మధ్యప్రదేశ్ ఎన్నికలు: రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ఇవి దిక్సూచి అవుతాయా

  • 28 నవంబర్ 2018
మధ్యప్రదేశ్ Image copyright wikipedia
చిత్రం శీర్షిక మధ్యప్రదేశ్‌లో 1977లో జనతా పార్టీ, 1990లో బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చినా.. రెండు ప్రభుత్వాలూ మూడేళ్లే ఉన్నాయి

సార్వత్రిక ఎన్నికలకు ముందు 'సెమీ ఫైనల్స్'గా భావిస్తున్న.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ - ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ఎన్నికలపైనే అన్ని రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.

మధ్యప్రదేశ్‌ శాసనసభకు బుధవారం - నవంబర్ 28వ తేదీ - పోలింగ్ జరగనుంది. మిజోరం అసెంబ్లీ ఎన్నికలూ అదే రోజు. అయితే.. బీజేపీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ మీదే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 శాసనసభ స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సరళి ఎలా ఉండొచ్చు అన్నది ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

నిజానికి 2000 నవంబర్ 1న కేంద్రంలోని అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ఛత్తీస్‌గఢ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేటప్పటికి.. ఉమ్మడి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. విభజన తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌ శాసనసభ: గత మూడు ఎన్నికల ఫలితాలు ఇలా...
పార్టీ - సీట్లు - సంవత్సరం 2003 2008 2013
బీజేపీ 173 143 165
కాంగ్రెస్ 38 71 58
సమాజ్‌వాది పార్టీ 7 1 -
బహుజన్ సమాజ్ పార్టీ 2 7 4
ఇతరులు 10 8 3
మొత్తం సీట్లు 230 230 230

2003లో రెండు రాష్ట్రాలకూ జరిగిన ఎన్నికల్లో రెండు చోట్లా కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచీ - 2008, 2013 ఎన్నికల్లోనూ - మధ్యప్రదేశ్‌లో బీజేపీ అప్రతిహతంగా గెలుస్తూనే ఉంది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటానికి పోరాడుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జ్యోతిరాదిత్య సింథియాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటించింది

మొదటి మూడు దశాబ్దాలూ కాంగ్రెస్ పాలనే...

భారత స్వాతంత్య్రానంతరం.. 1950లో మాజీ బ్రిటిష్ సెంట్రల్ ప్రావిన్సెస్, బేరార్, మాక్రాయ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని నాగ్‌పూర్ రాజధానిగా ఏర్పాటు చేశారు. అదే సమయంలో మధ్య భారత్, వింధ్యప్రదేశ్, భోపాల్ రాష్ట్రాలనూ సెంట్రల్ ప్రావిన్సెస్ నుంచి నెలకొల్పారు.

మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు 1952లో మొదటి ఎన్నికలు జరిగాయి. అప్పుడు 232 స్థానాలకు గాను కాంగ్రెస్ 194 సీట్లు గెలుచుకుంది. అత్యధికంగా 23 సీట్లలో ఇండిపెండెంట్లు గెలిచారు. సోషలిస్ట్ పార్టీ తదితర నాలుగు పార్టీలకు సింగల్ నంబర్ సీట్లే వచ్చాయి.

1956లో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ జరిగినపుడు.. మధ్యభారత్, వింధ్యప్రదేశ్, భోపాల్‌లను మధ్యప్రదేశ్‌లో కలిపారు. మధ్యప్రదేశ్‌లో భాగంగా ఉన్న మరాఠీ మాట్లాడే ప్రజల ప్రాంతమైన విదర్భను.. నాగ్‌పూర్ సహా.. బొంబాయి రాష్ట్రంలో చేర్చారు. కొత్త మధ్యప్రదేశ్ రాష్ట్రానికి భోపాల్ నగరాన్ని రాజధానిగా ప్రకటించారు.

అనంతరం 1957 శాసనభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. 1962, 1967, 1972 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2014 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాల్లో 27 సీట్లు బీజేపీ గెలుచుకుంది

మూడేళ్ల ముచ్చట: 1977లో జనతా పార్టీ... 1990లో బీజేపీ

ఎమర్జెన్సీ అనంతర కాలంలో 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. జనతా పార్టీ 230 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్ 84 సీట్లకే పరిమితమైంది.

కానీ.. మూడేళ్లకే 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనసంఘ్‌లు తలపడ్డాయి. కాంగ్రెస్ మళ్లీ 142 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జన సంఘ్ 41, ప్రజా సోషలిస్ట్ పార్టీ 33, సోషలిస్ట్ పార్టీ 14 సీట్లు గెలుచుకున్నాయి.

1985లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డాయి. కాంగ్రెస్‌కి 250 సీట్లు, బీజేపీకి 58 సీట్లు వచ్చాయి.

1990 ఎన్నికల్లో బీజేపీ 220 సీట్లు సొంతం చేసుకుని మొదటిసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 58 సీట్లకే పరిమితమైంది.

