గోత్రం అంటే ఏమిటి.. అది ఎలా పుట్టింది: అభిప్రాయం

  • 2 డిసెంబర్ 2018
గోత్రం ఎలా పుట్టింది Image copyright BISWARANJAN MISHRA

గోత్రం చరిత్ర చాలా పురాతనమైనది. దీని మూలాలను గమనిస్తే అవి మానవుడి సంచార దశ అంటే నాగరికత ఏర్పడడానికి ముందే టోటెమ్(సామాజిక గుర్తింపు), టబు(నిషేధం) వరకూ వెళ్తాయి.

టోటెమ్ అనేది జంతువులు, చెట్లు లాంటి వాటికి సంబంధించినది. ఇందులో కొన్ని పేర్లు తర్వాత కూడా అలాగే కొనసాగుతున్నాయి. వీటిలో మత్స్య, మీనా, ఉదంబర్(అత్తి), గర్గ్(ఆబోతు), గోతం, రిషభ్(ఎద్దు), అజ్(మేక), కాక్(కాకి), బాఘ్(పులి), పైప్లాద్(చిలుక), కట్, అలి(తుమ్మెద) లాంటివి ఉన్నాయి.

అయితే వీరిలోని కొందరు రుషులు, మునుల పేర్లు కూడా పెట్టుకున్నారు. ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా జరిగిన అభివృద్ధి క్రమంలో గురువులు లేదా రుషులు, మునుల పేర్లతో తమకు ఉన్న బంధాన్ని జోడిస్తూ గోత్రాల రూపంలో కొత్త గుర్తింపు ముందుకు వచ్చింది.

ప్రాచీనకాలంలో ఒకే రుషి, లేదా ఆచార్యుడి దగ్గర ఉన్న శిష్యులు తమను తాము గురుసోదర, సోదరీమణులుగా భావించి కుటుంబ సంబంధాలు ఏర్పరుచుకునేవారు. అంటే కుటుంబంలో సోదరికి, సోదరుడికి ఎలా వివాహం జరగదో, అలాగే గురుసోదర, సోదరీమణుల మధ్య వివాహ సంబంధాలను తప్పుగా భావించడం ప్రారంభించారు.

Image copyright venugopal bollampalli

ఆచార్యులు, రుషుల పేరుతో గోత్రాలు

అన్నిటికంటే మొదట గోత్రాలు సప్త రుషుల పేర్లతో చెలామణి అయ్యాయి. ప్రాచీన గ్రంథాల్లో సప్త రుషులుగా భావించే రుషుల పేర్లలో (శతపథ బ్రాహ్మణ, మహాభారతం) కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ గ్రంథాలను బట్టి మొత్తం రుషులు- గౌతమ, భరద్వాజ, జమదగ్ని, వశిష్ట, విశ్వామిత్ర, కశ్యప, అత్రి, అంగీర, పులస్తి, పులహ, క్రతు అనే పదకొండు మంది అవుతారు.

వీటి వల్ల ఆకాశంలో ఉన్న సప్త రుషులపై ఎలాంటి ప్రభావం పడదు. కానీ గోత్రాల సంఖ్య మాత్రం ప్రభావితం అవుతుంది. తర్వాత కూడా చాలా మంది ఆచార్యులు లేదా రుషుల పేర్లతో గోత్రాలు చెలామణిలోకి వచ్చాయి.

బృహదారణ్యక్ ఉపనిషత్ చివర్లో అలాంటి కొందరు రుషుల పేర్లు ఉన్నాయి. వీటిలో చాలా పేర్లు ఆదిమ జాతిగా భావించే ఆటవిక సమాజాల్లో ఈరోజుకూ కనిపిస్తున్నాయి.

అన్ని కులాల వారూ వ్యవసాయం చేయడానికి ముందు వేట, కందమూలాలు, పండ్లపై ఆధారపడుతూ అడవుల్లో జీవించడమే దానికి కారణం.

కొన్ని దశాబ్దాల ముందు వరకూ అప్పటి ఆర్యుల దాడుల కథలను చరిత్రలో వాస్తవాలుగా భావించేవారు. వాటిని అర్థం చేసుకోవడంలో పెద్ద పెద్ద చరిత్రకారులు కూడా గందరగోళంలో పడిపోయేవారు.

ఇప్పుడు వారి గురించి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివాదాలన్నీ వాటికవే సమసిపోయాయి. సభ్య సమాజంలో భాగం కావడానికి ఒకే టోటెమ్ లేదా ఒకే గుర్తింపు ఉన్న ఆదిమ దశకు చెందిన కొంతమంది పశువుల కాపరులు అయితే, కొంతమంది బ్రాహ్మణులుగా మారారు.

