‘రేప్ కల్చర్‌’ను పెంచి పోషిస్తున్నామా? - అభిప్రాయం

 • 3 డిసెంబర్ 2018
మహిళలు, అత్యాచార సంస్కృతి Image copyright Getty Images

''మీరు మా వెనుకభాగం పట్టుకోండి, లేకపోతే ముందు భాగం పట్టుకోండి, లేకపోతే మా తొడలు పట్టుకోండి.... మాకేం అభ్యంతరం లేదు. నందోజ్‌లో మీరు తినే ప్రతి దానినీ చేతితో పట్టుకొమ్మని సలహా ఇస్తున్నాం.''

రెండేళ్ళ క్రితం భారతదేశంలో ఎన్నో పత్రికలలో వచ్చిన నందోజ్ చికెన్ ప్రకటన ఇది.

మరొక అమెజాన్ ఇండియా ప్రకటనలో.. నగ్నంగా ఉన్న మహిళ కాళ్ళు బారజాపి బాత్ టబ్‌లో పడుకున్నట్టుగా ఉండే యాష్ ట్రే ఉంటుంది.

ఆరంభంలోనే ఈ ప్రకటనల గురించి ఎందుకు చెప్పామో, ముందు అడగబోయే ప్రశ్నల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే - మనం సమాజంలో అత్యాచారాలు చేసేవాళ్ళకు మద్దతిస్తున్నామా? అలాంటి వాళ్ళపై సానుభూతి చూపిస్తున్నామా? అత్యాచార బాధితురాలినే దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నామా?

ఈ ప్రశ్నలకు సమాధానం 'అవును' అనొచ్చు.

Image copyright TWITTER
చిత్రం శీర్షిక వివాదాస్పద నందోజ్ ప్రకటన

అత్యాచార సంస్కృతి.. రేప్ కల్చర్

'రేప్ కల్చర్' అంటే అత్యాచార సంస్కృతి ప్రపంచంలో ప్రతి చోట, ప్రతి సమాజంలో ఏదో ఒక రూపంలో ఉంది.

ఈ మాట మనకు వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే సంస్కృతి అనేదాన్ని పవిత్రమైన, సకారాత్మక సంబంధాలలో ఉపయోగించడం మనకు అలవాటు. కాని సంస్కృతి కేవలం అందమైనదో లేదా ఆచారాలు, సంప్రదాయాలు, రీతి రివాజులో కాదు.

సంస్కృతిలో మనస్తత్వం, ప్రవర్తన కూడా ఉంటాయి. సంస్కృతిలో బలాత్కార సంస్కృతి కూడ దాగి ఉంటుంది. దాని సూక్ష్మరూపం చాలాసార్లు మన దృష్టి నుంచి తప్పించుకుపోతుంది. అప్పుడప్పుడు దాని అదృశ్యరూపం బయటపడి మన ముందు నిలుస్తుంది.

Image copyright Amazon India
చిత్రం శీర్షిక అమెజాన్‌లో వివాదాస్పద యాష్ ట్రే ప్రకటన

అత్యాచార సంస్కృతి అంటే ఏమిటి?

అత్యాచార సంస్కృతి (రేప్ కల్చర్) అనే పదం 1975లో ఆ పేరుతో అమెరికాలో సినిమా వచ్చినప్పుడు మొదటిసారి వాడుకలోకి వచ్చింది. 70వ దశాబ్దంలో అమెరికాలో స్త్రీవాద ఆందోళనలు (ఫెమినిజం రెండో దశ) ఊపందుకుంటున్నపుడు, ఈ 'రేప్ కల్చర్' అనే శబ్దం ప్రయోగంలోకి వచ్చింది.

 • రేప్ కల్చర్ అంటే ఒక సామాజిక వ్యవస్థలో అత్యాచారం జరిగిన బాధితురాలికి అండగా కాకుండా, అత్యాచారం చేసిన వారిని సమర్థించే పరిస్థితి ఉండడం.
 • రేప్ కల్చర్ అనేది అత్యాచారానికి స్త్రీనే బాధ్యురాలిగా చేయడానికి సంబంధించినది.
 • అత్యాచారం చేయడం, మహిళల పట్ల హింసాయుతంగా ప్రవర్తించడం పెద్ద అపరాధంగా భావించకుండా, చిన్న చిన్న తప్పులుగా భావించే సంస్కృతే రేప్ కల్చర్.
Image copyright Getty Images

ఒక సమాజంలోనో, దేశంలోనో అత్యాచార సంస్కృతి ఉందనిగాని, దాన్ని రుజువు చెయ్యడంగాని పెద్ద కష్టం కాదు. భారతదేశం విషయానికి వస్తే మనందరం పైపైన అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు, అత్యాచారం చేసేవారికి శిక్ష వేయించాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. స్త్రీల గౌరవం, భద్రతల కోసం పోరాడుతున్నట్టుగా అనిపిస్తుంది.

