత్మహత్యయత్నం చేసిన ఓ దళిత రైతు

పథకం కోసం ఆత్మహత్య

ఈ పథకాన్ని తమకు వర్తింపజేయాలని చాలా చోట్ల దళితులు అధికారుల చట్టూ తిరుగుతున్నారు.

అర్హులైనా తమకు ఈ పథకాన్ని వర్తిపజేయడం లేదని సిద్ధిపేట మండలంలోని బెజ్జంకి గ్రామానికి చెందిన దళిత రైతు శ్రీనివాసులు ఎమ్మెల్యే కార్యాలయం ముందే ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇదే ఘటనలో అదే గ్రామానికి చెందిన పరశురాములు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, అర్హుడినైన తమను కాదని అనర్హులకు ఈ పథకాన్ని వర్తింపజేశారని, దీనిపై ఎమ్మెల్యేల ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు చెప్పారు.

‘మంత్రి, ఎమ్మెల్యే తనకు సర్కారు ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు నెరవేరలేదు’ అని తెలిపారు.

లబ్ధిదారులు ఏమంటున్నారు?

ప్రభుత్వం భూమి కేటాయించినా సాగుకు యోగ్యం కాని పరిస్థితులు ఉన్నాయని లబ్ధిదారులు అంటున్నారు.

ముస్తాబాద్ మండలం గోపాలపల్లికి చెందిన సత్యానంద్ మాట్లాడుతూ, తమ గ్రామంలో తొమ్మిది మందికి భూమి కేటాయిస్తే అందరికీ సాగుకు యోగ్యం కాని భూమినిచ్చారని అన్నారు. ఎరువులు, నీటిపారుదల సౌకర్యం కల్పించలేదని తెలిపారు.

మూడుసార్లు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినప్పటికీ పథకంలో తనకు అవకాశం కల్పించలేదని ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెప్పారు.

మైనకుంట గ్రామానికి చెందిన రాజవ్వ తనకు ఇచ్చిన భూమిలో ఏ పంటా పండించడం లేదని తెలిపారు. ప్రభుత్వం సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.

ఇబ్బందులివీ...

భూపంపిణీకి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని, అయితే, చాలా చోట్ల భూమి అందుబాటులో లేదని ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ది సంస్థ తహసీల్దార్ సుధారాణి బీబీసీకి చెప్పారు.

'లబ్దిదారులను గుర్తించడం ఒక సమస్య అయితే, లబ్ధిదారులు ఉన్న గ్రామాల్లో అనుకున్నస్థాయిలో భూమి లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు భూమిని అమ్మడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ పథకం సజావుగా సాగడం లేదు' అని తెలిపారు.

కొనుగోలు చేసే భూమికి రేటు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా ఈ పథకం కింద భూ పంపిణీ జరిగితే, ఖమ్మం, వరంగల్ జిల్లా పరిధిలో ఈ పథకం కింద లబ్దిపొందినవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు.

సరైన లబ్ధిదారులను గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సుధారాణి తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)