తెలంగాణ ఎన్నికలు2018: ఆర్ట్స్ కాలేజ్ టూ అసెంబ్లీ - కీలక నేతలపై పోటీ చేస్తున్న ఓయూ విద్యార్థులు ఎవరు?

  • 3 డిసెంబర్ 2018
విద్యార్థులు రాజకీయాలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలకపాత్ర పోషించింది. ధర్నాలు, పోరాటాలు, ఆత్మబలిదానాలతో ఉద్యమాన్ని రగిలించారు.

ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు కొందరు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు చట్టసభల్లోనూ అడుగుపెట్టారు. ఈసారి కూడా ఓయూ విద్యార్థులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి క్లాస్ రూం నుంచి కదన రంగంలోకి అడుగుపెట్టారు.

విశ్వవిద్యాలయం నుంచి చట్టసభల వైపు...

Image copyright Gadari kishore/fb
చిత్రం శీర్షిక గ్యాదరి కిషోర్

గ్యాదరి కిషోర్ కుమార్: 'ఇదో జీవితకాలపు అదృష్టం. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు యూనివర్సిటీనే నా కళ్లముందు మెదిలింది' అని తాజా మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ఓయూతో తనకు ఉన్న అనుబంధాన్ని బీబీసీతో అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నేతగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో పాల్గొన్న గ్యాదరి కిషోర్ 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున టికెట్ దక్కించుకున్నారు. తుంగతుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా అదేస్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇటీవల ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. కిషోర్ సహచరులు పిడమర్తి రవి, బాల్క సుమన్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కిషోర్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన అద్దంకి దయాకర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి.

Image copyright Pidamarthi ravi/fb

పిడమర్తి రవి: టీఆర్ఎస్‌ విద్యార్థి నేతగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన పడమర్తి రవి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.

ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగారు. రవి స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా గార్ల. ప్రస్తుతం ఆయన ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Image copyright Balka suman/fb

బాల్క సుమన్: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేరుగా పార్లమెంట్‌లో అడుగుపెట్టి బాల్క సుమన్ రికార్డ్ సృష్టించారు. ఓయూ నుంచి ఎంఏ ఇంగ్లిష్ చేసిన సుమన్ అక్కడి నుంచే పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

టీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఓయూ నేతగా పలు ఉద్యమాల్లో పాల్గొన్న సుమన్ 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎంపీగా బరిలో దిగారు.

పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎంపీ వివేక్‌పై విజయం సాధించారు.

ఈసారి అసెంబ్లీలో పోటీ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు.

Image copyright Syed shahajadi/fb

సయ్యద్ షెహజాది: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రాయణ గుట్ట నుంచి సయ్యద్ షెహజాది పోటీ చేస్తున్నారు.

ఈమె ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కోఠీ ఉమెన్స్ కాలేజ్‌లో ఎం.ఏ. హిందీ చేస్తున్నారు.

బీజేపీ అనుబంధం విద్యార్థి సంఘం ఏబీవీపీలో పనిచేసిన షెహజాది స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా. ముస్లింలు ఎక్కువగా ఉండే చంద్రాయణగుట్టలో అదే వర్గానికి చెందిన మహిళను బరిలోకి దింపాలని భావించిన బీజేపీ షెహజాదికి సీటు ఖరారు చేసింది. ప్రస్తుతం షెహజాది కోఠి ఉమెన్స్ కాలేజీలో ఉంటూనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

Image copyright Surepally sujatha/fb

ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత: శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సూరేపల్లి సుజాత ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీ చేశారు.

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యురాలిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ పాల్గొన్నారు. బాల్క్ సుమన్ పోటీ చేస్తున్న చెన్నూరు నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు.

రమావత్ సౌజన్య: కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి బరిలో ఉన్న నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి బహుజన వామపక్ష కూటమి (బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థిగా రమావత్ సౌజన్య పోటీ చేస్తున్నారు.

ఈమె కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థే. ఎం.ఏ. తెలుగు చేసిన సౌజన్య ఓయూ నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ఇటీవలే ఉత్తీర్ణులయ్యారు. త్వరలో ఆమె పీహెచ్‌డీ చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)