ప్రజలకు ఒక గోత్రం లేదా వాసరత్వ గుర్తింపు లభించడం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యా ఉండదు. బదులుగా వారి నాగరికత ఎలా వ్యాపించింది అనేది వివరించేందుకు అది మనకు ఒక పటంలా కనిపిస్తుంది.

Image copyright Thinkstock

భారత భూభాగంపై తలదాచుకున్న సమాజాలు

కశ్(వట్టివేళ్లు), కశ్యప్, కశ్మీర్(వట్టివేళ్ల దేశం) కశి, కోసల్, కసాయా(కుశినగర్), కుశిక్ లాంటి వాటితో కసో(కశో) అనే నాగరికత వ్యాప్తి చెందింది. పురాతన కాలంలో వారి పాలన ఎలా జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది.

సక్(శక్), సాకేత్, శక్ర్(ఇంద్రుడు), శాక్యవంశ్(గౌతమ బుద్ధుడి వంశం), శాకాల్, శాకల్య్‌కు సంబంధించిన వంశాల లింకులే కాదు.. మొదట్లో అర్థం కాకుండా ఉన్న ఎన్నో గోత్రాల గురించి ఇప్పుడు వివరంగా అర్థం చేసుకోవడానికి వీలవుతోంది.

అంతే కాదు, మంచు యుగంలో శాశ్వత నివాసం అనేది లేని సమయంలో కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఎన్నో మానవ సమాజాలు భారత భూభాగంలో తలదాచుకున్నాయి.

Image copyright Getty Images

కానీ ఎన్నో ప్రశ్నలు

మనకు తెలిసిన గోత్రం ఎవరిదైనా, అది ఏదైనా.. అది వేద కాలానికంటే వెనక్కు వెళ్లి ఉండదు. కానీ ఆ రుషులు, మునులకు అంతకు ముందు గుర్తింపు ఏదై ఉంటుంది? వారు ఏ వంశానికి చెందినవారు?

ఉదాహరణకు విశ్వామిత్ర, వశిష్ట, అంగిర లాంటి రుషులు తమ పూర్వీకులుగా ఎవరిని చెప్పుకుంటారు?

విశ్వామిత్రుడిని కుశిక్ లేదా కౌశిక్ అని చెబుతారు. అంగిర రుషి అగ్ని నుంచి జన్మించారని ఆగ్రియా వారు అంటారు. వారు ఒక కథ ప్రకారం ప్రపంచంలో మొత్తం మానవ సమాజం అగ్ని నుంచి పుట్టిన ఏడుగురు సోదరుల సంతానమే అని చెబుతారు. తమను ఆ ఏడుగురిలో అగ్రజుడి సంతానం అని చెప్పుకుంటారు.

ఇంద్రుడికి శక్ర్ అనే పేరు కూడా ఉంది. రుగ్వేదంలో ఒక దగ్గర ఆయన పేరును కౌశిక్(కుశిక వంశీయుడని)కూడా చెప్పారు. ఈ రెండూ చూస్తే కశ్, శక్‌లో కేవలం అక్షరాలు అటూఇటూ అయ్యాయనే అనిపిస్తుంది.

Image copyright BBC/ JITENDRA TRIPATHI

ఏదేమైనా మన పూర్వీకులను గుర్తించడానికి మూడు దశలున్నాయి. మొదటిది టోటెమ్ ఇందులో ఇతర ప్రాణులను మనుషుల కంటే ఎక్కువ తెలివైనవని, సమర్థమైనవని భావించి వాటితో తమ పూర్వీకులను జోడించేవారు. దీని చాయలు ధ్వజ, కేతు(గరుడధ్వజ్, రిషధ్వజ్) లాంటి వాటిపై కూడా ఉన్నాయి.

తర్వాత మిగతా వారి కంటే తమను ఉన్నతులుగా చెప్పుకున్న(ముండా, ఆర్య, అసుర, శక) లాంటి గోత్రాలు వచ్చాయి. చివర్లో అందరికీ విద్య, జ్ఞానం అబ్బిన తర్వాత ఆచార్యులు, రుషుల పేర్లను గోత్రంగా చేసుకునేవారు.

వ్యవసాయం స్వీకరించి తమను ఉన్నతవర్గమని చెప్పుకుంటూ సభ్య సమాజంలో భాగంగా మారే క్రమం ఎప్పటికీ పూర్తిగా ఆగిపోలేదు. దాంతో రుషుల నామావళిలో కూడా విస్తరణ అవసరమైంది.

(ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇందులోని వాస్తవాలు, ఆలోచనలు బీబీసీవి కావు. వాటికి బీబీసీ ఎలాంటి బాధ్యతా తీసుకోదు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు