తాజ్‌మహల్: ‘జాగ్రత్తపడకపోతే... జ్ఞాపకమే మిగులుతుంది’ - BBC Special

  • 1 డిసెంబర్ 2018
తాజ్‌మహల్

తాజ్ మహల్... పాలరాతి ప్రేమ సౌధం.. ప్రపంచంలో లక్షలాది మంది పర్యాటకుల గమ్యస్థానం.

కానీ.. నిర్లక్ష్యం - కాలుష్యం కలగలిసి ఈ అద్భుత నిర్మాణం మనుగడకే ముప్పుగా మారాయి.

తాజ్‌మహల్

షంషుద్దీన్ ఖాన్‌కి తాజ్‌మహల్‌తో అనుబంధం ముప్పై ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రతి రోజూ పర్యాటకులకు తాజ్‌మహల్‌ను చూపించటం అతడి వృత్తి. యాబై మందికి పైగా ప్రపంచ నాయకులకు ఆయన తాజ్ దగ్గర టూరిస్ట్ గైడ్‌గా వ్యవహరించారు. ఇటీవలే.. శ్రీలంక అధ్యక్షుడికి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి కూడా గైడ్‌గా పనిచేశారాయన.

తాజ్‌మహల్

''ఈ మూడు దశాబ్దాల్లో నా జుట్టు తెల్లబడింది... కానీ తాజ్ మహల్ మాత్రం నలుపు తిరిగింది'' అని ఆయన చెప్తారు. తాజ్ నిర్మాణంలో పగుళ్లు, క్షీణిస్తున్న పాలరాళ్లను ఆయన చూపిస్తారు.

''తాజ్‌మహల్‌ను చూసుకోవాల్సినంత జాగ్రత్తగా ఎందుకు చూసుకోవటం లేదు' అని విదేశీ పర్యాటకులు నన్ను అడిగినపుడు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. తాజ్ రంగు, మెరుపు ఎందుకు క్షీణిస్తున్నాయని కూడా వాళ్లు మమ్మల్ని అడుగుతారు. మా గైడ్ల దగ్గర జవాబులు లేవు.''

షంషుద్దీన్ ఖాన్‌
చిత్రం శీర్షిక షంషుద్దీన్ ఖాన్, తాజ్‌మహల్ టూర్ గైడ్

చక్రవర్తి షా జహాన్ 17వ శతాబ్దంలో ఆగ్రా నగరంలో తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ఆయన తన ముద్దుల రాణి ముంతాజ్ మహల్‌ కోసం నిర్మించిన సమాధి ఇది. ముంతాజ్.. వారి 14వ బిడ్డకు జన్మనిస్తూ చనిపోయింది. రాజస్థాన్ నుంచి పాలరాళ్లు తెప్పించారు. ఉదయం లేత గులాబీ రంగులో, మధ్యాహ్నం శ్వేత వర్ణంలో, సాయంత్రం పాలరంగులో కనిపించే విశిష్ట లక్షణం ఈ పాలరాళ్లకు ఉందని చెప్తారు.

1992: తాజ్‌మహల్ ఆధునిక సందర్శకుల్లో అత్యంత ప్రముఖ వ్యక్తి.. ప్రిన్సెస్ డయానా
చిత్రం శీర్షిక 1992: తాజ్‌మహల్ ఆధునిక సందర్శకుల్లో అత్యంత ప్రముఖ వ్యక్తి.. ప్రిన్సెస్ డయానా

''కాలం చెక్కిలి మీద చలువరాతి కన్నీటి చుక్క'' అని వర్ణించాడు విశ్వవిఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్.. ఈ తాజ్‌మహల్‌ని చూసి. ప్రిన్సెస్ డయానా.. ఒంటరిగా తాజ్‌మహల్ ముందు కూర్చుని ఫొటో దిగారు.. 1992లో ప్రిన్స్ చార్లెస్‌తో విడిపోతున్నట్లు ప్రకటించటానికి కొన్ని నెలల ముందు.

