కిసాన్ ముక్తి మార్చ్: ‘నాన్న, అన్నను పోగొట్టుకున్నాం.. సాయం కోసం దిల్లీ వచ్చాం... న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంతో మాకు ఎలాంటి ఉపయోగం లేదు’

  • 30 నవంబర్ 2018
అశ్విని, రమ్య, నిర్మల
చిత్రం శీర్షిక అశ్విని, రమ్య, నిర్మల

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు, ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్న అన్నదాతలు దేశ రాజధాని దిల్లీ బాట పట్టారు. శుక్రవారం నాడు దిల్లీలోని పార్లమెంటు భవనం వరకు చేరుకునే ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు అనేక రాష్ట్రాల నుంచి వేలాది రైతులు తరలి వచ్చారు.

అలా వచ్చిన వాళ్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు, వాళ్ల కుటుంబీకులు కూడా ఉన్నారు. వాళ్లలో ముగ్గురు అమ్మాయిలు బీబీసీతో మాట్లాడారు. ఇద్దరమ్మాయిల తండ్రులు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతే, మరో అమ్మాయి అన్నయ్య కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

గతేడాది కూడా తాము దిల్లీకి వచ్చి తమకు న్యాయం చేయాలని పోరాడమని, కానీ ఎలాంటి ఫలితమూ లేదని వాళ్లు చెబుతున్నారు.

ఆ అమ్మాయిల ఆవేదన వారి మాటల్లోనే...

‘మాది జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామం. పోయిన ఏడాది కూడా ఇలానే దిల్లీ వచ్చాం. కానీ ఎలాంటి ఉపయోగమూ లేదు. కనీసం ఇప్పుడన్నా న్యాయం చేస్తారేమోనని పది మంది కలిసి వచ్చాం.

మాకు న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంతో మాకు ఎలాంటి ఉపయోగం లేదు.

మేం ముగ్గురు అక్కచెల్లెళ్లం. మాకు ఒక అన్నయ్య ఉండేవాడు. మాకు సొంత పొలం లేదు. పదెకరాల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాం. పత్తి, మొక్కజొన్న, వరి, కందులు పండిస్తాం. వర్షాలు లేక, గిట్టుబాటు ధరలు లేక అనేక సమస్యలు చుట్టుముట్టాయి.

బ్యాంకు నుంచి మూడు లక్షలు, బయటి నుంచి మరో మూడు లక్షలు అప్పు చేసి పంట వేశాం. ఆ పంట చేతికి రాకపోవడంతో మా అన్నయ్యపైన ఒత్తిడి పెరిగిపోయింది. దాంతో తాను ఏం ఆలోచించుకున్నాడో ఏమో, మాకెవ్వరికీ ఏం చెప్పకుండా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇప్పుడు అమ్మానాన్నా చిన్నచిన్న పనులు చేస్తున్నారు. కానీ, ఆ డబ్బు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది తప్ప అసలు అప్పు తీరట్లేదు.

ఇప్పుడు మా అక్కచెల్లెళ్లు ముగ్గురికీ పెళ్లిళ్లు కాలేదు. మా భవిష్యత్తు ఏంటో తెలీట్లేదు. అందుకే ఏమైనా సాయం అందుతుందేమోనని ఇక్కడి దాకా వచ్చాం’ అని తన కథను వివరించారు అశ్విని. ఆమె ప్రస్తుతం చేర్యాల ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటోంది.

చిత్రం శీర్షిక వరంగల్‌కు చెందిన శోభ కూడా కిసాన్ ముక్తి మార్చ్‌లో పాల్గొన్నారు

అశ్వినితో పాటు రమ్య అనే మరో అమ్మాయి కూడా రైతుల ర్యాలీలో పాల్గొన్నారు.

‘మాది సిద్ధిపేట జిల్లా చించినకోట గ్రామం. మా నాన్న చంద్రయ్య ఆరెకరాల పొలం కౌలుకు తీసుకున్నారు. అప్పుడు వర్షాల్లేక పంటలు పండలేదు. అప్పటికే బయట మూడు లక్షలు, బ్యాంకులో లక్ష రూపాయలు తీసుకున్నాం. వాటికి వడ్డీలు పెరిగిపోయాయి. దాంతో నాన్న మాకెవరికీ ఏం చెప్పకుండా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికి మేం చిన్న పిల్లలం.

నాకు ఒక్క అక్క ఉంది. తనకు మాటలు రావు’ అని చెప్పింది రమ్య.

సిద్ధిపేటలోని నాగపురి గ్రామానికి చెందిన నిర్మల తండ్రి కనకయ్య కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. మూడెకరాల పొలం కౌలుకు తీసుకున్న ఆయన పంటను నష్టపోయి, అప్పులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు.

తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటూ నిర్మల దిల్లీకి వచ్చింది. తండ్రి బతికుండుంటే చదువు కొనసాగించేదాన్నని, కానీ ఇప్పుడు పదో తరగతి మధ్యలోనే మానేశానని ఆ అమ్మాయి చెబుతోంది.

దిల్లీకి చేరుకున్న రైతుల్లో ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నవంబర్ 29న దిల్లీకి చేరుకున్న వేలాది రైతులు, నవంబర్ 30న రామ్‌లీలా మైదానం నుంచి పార్లమెంటు వరకు ‘కిసాన్ ముక్తి మార్చ్’ పేరుతో పాదయాత్ర చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి