రాహుల్ గాంధీ: ఫిరోజ్ గాంధీ వారసుడికి జవహర్‌లాల్ నెహ్రూ 'కౌల్' గోత్రం ఎలా వచ్చింది?

  • 30 నవంబర్ 2018
రాహుల్ గోత్రం Image copyright Getty Images

అది 1991 మే 2, మండుతున్న ఎండల్లో రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం చేసిన రాజీవ్ గాంధీ, మధ్యలో పుష్కర్‌లోని బ్రహ్మ గుడికి వచ్చి పూజలు చేశారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉంది. రాజీవ్ గాంధీ మళ్లీ అధికారంలోకి వస్తారని అంతా అనుకుంటున్నారు.

రాజీవ్ గాంధీకి పుష్కర్‌తో ప్రత్యేకమైన బంధం ఉంది. అప్పట్లో రాజీవ్ గాంధీకి సన్నిహితంగా ఉన్న ఒక రాజస్థాన్ నేత "ఆయన 1983లో మొదటిసారి పుష్కర్‌ వచ్చారు. అప్పుడాయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రధానమంత్రి అయ్యాక కూడా ఆయన 1989లో పుష్కర్ వచ్చారు. బ్రహ్మ ఆలయంలో పూజలు-అర్చనలు చేశారు" అని చెప్పారు.

కానీ 1991 మే 2న పుష్కర్ యాత్రకు వచ్చిన 12 రోజులకే రాజీవ్ గాంధీ తమిళనాడులో జరిగిన బాంబు పేలుడులో మృతి చెందారు.

మృతిచెందిన వారం తర్వాత రాజీవ్ గాంధీ అస్థికలను పుష్కర్‌లో నిమజ్జనం చేశారు. ఆ సమయంలో రాజేష్ పైలెట్, అశోక్ గెహ్లాత్ లాంటి నేతలు ఉన్నారు.

కుటుంబ పురోహితుడైన దీనానాథ్ కౌల్ ఆ సమాచారం చెబుతూ "నేతలందరూ మూడు వారాల ముందే రాజీవ్ గాంధీతోపాటు ఇక్కడికి వచ్చారు. రాజీవ్ మూడు సార్లు పుష్కర్ వచ్చారు. ఆయన చనిపోయారనే వార్త వినగానే పట్టణంలో అందరూ కొన్ని రోజులపాటు షాక్‌లో ఉండిపోయారు" అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జైపూర్ గోవింద్ దేవ్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు

మోతీలాల్ నెహ్రూ పూజ చేశారు

అయితే, రాజీవ్ గాంధీకి ముందు ఆయన సోదరుడు సంజయ్ గాంధీ, మరదలు మేనకా గాంధీ కూడా పుష్కర్ వచ్చి బ్రహ్మ ఆలయంలో పూజలు చేసివెళ్లారు.

సంజయ్ గాంధీ 1980 మార్చి 12న పుష్కర్ వచ్చారు, కానీ తర్వాత రెండు నెలలకే ఒక విమాన ప్రమాదంలో మృతి చెందారు.

సంజయ్ గాంధీ మృతిచెందిన నాలుగేళ్ల తర్వాత మేనకా గాంధీ పుష్కర్ వచ్చారు. ఆమె నెహ్రూ-గాంధీ కుటుంబాల ఆచారాల ప్రకారం పూజలు చేశారు.

చిత్రం శీర్షిక పుష్కర్ బ్రహ్మ ఆలయంతోపాటు అక్కడి సరస్సు కూడా ప్రసిద్ధి చెందింది

నెహ్రూ-గాంధీ కుటుంబాల సుదీర్ఘ చరిత్రకు రాజస్థాన్ పుష్కర్ మధ్యలో ఉన్న సరస్సు తీరంతో కూడా కూడా సంబంధం ఉంది.

1921లో అంటే సుమారు వందేళ్ల క్రితం మోతీలాల్ నెహ్రూ పుష్కర్ వచ్చారు. ఆ సమయంలో పరాశర కుటుంబానికి చెందిన పురోహితులు బ్రహ్మ ఆలయంలో ఆయన కోసం పూజలు చేశారు.

మోతీలాల్ నెహ్రూ కోసం పూజ చేస్తున్నప్పుడు ఆయన తన గోత్రం కౌల్ అని చెప్పారు. తన కోసం పూజ చేసిన పురోహితులకు కౌల్ అనే పేరు ఇచ్చారు. మోతీలాల్ నెహ్రూ ఆ పురోహితుల కుటుంబంతో "ఇప్పుడు మీరు మా కుటుంబ పురోహితులు అయ్యారు. అందుకే మీ ఇంటిపేరు కూడా 'కౌల్' అని పెట్టుకోండి" అన్నారు.

అప్పటి నుంచి నాలుగు తరాలుగా పుష్కర్‌లో ఉంటున్న పరాశర్ కుటుంబంలోని వారు తమ ఇంటిపేరును 'కౌల్' అని రాస్తున్నారు.

చిత్రం శీర్షిక రాహుల్‌తో పూజలు చేయించిన దీనానాథ్ కౌల్, రాజ్‌నాథ్ కౌల్

15 ఏళ్ల తర్వాత వచ్చిన రాహుల్

మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకూ పుష్కర్ వచ్చి పూజలు చేయించేవారు.

కానీ గాంధీ కుటుంబానికి చెందిన ఒక సభ్యుడు పుష్కర్‌ యాత్ర చేసిన 15 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారు. ఇది చర్చనీయాంశం కూడా అయ్యింది.

పరాశర కుటుంబానికి చెందిన ఇద్దరు వృద్ధ పురోహితులు, రాజనాథ్ కౌల్, దీనానాధ్ కౌల్ సోమవారం రాహుల్ గాంధీతో ఈ ఆలయంలో పూజలు చేయించారు.

"ఆయన తల్లి సోనియా గాంధీ ఇక్కడకు వచ్చి 15 ఏళ్లైంది. అందుకే రాహుల్ గాంధీ ఇక్కడకు రావడం మాకు సంతోషంగా అనిపించింది. మేం ఆయనకు, తన కుటుంబ చరిత్ర గురించి చెప్పాం. రాహుల్ చాలా శ్రద్ధగా విన్నారు" అని బీబీసీతో మాట్లాడిన పురోహితులు రాజ్‌నాథ్ చెప్పారు.

చిత్రం శీర్షిక ఇందిరా గాంధీ పుష్కర్ దర్శనానికి వచ్చినపుడు చేసిన సంతకం

ఈ పూజలు చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ కూడా 1921లో మోతీలాల్ నెహ్రూ చెప్పిన గోత్రమే చెప్పారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారం పర్యటన సందర్భంగా అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గాకు, పుష్కర్‌లోని బ్రహ్మ మందిరానికి వెళ్లారు.

సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాట్‌తోపాటు వచ్చిన రాహుల్ అజ్మీర్లో ఏడు చాదర్లు సమర్పించారు, ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ప్రార్థనలు చేశారు.

ఇటు, పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయంలో కూడా పూజలు చేసిన రాహుల్ గాంధీ.. తన గోత్రం 'కౌల్ దత్తాత్రేయ' అని చెప్పారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గోత్రంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ మొదలైంది.

భారతీయ జనతా పార్టీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఒక మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ గోత్రం ఏంటని అడిగారు.

చిత్రం శీర్షిక రాజీవ్ గాంధీ మొదట పుష్కర్ వచ్చినప్పుడు సంతకం

పుష్కర్ రాని ఫిరోజ్, ప్రియాంక, వరుణ్ గాంధీ

కొంతమంది రాహుల్ గాంధీ ఇంతకు ముందెప్పుడూ తన గోత్రం చెప్పలేదని అంటారు. కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది మాత్రం రాహుల్, ఆయన కుటుంబం ఎప్పుడూ తమను కశ్మీరీ బ్రాహ్మణులుగానే చెప్పుకునేదని, మోతీలాల్-జవహర్ లాల్ నెహ్రూ కూడా కశ్మీరీ బ్రాహ్మణులే.

"మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్, ఇందిరా గాంధీ, అందరూ ఇక్కడికి కశ్మీరీ బ్రాహ్మణులుగా, అంటే కౌల్ గోత్రంతోనే వచ్చారని, అదులో వివాదం ఏముందో అర్థం కావడం లేదని" పుష్కర్‌లో గాంధీ కుటుంబానికి చెందిన కుల పురోహితులు కౌల్ అన్నారు.

చిత్రం శీర్షిక రాజీవ్ రెండోసారి పుష్కర్ వచ్చినప్పటి సంతకం

అయితే ఇందిరాగాంధీ భర్త, రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ పార్శీ అయినప్పుడు, వారు తమను తాము 'కశ్మీరీ కౌల్' అని ఎలా చెప్పుకుంటారని కొందరు చర్చిస్తున్నారు.

అయితే ఇక్కడకు వచ్చిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీ లాంటి వారు స్వయంగా తమ గోత్రం కశ్మీరీ కౌల్ అని చెప్పుకుని ఆలయంలో పూజలు-అర్చనలు చేయడంతో ఇలాంటి వాదనల్లో బలం లేకుండా పోతోంది.

పుష్కర్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ఈ పురోహితులు చెబుతున్న దాని ప్రకారం ఫిరోజ్ గాంధీ ఎప్పుడూ ఇక్కడకు రాలేదు. వారి కుటుంబంలోని ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, వరుణ్ గాంధీ కూడా పుష్కర్ ఆలయానికి రాలేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)