తాజ్‌మహల్

2010 - 2015 మధ్య ఐదేళ్లలో నలబై నుంచి అరవై లక్షల మంది పర్యాటకులు తాజ్‌మహల్‌ను సందర్శించారని భారత పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖ చెప్తోంది. అక్టోబర్ నుంచి మార్చి వరకూ పర్యాటకుల రాక ఎక్కువగా ఉంటుంది.

తాజ్‌మహల్

అయితే.. నిజంగానే తాజ్‌మహల్ ప్రకాశం క్షీణించటం ఆరంభమైంది. పునాదులు బలహీనపడుతున్నాయి. పాలరాతి గోపురంలోనూ, కట్టడం మీదా పగుళ్లు అంతకంతకూ పెద్దవవుతున్నాయి. మినారుల పై భాగాలు కుప్పకూలటానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వీచిన బలమైన గాలులకు బయటి భవనం మీది రెండు స్తంభాలు కూలిపోయాయి.

తాజ్‌మహల్

సీనియర్ పర్యావరణవేత్త, న్యాయవాది ఎం.సి.మెహతా జూలైలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు.. తాజ్‌మహల్‌ను పరిరక్షించటానికి కృషి చేయాలని కోరుతూ.

న్యాయమూర్తులు అంగీకరించారు. ఈ కట్టడం సంరక్షణలో బాధ్యులైన - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పురావస్తు శాఖలను కూడా చేర్చి విచారణకు ఆదేశించారు. భారతదేశపు విశ్వవిఖ్యాత కట్టడం భవిష్యత్తు పట్ల కేంద్ర, రాష్ట్రాల అధికారుల 'నిర్లక్ష్యా'న్ని సుప్రీంకోర్టు విమర్శించింది:

తాజ్‌మహల్

''తాజ్‌మహల్‌ను సంరక్షించాలి. అధికారుల ఇటువంటి ఉదాసీనత ఇలాగే కొనసాగితే దానిని మూసివేయాలి. అప్పటికీ పరిస్థితులు సరైన దారిలోకి రాకపోతే.. అధికారులు దానిని కూల్చివేయాలి.''

తాజ్‌మహల్‌ కూల్చివేతను సమ్మతించటానికి ఎవరూ సిద్ధంగా లేకున్నా.. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేయటమే.. ఆ కట్టడం భవిష్యత్తు నిజంగా ప్రశ్నార్థకంగా ఉందని సూచిస్తోంది.

తాజ్‌మహల్

ఎం.సి.మెహతా ఈ ఏడాది సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఆయన వేసిన మొదటి పిటిషన్ కాదు. తాజ్‌మహల్‌ను సంరక్షించటం కోసం అధికారులు చర్యలు తీసుకునేలా చేయటానికి.. వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఆయన 1980ల మధ్య నుంచీ ప్రయత్నిస్తున్నారు.

ఆ కాలానికే.. అప్పటికి చాలా ఏళ్ల నుంచే గాలిలో కాలుష్యం ఈ ప్రాంతంలో ఒక సమస్యగా ఉంది.

తాజ్‌మహల్

ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని మధురలో 1970ల్లో పనిచేయటం ఆరంభమైన భారీ చమురు శుద్ధి కర్మాగారం విషయంలో పర్యావరణవాదులు ఆనాడే ఆందోళనలు వ్యక్తం చేశారు.

1978లో.. ఆగ్రా లోపల, చుట్టుపక్కల గాలి నాణ్యత మీద అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ ఒకటి.. వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్ఓ2), పార్టిక్యులేట్ మేటర్ (పీఎం)ల స్థాయి గణనీయంగా ఉందని గుర్తించింది. సుప్రీంకోర్టు పత్రాల ప్రకారం.. ''తాజ్‌మహల్ వద్ద సల్ఫర్ డయాక్సైడ్ నాలుగు గంటల సగటు విలువలు.. చదరపు మీటరుకు 300 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా ఉందని గమనించారు''.

