ఒకే వేదికపై రాహుల్ గాంధీ, చంద్రబాబు: ‘టీఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్.. అది బీజేపీ బీ టీమ్’ - తెలంగాణ ఎన్నికలు 2018

  • 28 నవంబర్ 2018
రాహుల్ గాంధీ Image copyright Getty Images

తెలంగాణలో ప్రతి కుటుంబంపైనా రూ.2 లక్షల అప్పు ఉందని, ప్రతి వ్యక్తిపైనా రూ.60 వేలు అప్పు ఉందని.. మరోవైపు కేసీఆర్ కుమారుడి ఆస్తులు మాత్రం 400 శాతం పెరిగాయని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తెలంగాణ పర్యటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కొడంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు.

ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో కలిసి వేదికను పంచుకున్నారు.

ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఏర్పాటైన ఈ ప్రజాకూటమి దేశానికి దిక్సూచి కానుందని అన్నారు.

ప్రజల ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని అర్థమైపోయిందన్నారు.

ఇది కేవలం తెలంగాణకు చెందిన పోరాటం కాదని.. యావద్భారతదేశ భవితకు సంబంధించిన పోరాటమని అన్నారు.

రాహుల్ గాంధీ ప్రసంగం.. ఆయన మాటల్లోనే..

దిల్లీలో మోదీ ఒకదాని తరువాత ఒక్కో వ్యవస్థను అన్నిటినీ నాశనం చేస్తున్నారు. సుప్రీంకోర్టు, సీబీఐ, ఆర్బీఐ, ఎన్నికల కమిషన్.. ఇలా ప్రతి వ్యవస్థనూ మోదీ నాశనం చేస్తున్నారు.

తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణలోని ఖాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, ఆర్థిక ప్రోత్సాహకాలు హామీలు ఉన్నాయి.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. మోదీ వీటిని అమలు చేయలేదు.

కాంగ్రెస్ పార్టీ వీటన్నిటీ పూర్తి చేయాలనుకుంటోంది.

కేసీఆర్ పోయి మోదీకి మద్దతిస్తుంటే... మోదీ మాత్రం విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు. దీనిపై ప్రజలు కేసీఆర్‌ను నిలదీయాలి.

మీరు నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెలంగాణను తెచ్చుకున్నారు.

Image copyright Getty Images

‘పేరు మార్చినందుకు రూ.40 వేల కోట్లు.. ప్రపంచంలోనే అత్యధిక వ్యయం దీనికే’

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ 50 వేల కోట్లు ఇస్తే.. కేసీఆర్ దాని పేరును కాళేశ్వరంగా మార్చి రూ.90 వేల కోట్లకు అంచనాలు పెంచారు. కేవలం పేరు మార్చి రూ.40 వేల కోట్ల అంచనాలు పెంచారు. ప్రపంచంలోనే పేరు మార్పు కోసం ఇంత ఖర్చు ఎవరూ చేయలేదేమో.

మిషన్ కాకతీయ, భాగీరథలో పాత చెరువులకు రంగులద్ది డబ్బులన్నీ ఖర్చు చేశారు.

తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.17 వేల కోట్ల మిగులుతో అప్పగించాం.. ఇప్పుడు తెలంగాణపై రూ.2 లక్షల కోట్ల అప్పుంది. ప్రతి కుటుంబంపై రూ.2 లక్షల అప్పుంది. ఇక్కడి ప్రతి మనిషిపై రూ.60 వేల అప్పుంది.

ప్రజలు అప్పులబారిన పడుతుంటే కేసీఆర్ కుటుంబం మాత్రం అభివృద్ధి చెందుతోంది.

తెలంగాణ ఖజానా మొత్తం కేసీఆర్, ఆయన కుటుంబానికే చెందుతోంది.

Image copyright Getty Images

‘తెలంగాణలో బీ టీం.. దిల్లీలో ఏ టీం’

తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఓ వైపు.. రైతులు, యువత, పేదలు అంతా మరో వైపు ఉన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి గెలిచిన తరువాత దేశస్థాయిలోనూ గెలుస్తుందాన్నారు. తొలుత తెలంగాణలో మోదీ బీ టీంపై గెలిచి.. ఆ తరువాత దిల్లీలో మోదీ ఏ టీంను ఓడిద్దామన్నారు.

