అండమాన్ సెంటినల్: ఆ ఆదివాసీలను బయట ప్రపంచంలోకి తీసుకొచ్చినపుడు ఏమైంది?

సెంటినలీస్

అండమాన్-నికోబార్ దీవుల్లోని ఉత్తర సెంటినల్ ద్వీపంలో 27 ఏళ్ల అమెరికా పౌరుడు జాన్ అలెన్ చౌ మృతిచెందిన తర్వాత మానవ శాస్త్రవేత్త టీఎన్ పండిత్ పేరు అందరికీ తెలిసింది.

సెంటినెల్ ద్వీపంలోకి వెళ్లి అక్కడ ఉన్న వారిని కలిసిన ఏకైక వ్యక్తి పండిత్ మాత్రమేనని అందరూ భావించారు.

కానీ, 19వ శతాబ్దం చివర్లో బ్రిటిష్ నౌకాదళానికి చెందిన ఒక యువ అధికారి కూడా ఈ ద్వీపంలోకి వెళ్లారు. ఆయన మరో తెగకు చెందిన కొంతమంది సాయుధులను తనతోపాటు తీసుకుని అక్కడకు వెళ్లారు. వారితో ఆయనకు మంచి సంబంధాలుండేవి.

సెంటినెల్ ద్వీపంపైకి వెళ్లి వచ్చిన ఆ బ్రిటిష్ అధికారి పేరు మోరిస్ విదాల్ పోర్ట్‌మెన్. ఆయనను అండమాన్‌కు ఇంచార్జిగా పంపించారు. దీవుల్లో ఎవరికీ తెలీని తెగల భాష, వారి సంప్రదాయాల గురించి తెలుసుకుని, వారికి బయటి ప్రపంచాన్ని పరిచయం చేయాలనే లక్ష్యంతో ఆయన్ను అక్కడికి పంపించారు.

ఆ సమయంలో కూడా ఈ ఆదివాసీ తెగ గురించి చాలా విషయాలు చెప్పుకునేవారు. పొరపాటున ఆ ద్వీపానికి ఎవరైనా వెళ్తే సెంటినెలీస్ వారిని చంపేస్తారని, ఈటెలు గుచ్చుకుని ఉన్న శవాలు చాలాసార్లు నీళ్లలో తేలుతూ కనిపించాయని చెప్పేవారు.

జాన్ అలెన్ చౌ లాగే, బ్రిటీష్ అధికారి పోర్ట్‌మెన్‌కు కూడా ఇవన్నీ తెలుసని తెలుస్తోంది. కానీ ఆయన వారితో ఎలాగైనా మాట్లాడాలని అనుకునేవారు.

అడవి నుంచి మాయమయ్యారు

చరిత్రకారుడు ఆడమ్ గుడ్‌హార్ట్ 2000లో అమెరికన్ స్కాలర్ మ్యాగజీన్‌లో ఈ దీవుల గురించి ఒక వార్త రాశారు. పోర్ట్‌మెన్‌తోపాటు అక్కడికి వెళ్లిన మిగతా ఆదివాసీలు ఆ ద్వీపమంతా గాలించారని. కానీ వారికి అక్కడ ఎవరూ కనిపించలేదని గుడ్‌హార్ట్ తెలిపారు.

సెంటినెల్ దీవిలోని తెగ ఐరోవా వాసులు వస్తున్నారనే విషయం తెలిసినప్పుడు ఆ అడవిలోనే ఎక్కడో కనిపించకుండా దాక్కునేవారని గుడ్‌హార్డ్ చెప్పారు.

"పోర్ట్‌మెన్ తన అనుచరులతో అక్కడికి వెళ్లినపుడు ఆ ద్వీపంలోని సారవంతమైన మట్టిని, దట్టంగా ఉన్న అడవిలో ఎత్తైన చెట్లు చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆయన చాలా రోజుల వరకూ ఆ ద్వీపంలోనే ఉన్నారు. చివరికి ఎవరికోసం ఆయన అక్కడికి వెళ్లారో వాళ్లు ఆయనకు కనిపించారు" అని గుడ్‌హార్ట్ చెప్పారు.