తాజ్‌మహల్

ప్రజారోగ్యం మీద దుష్ప్రభావం విషయాన్ని పక్కన పెడితే.. తాజ్ మహల్ మీద ఈ కాలుష్యం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అంతకంతకూ స్పష్టంగా కనిపిస్తోంది.

సల్ఫర్ డయాక్సైడ్, ఇతర కాలుష్యకాలు.. వాతావరణంలోని తేమతో కలిసి ఆమ్లవర్షం (యాసిడ్ రెయిన్)గా మారుతోంది.

తాజ్‌మహల్

''గాలిలోని పార్టిక్యులేట్ మేటర్, ధూళి... కట్టడం ఉపరితలానికి ఢీకొడుతుండటం వల్ల తాజ్‌మహల్ పసుపు రంగులోకి మారుతోంద''ని భారత ప్రభుత్వానికి యునెస్కో ఇచ్చిన ఒక నివేదిక చెప్తోంది.

1984లో.. తాజ్‌మహల్ రంగుమారటానికి ఫౌండ్రీలు, రసాయన పరిశ్రమలు, రిఫైనరీలు ప్రధాన కారణమని వాదిస్తూ మెహతా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.

తాజ్‌మహల్‌ సంరక్షణ కోసం ఎం.సి.మెహతా 1980ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు
చిత్రం శీర్షిక తాజ్‌మహల్‌ సంరక్షణ కోసం ఎం.సి.మెహతా 1980ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు

అతడితో ఏకీభవిస్తున్నట్లు సుప్రీంకోర్టు తొమ్మిదేళ్ల తర్వాత ప్రకటించింది. ఈ ప్రాంతంలో కాలుష్యాన్ని తగ్గించటానికి చర్యల జాబితాను రూపొందించింది. ఆగ్రాలోనూ, చుట్టుపక్కలా.. ప్రత్యేకించి తాజ్‌మహల్‌కు చాలా దగ్గరగా ఉన్నటువంటి కాలుష్యకారక పరిశ్రమలన్నిటినీ మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.

ఆగ్రాలో, నగరం చుట్టుపక్కల నడుస్తున్న కంపెనీలు.. నాచురల్ గ్యాస్ (సహజ వాయువు)ను మాత్రమే ఇంధనంగా వాడాలని ఆదేశించింది. ఈ ప్రాంతంలో బొగ్గు వినియోగాన్ని చట్ట వ్యతిరేకం చేసింది.

తాజ్‌మహల్

ఆగ్రా నగరంలో డీజిల్ వాహనాలు, యంత్రాల మీద నిషేధం విధించారు. ఈ ప్రాంతంలోని తోళ్లపరిశ్రమలన్నిటినీ తొలగించాలని ఆదేశాలిచ్చారు. యమునా నదికి పశువులను తీసుకెళ్లటాన్ని, నదిలో బట్టలు ఉతకటాన్ని చట్టవిరుద్ధం చేశారు. యమునా నది ఒడ్డునే తాజ్‌మహల్ ఉండటం దీనికి కారణం.

భారీ పరిశ్రమలు ఈ పురాతన కట్టడానికి దూరంగా ఉండేలా చూడటానికి.. 1998లోనే తాజ్‌మహల్ చుట్టూ 10,400 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 'తాజ్ ట్రపేజియం జోన్ (టీటీజడ్)'గా నెలకొల్పింది సుప్రీంకోర్టు.

తాజ్ ట్రపేజియం జోన్

సుప్రీంకోర్టు ఉత్తర్వులను అధికారులు అమలుచేసి ఉన్నట్లయితే పరిస్థితి చాలా మారి ఉండేదని మెహతా అంటారు. ''దురదృష్టవశాత్తూ ఏమీ మారలేదు. నేను మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది'' అని చెప్పారు.

