అరవింద్ సుబ్రమణ్యన్: నోట్ల రద్దు దారుణమైన చర్య - ప్రెస్ రివ్యూ

  • 30 నవంబర్ 2018
అరవింద్ సుబ్రమణ్యన్ Image copyright Getty Images

పెద్ద నోట్ల రద్దు చాలా దారుణమైన చర్యని, ద్రవ్య విధానానికి ఇది పెద్ద షాక్‌లాంటిదని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యన్‌ వ్యాఖ్యానించారని 'సాక్షి' తెలిపింది.

దేశ ఆర్థిక వృద్ధి రేటు మరింత వేగంగా పడిపోవడానికి ఇదే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

'ఆఫ్‌ కౌన్సిల్‌ - ద చాలెంజెస్‌ ఆఫ్‌ మోదీ- జైట్లీ ఎకానమీ' పేరుతో రాసిన పుస్తకంలో అరవింద్‌ ఈ అంశాలు ప్రస్తావించారు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇందుకోసం ప్రత్యేకంగా 'టూ పజిల్స్‌ ఆఫ్‌ డీమానిటైజేషన్‌ - పొలిటికల్‌ అండ్‌ ఎకనమిక్‌' అనే అధ్యాయాన్ని కేటాయించారు.

నాలుగేళ్ల పాటు ప్రధాన ఆర్థిక సలహాదారుగా కొనసాగి ఇటీవలే అరవింద్‌ వైదొలిగారు.

''పెద్ద నోట్ల రద్దుతో ఒక్క దెబ్బతో చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించారు. డీమానిటైజేషన్‌ కన్నా ముందు కూడా వృద్ధి రేటు నెమ్మదించింది! కానీ పెద్ద నోట్ల రద్దుతో అమాంతంగా పడిపోయింది. డీమానిటైజేషన్‌కు ఆరు త్రైమాసికాల ముందు వృద్ధి రేటు సగటున 8 శాతంగా ఉండగా.. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏడు త్రైమాసికాల్లో 6.8 శాతానికి పడిపోయింది'' అని ఆయన చెప్పారు.

డీమానిటైజేషన్‌ వల్ల వృద్ధి నెమ్మదించిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని, కాకపోతే ఎంత స్థాయిలో మందగించిందన్నదే చర్చనీయమని అరవింద్‌ తన పుస్తకంలో తెలిపారు.

రాజకీయ కోణంలో చూస్తే ఇటీవలి కాలంలో ఏ దేశం కూడా సాధారణ సందర్భాల్లో ఎకాయెకిన డీమానిటైజేషన్‌ లాంటి అసాధారణ చర్య తీసుకోలేదని ఆయన స్పష్టంచేశారు.

''సాధారణ పరిస్థితులున్నప్పుడు కరెన్సీని రద్దు చేయాల్సి వస్తే అది క్రమానుగతంగా మాత్రమే జరగాలి. అలాకాక యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ సంక్షోభం, రాజకీయ సంక్షోభం(వెనెజ్వెలా) వంటి పరిస్థితుల్లో మాత్రమే నోట్ల రద్దు వంటి అసాధారణ చర్యలు ఉంటాయి. భారత్‌లో ప్రయోగం మాత్రం ప్రత్యేకమైనది'' అని అరవింద్‌ వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హైకోర్టు

ఆయేషా హత్య కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ గురువారం హైకోర్టు నిర్ణయం తీసుకొందని ఈనాడు రాసింది.

తాజాగా జరిపే దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ స్వేచ్ఛతో వ్యవహరించొచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో పిడతల సత్యంబాబు దాఖలు చేసిన 'అప్పీల్‌' 2017 మార్చి వరకు హైకోర్టులో అపరిష్కృతంగా ఉంటే.. 2014లో విజయవాడలోని దిగువ కోర్టులో వస్తు సంబంధ సాక్ష్యాధారాలు ధ్వంసం కావడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించింది.

దీనివెనక ఎవరున్నారో తేల్చాలని సీబీఐ అధికారులను ఆదేశించింది.

ఆయేషా హత్య, వస్తు సంబంధ సాక్ష్యాల నాశనం అంశాలపై వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని స్పష్టం చేసింది.

ఆయేషా హత్య ఏవిధంగా జరిగింది, దానికి బాధ్యులు ఎవరనే విషయంలో హేతుబద్ధ ముగింపు పలకాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది. కేసుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు, సాక్ష్యాధారాలు, ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) జరిపిన దర్యాప్తు వివరాలన్నీ సీబీఐ వినియోగించుకోవచ్చని సూచించింది. తన వద్ద ఉన్న మొత్తం రికార్డులను సీబీఐకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం... ఆయేషా తల్లిదండ్రులు దాఖలుచేసిన వ్యాజ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. బాధితులుగా మీకు పరిహారం కావాలా లేక ఇప్పటికే ఏమైనా అందిందా అని కోర్టు ప్రశ్నించినప్పుడు- పరిహారం వద్దు, న్యాయంచేస్తే చాలని ఆయేషా తల్లిదండ్రుల తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు.

విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు వసతిగృహంలో 2007 డిసెంబర్‌ 27న ఆయేషా హత్య జరిగింది. సత్యంబాబును నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేయడం, విజయవాడలోని మహిళా సెషన్సు కోర్టు సత్యంబాబుకు జీవితఖైదు, పదేళ్ల జైలుశిక్ష విధించడం, అనంతరం 2017లో హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది.

తమ కుమార్తె హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని ఆయేషా తల్లిదండ్రులు షంషాద్‌బేగం, సయ్యద్‌ బాషా తెలిపారు.

పాకిస్తాన్ నిర్బంధంలో ఆంధ్రప్రదేశ్ జాలర్లు

సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన 20 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు పాకిస్థాన్‌ చెరలో చిక్కుకున్నారని ఈనాడు తెలిపింది.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన 20 మంది, విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు జాలర్లు గుజరాత్‌ తీర ప్రాంతమైన వీరావల్‌ నుంచి బుధవారం సముద్రంలో చేపల వేటకు బయలుదేరి పొరపాటున పాకిస్థాన్‌ జలాల్లో ప్రవేశించారు.

అక్కడి కోస్ట్‌గార్డు (మెరైన్‌ సెక్యూరిటీ) దళాలు 20 మందిని అదుపులోకి తీసుకున్నాయి.

మత్స్యశాఖ కమిషనర్‌ రామశంకర్‌నాయక్‌ 'ఈనాడు'తో మాట్లాడుతూ 'నాలుగు బోట్లలో మత్స్యకారులు వేటకు బయల్దేరారు. మూడు బోట్లు పాకిస్థాన్‌ కోస్ట్‌గార్డ్‌లకు పట్టుబడ్డాయి. దూరంగా ఇది గమనించిన నాలుగో బోటు వారు అక్కణ్నుంచి తప్పించుకుని వచ్చేశారు. వారు చెప్పిన సమాచారంతో వివరాలు సేకరించాం' అని వివరించారు.

వీరు గుజరాత్‌లో చేపల వ్యాపారుల వద్ద పనిచేస్తున్నారు.

జాలర్ల నిర్బంధంపై ఏపీ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులను అప్రమత్తం చేశారు. వారు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనపై ఏపీ ప్రభుత్వ ఆందోళనను హైకమిషన్‌ పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లింది.

కోస్ట్‌గార్డు దళాలు ఈ జాలర్లను కరాచీ పంపినట్లు సమాచారం.

శ్రీకాకుళం, ఎచ్చెర్ల, విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాలు తీరప్రాంతంలో పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ మత్స్య సంపద తక్కువ. వందల మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం ఈ ప్రాంతం నుంచి వీరావల్‌కు వలస వెళతారు. ఇప్పుడు పాకిస్థాన్‌కు చిక్కింది కూడా ఈ మండలాల వారే. అక్కడ వాణిజ్య పడవల్లో వేటకు వెళితే నెలకు రూ.10 వేల వరకు జీతం ఇస్తారు. ఈ జాలర్లు ఏటా జులై-ఆగస్టు మధ్య వీరావల్‌కు వెళ్లి తిరిగి మరుసటి ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య స్వస్థలాలకు వస్తారు.

Image copyright Getty Images

రూ.5 విరాళంతో మోదీని కలిసే అవకాశం

రూ.5 విరాళంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశాన్ని నమో యాప్ కల్పిస్తోందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఈ యాప్‌ తెరిచి అందులో బీజేపీకి రూ.5 నుంచి రూ.1000 లోపు విరాళం అందజేస్తే ఒక రిఫరల్‌ కోడ్‌ వస్తుంది. ఆ కోడ్‌ను ఈమెయిల్‌, మెసేజ్‌, వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు, తోటివారికి పంపి విరాళం ఇచ్చేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది. అలా ఆ కోడ్‌ను వాడి వంద మంది విరాళాలు అందజేస్తే స్వయంగా మోదీని కలిసే అవకాశం వస్తుంది.

కనీసం పది మంది విరాళం ఇస్తే నమో టీషర్టులు, కాఫీ మగ్‌లు గెలుచుకోవచ్చు. సామాన్య ప్రజలు- ప్రధాని మోదీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ప్రయత్నం చేశామని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)