నిన్న మోదీ ఇక్కడికొచ్చి టీఆరెస్, కాంగ్రెస్ మధ్య తేడా లేదన్నారు. లోక్ సభ, రాజ్యసభలో కూడా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి బిల్లుకూ కేసీఆర్ పార్టీ మద్దతిచ్చింది. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాడింది. నోట్ల రద్దును టీఆర్ఎస్ సమర్థించింది.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మద్దతిచ్చింది. అవిశ్వాసంలో, గబ్బర్ సింగ్ ట్యాక్స్‌లోనూ మద్దతిచ్చింది. కాంగ్రెస్ మాత్రం ఈ అన్ని సందర్భాల్లో కాంగ్రెస్ బీజేపీతో పోరాడింది.

మరి అలాంటప్పుడు టీఆర్ఎస్ బీజేపీకి మద్దతిస్తున్నట్లా కాదా. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ కూడా మోదీ మరోసారి గెలవాలని కోరుకుంటున్నాయి.

టీడీపీ, కోదండరాం సహా కూటమిలోని అన్ని పార్టీలూ కలిసి మోదీ, కేసీఆర్‌లను ఓడిస్తాయి.

తెలంగాణ యువతకు కేసీఆర్, మోదీలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇక్కడ కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇంకెవరికీ ఉద్యోగం రాలేదు.

ఇక్కడ రైతులు కష్టాలు పడుతున్నారు. మద్దతు ధర అడిగితే లాఠీ చార్జి చేస్తున్నారు. వారి భూమి హక్కును లాక్కుంటున్నారు. సర్కారు భూ మాఫియా నడిపిస్తోంది.

తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇన్‌స్టాల్‌మెంట్లలో చేసిన మాఫీ ఎందుకూ పనికిరాలేదన్నారు.

‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే.. ప్రజలకు ఏం చేస్తామంటే..’

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు.

17 పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు.

తెలంగాణ కోసం పోరాడిన వారిని కేసీఆర్ మరిచిపోయారని.. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మేం ఇస్తామని. వారిపై ఉన్న రాజకీయ కేసులను ఎత్తేస్తామని అన్నారు.

మా ముఖ్యమంత్రి రోజులో 16 గంటలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కష్టపడతారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష రుణ మాఫీ చేస్తాం. మహిళా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు ఇస్తాం.

‘‘కూటమి సీఎం నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తారు. ప్రతి మండలంలోనూ 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. ప్రతి వ్యక్తికీ ఉచితంగా రూ.5 లక్షల విలువైన వైద్యం అందిస్తాం. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తాం’’ అన్నారు.

నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.3 వేల నిరుద్యోగ భృతి, మొదటి సంవత్సరంలోనే తెలంగాణ నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం.

'టీఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్.. బీజేపీ బీ టీమ్'

'పార్లమెంటులో ప్రతి బిల్లుకు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కు, సంఘ్ పరివార్‌కు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. టీఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. దాని పేరు తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్. ఇది బీజేపీ బీ టీమ్' అని అంతకు ముందు కొడంగల్‌ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఆరోపించారు.

''టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల లక్ష్యం జాతీయ స్థాయిలో బీజేపీ ఓడిపోకూడదు.. అధికారంలోనే కొనసాగాలి అని. కేసీఆర్ నిజంగానే తెలంగాణ వాది అయితే నరేంద్ర మోదీకి మద్దతు ఇచ్చేవారు కాదు. మీరెందుకు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని నేను టీఆర్ఎస్ ఎంపీలను అడిగాను. వాళ్లు స్పష్టంగా చెప్పారు.. 'మాకు పై నుంచి ఆదేశాలు వస్తాయి. ముఖ్యమంత్రి ఏం చెప్తారో అది మేం చేస్తాం' అని. ఏది ఏమైనా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగాలన్నదే వీరి లక్ష్యం'' అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)