కిసాన్ ముక్తి మార్చ్: పార్లమెంట్ కేవలం కార్పొరేట్ సంస్థల కోసం మాత్రమే కాదు, రైతుల కోసం కూడా పని చేయాలి కదా? - సాయినాథ్

  • 29 నవంబర్ 2018
పార్లమెంట్ మార్చ్, రైతులు

'పార్లమెంట్ మార్చ్' కోసం వేల సంఖ్యలో రైతులు దిల్లీ చేరుకున్నారు. రైతులను వ్యవసాయ రుణాల నుంచి విముక్తి చేసేలా చట్టం చేయాలని వీరు కోరుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఇలాంటి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

పొలాలలో వ్యవసాయం చేసుకోవాల్సిన రైతులు ఎందుకు మళ్లీ మళ్లీ ఇలాంటి ఆందోళనలు చేపడుతున్నారు?

రైతుల నిరసన ప్రదర్శనలు మంచివనే నేను భావిస్తున్నాను. అయితే ప్రభుత్వం ఈ నిరసనలపై ఎలా ప్రతిస్పందిస్తుందో తెలీదు.

20 ఏళ్ల వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఇన్నాళ్లూ ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

వాళ్లు తమ ప్రజాస్వామిక హక్కులను ఉపయోగించుకుంటున్నారని వాళ్ల నిరసనలు చెబుతున్నాయి.

మీకేం కావాలి? ఆత్మహత్యలా? ప్రజాస్వామిక హక్కులను ఉపయోగించుకోవడమా?

పార్లమెంట్ రైతుల కోసమూ పని చేయాలి కదా..

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం 2014లో స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలను 12 నెలల్లో ఆమోదిస్తామని తెలిపింది. వాటిలో కనీస మద్దతు ధరను 50 శాతం పెంచుతామన్న హామీ కూడా ఉంది.

కానీ అదే ప్రభుత్వం 2015లో కోర్టులోను, సమాచార హక్కు కింద ఇచ్చిన సమాధానంలోను.. తాము ఆ పని చేయలేమని చేతులెత్తేసింది. దాని వల్ల మార్కెట్ దెబ్బ తింటుందని పేర్కొంది. 2016లో వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ అసలు తాము అలాంటి హామీనే ఇవ్వలేదన్నారు.

ఇప్పుడు మధ్యప్రదేశ్ వ్యవసాయ నమూనాను చూపెడుతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, స్వామినాథన్ కమిషన్ కన్నా ముందుకు వెళ్లిపోయారు.

రైతుల జీవితాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. అయినా వాళ్ల గురించి ఎవరూ పట్టించుకోరు.

కొన్ని రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ, తాము ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం లేనందువల్లే అనేక హామీలు ఇచ్చామని అన్నారు.

2018లో అరుణ్ జైట్లీ చేసిన బడ్జెట్ ప్రసంగంలోని 13, 14 పేరాలను చూడండి.

''అవును, మేము హామీ ఇచ్చాం. వాటిని అమలు పరిచాం కూడా'' అని జైట్లీ అన్నారు.

ఈ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఆరు భిన్నమైన ప్రకటనలు చేసింది. అలాంటి ఈ ప్రభుత్వం తర్వాతేం చెబుతుందో ఎవరికీ తెలీదు.

ఇప్పుడు రైతులు అడుగుతున్న ప్రశ్నలన్నీ ప్రజాస్వామ్య బద్ధమైనవి. మన పార్లమెంట్ కేవలం కార్పొరేట్ సంస్థల కోసం మాత్రమే కాదు, రైతుల కోసం కూడా పని చేయాలి కదా?

Image copyright AFP

వ్యవసాయ రుణాలు పెరిగింది నిజమే కానీ..

వ్యవసాయ రుణాలు పెరిగాయన్న మాట వాస్తవమే. కానీ గత 20-25 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే, ప్రతి ఏటా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగాల్సి ఉండగా, అవి తగ్గుతూ వచ్చాయి. వ్యవసాయానికి మరింత ఎక్కువ కేటాయింపులు ఉండాలన్నది నా అభిప్రాయం.

నాకు గుర్తున్నంత వరకు వ్యవసాయానికి అత్యధిక కేటాయింపులు జరిపింది వీపీ సింగ్ చివరి బడ్జెట్‌‌లో.

వ్యవసాయ రంగంలో సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి వ్యవసాయానికి కనీస బడ్జెట్ ఉండాలనేది నా అభిప్రాయం. అలాగే వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు కూడా పెరగాలి.

పి.చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, అరుణ్ జైట్లీ.. వీళ్లంతా వ్యవసాయ రుణాలను పెంచారు. కానీ అవి రైతులకు చేరడం లేదు.

అవి రైతులతో వ్యాపారం చేస్తున్న వాళ్లకు వెళుతున్నాయి. మీరు మహారాష్ట్రను చూడండి. అన్ని కుంభకోణాలలోనూ మహారాష్ట్ర ముందుంటుంది.

నాబార్డ్ వ్యవసాయ రుణాలలో 57శాతం ముంబై నగరం, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్లాయి. ముంబైలో రైతులు ఉన్నారా? వాళ్లతో వ్యాపారం చేసే వాళ్లు మాత్రమే ఉన్నారు.

కౌలు రైతుల నుంచి ఎన్ని లక్షల కోట్లను లాక్కుని కంపెనీల చేతుల్లో పెట్టారో లెక్క లేదు.

అందుకే వ్యవసాయ రుణాలు పెరిగాయి కానీ అవి వ్యవసాయం చేసే రైతులకు చేరడం లేదంటున్నాను.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)