ఒకే వేదికపై చంద్రబాబు, రాహుల్ గాంధీ: ‘నేను నిర్మించింది హైదరాబాద్‌ కాదు.. సైబరాబాద్‌’ - తెలంగాణ ఎన్నికలు 2018

  • 28 నవంబర్ 2018
చంద్రబాబు నాయుడు Image copyright tdp.ncbn.official/facebook

తెలంగాణ ఎన్నికల సందర్భంగా రాజకీయంగా అరుదైన సందర్భం ఆవిష్కృతమైంది. గతంలో ఎన్నడూ కలిసి పనిచేయని పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు ఈ ఎన్నికల్లో ఒకే కూటమిలో కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఆ రెండు పార్టీల అధ్యక్షులు రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడులు ఒకే వేదికను పంచుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ పాలనలపై విరుచుకుపడ్డారు.

‘‘నేను చాలాసార్లు ఖమ్మం వచ్చాను. ఈ రోజు మీ ఉత్సాహం చూస్తోంటే.. నూతన చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు’’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

‘మొట్టమొదటి సారి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ ఒకే వేదికను పంచుకుంది. ఇది చారిత్రక అవసరం, ఖమ్మం సమావేశం చరిత్రలో మిగిలిపోతుంది. అవునా.. కాదా.. తమ్ముళ్లూ మీరే చెప్పాలి’ అని చంద్రబాబు అన్నారు.

దేశంలోని అన్ని పార్టీలూ ఎన్డీయేకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని.. దానికి ప్రజాకూటమి రూపంలో తెలంగాణ వేదికగా నాంది పడిందని అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని.. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన సీబీఐ, ఈడీ, ఆర్బీఐ వంటి సంస్థలే కాకుండా గవర్నర్ వ్యవస్థా పూర్తిగా నీరుగారిందన్నారు.

గత నాలుగున్నరేళ్ల ఎన్డీయే పాలనలో ఎవరికీ ప్రయోజనం కలగలేదన్నారు.

పెద్ద నోట్లు రద్దు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. దీనికి కారణం ఎన్డీయేనని ఆరోపించారు. జీఎస్టీ సరిగా అమలు చేయకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తి వృద్ధి రేటు, రూపాయి విలువ పతనం అయ్యాయన్నారు. ధరలు పెరిగి పేదలు, రైతులు అవస్థలు పడుతున్నారన్నారు.

Image copyright Getty Images

‘కేంద్రాన్ని తప్పు పడితే దాడులు చేస్తున్నారు’

దేశంలో అసహనం పెరిగిపోయిందని.. కేంద్రాన్ని తప్పుపడితే దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కలిశాయన్నారు. 37 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పోరాడామని.. కానీ, ఇప్పుడు ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం తమ రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందని అందరూ తమతో కలిసి రావాలని అన్నారు.

తెలుగుజాతి కోసం ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి ఐక్యత, సాధికారత కోసం నిత్యం పనిచేస్తుందన్నారు.

విభజనతో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాల్లోని తెలుగు జాతికోసం పనిచేస్తున్నామన్నారు.

''కేంద్రం విభజన హామీలను అమలు చేయలేదు. ఖమ్మంలోని బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి మొండిచేయి చూపించింది. గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయలేదు'' అన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరు?

కేంద్రం ఇంతగా అన్యాయం చేస్తున్నా కేసీఆర్ ప్రశ్నించడం లేదని ఆరోపించారు.

ఏపీలో తాము నీటిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో వివరించారు.

దేవాదుల, మాధవరెడ్డి లిఫ్ట్ కెనాల్, కల్వకుర్తి, బీమా వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ తన హయాంలోనే మొదలుపెట్టామన్నారు.

విద్యకు తాను ఎంతో ప్రాధాన్యం ఇచ్చానని.. ఇక్కడి మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు అన్నీ తన హయాంలోనివేనని.. ఇప్పుడొచ్చిన టీఆర్ఎస్ హయాంలో ఇవేమీ ఏర్పాటు కాలేదన్నారు.

తాను హైదరాబాద్ నగరాన్ని నిర్మించానని చెప్పుకొంటున్నానని ఎద్దేవా చేస్తున్నారని.. కానీ, తాను హైదరాబాద్ నిర్మించానని ఎన్నడూ చెప్పలేదని, తన హయాంలో సైబరాబాద్ నిర్మించామన్నారు.

Image copyright KalvakuntlaChandrashekarRao/fb

‘కేసీఆర్ నన్ను తిడుతున్నారు.. అయినా నేను తిట్టను’

కేసీఆర్ తనను దూషిస్తున్నారని.. ఆయన ఎందుకు తిడుతున్నారో తనకు తెలియడం లేదని అన్నారు. ఆయన తనను తిడుతున్నా.. తాను మాత్రం తిట్టనని చంద్రబాబు అన్నారు. తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సహకరించిందా లేదా.. తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉండేవాడా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం తాను పనిచేస్తానని అన్నారు.

‘వీవీప్యాట్‌ను నేను తెచ్చా’

దేశంలో ఎన్డీయే, ఎన్డీయే వ్యతిరేక కూటములు ఉన్నాయని.. దేశంలో ప్రస్తుతం ఎన్డీయే పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలని.. వీవీప్యాట్ ఈవీఎంలలో మీరు వేసే ఓటును చెక్ చేసుకోవాలని సూచించారు.

‘‘‘టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని.. ఆ రోజు నేనే పోరాడా.. ఆ రోజు పోరాడి వీవీప్యాట్ తీసుకొచ్చాం. ప్రజాస్వామ్యంలో మనం ఎవరికి ఓటేశామో చూసే హక్కు మనకుంది. నచ్చిన వ్యక్తికి ఓటేసే హక్కుంది. అనుమానం వస్తే పేపర్ బ్యాలట్లు కూడా కౌంట్ చేయాల్సిన అవసరముంది. ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలి.’’

ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలంటూ ఈవీఎంలలో మోసాలు జరగొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రజా కూటమికి 100 సీట్లొస్తాయన్నారు.

‘హైదరాబాద్ బంగారు బాతు’

దేశంలో ఎవరికీ లేనట్టి బంగారుబాతులాంటి హైదరాబాద్ నగరం ఉంది.. అవకాశమివ్వాలే కానీ ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్న యువత తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ వాతావరణం, భూమి అన్నీ అనుకూలమైనవే. వీటన్నిటినీ సరిగా ఉపయోగించుకుంటే దేశంలో తెలంగాణకు మించిన రాష్ట్రం ఉండదు. కానీ, గత నాలుగున్నరేళ్లలో ఇక్కడ ఏమీ జరగలేదని అన్నారు.

బీజేపీకి హెలికాప్టర్లే ఉన్నాయి కానీ, ఓట్లు లేవని చివర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము కదులుతున్నామని.. తమతో కలిసివస్తారా లేదా అని టీఆరెస్, ఎంఐఎంలను ప్రశ్నించారు.

ఎంఐఎంకు ఓటేస్తే మోదీకి ఓటేసినట్లేనన్నారు.

ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఏమన్నారో చదివేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)