చంద్రముఖి తిరిగొచ్చారు: ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల ప్రాతినిథ్యం ఎప్పుడు మొదలైంది

  • 29 నవంబర్ 2018
ట్రాన్స్‌జెండర్లు ఎన్నికల్లో ప్రాతినిథ్యం Image copyright chandramukhi/fb
చిత్రం శీర్షిక చంద్రముఖి

‘మా హక్కుల కోసం పోరాడటానికి ఎన్నికలను ఒక వేదికగా ఎంచుకున్నా’ అని చంద్రముఖి తన ప్రచారంలో చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి ట్రాన్స్ జెండర్ ఆమె. ఎన్నికల్లో పోటీకి దిగడం, అదృశ్యమై తిరిగి రావడంతో చంద్రముఖి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు.

ఆమె బుధవారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌లో కనిపించడంతో పోలీసులు బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌కి తరలించారు. తర్వాత గురువారం ఆమెను హైకోర్టులో ప్రవేశపెట్టారు.

అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడారు.

‘‘నేను మంగళవారం ఆటో ఎక్కి అబిడ్స్ వెళ్ళాను. అక్కడ ఇంకో ఆటో ఎక్కాను. కానీ అదే ఆటోలో ఇంకో ఇద్దరు ఎక్కి నాకు కత్తి చూపించి బెదిరించారు. ఒక ఇయర్ఫోన్ దాంతో పాటు ఒక ఫోన్ నాతో ఉంచారు. ఐదు నిముషాల వరకు ఎం జరుగుతోందో నాకు అర్ధం కాలేదు. కానీ చెవిలో నాతో మాట్లాడుతున్నతను నన్ను బెదిరించాడు. ప్రణయిని చంపినట్టే నన్ను చంపుతానని బెదిరించారు. కాబట్టి వారు చెప్పినట్టు చేస్తూ వెళ్ళాను. నేను బస్సు లో ప్రయాణం చేస్తూ హైదరాబాద్ నుంచి విజయవాడ అక్కడ నుంచి నెల్లూరు అక్కడ నుంచి చెన్నై చేరాను. చెన్నై చేరాక చీకటిగా ఉండటంతో చెవిలో ఉన్న హెడ్ఫోన్ అక్కడే పడేసి ఆటో ఎక్కి పారిపోయాను. ఎవరు ఫాలో అవట్లేదు అని నిర్దారించుకొని తిరుపతి బస్సు ఎక్కి అక్కడినుంచి హైదరాబాద్ చేరుకున్నాను." అని తెలిపారు.

చంద్రముఖి తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేయడంతో కోర్టు చంద్రముఖిని తమ ముందు హాజరుపరచాలని కోరింది. దీంతో తెలంగాణ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి చంద్రముఖి ఆచూకీ కోసం గాలింపులు జరిపారు.

హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థిగా చంద్రముఖి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఆమె ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ల సంఘాలు, బీఎల్ఎఫ్ కార్యకర్తలు ప్రచారంలో ఆమెకు సహకరిస్తున్నారు.

‘‘తమ్ముడు, నీ ఓటు నాకే వేయ్యాలి. మమ్నల్ని మనుషులుగా గుర్తించాలి అంటూ మెడలో నీలం రంగు కండువా వేసుకొని ఓ మహిళ మా ఇంటికి ప్రచారానికి వచ్చారు. టీవీలో చూశాకే ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలిసింది’ అని గోషామహల్‌కు చెందిన రమేశ్... చంద్రముఖి గురించి బీబీసీతో అన్నారు.

1994లో ట్రాన్స్ జెండర్లను థర్ట్‌జెండర్లుగా గుర్తించిన ఎన్నికల సంఘం వారికి ఓటు హక్కు కల్పించడంతో ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల ప్రాతినిథ్యం మొదలైంది.

ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 2,739 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

Image copyright chandramukhi/fb

ఓటర్ల నుంచి అభ్యర్థుల వరకు...

వివక్ష... విస్మరణ...నుంచి రాజ్యాధికారం దిశగా ట్రాన్స్‌జెండర్లు అడుగులు వేస్తున్నారు. భారత ఎన్నికల్లో థర్డ్ జెండర్ల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కేవలం ఓటర్లుగానే కాదు అభ్యర్థులుగానూ పోటీపడుతున్నారు.

భారత ఎన్నికల సంఘం 1994 నుంచి ట్రాన్స్‌జెండర్లకు ఓటు హక్కు కల్పించింది. అంతకు ముందు ట్రాన్స్ జెండర్లను ఎన్నికల సంఘం మహిళల కిందనే పరిగణిస్తూ వారి వివరాలను ఓటర్లు లిస్టులో పేర్కొనేవారు.

అయితే, సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు 2009 నుంచి ఎన్నికల సంఘం థర్ట్ జెండర్ కాలమ్‌ను ఓటరు లిస్టులో ప్రవేశపెట్టింది.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4.9 లక్షల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.

Image copyright Shabnam Mausi/fb
చిత్రం శీర్షిక షబ్నం మౌసీ

చరిత్ర సృష్టించిన షబ్నం మౌసీ

భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా చట్టసభలకు ఎన్నికైన ట్రాన్స్ జెండర్‌గా షబ్నం మౌసీ చరిత్ర సృష్టించారు.

2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని సోహగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో షబ్నం మౌసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 17,800 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

తొలి ట్రాన్స్ జెండర్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. అయితే, 2008 ఎన్నికల్లో ఆర్జేడీ టికెట్‌పై అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

మధు కిన్నార్...తొలి ట్రాన్స్ జెండర్ మేయర్

ఛత్తీస్‌గడ్‌లోని రాయిగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 2015లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ మధు కిన్నార్ పోటీచేశారు.

ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులను కాదని ప్రజలు మధు కిన్నార్‌కే మద్దతు పలికారు. బీజేపీ అభ్యర్థి మహవీర్ గురుజీ కంటే 4000 ఓట్ల మెజారిటీని సాధించిన కిన్నార్ దేశంలోని తొలి ట్రాన్స్ జెండర్ మేయర్‌గా చరిత్ర సృష్టించారు.

Image copyright ANKIT SRINIVAS

రాహుల్ గాంధీపై పోటీ

ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకరావచ్చని ట్రాన్స్ జెండర్లు భావిస్తున్నారు.

ఇందు కోసం వారు కీలకమైన నేతలు పోటీచేసే నియోజకవర్గాల నుంచే బరిలోకి దిగుతున్నారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ సోనమ్ కిన్నర్ రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన ఆమేథి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

ఇదే ఎన్నికల్లో తమిళనాడులోని మధురై నుంచి శరత్ కుమార్ కు చెందిన సముతువ మక్కల్ కట్చీ పార్టీ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ భారతి కన్నమ్మ పోటీ చేశారు. కీలకమైన ఆర్కే నగర్ నుంచి దేవి అనే మరో ట్రాన్స్ జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

2017లో ఉత్తరాఖండ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజనీ రావత్ స్వతంత్ర అభ్యర్థిగా రాయిపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2012లో ఉత్తర ప్రదేశ్‌లోని ఆయోధ్య అసెంబ్లీస్థానం నుంచి ట్రాన్స్ జెండర్ గుల్షన్ బిందో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బిందో గెలవనప్పటికీ 22 వేల ఓట్లు సాధించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)