డీజిల్‌తో నడిచే వాహనాలను వినియోగం నిరాఘాటంగా సాగుతోంది. ఆంక్షలకు వ్యతిరేకంగా స్థానిక పరిశ్రమల యజమానులు ఆందోళన చేపట్టారు. అంతేకాదు.. ''తాజ్‌ను తొలగించండి.. పరిశ్రమలను కాపాడండి'' అనే నినాదంతో ఒక సంస్థను కూడా ఏర్పాటుచేశారు.

తాజ్‌మహల్

పొగ, ధూళి, ఆగ్రాలోను, చుట్టుపక్కల గల పరిశ్రమల నుంచి యమునా నదిలో కుమ్మరిస్తున్న కలుషిత పదార్థాలు, కాలుష్యం ప్రమాదకర రేటుతో పెరుగుతూనే ఉన్నాయి. చర్మపరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించినా.. డీజిల్ వాహనాలు, జనేరేటర్ల వాడకం వంటి ఇతర కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగాయి. పైగా.. యమునా నదిలో పశువుల స్నానం, దుస్తులు ఉతకటం కూడా యధావిధిగా సాగిపోతోంది.

తాజ్‌మహల్

తాజ్‌మహల్‌కు ముప్పు కేవలం గాలి నుంచే కాదు.. నీటి నుంచి కూడా ముంచుకొస్తోంది. ఇక్కడ కూడా పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతోంది. ఆగ్రా గుండా ప్రవహించే యమునా నది పరీవాహం.. ప్రపంచంలో అత్యంత కలుషితమైన జలమార్గాల్లో ఒకటి.

''దిల్లీ మొదలుకుని ఆగ్రా వరకూ ఈ నదిని ఆనుకుని ఉన్న పరిశ్రమలు.. తమ రసాయన, ఇతర వ్యర్థాలను నేరుగా ఈ నదిలోకి విడిచిపెడుతున్నాయి'' అని చెప్పారు స్థానిక పర్యావరణవేత్త బ్రిజ్ ఖండేల్వాల్. ఆగ్రా నగర మురుగు కాలువలు - దాదాపు 90 వరకూ - ఎలాంటి శుద్ధీ చేయని మురుగును నేరుగా యమునా నదిలోకి వదులుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు.

తాజ్‌మహల్

ఈ పరిస్థిల్లో ఈ నీటిలో చేపలు బతకలేవు. చేపలు ఉంటే.. నీరు ఆవాసంగా పెరిగే ఈగలు, దోమలు, ఇతర కీటకాలను తింటూ వాటి వృద్ధిని నిరోధిస్తాయి. చేపలు లేనపుడు ఈ మురుగు నీటి మీద క్రిమికీటకాలు యదేచ్ఛగా పెరుగుతాయి. అవి తాజ్‌మహల్ చుట్టూ మూగుతాయి. వాటి మలవిసర్జనతో కూడా తాజ్ రంగు మారిపోతోంది.

తాజ్‌మహల్
చిత్రం శీర్షిక కలుషిత యమునా నది మీద వృద్ధి చెందే క్రిమికీటకాలు తమ మలవిసర్జనతో కూడా తాజ్ రంగు మారుతోంది

నీరు లేకపోవటం.. ఉన్న నీరూ నాసిరకంగా ఉండటం కూడా తాజ్‌మహల్‌కు పెద్ద సమస్యలు సృష్టిస్తోంది.

ఈ నిర్మాణం పునాదులను.. 180 బావులు, కొయ్య మూలాల మీద నిర్మించారు. వీటికి ఏడాది అంతటా నీరు అవసరం.

మొఘలుల భవనాల్లో అత్యధికం.. ఉద్యానవనం మధ్యలో ఉంటాయని చరిత్రకారుడు ప్రొఫెసర్ రామ్‌నాథ్ చెప్తారు. అయితే.. తాజ్‌మహల్ అసాధారణమైనది. ఎందుకంటే.. తోటలో ఒక మూలన యమునా నది ఒడ్డున దీనిని నిర్మించారు.

