మధుమేహం: మున్ముందు లక్షల మందికి ఇన్సులిన్ కొరత

  • 3 డిసెంబర్ 2018
ఇన్సులిన్ Image copyright Getty Images

పేలవమైన జీవన విధానం, ఊబకాయం, ఇతర అంశాల కారణంగా టైప్‌ 2 మధుమేహ సమస్య ప్రపంచవ్యాప్తంగా బాగా ఎక్కువైంది. రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు అవసరమైనంత ఇన్సులిన్‌ను శరీరం ఉత్పత్తి చేయలేకపోతే మధుమేహం సమస్య తలెత్తుతుంది.

వచ్చే దశాబ్దంలో, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మధుమేహ బాధితులకు ఇన్సులిన్ ధరపరంగా, లభ్యతపరంగా అందుబాటులో ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కుల్లో సుమారు 40 కోట్ల మందికి టైప్‌ 2 మధుమేహ సమస్య ఉంది. వీరిలో సగం మందికి పైగా చైనా, భారత్, అమెరికాల్లోనే ఉన్నారు.

మధుమేహ బాధితుల్లో ఎక్కువ మందికి టైప్ 2 సమస్యే ఉంది. ఇప్పుడు 40 కోట్లుగా ఉన్న టైప్ 2 బాధితుల సంఖ్య 2030లోగా 50 కోట్లు దాటుతుందని అంచనాలు చెబుతున్నాయి.

Image copyright Getty Images

టైప్ 2 మధుమేహ బాధితుల్లో కొందరికి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతావారు మందులు వాడటం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకొంటుంటారు.

2030 నాటికి మధుమేహ బాధితుల్లో దాదాపు ఎనిమిది కోట్ల మందికి ఇన్సులిన్ అవసరమవుతుందని లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ పత్రికలో వెలువడిన ఒక అధ్యయనం చెబుతోంది. అప్పట్లోగా దీని డిమాండ్ 20 శాతం పెరగొచ్చని అంచనా. అయితే ఇన్సులిన్ అవసరమైన బాధితుల్లో దాదాపు సగం మంది దీనిని పొందలేరు. వీరిలో ఎక్కువ మంది ఆసియా, ఆఫ్రికా దేశాలవారే ఉండొచ్చు. ఇప్పటికే టైప్ 2 మధుమేహ బాధితుల్లో ఇన్సులిన్ అవసరమైన ప్రతీ ఇద్దరిలో ఒకరు దీనిని పొందలేకపోతున్నారు.

ధరలను అందుబాటులో ఉంచాలి

ఇన్సులిన్ ధరలను అందుబాటులో ఉంచడమే కాకుండా, సరఫరా వ్యవస్థలను మెరుగుపరచాల్సి ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన, అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ సంజయ్ బసు చెప్పారు.

ఇన్సులిన్‌ 97 ఏళ్లుగా వినియోగంలో ఉంది. 20వ శతాబ్దంలో కనిపెట్టిన గొప్ప ఔషధాల్లో ఇన్సులిన్ ఒకటని చెబుతారు. చాలా కాలంగా దీని ధర అధికంగానే ఉంటూ వస్తోంది.

ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Image copyright Getty Images

మూడు సంస్థల చేతిలో మార్కెట్

2,100 కోట్ల డాలర్ల విలువైన అంతర్జాతీయ ఇన్సులిన్ మార్కెట్‌లో 99 శాతాన్ని కేవలం మూడే బహుళ జాతి సంస్థలు నోవో నోర్డిస్క్, ఎలీ లిలీ అండ్ కంపెనీ, సనోఫి నియంత్రిస్తున్నాయి. పరిమాణం పరంగా చూస్తే, 96 శాతం ఈ మూడు సంస్థల నియంత్రణలోనే ఉంది.

అమెరికా మార్కెట్ అంతటినీ కూడా ఈ మూడు కంపెనీలే నియంత్రిస్తున్నాయి.

ఇన్సులిన్‌కు సంబంధించి 132 దేశాల వివరాలను పరిశీలిస్తే, అందులో 90కి పైగా దేశాల్లో దీనిపై ఎలాంటి సుంకాలూ లేవు. అయినప్పటికీ చాలా మంది ఈ ఔషధాన్ని కొనలేకపోతున్నారు. సరఫరా వ్యయాలు, లాభాపేక్ష పెరగడం, ఇతర అంశాల కారణంగా దీని ధర పెరిగిపోతోంది.

అమెరికాలో మధుమేహం నిర్ధరణ అయినవారు రెండు కోట్ల మందికి పైనే ఉన్నారు. అక్కడ బాధితులు ఇన్సులిన్‌పై తమ జేబుల్లోంచి నేరుగా పెట్టే ఖర్చు 2000వ సంవత్సరం, 2010 మధ్య పదేళ్లలో 89 శాతం పెరిగింది. బీమా సదుపాయమున్నవారి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఓ రెండు వారాలకు సరిపడా ఇన్సులిన్‌ ధర 40 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరిగిపోయింది.