ఇవి పూర్తిగా నిజం కాదని చెప్పలేం.

కానీ దీనికి రెండో పార్శ్వం కూడా ఉంది. మనం కూడా అత్యాచారం చేసేవారిని సమర్థిస్తున్నామని, అత్యాచార సంస్కృతికి నీరుపోసి పెంచుతూ, దానిని సజీవంగా ఉంచుతూ, తప్పు చేస్తున్నామని రుజువవుతూ ఉంది.

దీనికి తాజా ఉదాహరణ కఠువా గ్యాంగ్ రేప్. ఆ సంఘటనలో నిందితులను సమర్థిస్తూ బహిరంగంగా జెండాను ఎగరేసి నినాదాలు చేశారు.

వేర్వేరు ఉదాహరణల ద్వారా రేప్ కల్చర్‌ను అర్థం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.

Image copyright Getty Images

1. అత్యాచారాన్ని సులభంగా తీసుకోవడం

 • అబ్బాయిల ఆలోచనలు మార్చలేం కదా? (మగాళ్ళు మగాళ్ళే)
 • అన్నతో పోటీపడకు. ఎనిమిది గంటలలోపు ఇంటికిరా. అప్పుడే నీకు భద్రత. (అబ్బాయిలకి, అమ్మాయిలకి వేర్వేరు నియమాలు)
 • నీ ఒక్కదానికే ఇలా జరగలేదు. చిన్న విషయాన్ని పెద్దగా చేయకు.
 • మీడియాలో ‘అత్యాచారం’ వంటి పదాలు రాయకుండా 'అసభ్య ప్రవర్తన'లాంటి పదాలు ఉపయోగించి నేర తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించడం.
 • అత్యాచారం గురించి జోకులు, వ్యాఖ్యానాలు, నవ్వడం, ఎగతాళి చేయడం.
 • సినిమాల్లో, పాటల్లో, పాప్ కల్చర్‌లో అమ్మాయిల వెంటపడడం, ఏడిపించడం, బలవంతపెట్టడం, రొమాంటిక్‌గా చూపించడం, మహిళల శరీరాన్ని 'సెక్స్ వస్తువు'గా ప్రదర్శించడం.
Image copyright Getty Images

2. బాధితురాలినే దోషిగా చేయడం

 • పొట్టి దుస్తులు/ పాశ్చాత్య దుస్తులు ధరించింది.
 • రాత్రి పొద్దు పోయేవరకూ బయట తిరుగుతుంది.
 • మద్యం తాగి అబ్బాయిలతో తిరుగుతుంది.
 • సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉంటుంది. చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు.
 • అబ్బాయిలతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది.
 • అబ్బాయిలతో పబ్‌కు వెళ్ళింది.
 • తప్పకుండా ఏదో సిగ్నల్ ఇచ్చి ఉంటుంది.
Image copyright Getty Images

3. బాధితురాలిని శంకించడం

 • వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది, ఇంక రేప్ ఏమిటి? (సమ్మతి)
 • భర్త భార్యనెలా రేప్ చేస్తాడు? (వైవాహిక అత్యాచారం, స్త్రీ ఇష్టానికి విలువనివ్వకపోవడం)
 • ఆమె అందవికారంగా/వృద్ధురాలిలా/లావుగా ఉంటుంది. తననెవరు రేప్ చేస్తారు? (బలాత్కారాన్ని స్త్రీ శరీరం, ముఖం, వయస్సుకి జోడించి చూడడం)
 • ఆమె శరీరం మీద గాయాల చిహ్నాలు లేవు. ఆమె ఎందుకు ప్రతిఘటించలేదు?
 • ఆమె ఆ సమయంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇప్పుడెందుకు మాట్లాడుతోంది?
 • ఏదో పబ్లిసిటీ స్టంట్. సానుభూతి కోసం చేస్తోంది.
 • అంతకు ముందు కూడ ఒక వ్యక్తి మీద ఫిర్యాదు చేసింది. ఆమెకే ఇలా ఎందుకవుతుంది?
Image copyright Getty Images

4. బ్రో కల్చర్ (సోదర సంస్కృతి)

మగవాళ్ళు ఒకరినొకరు రక్షించుకొనే పద్ధతి బ్రో కల్చర్. దీనిలో ఒకరి తప్పులను మరొకరు దాచటానికి చూస్తారు.

'అరే, అతనెంత మామూలుగా ఉంటాడు!' 'అలా ఎప్పుడూ చెయ్యడు. నాకు అతను బాగా తెలుసు' లాంటి వ్యాఖ్యల ద్వారా అమాయకులని రుజువు చేయడానికి ప్రయత్నించడం.

బ్రో కల్చర్‌కి మంచి ఉదాహరణ #NotAllMen అన్న హ్యాష్ టాగ్. మహిళలు తమ మీద జరిగిన అత్యాచారం, హింస, వేధింపుల గురించి మాట్లాడడం ప్రారంభించగానే పురుషుల వేదిక #NotAllMen పేరిట దానిని బలహీనం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది.

మహిళల ఫిర్యాదులను పురుషులు వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటారనేది ప్రశ్న. బహుశా పురుషులలో ఒక పెద్దవర్గం ఆ తప్పులు చేసి ఉంటుంది, అందువల్ల ఒకరికొకరు దన్నుగా రక్షాకవచం ఏర్పరచుకుంటారేమో.

ఇదొక్కటే కాదు. విచిత్రంగా.. బలాత్కారంలో 90%, వేధింపుల్లో 99% అబద్ధాలని పురుషులలో ఒక వర్గం ఎక్కడి నుంచో కొన్ని అంకెలు తీసుకొస్తుంది.

స్త్రీలెవరైనా తమ వేధింపు గురించి మాట్లాడినపుడే వీరికి పురుషులపై జరిగే వేధింపు గుర్తొస్తుంది.

5. లాకర్ రూమ్ సంభాషణ

''భాయ్... ఆ అమ్మాయిని చూశా, ఒక రాత్రైనా తనతో వెళతా.''

''యార్ తన ఫిగర్ చూశావా? అవకాశం వస్తే నేను..'' (తరువాత అన్నీ చెప్పలేని అశ్లీల పదాలే)

పురుషుల లాకర్ రూమ్ సంభాషణ ఇలా ఉంటుంది. పేరులోనే ఇది స్పష్టం. మూసిన గది లోపల అరమరికలు లేని సంభాషణ.

జెండర్ అధ్యయనంలో లాకర్ రూమ్ సంభాషణ విశ్లేషణ అంటే పురుషుల మాట్లాడుకునే అశ్లీల సంభాషణకు సంబంధించినది. మహిళల ముందు పురుషుడు ఆ విధంగా మాట్లాడడు.

ఇక్కడ పురుషులు దాపరికం లేకుండా మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు. వాళ్ళ గురించి అశ్లీల భాషను ఉపయోగిస్తారు. అందరి ముందు మాట్లాడలేని అన్ని మాటలూ ఇక్కడ మాట్లాడతారు.

Image copyright Getty Images

6. మహిళల ఆత్మధైర్యం చూసి భయపడడం

 • మహిళలను సామాజికంగా, ఆర్థికంగా ఆత్మధైర్యంతో ఉండనీయకపోవడం.
 • ఇంట్లో ఉండడానికే ఒప్పించడానికి ప్రయత్నించడం, బయటి ప్రపంచంతో కలిసే అవకాశం ఇవ్వకపోవడం.
 • కన్యగా ఉండడం గొప్ప అనడం.
 • రొమాంటిక్, సెక్సువల్ సంబంధాలలో ముందుగా చొరవ తీసుకునే మహిళను అవమానించడం.
 • మతం, ఆచారాలు, సంప్రదాయాల పేరు చెప్పి మహిళలను తమ అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడం.
Image copyright Getty Images
చిత్రం శీర్షిక మనోహర్ లాల్ ఖట్టర్