పోర్ట్‌మెన్‌కు సెంటినెల్ దీవిలో ఒక వృద్ధ జంట, వారి నలుగురు పిల్లలు కనిపించారు. ఆయన వారిని తన పడవలో తీసుకుని అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ తీసుకొచ్చారు. అక్కడ తన నివాసంలో ఆ తెగపై అధ్యయనం చేయాలని భావించారు.

కానీ ఆయన ఎన్ని ఆశలతో వారిని తీసుకొచ్చారో, అన్నీ తలకిందులైపోయాయి.

ఫొటో క్యాప్షన్,

టీఎన్ పండిట్

బయటి ప్రపంచంలో అడుగుపెట్టగానే..

సెంటినెల్ ద్వీపం నుంచి తీసుకొచ్చిన ఆరుగురూ బయటి ప్రపంచాన్ని, మిగతా ప్రజలను అంతకు ముందెప్పుడూ కలవలేదు. దాంతో వారి శరీరం బయట ఉన్న క్రిములు, వ్యాధులను తట్టుకోలేకపోయింది.

దాంతో ద్వీపం నుంచి పోర్ట్ బ్లెయిర్ తీసుకొచ్చిన వచ్చిన కాసేపటికే వృద్ధులు ఇద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత చనిపోయారు.

దాంతో వారి నలుగురు పిల్లలు అలా కాకూడదని భావించిన పోర్ట్‌మెన్ వారికి బహుమతులు ఇచ్చి తిరిగ వారి ద్వీపానికే పంపించివేశారు.

తర్వాత పోర్ట్‌మెన్ ఆదివాసీల జీవితంలో అలా జోక్యం చేసుకోవడాన్ని తన వైఫల్యంగా భావించేవారని గుడ్‌హార్ట్ చెప్పారు.

లండన్‌లోని రాయల్ సొసైటీ ఆఫ్ జియోగ్రఫీ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన భారతదేశంలోని అండమాన్ దీవుల్లో తనకు ఎదురైన అనుభవాలను అందరితో పంచుకున్నారు.

"ఆదివాసీలను విదేశీయులు కలవడం అంటే, వారికి నష్టం కలిగించడమే అవుతుంది. అలాంటి ఒక మంచి తెగ ప్రజలు వేగంగా అంతరించిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది" అన్నారు.

సెంటినలీస్ తెగవారు తమ ఆచారాల ప్రకారం జీవించడాన్ని గౌరవించాలని చాలా మంది నిపుణులతోపాటు భారత ప్రభుత్వం కూడా భావిస్తోంది.

సెంటినలీస్ ఆదివాసీలు ఎవరు?

అండమాన్ ఉత్తర సెంటినెల్ ద్వీపంలో నివసించే సెంటినెల్ ప్రజలు ఒక పురాతన తెగవారు. వీ0రి జనాభా 50 నుంచి 150 మంది వరకూ ఉండచ్చు.

ఉత్తర సెంటినెల్ ద్వీపం ఒక నిషేధిత ప్రాంతం. ఇక్కడికి సామాన్యులు వెళ్లడం చాలా కష్టం. భారతీయులు ఎవరూ అక్కడికి వెళ్లకూడదు.

అండమాన్ దీవుల్లో నివసించే తెగల ఫొటోలు, వీడియో తీయడం చట్టవిరుద్ధం అని భారత ప్రభుత్వం 2017లో ప్రకటించింది. అలా చేసిన వారికి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారు.

సెంటినెల్ తెగ వారు సుమారు 60 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి పారిపోయి అండమాన్‌ దీవులకు వచ్చి స్థిరపడి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారత ప్రభుత్వంతో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఈ తెగను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)