అంతర్జాతీయ ఇన్సులిన్ మార్కెట్ కొన్ని సంస్థల చేతుల్లోనే ఉండటం వల్ల దేశాలు వాటి నుంచే ఔషధాన్ని తీసుకోవాల్సి వస్తోందని జెనీవా యూనివర్శిటీ హాస్పిటల్స్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ జెనీవాకు చెందిన డేవిడ్ హెన్రీ బెరాన్ చెప్పారు. ఇన్సులిన్ సరఫరా సంస్థలు కొన్ని ఫార్ములేషన్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకొంటుండటం వల్ల మధుమేహ బాధితులు వారు వాడే ఇన్సులిన్ రకాన్ని మార్చుకోవాల్సి వస్తోందని తెలిపారు.

వ్యాధిగ్రస్థుడు ఔషధానికి స్పందించే తీరు, రక్తంలో చక్కెర స్థాయులు, వయసు, జీవనశైలి, రోజుకు తీసుకోవాల్సిన ఇంజెక్షన్లు లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని, సరైన రకం ఇన్సులిన్‌ను వైద్యుడు సూచిస్తారు. ఇన్సులిన్ సరఫరాలో స్వల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఎక్కువ. బంగ్లాదేశ్, బ్రెజిల్, మాల్వి, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక- ఈ ఆరు దేశాల్లో ఇన్సులిన్ లభ్యత తక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది.

ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశంలో ఇన్సులిన్ సరఫరా, పంపిణీ సరిగా లేకపోవడంవల్ల నిల్వలన్నీ రాజధాని మాపుటోలోనే ఉండిపోయాయి. దీనివల్ల దేశంలోని మిగతా ప్రాంతాల్లో కొరత ఏర్పడింది.

అంతర్జాతీయంగా ఇన్సులిన్ ధర ఎక్కువగా ఉండటం, లేదా అసలు లభించకపోవడం ప్రాణాలకే ముప్పు కలిగిస్తుందని, ఆరోగ్య హక్కు పరిరక్షణకు ఈ సమస్యలు సవాళ్లుగా నిలుస్తాయని డేవిడ్ హెన్రీ బెరాన్ వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

విరివిగా ఎందుకు అందుబాటులోకి రాలేదు?

కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ టొరంటోలో ఇద్దరు శాస్త్రవేత్తలు ఇన్సులిన్‌ ఔషధాన్ని కనుగొన్నారు. దీనిపై పేటెంట్‌ హక్కులను కేవలం ఒకే ఒక్క డాలర్‌కు వారు అదే యూనివర్శిటీకి ఇచ్చేశారు. కనిపెట్టిన దాదాపు శతాబ్దం తర్వాత కూడా ఈ ఔషధం సరసమైన జెనరిక్ మందుగా ఎందుకు అందుబాటులో లేదనే ప్రశ్న ఉంది.

డిమాండ్ ఎక్కువున్న ఔషధాలు పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, జెనరిక్ మందుల తయారీదారుల మధ్య పోటీవల్ల విరివిగా అందుబాటులోకి వస్తాయి. కానీ ఇన్సులిన్ విషయంలో అలా జరగలేదు.

ఇన్సులిన్- జీవకణాలు ఉత్పత్తిచేసే ఒక హార్మోన్.

ఇన్సులిన్ చాలా సంక్లిష్టమైనదని, దీనిని కాపీ చేయడం కష్టమని, ఇదంతా అంత ప్రయోజనకరం కాదని జెనరిక్ మందుల కంపెనీలు భావిస్తున్నాయని శాస్త్రవేత్తలు జెరేమీ గ్రీన్, కెవిన్ రిగ్స్ తెలిపారు.

ఇన్సులిన్ తరహాలోనే బయోసిమిలర్ ఇన్సులిన్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. సాధారణ ఇన్సులిన్‌తో పోలిస్తే వీటి ధరలు కాస్త మెరుగ్గా ఉంటాయి. అయితే వీటికి కూడా జెనరిక్ వర్షన్ లేదు.

ఇన్సులిన్‌ను సార్వత్రిక ఆరోగ్య ప్యాకేజీల్లో చేర్చాలని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు. మధుమేహ బాధితుల ఔషధం, ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణల కోసం మరిన్ని నిధులు కేటాయించాలని సూచిస్తున్నారు.

పేలవమైన ఆరోగ్య విధానాలు, వ్యవస్థలు, వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, అధిక ధరలు చాలా మందికి ఇన్సులిన్‌ను అందుబాటులో లేకుండా చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇన్సులిన్ ధరల తగ్గింపు, ఔషధ సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడం లాంటి చర్యలు చేపట్టే వరకు ఇన్సులిన్ అవసరమైన అందరికీ అందుబాటులోకి రాదని సంజయ్ బసు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)