7. సానుభూతి లేకపోవడం

 • నిర్భయ గ్యాంగ్ రేప్ విషయంలో నిందితుల తరపు న్యాయవాది ఏపీ సింహ, ''ఒకవేళ నా కూతురు గాని, సోదరిగాని పెళ్ళికి ముందు ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే, లేదా మా చరిత్రకు కళంకం తెచ్చే పని ఏదైనా చేస్తే నేను తనని పెట్రోలు పోసి తగలబెట్టేస్తాను''అన్నారు.
 • నిర్భయ విషయంలోనే రెండో నిందితుడి విషయంలో అతని న్యాయవాది ఎం.ఎల్. శర్మ, ''మన సమాజంలో తెలియని వ్యక్తులతో అమ్మాయిలు రాత్రిళ్లు బయటికి వెళ్ళరు. మీరు అబ్బాయి, అమ్మాయి స్నేహం గురించి మాట్లాడుతున్నారు. సారీ, మన సమాజంలో అలా జరగదు, మన సంస్కృతి ఉత్తమమైంది. మన సంస్కృతిలో అలాంటి మహిళకు స్థానం లేదు'' అన్నారు.
 • ఇటీవల హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, ''ముందు అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి తిరుగుతారు. తర్వాత ఏమైనా జరగరానిది జరిగితే బలాత్కారం అని ఆరోపిస్తారు,'' అన్నారు.
 • భారత చట్టసభల్లో మహిళలను రహస్యంగా అనుసరించరించడంపై చర్చ జరిగినపుడు కొందరు సభ్యులు నవ్వుతారు. మరికొందరు ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తారు.
 • ఒక అత్యాచారంపై ఐర్లండ్ కోర్టులో విచారణ జరుగుతున్నపుడు న్యాయవాది అమ్మాయి అండర్‌వేర్ (లోదుస్తులు) చూపిస్తూ, ఆ అమ్మాయి లేసున్న అండర్ వేర్ ధరించింది కాబట్టి 'బహుశ అబ్బాయితో సెక్స్ కావాలనుకుంటోందేమో' అని వ్యాఖ్యానించారు.
 • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమ్మాయిల విషయంలో మాట్లాడే అశ్లీల పదజాలాన్ని ఇక్కడ రాయలేము.
 • ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటార్ట్ కూడా మహిళల విషయంలో ఒక దాన్ని మించి మరో అశ్లీల వ్యాఖ్యానం చేస్తుంటారు. కొన్ని నెలల క్రితం ప్రపంచంలో అందమైన ఆడవాళ్ళున్నంత వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయన్నారు ఆయన.
Image copyright EPA

8. ప్రతీకారం కోసం బలాత్కారం

ఇవన్నీ కాకుండా అత్యాచార సంస్కృతిని పెంపొందించే మరికొన్ని అంశాలున్నాయి. అత్యాచారాన్ని అవమానంగా చూడడం, అత్యాచార పీడితురాలు, ఆమె కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించడం, అపరాధులకు శిక్ష వెయ్యడంలో ఉదాసీనత, అత్యాచారాన్ని రాజకీయ-సామాజిక కోణాల్లో చూడడం, యుద్ధాలు జరిగినపుడు ప్రతీకారం కోసం అత్యాచారాలు చేయడం వంటివి వాటిలో కొన్ని.

చట్టసభలలో అత్యాచార ఆరోపణలున్న వ్యక్తులు పెరిగిపోవడం, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మత గురువులకు భక్తులు పూజలు చేయడం అత్యాచార సంస్కృతికి ఉదాహరణలు.

దీనిలో కొన్ని విషయాలు పెద్దగా (పట్టించుకోదగినవిగా), మరికొన్ని విషయాలు చిన్నవిగా (పట్టించుకోనవసరం లేనివిగా) అనిపించవచ్చు. అయితే అత్యాచార సంస్కృతిని కొనసాగించడంలో వాటన్నిటి పాత్ర ఉంది.

Image copyright AFP

మీరు కూడ అత్యాచార సంస్కృతిలో భాగస్వాములా?

అత్యాచార సంస్కృతి కేవలం భారతదేశంలో మాత్రమే లేదు. అలాగని దీనికి పూర్తిగా పురుషులే కారణమనీ చెప్పలేం. మహిళలకూ దీనిలో కొంత భాగముంది.

నందోజ్ చికన్ ప్రకటనలో తప్పు లేదనిపిస్తే, మీరూ అత్యాచార సంస్కృతిలో భాగస్వాములే.

అమెజాన్ యాష్ ట్రే ప్రకటనలో మీకు తప్పు లేదనిపిస్తే అత్యాచార సంస్కృతిని పెంచి పోషించడంలో మీ హస్తం కూడా ఉన్నట్టే.

నిర్భయ కేసులో.. అమ్మాయిలు రాత్రి 7 గంటల తరువాత ఇంటి బయటకి వెళ్ళకూడదు అన్న వకీలు వాదనను అంగీకరిస్తే, దానివల్లే మనది ఉత్తమ సంస్కృతి అయిందని ఒప్పుకుంటే మీకు బాధితులపై సానుభూతి లేనట్లే. అత్యాచార సంస్కృతిని కొనసాగించడంలో మీరు మీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారనే చెప్పాలి.

మీరు గనక #MeTooను ఆరంభించిన టైరానా బర్క్‌ అందవికారంగా ఉందని, తన యౌవన బాధనెవరు తీరుస్తారని ఎగతాళి చేస్తే... మిత్రులారా, మీరు ఈ అత్యాచార సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)