కానీ.. 1993లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ 174 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం సొంతం చేసుకుంది. బీజేపీ 117 సీట్లతో ప్రతిపక్షంలో నిలిచింది.

1998 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు 172 సీట్లు, బీజేపీకి 119 సీట్లు వచ్చాయి. అధికారం కాంగ్రెస్ చేతిలోనే ఉంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పదమూడేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఈసారీ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు

ఛత్తీస్‌గఢ్ విభజన తర్వాత.. ఎదురులేని బీజేపీ

అయితే.. 2000 నవంబర్‌లో మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్‌ను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఇది కాంగ్రెస్ తలరాతను మార్చేసింది. విభజనకు ముందూ, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగినప్పటికీ.. 2003 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2003 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 173 సీట్లు (230 సీట్లకు గాను) గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కేవలం 38 సీట్లకు పరిమితమైంది.

2008, 2013 ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉండిపోయింది.

2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం మొత్తం 29 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 27 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయవచ్చునని పరిశీలకులు అంటున్నారు

లోక్‌సభ ఎన్నికలకు మధ్యప్రదేశ్‌లో సెమీ ఫైనల్సా?

ఈ నేపథ్యంలో.. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. పదిహేనేళ్ల సుదీర్ఘ పాలన మీద ప్రజావ్యతిరేకత ఈ ఎన్నికల్లో వ్యక్తమవుతుందా అన్నది ఒక అంశమైతే.. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు మధ్యప్రదేశ్ ఎన్నికలు అద్దం పడతాయా అన్నది మరొక కీలక అంశంగా మారింది.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లు చిన్న రాష్ట్రాలు. తెలంగాణ ఎన్నికలను ప్రధానంగా ప్రాంతీయ ఎన్నికలుగానే భావిస్తుంటారు. ఇక పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్‌లో గత రెండు దశాబ్దాలుగా.. అధికారం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఐదేళ్లకోసారి మారుతూ వస్తోంది.

మధ్యప్రదేశ్ ముఖ్యాంశాలు....
విస్తీర్ణంలో రెండో అతి పెద్ద రాష్ట్రం 3,08,245 చ.కి.మీ.
జనాభాలో ఐదో అతి పెద్ద రాష్ట్రం 7.25 కోట్లు
ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 5.05 కోట్లు
రాష్ట్ర శాసనసభ స్థానాలు 230 (ప్రస్తుతం: బీజేపీ 165, కాంగ్రెస్ 58)
రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 29 (ప్రస్తుతం: బీజేపీ 27, కాంగ్రెస్ 2)

ఈ పరిస్థితుల్లో.. హిందీ రాష్ట్రాల్లో ప్రధానమైనదిగా పరిగణించే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను.. రాబోయే కేంద్ర రాజకీయాలకు దిక్సూచిగా చూస్తున్నారు.

పైగా ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై వివిధ సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్‌ వైపు.. మరికొన్ని సర్వేలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నాయి. మొత్తంగా ఎన్నికల పోరు హోరా హోరీగా ఉంటుందని అంచనా.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గిట్టుబాటు ధరలు, రుణ మాఫీ డిమాండ్‌తో 2017లో మధ్యప్రదేశ్ రైతుల ఆందోళన హింసాత్మకంగా మారి.. పోలీసు కాల్పుల్లో 8 మంది రైతులు చనిపోయారు

ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలేమిటి?

రాష్ట్రంలో ఎన్నికలను ప్రధానంగా ప్రభావితం చేసే వర్గం.. వ్యవసాయంపై ఆధారపడ్డ 70 శాతం ప్రజలే. మరోవైపు ఆదివాసీ జనాభా రాష్ట్రంలో 45 శాతం మంది ఉన్నారు. వారు ఎటువైపు ఉంటారన్నది చాలా స్థానాల్లో గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది.

వ్యవసాయ సంక్షోభం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి కేంద్ర సంస్కరణల ప్రభావం, పెరుగుతున్న నిరుద్యోగిత, కులాల మధ్య విభేదాలు తదితర అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయవచ్చునని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో తాజా ఎన్నికలు రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్.. రెండు పార్టీలకూ చాలా ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇరు పక్షాలూ హోరాహోరీగా ప్రచారం చేశాయి. గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

ఈసారి తిరిగి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. అధికారం మళ్లీ తమదేనని బీజేపీ ధీమాగా ఉంది.

ఈ ఎన్నికల్లో బీజేపీ మరోసారి సునాయాసంగా గెలిస్తే.. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు సులభంగానే ఉంటుందని భావించవచ్చునని పరిశీలకుల అభిప్రాయం.

అలా కాకుండా.. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల సరళి కూడా బీజేపీకి ప్రతికూలంగానూ, కాంగ్రెస్‌కు కొంత అనుకూలంగానూ ఉండవచ్చునని అంటున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)