తాజ్‌మహల్

దీనికి కారణం.. నిర్మాణం పునాదుల్లోని బావులు, కొయ్య మూలాలకు నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూడటమని ప్రొఫెసర్ రామ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ పునాదులకు ఒక ఏడాదంతా నీరు అందకపోతే.. కింద ఉన్న చెక్క ఎండిపోతుంది. ఫలితంగా అది విరిగిపోవటమో, శిథిలమవటమో జరుగుతుంది.

తాజ్‌మహల్
చిత్రం శీర్షిక నీటి మట్టం తగ్గుతున్న కొద్దీ.. తాజ్ మహల్‌ పునాదుల్లోని చెక్కలో పగుళ్లు మొదలవుతాయి

తాజ్‌మహల్‌ను నిర్మించినపుడు.. చాలా వ్యాపారం, ప్రయాణం నది వెంబడే సాగేది. కానీ జనాభా పెరగటం, పరిశ్రమలు వృద్ధి చెందటంతో.. యమునా నది మీద జలాశయాలు, ఆనకట్టలు కట్టారు. దీంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది.

''హిమాలయాల నుంచి కిందికి ప్రవహించే యమునా నది.. ఆగ్రా చేరే సరికి చిక్కిపోయి దాదాపు మురుగు కాలవగా మారిపోతుంది'' అంటారు ఖండేల్వాల్.

తాజ్‌మహల్

ఆగ్రాలో.. రుతుపవనాల ముందు భూగర్భ జలాల లోతు దశాబ్దాలుగా క్రమంగా పడిపోతూ వస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ భూగర్భ జలాల విభాగం లెక్కల ప్రకారం.. 1980ల్లో రుతుపవనాలకు ముందు ఆగ్రాలో భూగర్భ జలాల లోతు భూమికి 15 మీటర్ల లోతుగా ఉండేది.

నేడు.. ఇక్కడ భూగర్భ జల మట్టాలు ప్రమాదకర స్థాయికి.. 35 మీటర్లకు - కొన్ని చోట్ల మరింత కిందకు పడిపోయాయి.

తాజ్‌మహల్‌ను పరిరక్షించాలంటే.. యమునా నదిని వాస్తవ స్థాయికి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంటుందని ఖండేల్వాల్ అంటారు.

తాజ్‌మహల్

''ఒక్క గోపురం బరువే 12,500 టన్నులు అయితే.. మొత్తం కట్టడం బరువు ఎంత ఉండొచ్చు అనేది ఊహించవచ్చు. ఇటువంటి భారీ నిర్మాణపు పునాదులు ఎల్లప్పుడూ బలంగా ఉండాలి'' అని ఆయన పేర్కొన్నారు.

నదీ తలం ఎండిపోయినపుడు.. అందులో కూడా ధూళి రేణువులు పుట్టి గాలులు వీచినపుడు ఎగురుతూ వెళ్లి తాజ్‌మహల్‌ను తాకుతుంటాయి. ఈ ప్రాంతంలో ధూళి తుపానులు చాలా తరచుగా వస్తుంటాయి. వాతావరణ మార్పు వల్ల.. ఎడారి వేగంగా ఆగ్రా దిశగా కదులుతోందని ఖండేల్వాల్ చెప్తున్నారు.

తాజ్‌మహల్

తాజ్ గంజ్‌లోని ఇరుకు సందుల గుండా వేగంగా నడుస్తున్నారు సందీప్ అరోరా. తాజ్‌మహల్ చుట్టూ ఉన్న జనావాసమిది. ఆయనకు స్థానికంగా ఒక హోటల్ ఉంది. అక్కడికి ఆలస్యం కాకుండా వెళ్లాలన్నది ఆయన తొందర. డీజిల్ వాహనాల మీద ఆంక్షల కారణంగా ఇక్కడ వాహనం నడిపే అవకాశం లేదు.

