ఉర్జిత్ పటేల్: ‘నోట్ల రద్దు ప్రభావం చాలా తక్కువ’ : ప్రెస్ రివ్యూ

  • 28 నవంబర్ 2018
Image copyright PUNIT PARANJPE

నోట్ల రద్దు ప్రభావం చాలా తక్కువగా ఉందని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నట్లు సూర్య కథనం తెలిపింది.

మంగళవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరైన ఉర్జిత్ పటేల్.. రూ.500, రూ.1000 నోట్ల రద్దు సరైన నిర్ణయమే అన్నారు. నోట్ల రద్దు ప్రభావం తక్కువ కాలమే ఉందని కమిటీకి తెలిపారు.

ఆర్బీఐ నిర్వహణ వ్యవహారాల్లో ఇటీవల కేంద్ర జోక్యం పెరిగిందన్న విమర్శల నేపథ్యంలో సెక్షన్ 7ను ప్రయోగించారనే ప్రచారంపై పార్లమెంటరీ కమిటీ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులపైనా ఆయనను ప్రశ్నించింది.

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. కమిటీ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై తాను పది రోజుల్లో సమాధానం ఇస్తానని ఉర్జిత్ పటేల్ చెప్పినట్లు సూర్య తెలిపింది.

Image copyright Hindustan Times

కాంగ్రెస్-టీఆర్ఎస్‌లది డమ్మీ ఫైట్: మోదీ

కేసీఆర్‌వన్నీ సగం పనులే అని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో విమర్శించారని వెలుగు కథనం పేర్కొంది.

ఆఖరికి ఆయన తన ఐదేళ్ల పాలన కూడా పూర్తిచేయలేదని మోదీ అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలకు తొమ్మిది నెలల ముందే విముక్తి దొరికిందని మోదీ వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌ను లండన్‌లా మారుస్తానన్న మాటలు ఏమయ్యాయని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్-టీఆర్ఎస్‌లది డమ్మీ ఫైట్ అని మోదీ అన్నారు.

సర్దార్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని, లేకపోతే హైదరాబాద్‌కు పాకిస్తాన్ వీసా తీసుకొని రావాల్సి వచ్చేది అన్నారు. రాహుల్‌ను పక్కన కూర్చోబెట్టుకుని సోనియా... టీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అని విమర్శించడం పెద్ద జోక్ అని మోదీ అన్నారు.

Image copyright TRS Party/Facebook

ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేసీఆర్.. ప్రధాని హోదాలో ఉంటూ ఇలా తప్పుడు మాటలు ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణలో కరెంట్ సమస్య ఉందని రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని, లేదంటే ప్రధాని క్షమాపణ చెప్పి అబిడ్స్ వద్ద ముక్కు నేలకు రాయాలని కేసీఆర్ సవాలు విసిరారు.

కేంద్రంలో మతగజ్జి ప్రభుత్వం ఉందని కేసీఆర్ అన్నారు. దేశం వెనుకబాటుకు కాంగ్రెస్, బీజేపీలే కారణమన్న కేసీఆర్.. కేంద్రంలో రెండూ పార్టీలు కాని ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందన్నట్లు వెలుగు కథనం పేర్కొంది.

Image copyright Chandramukhi Muvvala/Facebook

ఆచూకీ లభించని చంద్రముఖి

గోషామహల్‌ నియోజకవర్గం బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థి ట్రాన్స్‌జెండర్‌ చంద్రముఖి అదృశ్యమయ్యారని ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు-2 ఇందిరానగర్‌లో నివసిస్తున్న చంద్రముఖి.. సోమవారం రాత్రి 11 గంటల వరకు సన్నిహితురాలు సోనారాథోడ్‌ మరికొందరితో కలిసి ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామునే సోనా పని మీద బయటకు వెళ్లారు. 8 గంటలకు తిరిగి వచ్చి చూసేసరికి చంద్రముఖి కనిపించలేదు. ఆమె ఫోన్‌ కూడా పని చేయడం లేదు.

అంతటా వెతికినా చంద్రముఖి ఆచూకీ లభించకపోవడంతో సోనా బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రముఖి ఏదైనా ఆపదలో చిక్కుకున్నారేమో అని సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆమె అదృశ్యానికి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌ డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌జెండర్‌ పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేకే గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించుకుపోయారని ఆయన ఆరోపించినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

మిథాలీ రాజ్ Image copyright Hindustan Times

మొదటిసారి కుంగుబాటుకు గురయ్యా: మిథాలీ రాజ్

కోచ్ రమేశ్ పొవార్, సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ తన నాశనం కోరుకుంటున్నారని గురయ్యానని భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.

బీసీసీఐ సీఈవో జోహ్రీ, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సాబాకరీంకు రాసిన లేఖలో మిథాలీ.. రెండు దశాబ్దాల కెరీర్‌లో తాను మొదటిసారి కుంగుబాటుకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

టీ20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ నుంచి తప్పించడానికి రమేశ్ పొవార్, సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీలదే ప్రధాన పాత్ర అని ఆరోపించారు. తనను జట్టు నుంచి తప్పించేందుకు ఎడుల్జీ తన హోదాను ఉపయోగించారని విమర్శించారు.

హర్మన్‌ప్రీత్‌పై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదన్న మిథాలి... కొత్తగా జట్టుతో చేరిన కోచ్ రమేశ్ పొవార్ తనను మానసికంగా వేధించారని అన్నారు. మిగతా క్రికెటర్ల మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంగా సలహాలు సూచనలు అందించిన ఆయన కనీసం తన ప్రాక్టీస్‌ను పట్టించుకోలేదని... తాను ఆయనతో మాట్లాడేందుకు వెళ్లినప్పుడల్లా దూరంగా వెళ్లిపోయేవాడని తెలిపారు. మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఫోన్ కేసి చూస్తూ తనను పట్టించుకోకుండా అవమానించాడని మిథాలీ ఆరోపించినట్లు నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)