తాజ్‌మహల్

తాజ్‌మహల్‌కు రాళ్లెత్తిన వాస్తవ కార్మికుల వారసులు వీళ్లే

తాజ్‌ గంజ్‌లో శిథిలమైన, కూలిపోయిన భవనాల వైపు ఆయన చూపించారు. ''ఈ ప్రాంతం తాజ్‌మహల్ వారసత్వ సంపదలో ఒక భాగం. తరతరాలుగా మేమిక్కడ జీవిస్తున్నాం. మీరు చూస్తున్న ఈ ఇళ్లను.. తాజ్‌మహల్ నిర్మించినపుడు కట్టారు. తాజ్ గంజ్‌లో నివసిస్తున్న చాలా మంది తాజ్ నిర్మాణానికి శ్వేదరక్తాలు ధారపోసిన వారి వారసులే. మాకు దక్కుతున్న ఫలితమేమిటి? ఉదాసీనత, నిర్లక్ష్యం, అలక్ష్యం'' అన్నారాయన.

తాజ్‌మహల్‌ను నిర్మించిన కూలీలు, శిల్పులు, వృత్తినిపుణులు నివసించిన ప్రాంతమీ తాజ్ గంజ్. ఇక్కడి జనాభా సుమారు 5,000 మంది. వారిలో చాలా మంది 'పచ్చీకార్లు'.. అంటే తాజ్‌మహల్‌ను నిర్మించిన వాస్తవ కార్మికుల వారసులు. ఆ సంప్రదాయ శిల్పకళా నైపుణ్యాలను వీరు ఇంకా కొనసాగిస్తున్నారు.

తాజ్‌మహల్

ఈ వీధుల్లో చిన్న చిన్న దుకాణాలున్నాయి. చిన్నచిన్న తాజ్‌మహల్ పాలరాతి ప్రతిరూపాలు ఆ దుకాణాల్లో అమ్ముతున్నారు. ''పూర్వీకుల సంప్రదాయానికి అనుగుణంగా నివసిస్తున్న స్థానిక శిల్పకళాకారులు ఈ ప్రతిరూపాలను తయారుచేశారు'' అని చెప్పారు షంషుద్దీన్.

ఈ పనికి పెద్దగా ప్రతిఫలం దక్కదు. ''మా అదృష్టం బాగుంటే.. ఎవరైనా విదేశీ పర్యాటకుడు తాజ్‌మహల్ ప్రతిరూపాన్ని కొనదలచుకుంటే.. మాకు కొన్ని వందల రూపాయలు వస్తాయి. అదే మా జీవనాధారం'' అని తెలిపారు స్థానిక షాపు యజమాని బషీర్ అహ్మద్.

తాజ్‌మహల్

ఈ పచ్చీకార్ల ఉమ్మడి విజ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి పెద్దగా కృషి జరగటం లేదని షంషుద్దీన్ ఖాన్ అంటారు. ''తాజ్‌మహల్ నిర్మాణంలో పనిచేసిన శిల్పకళాకారుల వారుసులు వీరు. తాజ్‌మహల్‌ను ఎవరు సంరక్షిస్తారు? ఈ శిల్పకళాకారులు మాత్రమే. వాళ్లకది తెలుసు. వీరి జన్యువుల్లో ఉందది. కానీ వీరి కళను పరిరక్షించటానికి, ఇతరులకు ఈ కళను బోధించటానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు'' అని ఆయన పేర్కొన్నారు.

తాజ్‌మహల్

ఈ వాదనతో భారత పురావస్తు శాఖ మాజీ అధికారి ఆర్.కె.దీక్షిత్ విభేదిస్తున్నారు. తాజ్‌మహల్ సంరక్షణలో పచ్చీకార్లను చాలా కాలంగా భాగస్వాములను చేసినట్లు ఆయన చెప్పారు. ''ఆ కళ తెలిసిన మనుషులు వీళ్లు'' అని పేర్కొన్నారు.

తాజ్ గంజ్‌తో పాటు.. ఇక్కడి ప్రజలను కూడా ''సజీవ వారసత్వ సంపద''గా సుప్రీంకోర్టు భావించింది. కానీ.. చాలా మంది స్థానిక వాసులను ఆ నిర్ణయం అసంతృప్తికి గురిచేసింది. అధికారులు ఈ ప్రాంతం ఒక మురికివాడగా మారేలా చేస్తున్నారని వీరు అంటున్నారు.

తాజ్‌మహల్

''స్థానికుల ఇళ్ల గోడలు, పైకప్పులు దెబ్బతిన్నపుడు వాటిని పునర్‌నిర్మించే హక్కు వీరికి లేదు. గోడకు మేకు కొట్టటానికి కూడా జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి కానీ, నిరభ్యంతర పత్రం కానీ తెచ్చుకోవాలి. ఆగ్రాలోని మిగతా ప్రాంతాల్లో పెద్ద పెద్ద హోటళ్లలో పెద్ద పెద్ద జనరేటర్లు వాడుతూనే ఉన్నారు కానీ మేం డీజిల్ జనరేటర్లు వాడటానికి లేదు'' చెప్పారు అరోరా.

తాజ్‌మహల్

ఆయన హోటల్‌లో టాయిలెట్‌కి మరమ్మతు చేయాల్సి వచ్చినపుడు.. ప్రభుత్వ అధికారులకు ఆరు లేఖలు రాశాక కానీ తనకు అనుమతి లభించలేదని ఆయన పేర్కొన్నారు. ''డీజిల్ వాహనాలు ఉపయోగించటానికి అనుమతిస్తూ అధికారులు, రాజకీయ నాయకులు, వారి బంధువులకు 5,000 పాసులు పంపిణీ చేశారు. కానీ స్థానికులు మాత్రం డీజిల్ వాహనాలు వాడకూడదంటూ ఆంక్షలు విధించారు'' అని కూడా ఆయన ఫిర్యాదుచేశారు. ''వారు నేరుగా తాజ్‌మహల్ ముఖద్వారం వరకూ డీజల్ వాహనాల్లో వస్తారు.. దానిపై నిషేధం ఉన్నాసరే'' అన్నారు.

తాజ్‌మహల్‌ను ఎలా సంరక్షించవచ్చు అనే అంశంపై సాధారణ సమ్మతి బాగా లోపించిందన్న విషయాన్ని తాజ్ గంజ్ నివాసుల ఫిర్యాదులు ప్రతిబింబిస్తున్నాయి.

తాజ్‌మహల్

తాజ్‌మహల్‌ను, ఆగ్రా వారసత్వ సంపదను సంరక్షించే బాధ్యతను.. నగర డివిజనల్ కమిషనర్ కె.మోహన్‌రావుకు అప్పగించింది సుప్రీంకోర్టు. నగరంలోని కాలువలు, ఇళ్ల నుంచి వచ్చే చెత్తను తగ్గించటానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్తారు.

''చెత్త నిర్వహణపై రాష్ట్ర యంత్రాంగం పలు కమిటీలను ఏర్పాటుచేసింది. మురుగుశుద్ధి ప్లాంట్లను నెలకొల్పుతున్నాం'' అని మోహన్‌రావు తెలిపారు. నగర మౌలికవసతులను సంపూర్ణంగా సంస్కరిస్తూ ఆగ్రాను ''స్మార్ట్ సిటీ''గా మార్చటానికి ప్రతిపాదనలు కూడా తయారుచేశామని చెప్పారు. కానీ.. ఈ ప్రక్రియలో నగర వారసత్వ సంపద అదృశ్యమైపోతుందని ఖండేల్వాల్ వంటి కార్యకర్తలు భావిస్తున్నారు.

తాజ్‌మహల్

ఎటువంటి ప్రణాళికలోనైనా.. తాజ్‌మహల్‌తో పాటు నిర్మించిన కట్టడాలన్నిటికీ, 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్లు చేసిన పునరుద్ధరణలకు కూడా చోటు ఉండాలన్నది ఆయన అభిప్రాయం.

తాజ్‌మహల్‌ను ఫుల్లర్ ఎర్త్ (ముల్తానా మట్టి) పూతతో శుద్ధి చేయాలన్న భారత పురావస్తుశాఖ సంరక్షణ కార్యక్రమం పట్ల కూడా ఖండేల్వాల్, మెహతాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

తాజ్‌మహల్

కట్టడం గోడల రంగును మారుస్తున్న దుమ్ము, విసర్జకాలను ఈ మట్టి పూత పీల్చుకోవటం ద్వారా శుభ్రం చేస్తుందన్నది ఈ ప్రణాళికలోని ఆలోచన. అయితే.. ఈ మట్టి పూత వల్ల తాజ్‌మహల్ గోడలకు ఉపయోగించిన పాలరాళ్ల ఉపరితలం గరుకుగా మారుతుందని.. దానివల్ల ఆగ్రాలో తరచుగా వచ్చే ధూళి తుపానుల కారణంగా ఈ కట్టడం దెబ్బతినే ప్రమాదం ఇంకా పెరుగుతుందని వారు అంటారు.

తాజ్‌మహల్

తాజ్‌మహల్ ప్రాభవాన్ని పునరుద్ధరించటానికి.. మొఘలుల కాలంలోను, ఆ తర్వాత బ్రిటిష్ పాలనలోను దీనిని ఎలా సంరక్షించారనే అంశంపై దృష్టి సారించాలని మెహతా, ఖండేల్వాల్‌లతో పాటు తాజ్ గంజ్ జనం కూడా భావిస్తున్నారు.

యమునా నదిని కాలుష్యం లేని స్థితికి పునరుద్ధరించటం ద్వారా, సంరక్షణ పనుల్లో సంప్రదాయ 'పచ్చీకార్ల'ను భాగస్వామ్యం చేయటం ద్వారా దీనిని సాధించవచ్చు.

తాజ్‌మహల్

కానీ.. తాజ్‌మహల్ సంరక్షణ కోసం పోరాటానికి ఇన్నేళ్లు వెచ్చించిన మెహతా.. ఈ అద్భుతసౌధాన్ని కాపాడటానికి ఏమైనా చేస్తారా అన్న ఆశలు మృగ్యమయ్యాయని అంటారు. పునాదులు అంతకంతకూ బలహీనపడుతుండటంతో.. తాజ్‌మహల్ కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయే రోజు వస్తుందని ఆయన ఆందోళన చెందుతున్నారు.

తాజ్‌మహల్

''తాజ్‌మహల్‌ను ఎలా కాపాడాలి అనేదానిని అధ్యయనం చేయటానికి సుప్రీంకోర్టు చాలా సంస్థలను భాగస్వాములను చేసింది. ఆ సంస్థలు తాము చేసిన అధ్యయనాలపై నివేదికలను ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాయి. కోర్టు ఆదేశాల మీద ఆదేశాలు ఇస్తూ వస్తోంది'' అని విచారం వ్యక్తం చేశారు.

''దురదృష్టవశాత్తూ.. అధికారవ్యవస్థలు ఉదాసీనంగా ఉన్నాయి. ఇప్పుడు నా వయసు మళ్లుతోంది. అయినా నేను పోరాడుతూనే ఉంటా'' అని ఉద్ఘాటించారు.

రిపోర్టర్: సల్మాన్ రావి, ఫొటోలు: గగన్ నార్హే, ప్రీతమ్ రాయ్, గెటీ ఇమేజెస్, అలామీ

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)